Type Here to Get Search Results !

Vinays Info

కుతుబ్‌షాహీల నిర్మాణాలు - అసఫ్‌జాహీలు

Top Post Ad

కుతుబ్‌షాహీల నిర్మాణాలు

-గోల్కొండ కోట: మధ్యయుగంలో వరంగల్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయుల కాలంలోనే గోల్కొండ కోటను నిర్మించారు. పాత కాకతీయ కోట ఉన్న స్థానంలోనే కొత్త కోట కట్టారు. దీనికి మహ్మద్‌నగర్ అని పేరు పెట్టారు. కోట ప్రహరీని కొత్తగా రాతితో నిర్మించి కుతుబ్‌షాహీ సుల్తానులు బలోపేతం చేశారు.
-ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా (1580-1612): గోల్కొండ కోటను బలోపేతం చేయడానికి పెద్ద ప్రణాళిక రూపొందించాడు. పాత కోట చుట్టూ ఏడు కిలోమీటర్ల బలిష్టమైన రాతికోటను నిర్మించి కోట ప్రహరీ చుట్టూ లోతైన కందకాలు తవ్వించాడు. 87 బురుజులు, 8 ద్వారాలు కట్టించాడు. పేట్లబుర్జు, ముసాబుర్జు, కాగజీబుర్జులు గోల్కొండ కోటలోని ప్రసిద్ధిగాంచిన బురుజులు. ఫతేదర్వాజ, మక్కా దర్వాజ, బంజారా దర్వాజా, పటాన్ చెరు దర్వాజా, మోతీ దర్వాజా, జమాలీ దర్వాజా కొన్ని ముఖ్య దర్వాజాలు. అన్నింటికంటే ముఖ్యమైన ఫతేదర్వాజ ఎత్తు 25 ఫీట్లు. వైశాల్యం 13 ఫీట్లు. ఈ దర్వాజ నిర్మాణంలో మేలురకపు మందపు టేకును, ఇనుప రేకులను, పదునైన ఇనుప మేకులను వాడారు. శత్రువులు, ఏనుగుల ఒత్తిడిని కూడా ఈ దర్వాజ తట్టుకొనేది.
-పురానాపూల్ (1578): హైదరాబాద్ నగర నిర్మాణానికి ముందే, ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా కాలంలో మూసీనదిపై వంతెన నిర్మించారు. ఇది పటిష్టమైన కట్టడం. దీని పొడవు ఆరు వందల గజాలు, 35 అడుగుల వెడల్పు, నదీ తీరం నుంచి 54 అడుగుల ఎత్తున నిర్మించారు. దీనికి 22 కమానులు స్తంభాలుగా నిలబడి ఉన్నాయి. ప్రసిద్ధ ఫ్రెంచి నగల వ్యాపారి టావెర్నియర్ 1676లో హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ఈ బ్రిడ్జిని చూసి దీన్ని ప్రేమవంతెనగా వర్ణించాడు. అతడు పురానాపూల్‌ను పారిస్‌లోని Pont Neuf వంతెనతో పోల్చాడు.
-హుస్సేన్ సాగర్ (1562): దీనిని ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా అల్లుడైన హుస్సేన్‌షావలీ 1562లో నిర్మించాడు. ఈ నిర్మాణమే నేటి ట్యాంక్‌బండ్. హైదరాబాద్-సికింద్రాబాద్‌లను కలిపే వారధి. దీని పొడవు 11/2 మైళ్లు. విస్తీర్ణం 8 చదరపు మైళ్లు. హుస్సేన్‌సాగర్‌లోకి నీరు బలక్‌పూర్ నది నుంచి వచ్చి చేరేది.
-మక్కా మసీదు (1614-93): మక్కా మసీదు దక్కన్‌లోనే అతిపెద్ద మసీదు. ఇది భారీ వాస్తు కట్టడం. ప్రధాన ప్రార్థనా మందిరాన్ని 225x180x73 కొలతలతో నిర్మించారు. దీని నిర్మాణం మహ్మద్ కుతుబ్‌షా కాలంలో క్రీ.శ. 1614లో ప్రారంభమై వివిధ కారణాలవల్ల చివరికి 1693లో పూర్తయ్యింది. దీన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత పూర్తి చేశాడని ఒక అభిప్రాయం ఉంది. దీని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినవారు సుల్తాన్ అధికారి మీర్ ఫజీఉల్లాబేగ్, చౌదరి రాజయ్య. దీని నిర్మాణంలో పర్షియా, అరేబియాల నుంచి వచ్చిన మేస్త్రీలు, రాతిపనివారు పాల్గొన్నారు. 