Type Here to Get Search Results !

Vinays Info

మాల్దీవులు - భారత్ సంబంధాలు

చారిత్రక నేపథ్యం

- భౌగోళికంగా చూసుకుంటే హిందూ మహాసముద్రంలో చిన్న ద్వీప దేశం మాల్దీవులు. ఇది మన దేశానికి, లక్ష దీవులకు దక్షిణముఖంగా ఉంది. అయితే 1966లో మాల్దీవులకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే భారత్, మాల్దీవులకు మధ్య అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. మరో విశేషం ఏమిటంటే అధికారికంగా మాల్దీవులను ఒక సార్వభౌమ దేశంగా మొదట గుర్తించినది మన దేశమే. అప్పటి నుంచి భారత్ ఈ దేశానికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటూ.. దౌత్య, రక్షణ, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను నెరుపుతుంది.
- అయితే భారత్ ఈ సంబంధాలను విదేశాంగ విధానంలో భాగంగా చూస్తే, మాల్దీవులు మాత్రం మన దేశాన్ని ఒక సహాయ నిధిగా, తన పొరుగునే ఉన్న అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన శ్రీలంక ఆధిపత్య వ్యాపార ధోరణికి అడ్డుగోడలా, తనకు రక్షణగా భావించింది.

దౌత్య సంబంధాల బలోపేతం

- భారత్, మాల్దీవులు ఇరుపక్షాలకు అంగీకారయోగ్యంగా 1976లో తమ సరిహద్దులను పరిష్కరించుకున్నాయి. అయితే అప్పటి అధ్యక్షుడు గయూమ్ తమ్మడు.......... 1992లో మినికాయ్ ద్వీపం తమదేనని చెప్పడంతో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే వెంటనే స్పందించిన మాల్దీవుల ప్రభుత్వం ఆ దీవులు భారతదేశానికి చెందినవిగా ప్రకటించి ఘర్షణ లేకుండా చూసుకుంది.
- అంతేగాకుండా భారత్, మాల్దీవులు 1981లో ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. సౌత్ ఏషియన్ అసోషియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్)కు రెండు దేశాలూ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. అంతేగాకుండా సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్, సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లో కూడా ఇరుదేశాలు సంతకాలు చేసి ఉన్నాయి. రెండు దేశాల అధినేతల మధ్య కూడా మంచి సంబంధాలు ఉంటున్నాయి.

ఆపరేషన్ కాక్టస్

- అప్పటి అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1988 నవంబర్‌లో 80 మంది LTTE మిలిటెంట్లతో కూడిన ఒక బృందం.. అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌కు వ్యతిరేకంగా రాజధాని మాలేను ముట్టడించడానికి ప్రయత్నించింది. అయితే అధ్యక్షుడి కోరిక మేరకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం మాల్దీవుల రక్షణ కోసం సైన్యాన్ని పంపింది. దీని పేరే ఆపరేషన్ కాక్టస్.
- మాల్దీవులు భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన దేశం. అలాంటి దేశంలో స్థిరమైన ప్రభుత్వాలు ఉండటం ఇండియాకు చాలా మంచిది. ఈ పరిస్థితుల్లో మాల్దీవుల్లో మిలిటెంట్ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం భారత ప్రయోజనాలకు వ్యతిరేకం. కాబట్టి భారత్ త్వరితగతిన స్పందించి 12 గంటల్లో ఆ దేశానికి సైన్యాన్ని చేరవేసింది. ఇందులో 19 మంది ఉగ్రవాదులు హతంకాగా, ఒక సైనికుడికి గాయాలయ్యాయి. ఈ ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయి. అమెరికా, రష్యా, గ్రేట్ బ్రిటన్ తదితర దేశాలతోపాటు మన పొరుగుదేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ కూడా అభినందించాయి. సత్వర నిర్ణయంతో భారత్.. మాల్దీవుల రక్షణకు, ప్రభుత్వాల స్థిరీకరణకు తోడ్పడటమేగాకుండా, ఆర్థిక తోడ్పాటును అందించింది. దీంతో భారత్, మాల్దీవుల మధ్య మరింత దృఢ సంబంధాలు ఏర్పడ్డాయి.

GMR - మాల్దీవుల విమానాశ్రయ వివాదం

- మాల్దీవుల్లో అతిపెద్ద పెట్టుబడి భారత్ నుంచి జీఎంఆర్ కంపెనీ. ఆ దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ పెట్టుబడిని కేటాయించారు. అయితే అప్పటి ప్రభుత్వం కంపెనీ కాంట్రాక్ట్టును రద్దు చేయడంవల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారాయి. దీంతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో.. భారత్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుంది. పోలీస్ అకాడమీ నిర్మాణం, వివిధ హామీల అమలును నిలిపివేసింది.

