వివాహం - నిర్వచనాలు- ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలతో ఆచారంతో లేదా చట్టంతో గుర్తింపు పొందిన, కొంత లాంఛనప్రాయంతో కూడి ఉన్న విధానంతో కొంతకాలం పాటు నిలకడగా ఉండే కలయిక లేదా సంబంధమే వివాహం. - ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్
వెస్టర్ మార్క్ ఇచ్చిన నిర్వచనం అన్ని సమాజాల్లోని వివాహ వ్యవస్థకు సరిపోయే విధంగా లేదు. ఉదాహరణకు కింద పేర్కొన్న సమాజాలకు ఈ నిర్వచనం సరిపోదు.
ఎ) ఒనోటోవా, టుక్ సమాజాల్లో వయసుకు రాగానే న్యాయబద్ధమైన సంతానాన్ని పొందుతారు.
బి) ‘కిబ్బుజ్ సమాజం’లో అసలు వివాహ వ్యవస్థే లేదు.
- సంతానోత్పత్తి, పిల్లల నిర్వహణ కోసం స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఒప్పందమే వివాహం. - మలినో విస్కీ
ఈ నిర్వచనం కూడా కొన్ని సమాజాలకు మినహాయింపుగా ఉంది.
- భార్యాభర్తల పరస్పర హక్కులు, విధులు, సదుపాయాలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉన్నదే వివాహం.- ల్యూండ్ బర్గ్
ల్యూండ్ బర్గ్ నిర్వచనం కూడా అన్ని సమాజాలకు వర్తించదు. ఉదాహరణకు..
ఎ) ఇజ్రాయెల్‌లోని ‘కిబ్బుజ్’ తెగలో స్త్రీ, పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉంది కానీ, ఆర్థిక సహకారం లేదు.
బి) కేరళలోని ఒక తెగలో స్త్రీ, పురుషులకు సహ నివాసం లేదు, ఆర్థిక సహకారం లేదు.
వివాహానికి విశ్వజనీన నిర్వచనం లేనప్పటికీ దీనికి ప్రపంచవ్యాప్తంగా సామాజిక సమ్మతి ఉంది.
వివాహ విధులు
జైవిక విధులు: మానవుడిలో లైంగిక వాంఛలను వివాహం ద్వారా నెరవేర్చుకుంటారు. దీని ద్వారా స్త్రీ, పురుషులు జంటగా ఏర్పడి సంతానోత్పత్తితో తమ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇది కేవలం ఆ దంపతులనే కాకుండా వారి భావి సంతానాన్ని కూడా సూచిస్తూ సన్నిహిత సంబంధాలతో, పరస్పర అనురాగబద్ధమై ఉంటుంది. మరణం వల్ల ఏర్పడే లోటు సంతానం ద్వారా భర్తీ అవుతుంది.
సామాజిక విధులు: వివాహం దంపతుల మధ్య కొన్ని బాధ్యతలను సంస్థాగతం చేస్తుంది. దంపతులిద్దరూ వారి సంతానాన్ని ఒకరు తండ్రిగా, మరొకరు తల్లిగా సంరక్షిస్తారు. వివాహం భార్యభర్తల్లో ఒకరికి మరొకరిపై లైంగిక గుత్తాధిపత్యాన్ని కల్పిస్తుంది. స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే శ్రమ విభజనకు కూడా వివాహమే బీజం వేస్తుంది. వివాహం తర్వాత స్త్రీ.. పిల్లల రక్షణ చూస్తూ, పురుషుడికి సహాయకారిగా ఉంటూ సామాజిక మనుగడకు దోహదం చేస్తుంది. పురుషుడు ప్రధానంగా కుటుంబ బాధ్యతలను చూస్తాడు.
సంబంధ బాంధవ్యాలు కల్పించడం: వివాహం వల్ల నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ఇది రెండు కుటుంబాలను కలపడం ద్వారా పెద్ద సంఖ్యలో బంధుత్వ వర్గాలను ఏర్పాటు చేస్తుంది. ఇరుపక్షాల వాళ్లు ఒకరికొకరు జీవనోపాధి పరంగా, రాజకీయంగా, చట్టపరంగా, మతపరంగా ఆదుకుంటారు. బంధువర్గంలో భావితరాలకు మార్గదర్శకంగా ఉంటారు. ఇతరులతో కలహం ఏర్పడినప్పుడు రక్షణగా నిలుస్తారు. వ్యవహారాల్లో అండగా ఉంటారు. ఈ సంబంధ బాంధవ్యాలు తరతరాలకు సాగిపోతూ ఉంటాయి.
విద్యా విధులు: వివాహం ద్వారా ఏర్పడిన నూతన కుటుంబం ఆ సమాజం సంస్కృతిని, అందులోని నియమ నిబంధనలు, ప్రవర్తనా రీతులను తమ సంతానానికి అందజేస్తూ వారికి విద్యాబుద్ధులు అందిస్తారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన కొత్త తరాలను తయారు చేస్తారు. వివాహం ద్వారా ఏర్పడ్డ కుటుంబం పాత తరాల సంస్కృతిని కొత్త తరాలకు అందిస్తుంది.
వివాహం రకాలు
సమాజంలో వివాహానికి సంబంధించి వివిధ రకాల విధానాలున్నాయి.
అంతర్వివాహం
ఒక వ్యక్తి తమ ప్రాంతం లేదా తన సమూహానికే చెందిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటే దాన్ని ‘అంతర్వివాహం’గా పేర్కొంటారు. తన సమూహం అంటే ఆ వ్యక్తి మతం, వర్ణం, కులం, తెగ ఏదైనా కావొచ్చు.
ఈ పద్ధతి హిందూ సమాజంలోని కుల వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన హిందూ సమాజంలో నాలుగు రకాల వర్ణాలు ఉన్నాయి. అవి:
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
వీరు కొన్ని నియమాల ప్రకారం వర్ణాంతర వివాహాలను అనుమతించారు.
ఎ) అనులోమ వివాహ పద్ధతి: హిందూ వర్ణ వ్యవస్థలో ఒక పురుషుడు తన కింది వర్ణానికి చెందిన యువతిని వివాహం చేసుకుంటే దాన్ని ‘అనులోమ వివాహం’ అంటారు. దీని ప్రకారం.. ఒక బ్రాహ్మణ యువకుడు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణానికి చెందిన స్త్రీని; క్షత్రియుడు - క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీని; వైశ్యుడు - వైశ్య, శూద్ర స్త్రీని; శూద్రుడు - శూద్ర స్త్రీని వివాహం చేసుకునే విధానం.
బి) ప్రతిలోమ వివాహం: హిందూ వర్ణ వ్యవస్థలో ఒక యువతి తన కంటే పై వర్ణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని ‘ప్రతిలోమ వివాహం’ అంటారు. దీని ప్రకారం.. బ్రాహ్మణ యువతి - బ్రాహ్మణ; క్షత్రియ స్త్రీ - క్షత్రియ, బ్రాహ్మణ; వైశ్య యువతి - వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ; శూద్ర స్త్రీ - శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ యువకులను వివాహం చేసుకునే విధానం.
అంతర్వివాహానికి కారణాలు: