అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం - International Children's Book Day
International Children's Book Day - అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం |
ఉద్దేశ్యం : పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పెంపొందించడం, పిల్లలతో బాటు పెద్దల్ని కూడా బాల సాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం (International Children's Book Day) ముఖ్య ఉద్దేశ్యం.
పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఏటా ఏప్రిల్ 2ను అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవంగా గుర్తించారు. ఈరోజు డెన్మార్క్‌కు చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత 'హాన్స్ క్రిస్టియన్ ఆండర్‌సన్' జయంతి.
ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? : 1967 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2 వ తేదీన అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 2 నే ఎందుకు జరుపుతున్నారు?
డెన్మార్క్ దేశానికి చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్‌సన్ (Hans Christian Andersen) 2 ఏప్రిల్ 1805 న జన్మించాడు.
- ఈయన గౌరవార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 2 ను అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవంగా ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY- International Board on Books for Young People) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ఆకర్షించిన 'ది లిటిల్ మర్మెయిడ్', 'ది అగ్లీ డక్లింగ్' ఈయన రాసిన పుస్తకాలే. ఈయన గౌరవార్థం బాలల పుస్తక దినోత్సవాన్ని 1967 నుంచి 'ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు 70దేశాలకు పైగా పనిచేస్తోంది.
- ప్రపంచంలోనే బాల సాహిత్యం మొదట పుట్టింది మన దేశంలోనే. క్రీస్తు పూర్వం 200లలో విష్ణుశర్మ రచించిన 'పంచతంత్రం' కథలు జంతువుల పాత్రలతో ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. అంతేకాదు, యూకేలో 'సెవెన్‌స్టోరీస్' పేరుతో పిల్లల పుస్తకాల మ్యూజియం ఉంది.
- 'ది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డిజిటల్ లైబ్రరీ ఫౌండేషన్' పేరుతో ఆన్‌లైన్ గ్రంథాలయం ఉంది. దీంట్లో దేశదేశాల భాషల పుస్తకాలు చదవొచ్చు.
- 'ది లిటిల్ ప్రిన్స్' అనే ఫ్రెంచ్ నవల ప్రపంచ వ్యాప్తంగా 250 భాషల్లోకి తర్జుమా అయ్యింది. మొత్తం 14కోట్ల కాపీలు అమ్ముడైంది.
- బ్రిటీష్ రచయిత్రి జె.కె. రౌలింగ్ రాసిన 'హారీపోటర్' నవల 7 భాగాలు కలిసి 45 కోట్లకుపైగా కాపీలు అమ్ముడయ్యాయి. చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇదే. చివరి పుస్తకం విడుదలైన 24గంటల్లో 83లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.
- 'లెస్ మిజరబుల్స్' అనే పుస్తకంలో ఒక వాక్యం ఏకంగా 823 పదాలతో ఉండడం రికార్డు.