Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ భావజాల వ్యాప్తి

తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్

- తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలపై పరిశోధన, అధ్యయనం చేయడం, వాటికి సంబంధించిన ప్రచురణలను లక్ష్యాలుగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్‌ను 1988, జూలై 14న టీ ప్రభాకర్ రావు, ప్రొ. కే జయశంకర్, కేశవరావు జాదవ్, పీ హరినాథ్, డా. ఏ వినాయక్ రెడ్డి కలిసి ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లోని ప్రభాకర్ ఇంటిని దీని కార్యాలయంగా ఉపయోగించారు. ట్రస్ట్ లక్ష్యాల ప్రకారం ఇదొక అకడమిక్ సంస్థగా ప్రారంభమైనా తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషిచేసింది. ఆందోళనకారులు, ఉద్యమకారులకు అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని మా తెలంగాణ పత్రిక ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పత్రిక ఆవిష్కరణ సభ 1989, ఆగస్టు 13న కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో నిర్వహించారు.

తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్‌ఓ)

- 1992లో ఉస్మానియా యూనివర్సిటీలో కొతిరెడ్డి మనోహర్ రెడ్డి ఈ సంస్థను ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోని విద్య, ఉద్యోగ అవకాశాలు స్థానికేతరుల పాలవుతున్నాయని భావించిన విద్యార్థులు టీఎల్‌ఎస్‌ఓలో చేరి తెలంగాణ సమస్యలు, వివక్ష, అన్యాయాలపై పోరాడారు.
- ఉదయం పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సామిడి జగన్‌రెడ్డి టీఎల్‌ఎస్‌ఓలో చురుగ్గా పాల్గొంటూ కాకతీ పేరుతో ఒక చిన్న పుస్తకం వెలువరించారు.

వీవీ కాలేజీ అశోకా టాకీస్ సదస్సు

- హైదరాబాద్ పుత్లిబౌలీలోని వివేకవర్ధిని కళాశాల ఆవరణలో ఉన్న అశోకా టాకీస్‌లో తెలంగాణ సంసృ్కతి-వివక్షపై 1997, జనవరి 19న సదస్సు జరిగింది. దీన్ని పాశం యాదగిరి నిర్వహించారు.
- పోలీసుల చేతిలో హత్యకు గురైన గులాం రసూల్ స్మారకార్థం ప్రతి ఏటా సభ నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ జర్నలిస్టులు ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సదస్సు కరపత్రంలో సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం అని పేర్కొన్నారు.
- తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన గణాంకాలతో గాదె ఇన్నయ్య ముద్రించిన దగాపడ్డ తెలంగాణ తొలి సంచికను, 1997-2000 మధ్య కాలంలో వేలాది మందిని ప్రభావితం చేసి తెలంగాణ సోయిని కలిగించిన ప్రొ. జయశంకర్ రచించిన తెలంగాణలో ఏం జరుగుతోంది? పుస్తకాన్ని ఈ సదస్సులోనే ఆవిష్కరించారు.
Telangana1

తెలంగాణ ప్రగతి వేదిక

- ప్రముఖ జర్నలిస్టు రాపోలు ఆనందభాస్కర్ తెలంగాణ ప్రగతి వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో 1997, జూలై 12, 13న తెలంగాణ సమస్యలపై ఒక సమాలోచన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో తెలంగాణ ప్రజల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనంపై వక్తలు ప్రసంగించారు.
- ఈ సమావేశాల్లో దాశరథి రంగాచార్య, ప్రొ. జయశంకర్, బీఎస్ రాములు, వెలిజాల చంద్రశేఖర్, ప్రొ. చక్రధర్ రావు, ప్రొ. సింహాద్రి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఈఎన్‌సీ ప్రభాకర్ రావు, నారం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మహాసభ (1997)

- దోఖా దిన్ తెలంగాణ అనే పేరుతో 1997, ఆగస్టు 11న సూర్యాపేటలో సదస్సు, భారీ బహిరంగసభ జరిగింది. దీనికి చెరకు సుధాకర్ అధ్యక్షత వహించారు. ఇందులో ప్రొ. జయశంకర్, డా. బి జనార్దన్ రావు, కంచె అయిలయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, ప్రొ. కేశవరావు జాదవ్, వరదా రెడ్డి, బీ రాములు, మల్లేపల్లి లక్ష్మయ్య, వీ ప్రకాశ్ మందడి సత్యనారాయణరెడ్డి తదితరులు ప్రసంగించారు.

తెలంగాణ మహాసభ మాసపత్రిక

- తెలంగాణ భావజాల వ్యాప్తికోసం వీ ప్రకాశ్ ఎడిటర్‌గా తెలంగాణ మహాసభ మాసపత్రికను వెలువరించారు. తెలంగాణవ్యాప్తంగా వివిధ సంఘాలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాల వార్తలు ఈ పత్రికలో ప్రచురించారు.

ఓయూ సెమినార్

- ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ భవనంలో ఉన్న ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో సెంటర్ ఫర్ తెలంగాణ స్డడీస్ ఆధ్వర్యంలో 1997, ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశంపై సదస్సు జరిగింది. దీన్ని ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ. సింహాద్రి నిర్వహించారు.

