National Security Day | జాతీయ భద్రతా దినోత్సవం | Rashtriya Suraksha Diwas
జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించబడుతుంది. భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965, డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంస్థలు పాల్గొని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు. 1966, మార్చి 4న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతామండలి ఏర్పడింది. మండలి ప్రారంభమయిన మార్చి 4న ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవం జరుపబడుతుంది.
ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు భద్రత, ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
కార్యక్రమాలు
- ఈ దినోత్సవం సందర్భంగా వారంరోజులపాటు భద్రత వారోత్సవాలు నిర్వహించబడుతాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు ఉంటాయి.
- ఉద్యోగులు, కార్మికులతో భద్రతా ప్రతిజ్ఞను చేయిస్తారు.
- ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినపుడు ఎలా స్పందించాలనే అంశాలను చిన్న చిన్న ఫిల్మ్ ద్వారా ప్రదర్శిస్తారు.