Type Here to Get Search Results !

Vinays Info

రక్త ప్రసరణ వ్యవస్థ(Blood Circulatory System)

రక్త ప్రసరణ వ్యవస్థ మొదట అనిలెడా వర్గానికి చెందిన వానపాము, జలగలో ఏర్పడింది. రక్తప్రసరణ వ్యవస్థ పితామహుడు విలియం హార్వే.

రక్తం-Blood

  • రక్తం ఒక కొల్లాయిడల్ పదార్థం. రక్తం ద్రవరూపంలో ఉండి శరీరంలోని అన్ని భాగాలను అనుసంధానం చేస్తుంది. కాబట్టి రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అంటారు.
  • రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హెమటాలజీ.
  • ప్రౌఢమానవుడిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది.
  • రక్తం రుచి కొంచెం ఉప్పగా ఉంటుంది. రక్తం pH 7.4 (బలహీన క్షారం)
  • ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆహార పదార్థాలను రక్తం రవాణా చేస్తుంది.

రక్తం- రంగు(Colour of the Blood)

  • ఆర్థ్రోపొడా, మొలస్కా వర్గం జీవులు మినహా అన్ని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. 
  • జీవుల రక్తంలోని ఎర్ర రర్తకణాలపైన హిమోగ్లోబిన్ ఉంటుంది.
  • తెలుపు రంగు రక్తం ఉన్న జీవులు కీటకాలు (ఆర్థ్రోపొడా వర్గం)
  • ఈ జీవుల రక్తంలో Hb (హిమోగ్లోబిన్) ఉండదు. కాబట్టి రక్తం వర్ణరహితం (తెలుపు)గా ఉంటుంది.
  • పీతలు, నత్తలు, ఆల్చిప్పల్లో నీలి రంగు రక్తం ఉంటుంది.
  • ఈ జీవుల రక్తంలో హిమోసయనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది.
  • అనిలెడా (పాలికీటా) జీవుల్లో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
  • ఈ జీవుల్లో క్లోరోక్రువోరిన్స్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది.

రక్త ప్రసరణ వ్యవస్థ - రకాలు(Types of Blood Circulatory System)

రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలు.

1) వివృత రక్త ప్రసరణ లేదా స్వేచ్ఛా రక్త ప్రసరణ వ్యవస్థ(Open)

2) సంవృత లేదా బంధిత రక్తప్రసరణ వ్యవస్థ(Closed).

వివృత రక్త ప్రసరణ వ్యవస్థ(Open Blood Circulation System)

రక్తం రక్తనాళాల్లో కాకుండా స్వేచ్ఛగా శరీరంలోని కోటరాలు లేదా కాలువల్లో ప్రవహిస్తుంది.

ఈ జీవుల్లో రక్తనాళాలు ఉండవు.

ఉదా: 

1. ఆర్థ్రోపొడా (కీటకాలు)

2. మొలస్కా (సెఫలోపొడా మినహా)

3. ఇకైనోడర్మేటా

4. నిమ్నశ్రేణి కార్డేటా జీవులు

సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ(Closed type Blood Circulation System)

  • రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది.
  • ఈ జీవుల్లో రక్తనాళాలు ఉంటాయి
  • ఉదా॥అనిలెడా, ఆక్టోపస్ (సెఫలోపొడా, మొలస్కా) ఉన్నత స్థాయి కార్డేటా జీవులు, సెఫలోకార్డేటా, సకశేరుక జీవులు (చేపలు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు).
  • జలగ లాలాజలంలో హిరుడిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రక్తాన్ని పీల్చినప్పుడు గడ్డకట్టకుండా ఉంటుంది.
  • జలగను చెడురక్తం పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని పిలోబోటమీ అంటారు.
  • దోమల లాలాజలంలో హిమోలైసిన్ ఉత్పత్తి అవుతుంది.

సీరం(Serum)

శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్ష నాళికల్లోకి తీసుకున్నప్పుడు రక్తం గడ్డకడుతుంది. రక్తం గడ్డకట్టిన తర్వాత పైకి కనిపించే పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు. సీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి. కానీ రక్తకణాలు, ప్లాస్మా ప్రొటీన్లు, రక్తం గడ్డకట్టే కారకాలు ఉండవు. సీరం అధ్యయనాన్ని సీరాలజీ అంటారు.