తాగునీటి ఎద్దడి - భారత్ సహాయం

- 2014, డిసెంబర్ 4న మాల్దీవుల్లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో తాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాల్దీవులు భారతదేశ సహాయాన్ని అర్థించింది. భారత్ త్వరితగతిన స్పందించి హెవీ లిఫ్ట్ ట్రాన్స్‌పోర్టర్ అయిన సి-17 గ్లోబల్ మాస్టర్-IIIని పంపించింది. నావికాదళం కూడా INS సుకన్య, INS దీపక్ తదితర నౌకలను పంపింది. ఇవి సముద్రంలోని ఉప్పునీటి నుంచి మంచి నీటిని ఉత్పత్తి చేయగల నౌకలు. ఈ మానవతా సాయాన్ని, సత్వర స్పందనను ప్రపంచ దేశాలన్నీ అభినందించాయి. మాల్దీవుల ఉపాధ్యక్షుడు భారత రాయబారిని పిలిపించి మరీ అభినందించారు.

2015 - మాజీ అధ్యక్షుడు నషీద్ అరెస్ట్

- మాల్దీవుల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను 2015, ఫిబ్రవరి 22న తీవ్రవాద ఆరోపణలతో అరెస్ట్ చేశారు. మహమ్మద్ నషీద్ 2008 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతనికి భారత్‌కు అనుకూలుడిగా పేరుంది. నషీద్ అరెస్టును భారత్, అమెరికా తీవ్రంగా ఖండించాయి. సాధారణంగా భారత ప్రధాని వెళ్లాల్సిన దేశాల జాబితాలో మాల్దీవులు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో ఇటీవల జరిగిన ఎన్నికలు దేశానికి దక్కిన మరో అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది.

పెద్ద అడ్డంకిగా చైనా

- అప్పటివరకు గ్రేట్ బ్రిటన్, అమెరికా, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలు నెరిపిన మాల్దీవుల ప్రభుత్వం 2013లో యామీన్ రాకతో చైనా ప్రభావానికి లోనవడం మొదలైంది.
- మొదట సిల్క్‌రోడ్ మారిటైమ్ ఇనీషియేటివ్‌గా పేరుగాంచిన ఇప్పటి ఓబీఓఆర్ (వన్ బెల్ట్, వన్ రోడ్) పథకంలో మాల్దీవులు భాగస్వామి అయ్యింది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టుల పేరుతో చైనా మాల్దీవులను అప్పుల ఊబిలోకి నెట్టడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాజధాని మాలే, మరో పట్టణమైన ఎర్రల్ హులే కి అనుసంధానంగా సినామాల్ బ్రిడ్జిని చైనా నిర్మించింది. ఈ ప్రాజెక్టును గతంలో భారత కంపెనీ ప్రారంభించింది.
- దీంతోపాటు మరిన్ని అభివృద్ధి పనుల పేరుతో విపరీతమైన నిధుల దన్నుతో చైనా ఈ దేశంలో చొచ్చుకుపోతున్నది. ఇలాంటి తరుణంలో చైనాను ఆపి, భారత్ తన పూర్వపు స్థాయిని తెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది.
- ఇప్పటి ప్రభుత్వం చైనా పెట్టుబడులపై పునఃపరిశీలన జరుపుతామన్నప్పటికీ అది అంత సులువుగా జరిగే పనికాదు. ఈ మధ్య శ్రీలంకలో హంబన్ తోట నౌకాశ్రయం పనుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి మాటలు చెప్పినప్పటికీ, తిరిగి చైనాకే అప్పగించాల్సి వచ్చింది. వివిధ నియమ నిబంధనల రూపంలో వివిధ దేశాలను వశపర్చుకోవడంలో చైనా దిట్ట!

తక్షణ కర్తవ్యం

- ఇలాంటి తరుణంలో భారతదేశ మరింత చురుకుగా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి ప్రభుత్వం భారత్‌కు అనుకూలమైనప్పటికీ చైనా ప్రభావం నుంచి బయటపడేలా భారతదేశం కూడా సహాయం అందించాలి. సైనిక, ఆర్థిక, సాంస్కృతిక సహాయ సహకారాలు మళ్లీ పెంపొందించి, ఆ దేశ ఆర్థిక ప్రగతికి మనదేశం సహాయ పడాల్సిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్న మాల్దీవులు భారత రక్షణకు ఎంతో కీలక దేశం. దీనికి అనుగుణంగా భారత్ తక్షణమే రంగంలోకి దిగి దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ముందుకు సాగాలి.
- ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్ఠత కోసం పాటుపడాలి. వివిధ సంస్థల నిర్మాణం జరగాలి. ప్రజలు వారి స్వతంత్ర గొంతును వినిపించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నప్పుడే కీలక మిత్రదేశాన్ని కాపాడుకునే అవకాశం ఉంది.

