Type Here to Get Search Results !

Vinays Info

నోబెల్ అవార్డ్స్- 2018, Nobel Awards 2018

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి నోబెల్ ప్రైజ్. ప్రపంచ మానవాళికి ఉపయోగపడే పరిశోధనల్లో సఫలీకృతులైనవారినే ఈ బహుమతి వరిస్తుంది. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక, శాంతి, సాహిత్యం వంటివాటిలో చేసిన కృషికిగాను ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ పేరుమీద ఈ ప్రైజ్‌ను అందిస్తున్నారు. ప్రతి ఏటా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న వీటిని ప్రదానం చేస్తారు. ఈ ఏడాది నోబెల్‌కు ఎంపికైనవారి గురించి ప్రత్యేకం.

వైద్యం

- క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అమెరికా పరిశోధకుడు జేమ్స్ అలిసన్, జపాన్ శాస్త్రవేత్త తాసుకు హోంజోలను వైద్యశాస్త్రంలో నోబెల్ వరించింది. క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు సంప్రదాయ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, లేజర్ వంటి పలు రకాల చికిత్సలు అందిస్తున్నారు. అయితే అలిసన్, హోంజోలు ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింతవేగంగా క్యాన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు.
Nobel-Medicine
- ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ-కణాలే (టీ-లింఫోసైట్స్: తెల్లరక్త కణాల్లో ఒక రకం) క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టీ-కణాలు చెక్‌పాయింట్ ఇన్‌హిబిటర్స్ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, క్యాన్సర్ కణాల మధ్య తేడాను టీ-కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ రిసెప్టర్లను వాడుతారు. వీటినే చెక్‌పాయింట్స్ అంటారు. సాధారణంగా క్యాన్సర్ కణాలు కూడా మామూలు కణల్లాగే టీ-సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో క్యాన్సర్ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ-సెల్స్ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ-కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించేలా చేస్తారు. - రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడుతారు. రోగ నిరోధక వ్యవస్థను తయారుచేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ-సెల్స్ అధికమై అవి క్యాన్సర్ కణాలపై దాడిచేస్తాయని అంచనా. మూడో పద్ధతి వ్యాక్సిన్లు. కొన్ని క్యాన్సర్ల విషయంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తర్వాత కూడా టీ-కణాలపై దాడిచేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడుతాయి. ఈ పద్ధతిలో రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు. కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై పడుతుంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి.
- రోగనిరోధక కణాలు కొన్ని ప్రొటీనను ఉత్పత్తి చేస్తుంటాయి. ఒక్కోసారి ఇవే రోగనిరోధక వ్యవస్థ చేతిలో క్యాన్సర్ కణాలు హతం కాకుండా అడ్డుకుంటాయి. ఈ పరిణామాన్నే బ్రేక్‌గా పిలుస్తున్నారు. బ్రేక్ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనావేస్తూ రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో అలిసన్ విజయం సాధించారు. ఇదే సమయంలో బ్రేక్‌గా పనిచేస్తున్న కొత్త ప్రొటీన్లు లైజండ్ పీడీ-1లను హోంజో కనుగొన్నారు.
- డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే వేడుకలో స్వీడన్ రాజు కార్ల్-16 వీరికి బహుతిని అందించనున్నారు. ఈ బహుమతి కింద ఇచ్చే రూ.7.35 కోట్లను వీరికి పంచుతారు. అలిసన్ టెక్సాస్ యూనివర్సిటీలో, హోంజో క్యోటో యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరి పరిశోధనలకు గాను 2014లో టాంగ్ ప్రైజ్ (ఆసియా నోబెల్)ను గెలుచుకున్నారు.
- 1901 నుంచి ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతులను 108 సార్లు ఇచ్చారు. వైద్య నోబెల్ అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఫ్రెడరిక్ జీ బాంటింగ్ రికార్డు సృష్టించారు. 32 ఏండ్ల వయస్సు (1923)లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈయన ఇన్సులిన్‌పై పరిశోధన చేశారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పెద్దవయస్కుడిగా రికార్డు పేటన్ రౌస్ పేరిట ఉంది. ఆయన 87 ఏండ్ల వయస్సు (1966)లో ఈ అవార్డును అందుకున్నారు. ఈయన కణితుల పెరుగుదలకు కారణమయ్యే వైరస్‌లపై పరిశోధన చేశారు. ఇప్పటివరకు వైద్యనోబెల్‌ను అందుకున్నవారిలో 12 మంది మహిళలు ఉన్నారు. వైద్యంలో నోబెల్‌ను అందుకున్న మొదటి మహిళ గెర్టి థెరిసా కోరి (1947).
- వైద్యంలో మొదటి నోబెల్‌ను అందుకున్నవారు ఎమిల్ వాన్ బెహ్రింగ్ (1901). వైద్యశాస్త్రంలో గతేడాది (2017) నోబెల్‌ను అందుకున్నవారు జెఫ్రీ సీ హాల్, మైకేల్ రాస్‌బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్.