రక్తం- భాగాలు(Parts of Blood)

రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. అవి..

1) ప్లాస్మా

2) రక్త కణాలు

ప్లాస్మా(Plasma)

  • రక్తంలోని ద్రవభాగాన్ని ప్లాస్మా అంటారు. ప్రౌఢవ్యక్తిలో సుమారు 2.7 నుంచి 3 లీటర్ల ప్లాస్మా ఉంటుంది. ఇది గడ్డి రంగులో ఉంటుంది.
  • రక్తంలో ప్లాస్మా 55 శాతం ఉంటుంది.
  • ప్లాస్మాలో 92 శాతం నీరు, 8 శాతం కర్బన,అకర్బన, ఇతర పదార్థాలు ఉంటాయి.
  • ప్లాస్మా pH విలువ 7.1
  • ప్లాస్మాలో లవణ శాతం 0.85 నుంచి 0.9
  • ప్లాస్మాలో అల్బుమిన్, గ్లొబ్యులిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటాయి.
  • ప్రోత్రాంబిన్, పైబ్రినోజన్ అనే రక్తస్కందనపదార్థాలు ఉంటాయి.
  • సోడియం, పొటాషియం, అమ్మోనియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి.
  • కర్బన పదార్థాలైన యూరికామ్లం, విటమిన్లు, హార్మోన్లు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి.

రక్త కణాలు(Blood Cells)

  • రక్త కణాల సేకరణకు రక్తానికి 10 మి.లీ. (0.9%) సోడియం క్లోరైడ్ (NaCl) ద్రావణాన్ని కలుపుతారు.
  • రక్తంలో రక్తకణాలు 45 శాతం ఉంటాయి.

రక్త కణాలు మూడు రకాలు అవి..

1) ఎర్ర రక్తకణాలు

2) తెల్ల రక్తకణాలు

3) రక్త ఫలకికలు

ఎర్ర రక్త కణాలు (Red Blood Cells-RBC)

  • ఎర్ర రక్తకణాలను ఆంటోనీవాన్ లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఎముక ఎరుపు అస్థిమజ్జలోని నార్మోబ్లాస్ట్ అనే పూర్వకణాల నుంచి ఎర్ర రక్తకణాలు ఏర్పడుతాయి.
  • పక్షుల్లో అస్థిమజ్జ ఉండదు. ఎముకలు గాలితో నిండి ఉంటాయి. కాబట్టి పక్షుల్లో ఎర్ర రక్తకణాలను బార్సా అనే అవయవం ఉత్పత్తి చేస్తుంది.
  • ఎర్ర రక్తకణాల పరిపక్వతకు విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లం అవసరం.
  • పరిపక్వం చెందిన ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. కేంద్రకం ఇతర కణాంగాలు ఉండవు.
  • వానపాములో ఎర్ర రక్తకణాలు ఉండవు.
  • ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎరిత్రోపోయిసిస్ అంటారు
  • ఎరిత్రోసైసిస్ అంటే ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి(ప్లీహంలో)
  • ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే, అంతరించే ఆర్‌బీసీల సంఖ్య 10×1012.

ఆర్‌బీసీల లక్షణాలు(Features of RBC's)