సమకాలీన పరిణామాలు-భారతదేశం పాత్ర

- 2018, సెప్టెంబర్ 23న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ విజయం సాధించారు. అయితే ఈ విజయం ఆషామాషి కాదు. 89.21 శాతం మంది పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓట్లు వేశారు. అందులో ఎండీపీ (మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ) అభ్యర్థి అయిన సోలిహ్ 58.3 శాతం ఓట్లతో విజయం సాధించడం విశేషం. ఆయన తన ప్రచార సభల్లో భారత్‌కు అనుకూలంగా మాట్లాడారు.
- అయితే వివాదాస్పద రీతిలో 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ అనుసరించిన పలు విధ్వంసకర విధానాలవల్ల మాల్దీవులు, భారత్‌కు మధ్య అంతరం పెరిగింది. యామీన్ రాకతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దేశం నియంతృత్వంలోకి జారుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. యామీన్ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య హననం జరిగిందని చెప్పవచ్చు. ఆయన స్వేచ్ఛా స్వతంత్రాలను అణగదొక్కడం, ప్రజల గొంతుకలను వినపడనీయకుండా చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేయడంపైనే దృష్టి సారించాడు. అందులో భాగంగానే ప్రతిపక్షాల గొంతునొక్కారు. వారందరినీ జైలుపాలు చేశాడు. న్యాయమూర్తులను కూడా అరెస్టు చేయించాడు.
- నాయకులు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితిలేని ఎండీపీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్న ఇబ్రహీం సోలిహ్ రూపంలో ప్రజలకు మంచి ప్రత్యామ్నాయం దొరికింది. విశేషంగా తరలివచ్చిన ఓటర్లు అతనికి పట్టం కట్టారు. ఇలా దొరికిన అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందా లేదా చూడాలి.
india

వాణిజ్యపరమైన సంబంధాలు

- భారత్, మాల్దీవుల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఆపరేషన్ కాక్టస్ విజయవంతం కావడంతో మాల్దీవుల అభివృద్ధి కోసం భారత్ విరివి గా నిధులు ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, పౌర విమానయానం, అభివృద్ధి, ఆరోగ్య రంగం, టెలికమ్యూనికేషన్, కార్మిక రంగం అభివృద్ధికి పాటుపడింది. మాల్దీవుల రాజధాని మాలేలో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌ను భారత్ నిర్మించింది. టెలి కమ్యూనికేషన్ రంగాన్ని విస్తరించడంతోపాటు మాల్దీవుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు పెంచింది. భారత్ నుంచి మాల్దీవులకు ఎగుమతులు ఆరు బిలియన్లు కాగా, దిగుమతులు 60 మిలియన్లు మాత్రమే. మాలే విస్తరణ కోసం ఎస్‌బీఐ 500 మిలియన్ డాలర్లు ఇచ్చింది. మరింత అభివృద్ధి కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నది.

రక్షణ ఒప్పందాలు - సంబంధాలు

- 2009లో మధ్యేవాద ఇస్లామిక్ దేశమైన మాల్దీవులు భారత్ సహాయం అర్థించింది. తమ దేశానికి చెందిన ఒక దీవిని ఉగ్రవాదులు ఆక్రమించే అవకాశం ఉండటంతో, తమ సైనిక సన్నద్ధతలో నిస్సహాయతను తెలియజేస్తూ మనదేశ సహాయాన్ని కోరింది. అందులో భాగంగా మనదేశం తన రక్షణ ఛత్రంలో ఈ దేశాన్ని ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
- ఈ వ్యూహంలో భాగంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్, మాల్దీవుల కోస్ట్‌గార్డ్‌కు తన సహాయ సహకారాలను అందించే ఒప్పందం చేసుకుంది. మరిన్ని ఒప్పందాలను కూడా ఇందులో చేర్చింది.
- హిందూ మహాసముద్రంపై మరింత నిఘా పెంచడం కోసం, ఏదైనా దాడి జరిగితే సత్వర స్పందన కోసం, భారత్ రెండు హెలికాప్టర్లను మాల్దీవులకు ఇచ్చింది.
- మాల్దీవులు తన 26 దీవుల్లో కేవలం రెండు దీవుల్లోనే రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం 26 దీవుల్లో కూడా రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం అంగీకరించింది.
- తీరప్రాంత రాడార్ వ్యవస్థతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ రాడార్ వ్యవస్థ అనుసంధానం ఏర్పర్చుకున్నది. దీని కమాండ్ కంట్రోల్ మన దేశంలో ఉంటుంది. దీనివల్ల మనకు అంతరాయంలేని రక్షణ వ్యవస్థ లభిస్తుంది. అంతేగాకుండా నిరంతర నిఘా వ్యవస్థ, మిలిటరీ సంబంధాలు నడుస్తున్నాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో భాగంగా ఈ రెండు దేశాల మిలిటరీ వ్యవస్థల మధ్య 2009 నుంచి జాయింట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీన్నే ఈక్వేరిన్ అనే పేరుతో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section