భౌతికశాస్త్రం

- ఆప్టికల్ లేజర్లపై పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు కృషిచేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ దక్కింది. అమెరికా శాస్త్రవేత్త ఆర్థర్ ఆష్కిన్, ఫ్రాన్స్ శాస్త్రవేత్త జెరార్డ్ మౌరు, కెనడా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌లాండ్‌లను భౌతిక నోబెల్ వరించింది. ఈ బహుమతి కింద ఇచ్చే 1.01 మిలియన్ డాలర్ల (రూ.7.35 కోట్లు)లో సగం ఆష్కిన్‌కు, మిగిలి సగం మోరో, డోనాలకు ఇవ్వనున్నారు.
Nobel-Physics
- సూక్ష్మక్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవిం చి ఉన్న కణాలను లేజర్ బీమ్‌లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆష్కిన్‌కు ఈ బహుమానం దక్కింది. ఆష్కిన్ 1952 నుంచి 1991 మధ్యకాలంలో అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ట్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న కాలంలో 1987లో సూక్ష్మజీవులకు హానిచేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. అత్యంత చిన్న ఆప్టికల్ పల్స్‌లను ఉత్పత్తిచేసే విధానాన్ని మోరో, డోనాలు అభివృద్ధి చేశారు.- ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడు ఆష్కిన్. ఇప్పటివరకు ఈ రికార్డు 2007లో 90 ఏండ్ల వయస్సులో ఆర్థిక నోబెల్‌ను అందుకున్న లియోనిడ్ హ్యూరిజ్ పేరిట ఉంది. భౌతిక నోబెల్‌కు ఎంపికైన మూడో మహిళ డోనా. ఈమెకు ముందు మేరీ క్యూరీ (1903), జియో పెర్ట్ మేయర్ (1963)లకు భౌతిక నోబెల్ దక్కింది. మేరీ క్యూరీకి రసాయనశాస్త్రం (1911)లోనూ నోబెల్ దక్కింది.
- ఇప్పటివరకు భౌతికశాస్త్రంలో 111 నోబెల్ బహుమతులు అందించారు. భౌతికంలో నోబెల్ అందుకున్న అత్యంత పిన్నవయస్కుడు లారెన్స్ బ్రాగ్. ఈయన 25 ఏండ్ల వయస్సులో 1915లో ఈ అవార్డును అందుకున్నారు. ఈ భౌతిక నోబెల్‌ను రెండుసార్లు (1956, 1972) అందుకున్న ఒకే ఒక్క వ్యక్తి జాన్ బర్డీన్.
- భౌతికశాస్త్రంలో ఈ అవార్డును మొదటిసారిగా అందుకున్నది విల్హెమ్ కాన్రాడ్ రాంట్‌జెన్ (1901). గతేడాది (2017) భౌతిక నోబెల్‌ను అందుకున్నవారు కిప్ థోర్న్, రైనర్ వీస్, బారి బారిష్.
ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ను అందించడంలేదు. సాహిత్యంలో మొదటి నోబెల్‌ను అందుకున్నది సలి ప్రధోమ్ (1901). గతేడాది (2017) సాహిత్య నోబెల్‌ను అందుకున్నది కజువో ఇషిగురో.