  • ఆకారం(Shape): బల్లపరుపు లేదా ద్విపుటాకారం (Biconcave) క్షీరదాల్లో మాత్రమే ఉంటుంది.
  • కేంద్రకం: క్షీరదాల ఆర్‌బీసీల్లో కేంద్రకం ఉండదు. కానీ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షుల ఆర్‌బీసీల్లో కేంద్రకం ఉంటుంది.
  • ఒంటె, లామా అనే క్షీరదాల ఎర్రరక్తకణాలు ద్వికుంభాకారంలో(Dichotomous)ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది.
  • ఆర్‌బీసీలు పిండదశలో కాలేయం, ప్లీహం నుంచి ఉత్పత్తి అవుతాయి.
  • కాలేయాన్ని ఎర్రరక్తకణాల క్రాడిల్ అంటారు.
  • పురుషులలో ఆర్‌బీసీల సంఖ్య.. 4.5 నుంచి 6.5 మిలియన్లు (లేదా) 4.5 నుంచి 6.5×106(క్యూబిక్ మి. లీ. రక్తంలో)
  • స్త్రీలలో 3.5 నుంచి 5.5 మిలియన్లు (లేదా) 35 - 55 లక్షల ఆర్‌బీసీలు ఉంటాయి.
  • ఆర్‌బీసీల గుంపును రౌలెక్స్ అంటారు.
  • హిమోసైటోమీటర్‌తో ఆర్‌బీసీలను లెక్కిస్తారు.
  • ఆర్‌బీసీల జీవితకాలం 120 రోజులు
  • విటమిన్-C లోపంతో ఆర్‌బీసీల జీవితకాలం తగ్గుతుంది.
  • ఆర్‌బీసీలు ప్లీహం, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.
  • ఆర్‌బీసీలు విచ్చిన్నం చెందే ప్రక్రియను ఎరిత్రోక్లాసియా అంటారు.
  • కాలేయాన్ని హిమోపాయిటిక్ + హిమోలైటిక్ అవయవం అంటారు.
  • హిమోలైటిక్ చర్యలో కాలేయ కౌపర్ కణాలు ఉపయోగపడుతాయి.

హిమోగ్లోబిన్(Haemoglobin)

  • హిమోగ్లోబిన్ ఒక సంయుగ్మ ప్రొటీన్. దీనిలో ఉండే మూలకం ఇనుము.
  • పచ్చని ఆకుకూరలు, కూరగాయల్లో ఐరన్ లభిస్తుంది.
  • హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము, గ్లోబ్యులిన్ ప్రొటీన్ అవసరం.
  • రక్తంలో Hbని లెక్కించే పద్ధతిని కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు.
  • ప్రౌఢ వ్యక్తి రక్తంలో Hb-15 గ్రా./డెస్సీలీటర్
  • హిమోగ్లోబిన్ ఫోర్‌పైరిన్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
  • హిమోగ్లోబిన్ నిర్మాణంలో హీమ్, గ్లోబ్యులిన్ అనే భాగాలుంటాయి.

హీమ్(Heme)

  • హిమోగ్లోబిన్‌లోని ఇనుము భాగాన్ని హీమ్ అంటారు.
  • ఇది ఫోర్‌పైరిన్ నిర్మాణం మధ్యలో ఉంటుంది.

గ్లోబ్యులిన్(Globulins)

  • ఇది ఒక ప్రొటీన్ భాగం
  • గ్లోబ్యులిన్ నిర్మాణంలో 4 అమైనో ఆమ్ల శృంఖలాలు (2 ఆల్ఫా+ 2 బీటా) ఉంటాయి.
  • Hbతో అధిక చర్యాశీలత ఉన్న వాయువు కార్బన్ మోనాక్సైడ్
  • ఒక Hb అణువు 4 ఆక్సిజన్ పరమాణువులను కణాల వద్దకు తీసుకెళ్తుంది.

తెల్ల రక్త కణాలు (ల్యూకోసైట్స్ / డబ్ల్యూబీసీ)

  • తెల్ల రక్త కణాలను ఫాగోసైట్స్, శరీర రక్షక భటులు (బాడీ సోల్జర్‌‌స), శ్వేత రక్త కణాలు అని కూడా అంటారు. రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను తెల్ల రక్తకణాలు చంపి దేహాన్ని కాపాడతాయి. కాబట్టి వీటిని శరీర రక్షక భటులు, లేదా రక్తంలోని పారిశుద్ధ్య పనివారు అని అంటారు.
  • ల్యూకోపాయిసిస్ అంటే తెల్ల రక్తకణాలఉత్పత్తి.
  • ల్యూకోలైసిస్ అంటే తెల్ల రక్తకణాల విచ్ఛిత్తి.
  • ల్యూకోపేనియా అంటే తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా తగ్గడం.
  • ల్యూకేమియా (ల్యుకోసైథీమియా) అంటే తెల్ల రక్తకణాల సంఖ్య విపరీతంగా పెరగడం (బ్లడ్ క్యాన్సర్).
  • శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొనే క్రమంలో చనిపోయిన తెల్ల రక్తకణాలు చీము రూపంలో బయటకు విసర్జితమవుతాయి.
  • డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్‌కు తెల్ల రక్తకణాలను ఉపయోగిస్తారు.
  • ఉపయోగం: నేర పరిశోధన, మాతృ, పితృత్వ వివాదాల పరిష్కారం.
  • తెల్ల రక్తకణాలు గుండ్రంగా ఉంటాయి.
  • వీటిలో కేంద్రం ఉంటుంది.
  • కాలేయం, ప్లీహం (లింప్ గ్రంథి), థైమస్ గ్రంథి (బాల గ్రంథి), దీర్ఘ అస్థిమజ్జ నుంచి తెల్లరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి.
  • క్యూబిక్ మి.లీ. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య 5000-9000 (5–9 × 103)
  • ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల నిష్పత్తి 500 : 1
  • తెల్ల రక్తకణాలు కాలేయం, ప్లీహంలో విచ్ఛిన్నమవుతాయి.

తెల్ల రక్తకణాలు ప్రధానంగా రెండు రకాలు. అవి..

ఎ)గ్రాన్యులోసైట్స్, బి) ఎగ్రాన్యులో సైట్స్

గ్రాన్యులోసైట్స్(Granulocytes)

ఈ డబ్ల్యూబీసీల జీవ పదార్థంలో రేణువులు (గ్రాన్యుల్స్) ఉంటాయి. మొత్తం డబ్ల్యూబీసీల్లో గ్రాన్యులోసైట్స్ 70 శాతం వరకు ఉంటాయి. వీటిలో కేంద్రకం భిన్న రూపాల్లో ఉంటుంది. కాబట్టి వీటిని బహురూపక కేంద్రక తెల్ల రక్తకణాలు అంటారు. గ్రాన్యులో సైట్స్‌ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

1) ఇసినోఫిల్స్ (అసిడోఫిల్స్)

2) బేసోఫిల్స్

3) న్యూట్రోఫిల్స్

ఇసినోఫిల్స్(Isinophills)

ఈ కణాలు ఆమ్ల రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. వీటి కేంద్రకంలో రెండు తమ్మెలు ఉంటాయి. జీవ పదార్థంలో అతిపెద్ద కణికలుంటాయి. మొత్తం తెల్ల రక్తకణాల్లో వీటి సంఖ్య 2 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. ఇసినోఫిల్స్ జీవిత కాలం 7 నుంచి 12 రోజులు.

విధులు

  • ఇసినోఫిల్స్ ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి.
  • శరీరంలో ప్రవేశించిన విషపదార్థాలను నాశనం చేస్తాయి.
  • ఎలర్జీ కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ సమయంలో ఇసినోఫిల్స్ సంఖ్య విపరీతంగా పెరగడాన్ని ఇసినోఫిలియా అంటారు.

ఎలర్జీని కలిగించే మొక్కలు

1) అర్టకేరియా

2) పార్దీనియం హిస్టిరోఫోరస్ (వయ్యారిభామ/కాంగ్రెస్ గడ్డి )

  • ఈ మొక్కల పరాగ రేణువుల వల్ల వచ్చే జ్వరాన్ని హైఫీవర్ అంటారు.
  • ఎలర్జీని కలిగించే కారకాన్ని ఎలర్జీన్ అంటారు.
  • ఉదా: పరాగరేణువులు, దుమ్ము, సెంట్, లిప్‌స్టిక్ మొదలైనవి.

బేసోఫిల్స్(Basophills)

  • ఈ కణాలు క్షార రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. కేంద్రకం ఎస్ (S) ఆకారంలో ఉంటుంది. తెల్ల రక్తకణాలన్నింటి కంటే వీటి సంఖ్య చాలా తక్కువ (0.4 శాతం).
  • వీటి జీవిత కాలం 12 నుంచి 15 రోజులు
  • పుండ్లు, గాయాలను మాన్పడంలో ఈ కణాలు తోడ్పడుతాయి.

