Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ ఉద్యమం- కమిటీలు

తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జనవరి 23 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనావేసి 1969, మార్చి 5లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది.

పండిట్ సుందర్‌లాల్ కమిటీ

- ఆపరేషన్ పోలో పేరుతో జరిగిన సైనిక చర్య సందర్భంగా భారతీయ సైన్యం చేతిలో వేలాది మంది ముస్లింలు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని నెహ్రూ పండిట్ సుందర్‌లాల్ అధ్యక్షతన ఖాజీ అబ్దుల్ గఫార్, యూనస్ సలీంలు సభ్యులుగా విచారణ కమిటీని నియమించారు.

జస్టిస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్

- 1952 ముల్కీ ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సిటీ కాలేజీ, ఉస్మానియా దవాఖాన వద్ద జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడానికి హోంశాఖ 1952, సెప్టెంబర్ 9న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1952, డిసెబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది.

పెద్దమనుషుల ఒప్పందం

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి న్యూఢిల్లీలోని హైదరాబాద్ భవన్‌లో 1956, ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర నేతలు చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, జేవీ నరసింగరావు, మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్న పాల్గొన్నారు.

కుమార్ లలిత్ కమిటీ

- తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జనవరి 23 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనావేసి 1969, మార్చి 5లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది.

జస్టిస్ వాంఛూ కమిటీ

- అష్టసూత్ర పథకం అమలులో భాగంగా 1969, ఏప్రిల్ 19న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కైలాస్‌నాథ్ వాంఛూ అధ్యక్షతన ఒక న్యాయ నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనంచేసి రాజ్యాంగపరమైన పరిష్కారాలను సూచించడానికి ఈ కమిటీని నియమించింది. ఇందులో మాజీ అటార్నీ జనరల్ ఎంపీ సెతల్వాడ్, అప్పటి అటార్నీ జనరల్ నిరెన్‌డే...లు సభ్యులుగా ఉన్నారు. కమిటీ నివేదిక- ఈ కమిటీ తన నివేదికను 1969, ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించింది. ముల్కీ నిబంధనల అమలుకోసం రాజ్యాంగాన్ని సవరించే అవకాశం లేదని, గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 సవరణకు అనుమతించడం లేదని ఇందులో పేర్కొన్నది.

వశిష్ట భార్గవ కమిటీ

- ప్రధాని అష్ట సూత్ర పథకం అమలులో భాగంగా 1969, ఏప్రిల్ 22న తెలంగాణ మిగులు నిధులను అంచనావేయడానికి జస్టిస్ వశిష్ట భార్గవ అధ్యక్షతన ఉన్నతాధికార సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ప్రొఫెసర్ ముకుట్ విహారీ మాథూర్ (ఆసియాన్ విద్యా ప్లానింగ్ డైరెక్టర్), హరిభూషణ్ భట్ (డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సభ్యులు. ఈ కమిటీ కార్యదర్శి టీఎన్ కృష్ణ స్వామి.
- కమిటీ తన నివేదికలో కుమార్ లలిత్ కమిటీ అంచనాలకంటే తక్కువగా రూ. 28.34 కోట్లు తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయని చెప్పింది. ఇది తెలంగాణ ప్రాంతీయ కమిటీ నాయకులను, ఉద్యమకారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది.

తెలంగాణ అభివృద్ధి కమిటీ

- అష్టసూత్ర పథకం అమల్లో భాగంగా 1969, ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి కమిటీ ఏర్పడింది. ఇందులో ఆర్ వెంకట్రామన్, వీబీ రాజు, జేవీ నరసింగరావు, పీవీ నరసింహారావు, గురుమూర్తి, అరిగె రామస్వామి, కేవీ నారాయణరెడ్డి మహ్మద్ ఇబ్రహీం అన్సారీ, జే చొక్కారావు సభ్యులుగా ఉన్నారు.

జయభారత్‌రెడ్డి లేదా ఆఫీసర్స్ కమిటీ

- తెలంగాణలో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ అధ్యక్షతన టీఎన్‌జీఓ సంఘం నిర్వహించిన ఆందోళనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్‌టీ రామారావు ప్రభుత్వం 1984లో ఈ కమిటీని నియమించింది. ఇందులో కమలనాథన్, ఉమాపతిరావు సభ్యులుగా ఉన్నారు.
- ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన తేదీ 1975, అక్టోబర్ 18 నుంచి 1984 వరకు జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటినీ పరిశీలించింది. 1981, జూన్ 30 నాటికి తెలంగాణలో అక్రమంగా 58,962 మంది స్థానికేతరులు నియామకమయ్యారని తన 36 పేజీల నివేదికలో తేల్చింది.

సుందరేశన్ కమిటీ

- ఆఫీసర్స్ కమిటీ నివేదికపై విస్తృత చర్చల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సుందరేశన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం 610 జీఓను విడుదల చేసింది.

610 జీఓ

- ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ 1985, డిసెంబర్ 30న 610 జీఓ విడుదల చేశారు.
- దీనిప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన రోజు నుంచి జీఓ 610 జారీ అయ్యే నాటికి తెలంగాణలోని జిల్లాలు, జోన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన స్థానికేతరులందరినీ వారి స్వస్థలాలకు 1986, మార్చి 31 నాటికి పంపించాలని, వారిని బదిలీ చేయడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైతే అదనపు ఉద్యోగాలు కల్పించాలి.

ప్రణబ్ ముఖర్జీ కమిటీ

- తెలంగాణపై సంప్రదింపుల కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన, రఘువంశ్ ప్రసాద్, దయానిధి మారన్ సభ్యులుగా 2005, జనవరి 8న త్రిసభ్య కమిటీని సోనియాగాంధీ నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేశంలోని వివిధ పార్టీల అభిప్రాయాలను కోరడం ఈ కమిటీ ఉద్దేశం.

రోశయ్య కమిటీ

- 2009, ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయసభల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, షేక్ హుస్సేన్, ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రుద్రరాజు, అక్బరుద్దీన్ ఓవైసీ మొదలైనవారు సభ్యులుగా ఉన్నారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీ

- 610 జీఓ అమలుకోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కమిటీ సభ్యుల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 610 జీఓ అమలుకు విఘాతం కలిగింది.

శ్రీకృష్ణ కమిటీ

- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విస్తృత సంప్రదింపుల కోసం 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) అధ్యక్షత వహించగా, వినోద్ కుమార్ దుగ్గల్ (హోంశాఖ మాజీ కార్యదర్శి) కార్యదర్శిగా, రవీందర్ కౌర్ (ఐఐటీ ఢిల్లీలో మానవ సామాజిక శాస్ర్తాల విభాగం ప్రొఫెసర్), రణ్‌బీర్ సింగ్ (జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్), అబూ సలే షరీఫ్ (సీనియర్ రిసెర్చ్ ఫెలో, అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధక సంస్థ, ఢిల్లీ) సభ్యులుగా ఉన్నారు.
- 2010, డిసెంబర్ 31నాటికి నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒక రోజు ముందే అంటే 2010, డిసెంబర్ 30న తన నివేదికను అందించింది. ఇందులో 9 అధ్యాయాలున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో 6 సూచనలు చేసింది.

అఖిలపక్ష సమావేశం

- చిదంబరం స్థానంలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల్‌కుమార్‌షిండే తెలంగాణ అంశంపై 2012, డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో 8 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంటోనీ కమిటీ

- రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అధ్యక్షతన విభజన అమలుకు 2013, ఆగస్టు 6న కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు.

మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)

- 2013, అక్టోబర్ 8న రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్‌గా మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ సభ్యులుగా ఉన్నారు. దీనికి 6 వారాల గడువు ఇచ్చారు.

గిర్‌గ్లానీ కమిషన్

- 610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్‌జీవోల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిర్‌గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల తేదీ నుంచి 2004, సెప్టెంబర్ 30 వరకు జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, బదిలీల గురించి ఈ కమిటీ పరిశీలించింది. 2004, సెప్టెంబర్ 30న నివేదికను సమర్పించింది. అందులో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘనకు గురయ్యాయని, వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కారాలను సూచించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section