ఆర్థికం

- అమెరికాకు చెందిన ఇద్దరు స్థూల ఆర్థికవేత్తలైన విలియం డీ నోర్ధాస్, పాల్ ఎం రోమర్‌లకు ఈ ఏడాది ఆర్థిక నోబెల్ దక్కింది. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలకు కారణమైన అన్ని దేశాలపై కార్బన్ ట్యాక్స్‌లను సమంగా విధించే స్కీమ్‌ను విలియం రూపొందించారు. సుదీర్ఘకాల ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుందన్న సిద్ధాంతాన్ని పాల్ రోమర్ అభివృద్ధి చేశారు.- గ్రీన్‌హౌస్ వాయువుల నియంత్రణ కోసం విలియం రూపొందించిన స్కీమ్ ద్వారా వాతావరణ విధానాలను అమలుచేయడం సులువవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, వాతావరణం మధ్య సంబంధాన్ని తెలిపేందుకు విలియం క్వాంటిటేటివ్ మోడల్‌ను సృష్టించారు. దీనిద్వారానే అనేక దేశాల్లో వాతావరణ విధానాలను విశ్లేషిస్తున్నారు. కార్బన్ ట్యాక్స్‌లను విధిస్తున్నారు.
- రోమర్ సుదీర్ఘకాల ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుందన్న సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. సంస్థలపై ఆర్థిక శక్తులు చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే విధంగా ఆయన కొన్ని సూత్రాలను తయారుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘ సుస్థిర అభివృద్ధి ఎలా సాధ్యమన్న అంశాలను విశ్లేషించారు.
- మొదటి ఆర్థిక నోబెల్ రగ్నార్ ఫిష్ (1969) అందుకున్నారు. గతేడాది (2017) రిచర్డ్ థాలేర్‌కు వచ్చింది.

- స్వీడన్‌లోని స్టాక్‌హోంలో 1833, అక్టోబర్ 21న జన్మించిన నోబెల్ 1896, డిసెంబర్ 10న మరణించారు. ఈయన తల్లిదండ్రులు ఇమ్మాన్యుయేల్ నోబెల్, ఆండ్రియేట్ అహ్లసెల్ నోబెల్. ఈయన మొత్తం 355 పరిశోధనలపై పేటెంట్లను కలిగి ఉన్నాడు. అందులో డైనమైట్ ప్రతిష్ఠాత్మకమైనది.
- తన మరణానంతరం తన సంపద నుంచి వచ్చే ఆదాయంతో భౌతిక, రసాయన, వైద్యశాస్ర్తాలు, సాహిత్యం, శాంతి వంటి రంగాల్లో విశేష కృషిచేసినవారినికి తన పేరుమీద బహుమతులు ఇవ్వాలని వీలునామా రాశారు. ఆయన మరణించిన ఐదేండ్ల తర్వాత 1901 నుంచి ఈ పురస్కారాలను అందిస్తున్నారు. 1969 నుంచి అర్థశాస్త్రంలో కూడా నోబెల్‌ను ప్రవేశపెట్టారు.