న్యూట్రోఫిల్స్(Neutrophils)

  • ఈ కణాలు తటస్థ రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. కేంద్రకం అనేక తమ్మెలను (ఐదు లేక ఆరు) కలిగి ఉంటుంది.
  • తెల్ల రక్తకణాలన్నింటి కంటే వీటి సంఖ్య చాలా ఎక్కువ (60-65 శాతం).
  • వీటి జీవిత కాలం 2 నుంచి 5 రోజులు.
  • శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాలను చంపడం వల్ల వీటిని సూక్ష్మ రక్షక భటులు (మైక్రో పోలీస్‌మెన్) అంటారు.
  • బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని రక్షించడం వల్ల వీటిని మొదటి వరుస రక్షకులు అంటారు.
  • డబ్ల్యూబీసీల్లోని ఏ ఇతర కణాన్ని అయినా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి న్యూట్రోఫిల్స్‌ను బహు రూపక తెల్ల రక్తకణాలు (ప్లియోమార్పిక్ సెల్స్) అంటారు.
  • బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షణ క్రియలో పాల్గొని లైసోసోమ్స్ అనే కణాంగాల సహాయంతో సూక్ష్మజీవులను చంపే (భక్షణ) ప్రక్రియను ఫాగోసైటాసిస్ అంటారు.

ఎగ్రాన్యులో సైట్స్(Agranulocytes)

ఈ కణాల జీవపదార్థంలో రేణువులు (గ్రాన్యుల్స్) ఉండవు. ఇవి తిరిగి రెండు రకాలు..

  1. లింపోసైట్స్
  2. మోనోసైట్స్

లింపోసైట్స్

తెల్ల రక్త కణాలన్నింటిలోకి అతి ప్రధానమైనవి. ఇవి మిగతా తెల్ల రక్తకణాల విధులను నియంత్రిస్తాయి. ఇవి శరీరంలోకి వచ్చిన ప్రతి జనకాల (యాంటీజెన్)ను గుర్తించి వాటికి వ్యతిరేక ప్రతిరక్షకాల(యాంటీబాడీస్)ను ఉత్పత్తి చేసి అసంక్రామ్యత (రోగనిరోధక శక్తి)ని పెంచుతాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే అతి ముఖ్యమైన కణాలుగా లింపోసైట్లను పరిగణిస్తారు.

  • మొత్తం తెల్ల రక్తకణాల్లో ఇవి 25-28 శాతం వరకు ఉంటాయి.
  • డబ్ల్యూబీసీల్ల్లో అతి చిన్న రక్తకణాలు లింపో సైట్లు. ఇవి గుండ్రంగా ఉంటాయి. కేంద్రకం చాలా పెద్దగా ఉంటుంది.
  • వీటి జీవిత కాలం రెండు గంటల నుంచి కొన్ని రోజులు.

లింపోసైట్స్ రెండు రకాలు

1) బి-లింపోసైట్స్

2) టి– లింపోసైట్స్

బి– లింపోసైట్స్(B-Limphicytes)

  • ఇవి దీర్ఘ అస్థిమజ్జ నుంచి ఏర్పడతాయి.
  • వీటి జీవిత కాలం 12 నుంచి 24 గంటలు. కొన్ని మాత్రం నెల వరకూ జీవిస్తాయి.
  • ఇవి అసంక్రామ్యతను కలిగిస్తాయి.
  • వీటిని CD8 కణాలు అంటారు.

టి– లింపోసైట్స్ (CD4 / T4)

  • ఇవి థైమస్ గ్రంథి నుంచి ఏర్పడతాయి.
  • రక్తంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని ఇవి గుర్తిస్తాయి. అనంతరం వ్యాధి కారకాన్ని భక్షక కణానికి అందిస్తాయి.
  • వ్యాధి కారకాన్ని గుర్తించిన కొన్ని టి – లింపోసైట్స్, బి–లింపోసైట్స్‌ని ప్రేరేపిస్తాయి.
  • హెచ్‌ఐవీ వైరస్ లేదా రిట్రో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట T4 లింపోసైట్స్‌పై దాడిచేసి నాశనం చేస్తుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది.
  • ఎయిడ్స్ వ్యాధిని 1981లో యూఎస్‌ఏలో మొదటి సారి గుర్తించారు. భారతదేశంలో 1986లో చెన్నైలో గుర్తించారు.

