Indian Polity Important Questions and Answers
1.లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు?
సమాధానం: 104
వివరణ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 331, 332, 333 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను కల్పిస్తూ, ఇవి 10 సంవత్సరాల పాటు అంటే 1960 వరకు ఉంటాయని ఆర్టికల్-334లో పేర్కొన్నారు. కానీ దీన్ని ఇప్పటికి 7సార్లు పొడిగించారు.
ఇటీవల మోడీ ప్రభుత్వం 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ర్టపతి సంతకంతో 2019 డిసెంబర్ 12న 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు 80 సంవత్సరాలపాటు (రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 సంవత్సరం నుంచి) అంటే 2030 వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్‌వ చేశారు.
2. భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది? - 1952 మే 13
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పడింది. లోక్‌సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది. ఈ రెండు సభలతో కూడిన భారత పార్లమెంట్ తొలిసారిగా 1952 మే 13న సమావేశం అయింది. భారత పార్లమెంట్ 2002 మే 13న స్వర్ణోత్సవాలు జరుపుకోగా, 2012 మే 13న వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకుంది.
3. లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? - 552
లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి ఎన్నిక కాగా, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తారు. కానీ ప్రస్తుతం లోక్‌సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తాడు.
4. లోక్‌సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? - సిక్కిం, నాగాలాండ్, మిజోరాం
సిక్కిం, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం ఒక్క సీటు మాత్రమే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నారు. లోక్‌సభలో ఎక్కువ సభ్యులు ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ (80), మహారాష్ర్ట (48), పశ్చిమ బెంగాల్ (42).
5. భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? - కనీసం రెండుసార్లు
రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి ఉండరాదు. కానీ ప్రస్తుతం భారత పార్లమెంట్ సంవత్సరానికి మూడుసార్లు సమావేశం అవుతుంది.
అవి..
1) బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్)
2) వర్షాకాల సమావేశాలు (జూలై నుంచి సెప్టెంబర్)
3) శీతాకాల సమావేశాలు (నవంబర్ నుంచి డిసెంబర్)
అదే విధంగా భారత పార్లమెంట్ సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లు అయినా సమావేశం కావచ్చు.
6. లోక్‌సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? - వై.బి. చవాన్
పార్లమెంట్‌లో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆయా సభలో 10 శాతం సీట్లను గెలుచుకోవాలి. తొలిసారిగా 1977లో జనతాపార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 154 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్షంగా గుర్తించబడింది. కాంగ్రెస్ నేత వై.బి.చవాన్ అధికారికంగా ప్రతిపక్షనేతగా గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం (1977)లో కమలాపాటి త్రిపాఠి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు.
7. లోక్‌సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నిక ఎప్పుడు జరిగింది? - 1971
సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. కానీ ప్రధాని సలహా ప్రకారం దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ర్టపతికి ఉంది. ఆ సందర్భంలో నిర్వహించే ఎన్నికను మధ్యంతర ఎన్నికలు అంటారు. 1967లో జరిగిన నాలుగో లోక్‌సభను ఒక సంవత్సరం ముందు 1971లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ సలహాపై రాష్ర్టపతి వి.వి. గిరి రద్దు చేశాడు. ఈ విధంగా తొలిసారిగా 1971లో మధ్యంతర ఎన్నిక జరిగింది. అనంతరం 1980లో రెండోసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 7 సార్లు మధ్యంతర ఎన్నికలు (1971, 1980, 1984, 1991, 1998, 1999, 2004) జరిగాయి.