Type Here to Get Search Results !

Vinays Info

ఐక్యతా విగ్రహం(Statue of Unity) | Statue of Sardar Vallab bhai Patel

ఐక్యతా విగ్రహం(Statue of Unity) | Statue of Sardar Vallab bhai Patel 

స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు.

182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో రూ.2,989 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

పటేల్ విగ్రహ నిర్మాణంలో టర్నర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా వ్యవహరించగా దానికి మెయిన్‌హార్డ్, మైఖేల్ గ్రేవ్స్, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. విగ్రహం స్టక్చ్రర్ డిజైన్, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కాంక్రీట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది. త్రీ డెమైన్షనల్ స్కానింగ్ టెక్నిక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను ఉప‌యోగించి కేవలం 33 నెలల్లోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

5 జోన్లుగా విగ్రహం

పటేల్ ఐక్యతా విగ్రహాన్ని 5 జోన్లుగా విభజించారు. 

  1. మొదటి జోన్‌లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, 
  2. రెండో జోన్‌లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. 
  3. మూడో జోన్‌లో 157 మీ. వరకు గ్యాలరీ, 
  4. నాలుగో జోన్‌లో మెయింటనెన్స్ ఏరియా, 
  5. ఐదో జోన్‌లో పటేల్ భుజాలు, తల ఉంటుంది. 

మూడో జోన్ వరకు సందర్శకులను అనుమతిస్తారు. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. ఈ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.

పర్యాటకం

ఐక్యతా విగ్రహం ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠ భారత్ భవన్, పటేల్ జీవిత విశేషాలతో మ్యూజియం, పరిశోధనా కేంద్రం కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహం నుంచి చూస్తే సర్దార్ సరోవర్ డ్యాం పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తాయి. సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. అలాగే 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాంగా గుర్తింపు పొందింది.

మరోవైపు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి జ‌రుగుతుంద‌ని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మెరుగైన రవాణా సౌకర్యం, ఉపాధి, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు ఆ ప్రాంత గిరిజనులకు సమకూరుతాయనేది ప్రభుత్వ భావన.

విగ్రహం విశేషాలు

విగ్రహ రూప‌క‌ర్త : రామ్ వి. సుత‌ర్  

Also Read : Biography of Ram Vanji Sutar 

  • నిర్మాణ ప్రదేశం : సాధు బెట్ ఐలాండ్, సర్దార్ సరోవర్ డ్యామ్ (నర్మదా నది) కు 3.5 కిలోమీటర్ల దూరం, నర్మదా జిల్లా, గుజరాత్
  • విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగులు)
  • వ్యయం: రూ.2,989 కోట్లు.
  • ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు.
  • విగ్రహ నిర్మాణం కోసం దేశంలోని లక్షా అరవైతొమ్మిది వేల గ్రామాల నుంచి ఇనుమును సేకరించారు.
  • నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్ కాంక్రీట్‌లో కలిపి, 6500 టన్నుల స్టీల్ విడిగా స్టక్చ్రర్ కోసం వాడారు.
  • విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలవగలదు.
  • విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు.
  • 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు.
  • మొత్తం 3వేల పటేల్ ఫొటోలను పరిశీలించి విగ్రహానికి రూపునిచ్చారు. 1949లో తీసిన ఫొటో ప్రధాన పాత్ర వహించింది.
  • చైనాలో కాంస్య తాపడాలు తయారయ్యాయి.
  • ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్ల సమయం పడితే.. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి కేవలం 33 నెలలు పట్టింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section