రసాయన శాస్త్రం

- జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు చేసిన ముగ్గురికి ఈ ఏడాది రసాయనశాస్త్రంలో నోబెల్ దక్కింది. అమెరికా శాస్త్రవేత్తలు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, బ్రిటన్ శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్ ఈ పురస్కారాని కి ఎంపికయ్యారు. ప్రైజ్‌మనీ కింద లభించే 1.01 మిలియన్ డాలర్ల (రూ. 7.40 కోట్లు)లో సగం ఆర్నాల్డ్‌కు, మిగతా సగం స్మిత్, వింటర్‌లకు పంచుతారు.
Nobel-Chemistry
- జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌ల ను వీరు జీవపరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. జీవపరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్‌ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీంతో విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుక్కునేందుకు వీలు కలిగింది.- మిస్సోరి యూనివర్సిటీలో స్మిత్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వింటర్ పరిశోధకులుగా కొనసాగుతున్నారు. ఫేజ్ డిస్‌ప్లేగా పిలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో బ్యాక్టీరియాకు సోకే వైరస్‌లను కొత్త ప్రొటీన్ల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. దీర్ఘకాలం వేధించే కీళ్లవాతం, సొరియాసిస్, పేగువాపు వంటి రోగాలకు కొత్త ఔషధాల తయారీకి వీరి పరిశోధన తోడ్పడుతుంది.
- శరీరంలోని విషపూరిత పదార్థాలను నిర్వీర్యం చేయడం, వ్యాధి నిరోధక కణాల అసాధారణ స్పందనలను నియంత్రించడం, శరీరం మొత్తం వ్యాపించకుండా క్యాన్సర్ కణాలను నియంత్రించడం లాంటి చర్యలకు ఉపయోగపడే యాంటీబాడీల ఉత్పత్తికీ బాటలు పరుస్తోంది. స్మిత్, వింటర్‌ల పరిశోధనలు తక్కువ దుష్ప్రభావాలతో మెరుగ్గా పనిచేసే యాంటీబయాటిక్స్ అభివృద్ధికి బాటలుపరిచాయి.
- రసాయనంలో 1901 నుంచి ఇప్పటివరకు 109 నోబెల్ పురస్కారాలను అందించారు. ఈ అవార్డును రెండుసార్లు (1958, 1980) అందుకున్న ఒకే ఒక వ్యక్తి ఫ్రెడరిక్ సాంజెర్. 35 ఏండ్ల వయస్సులో ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడు ఫ్రెడరిక్ జోలియట్ (1935), అత్యంత పెద్దవయస్కుడు జాన్ బీ ఫెన్ (2002).
- ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ రసాయనంలో నోబెల్‌ను అందుకుంటున్న ఐదో మహిళ. ఈమె కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రసాయనంలో నోబెల్‌ను అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ (1903).
- రసాయనంలో మొదటి నోబెల్‌ను అందుకున్నది జాకోబస్ హెన్నికస్ వాంట్ హాఫ్ (1901). గతేడాది (2017) రసాయన నోబెల్‌ను అందుకున్నది జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్, జాక్వెస్ డుబోచెట్.

శాంతి

- ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వెజ్, ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన నదియా మురాద్‌లకు ఈ గౌరవం దక్కింది.
Nobel_Peace
- డెనిస్ మక్వెజ్ స్త్రీల వైద్యనిపుణుడిగా ఫ్రాన్స్‌లో శిక్షణ పొందారు. స్వదేశానికి తిరిగొచ్చి బుకావులో లైంగిక హింసకు గురైన బాధితులకు చికిత్సలు అందించారు. యుద్ధం, సాయుధ పోరాటాల సందర్భంగా లైంగిక హింసకు పాల్పడే దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. - ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు యాజిది తెగ ప్రజలను సామూహకింగా మట్టుబెట్టే ఉద్దేశంతో సింజార్ జిల్లాలోని (ఉత్తర ఇరాక్) గ్రామాలపై దాడులకు దిగారు. నదియా గ్రామం కోజోలో కూడా వందలమందిని ఊచకోత కోశారు. యువతులు, బాలికలను లైంగిక బానిసలుగా మార్చేశారు. ఈ బాధితుల్లో నదియా కూడా ఉంది. తమపై జరుగుతున్న అకృత్యాలను మహిళలు గుట్టుగా ఉంచాలన్న కట్టుబాటును ఆమె ధిక్కరించి, ఈ అఘాయిత్యాలను వెలుగులోకి తెచ్చారు.
- గతేడాది (2017) నోబెల్ శాంతి బహుమతి ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ సంస్థకు బహుమతి లభించింది. ఈ రంగంలో మొదటి బహుమతి 1901లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ స్థాపకులు హెన్రీ డునాంట్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వ్యవస్థాపకులు ఫ్రెడరిక్ పాసి అందుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section