మోనోసైట్స్(Monocytes)

ఇవి తెల్ల రక్తకణాలన్నింటిలో కెల్లా అతిపెద్దవి. ఈ కణాల కేంద్రకం మూత్రపిండాకారం (కిడ్నీ)లా ఉంటుంది. ఇవి అంటు రోగం (వ్యాధి గ్రస్తభాగం) వద్దకు వెళ్లి బ్యాక్టీరియాలను చంపుతాయి. ఈ మోనోసైట్స్ సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. మోనోసైట్స్‌నే రక్తం నిజమైన పారిశుద్ధ్య కార్మికులు అంటారు. వీటి జీవిత కాలం 2 నుంచి 5 రోజులు.

రక్త ఫలకికలు(Blood Platelets)

ఈ కణాలు అస్థిమజ్జలోని మెగా క్యారియోసైట్స్ అనే కణాల నుంచి ఏర్పడతాయి. ఇవి పూర్తిస్థాయి రక్తకణాలు కావు. ఇవి ద్వికుంభాకారంలో బల్లపరుపుగా ఉంటాయి.

  • ఈ కణాల్లో కేంద్రకం ఉండదు.
  • వీటి సంఖ్య 2 నుంచి 4 లక్షలు / క్యూబిక్ మి.లీ. రక్తం.
  • వీటి జీవిత కాలం 3 నుంచి 10 రోజులు.
  • క్షీరదాల్లో మాత్రమే రక్త ఫలకికలుంటాయి.
  • డెంగ్యూ, ఎబోలా వ్యాధుల్లో వైరస్ ప్రభావం వల్ల రక్త ఫలకికల సంఖ్య విపరీతంగా తగ్గి రోగి మరణిస్తాడు.
  • రక్తఫలకికల విధి: రక్తాన్ని గడ్డకట్టించడం (రక్త స్కందనకు తోడ్పడుతాయి. కాబట్టి వీటిని థ్రాంబోసైట్స్ అంటారు (థ్రాంబస్ అంటే రక్తం గడ్డకట్టడం అని అర్థం).
  • గాయమైనప్పుడు ఆ ప్రాంతంలోని రక్త ఫలకికలు విచ్ఛిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్ (థ్రాంబోకైనేజ్) అనే రసాయనాన్ని స్రవిస్తాయి.

రక్త స్కందనకు నాలుగు కారకాలు అవసరం. అవి..

1. రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే ఎంజైమ్..థ్రాంబోప్లాస్టిన్ / థ్రాంబోకైనేజ్.

2. హార్మోన్..ప్రోథ్రాంబిన్ లేదా ఫైబ్రినోజన్.

3. విటమిన్ K.

4. మూలకం.. Ca+2 (కాల్షియం అయాన్లు).

  • రక్త స్కందనకు 13 కారకాలు అవసరమని ఇటీవల గుర్తించారు.
  • రక్తం గడ్డ కట్టే యాంత్రికాన్ని వివరించింది బెస్ట్, టేటర్.
  • రక్తం గడ్డ కట్టే యాంత్రికంలో మూడు దశలు ఉంటాయి.

I) థ్రాంబోప్లాస్టిన్ విడుదల

దెబ్బతిన్న రక్త ఫలకికల నుంచి థ్రాంబోప్లాస్టిన్ విడుదలవుతుంది.

II) ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్‌గా మారడం

III) ఫైబ్రినోజన్ ఫైబ్రిన్‌గా మారడం

ఫైబ్రిన్ రక్తంలో కరిగి ఉన్న ఫైబ్రినోజన్‌ను ఫైబ్రిన్ పోగులుగా మారుస్తుంది. తర్వాత ఈ ఫైబ్రిన్ పోగులు సంక్లిష్టమైన వలను ఏర్పర్చి గాయం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని బిరడా వలె మూసి రక్తాన్ని బయటకు రానీయదు.


రక్త స్కందన నివారణ పదార్థాలు

రక్తం రక్తనాళాల్లో O2ను రవాణా చేస్తున్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా హిపారిన్ తోడ్పడుతుంది. దీన్ని కాలేయం స్రవిస్తుంది.

బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి సోడియం, పొటాషియం, అల్యూమినియం సిట్రేట్స్, ఆక్సలేట్స్‌ను కలుపుతారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section