తెలంగాణ ఐక్యవేదిక

- తెలంగాణ కోసం పనిచేసే 28 సంస్థలు 1997, అక్టోబర్ 14న ఉస్మానియా లైబ్రరీ భవనంలో తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేసుకున్నాయి. అక్టోబర్ 16న ఐక్యవేదిక ఆవిర్భావాన్ని ప్రకటించారు. సమష్టి నాయకత్వం ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం అని పేర్కొన్నారు.
- దీనికోసం ప్రొ. కేశవరావు జాదవ్, ప్రొ. జయశంకర్, పాశం యాదగిరి, వీ ప్రకాశ్ తదితరులు కృషిచేశారు.

వరంగల్ డిక్లరేషన్

- ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక) ఆధ్వర్యంలో 1997, డిసెంబర్ 28, 29 తేదీల్లో హన్మకొండలో ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల సదస్సు, బహిరంగ సభ జరిగాయి. దీనికి ప్రొ. సాయిబాబా అధ్యక్షత వహించారు.
- మొదటి రోజు ప్రొ. జయశంకర్, వరవరావు, గద్దర్, ప్రొ. సీతారామారావు, బీ. జనార్దనరావు తదితరులు ప్రసంగించారు. 50 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రొ. సాయిబాబా ప్రతిపాదించగా సదస్సు ఆమోదించింది.
- రెండోరోజు సదస్సులో కాళోజీ, ప్రొ. జయశంకర్, గద్దర్, కన్నభిరాన్, బీ జనార్దాన్‌రావు ప్రసంగించారు.

తెలంగాణ జనసభ

- 1998, జూలై 5, 6 తేదీల్లో హైదరాబాద్ అంబర్‌పేటలోని రాణాప్రతాప్ హాల్‌లో ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ఎంజే ఖాన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
- ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన తెలంగాణ మాసపత్రికను ఆవిష్కరించారు. ఇక్కడి వనరులను కొల్లగొడుతున్న కోస్తాంధ్ర పాలకవర్గాలకు క్విట్ తెలంగాణ అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన ఉద్యమంలో చావో బతుకో తేల్చుకోవాలన్నారు.
- ఆకుల భూమయ్య ప్రవేశపెట్టిన జనసభ అవగాహనా పత్రాన్ని సభ ఆమోదించింది.

జై తెలంగాణ పార్టీ..తెలంగాణ ఉద్యమ కమిటీ

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి పీ ఇంద్రారెడ్డి చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమకమిటీ 1997, జూన్ 18న ఏర్పడింది. ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావు జాదవ్, మేచినేని కిషన్‌రావు మొదలైనవారు ఇంద్రారెడ్డిని ప్రోత్సహించారు. చంపాపేటలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన ప్రతినిధుల సదస్సు తర్వాత ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని ప్రారంభించారు.

ప్రత్యేక తెలంగాణ పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ విధాన ప్రకటన

- సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం- తెలంగాణ అభివృద్ధి-మా కార్యక్రమం పేరుతో 1997, జూన్ 1న విధాన ప్రకటన విడుదల చేసింది.
- వివిధ రాష్ర్టాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల బూర్జువాలు మొత్తం వనరుల మీద ఆధిపత్యం సంపాదించడంతో వెనుకబడిన ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఈ ప్రాంతీయ అసమానతలవల్లే ముందుకు వచ్చిందని ఆ కమిటీ అభిప్రాయపడింది.

భువనగిరి ప్రతినిధుల సదస్సు

- భువనగిరి బహిరంగసభకు ఒకరోజు ముందు ఇండియా మిషన్ హైస్కూల్ ఆవరణలో ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ప్రాంగణానికి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరుపెట్టారు.
- ఈ సదస్సును కాళోజీ నారాయణరావు ప్రారంభించారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిని పాలకులు కాల్చి చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొ. జయశంకర్ విద్య, వైద్య రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, గాదె ఇన్నయ్య సాగునీరు, విద్యుత్ రంగాల్లో జరగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించారు. ఈ సెషన్‌కు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు.
- తెలంగాణ వనరులు, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం అంశంపై ప్రొ. కేశవరావు జాదవ్ ప్రసంగించారు. వలసీకరణ, ఉన్నతాధికారుల ఉద్యోగాల అంశంపై ప్రొ. కే శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమం-అవగాహన అనే అంశంపై గద్దర్, సాల్వేరు వెంకటేశ్వర్లు మాట్లాడారు. మార్చి 9న ఉదయం సెషన్‌లో భాషా సంస్కృతి, మీడియాపై నందిని సిధారెడ్డి ప్రసంగించారు. పత్రికా రంగంలో తెలంగాణవారికి జరుగుతున్న అన్యాయాలను ఆ సెషన్‌కు అధ్యక్షత వహించిన జర్నలిస్టు కే శ్రీనివాస్ వివరించారు. తరువాత జరిగిన రెండో సెషన్‌కు దినేష్ కుమార్ అధ్యక్షత వహించారు. సాంఘిక సంక్షేమ రంగం, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడారు.
భువనగిరి బహిరంగసభ
- 1997, మార్చి 9న ప్రభుత్వ జూ. కళాశాల మైదానంలో నాగారం అంజయ్య అధ్యక్షతన ఈ సభ జరిగింది. దీనికి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణం అని నామకరణం చేశారు. గొల్లకుర్మ డోలు దెబ్బ నాయకురాలు బెల్లి లలిత పాటలు ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section