15 ఆర్చ్‌లు ఉన్న మసీదు ముఖ్య ఆవరణ 67 మీటర్లు, 54 మీటర్లు, 23 మీటర్ల ఎత్తు విస్తీర్ణంతో ఉంది. పశ్చిమ దిశలో ఉన్న భాగాన్ని మెహరబ్ నిర్వహణకు కేటాయించారు. ఈ మెహరబ్ ఏకశిలా నిర్మాణం. దీన్ని మూలస్థానం నుంచి తెచ్చి మసీదులో నిలపడానికి ఆరు వేల మంది కూలీలు, 1400 ఎడ్లను కట్టిన ప్రత్యేక చక్రాలు ఉన్న బండిని వినియోగించారని టావెర్నియర్ పేర్కొన్నాడు. పవిత్ర మక్కా నుంచి తెచ్చిన కొన్ని ఇటుకలను దీని నిర్మాణంలో వాడారని, అందువల్లనే మక్కామసీదుగా ప్రసిద్ధిగాంచిందని పండితుల అభిప్రాయం.
-కుతుబ్‌షాహీల సమాధులు: గోల్కొండ సుల్తానులు నిర్మించిన సమాధులు గొప్పవాస్తు కట్టడాలుగా పేరుపొందాయి. ఇవి గోల్కొండకోటకు ఒక కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజ వద్ద నిర్మించారు. ఈ సముదాయంలో మహ్మద్-కులీ-కుతుబ్‌షా కూతురైన హయత్-బక్ష్-బేగం సమాధి ఉంది. దీని సమీపంలో చిన్న మసీదు నిర్మించారు. ఔరంగజేబ్ గోల్కొండ ఆక్రమణ సందర్భంగా ఈ మసీదులో ప్రార్థనలు జరిపాడని ప్రతీతి. నేడు తెలంగాణ రాష్ట్రంలో మధ్యయుగ ఇస్లామిక్ వాస్తు కట్టడాల్లో కుతుబ్‌షాహీల సమాధులు గొప్ప చారిత్రక వారసత్వ సంపదగా మిగిలాయి.
-హయత్‌నగర్ మసీదు (1626): హయత్-బక్ష్-బేగం మహ్మద్-కులీ-కుతుబ్‌షా ఏకైక కూతురు. ఈమె యావత్ కుతుబ్‌షాహీ రాజ కుటుంబ స్త్రీలలో విశిష్ట స్థానం పొందింది. రాజ్య నిర్వహణ వ్యవహారాల్లో అసాధారణ తెలివి తేటలను ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు పొందింది. నేటి సైఫాబాద్ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం 1625లో ఒక చెరువును నిర్మించింది. దీన్ని మాసబ్‌ట్యాంక్ అంటారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మసీదును ఆమె గురువు అకుంద్-ముల్లా-అబ్దుల్‌మాలిక్ జ్ఞాపకార్థం నిర్మించింది. హైదరాబాద్‌కు తూర్పున 16 మైళ్ల దూరాన ఒక నగరాన్ని కట్టించింది. దీన్నే హయత్‌నగర్ అనేవారు. ఇక్కడ ఒక రాజమహల్, మసీదు నిర్మించింది.
-అసఫ్‌జాహీలు (1724-1948): కుతుబ్‌షాహీల పతనానంతరం 1687 నుంచి 1724 వరకు హైదరాబాద్ మొఘలుల ఆధిపత్యం కింద ఉంది. అనంతరం అసఫ్‌జాహీల పరిపాలన కిందకి వచ్చింది. హైదరాబాద్, దక్కన్ పీఠభూమిలో కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైన ప్రాంతాన్ని అసఫ్‌జాహీ వంశం 1724 నుంచి 1948 వరకు పరిపాలించింది. వీరి పరిపాలన కాలంలో హైదరాబాద్ విశిష్టతను సంతరించుకుంది. సంస్కృతి, సాహిత్యాలు, ఆచార వ్యవహారాల్లో దేశంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. వీరి పరిపాలనలోనే హైదరాబాద్ ఆధునిక యుగంలోకి ప్రవేశించింది. ఇంతటి గొప్ప వంశాన్ని స్థాపించింది నిజాం-ఉల్-ముల్క్. అసఫ్‌జాహీలు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. 
నిజాం-ఉల్-ముల్క్
-ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్.
-ఇతడు ఘాజీ-ఉద్-దీన్ ఫిరోజ్ జంగ్, సఫియా ఖానమ్‌లకు 1671 ఆగస్టు 11న ఆగ్రాలో జన్మించాడు.
-ఇతడి జన్మవృత్తాంతాన్ని వివరించిన జోతిషులు ఇతడిని నేక్‌భక్త్ (అదృష్టవంతుడు) అని చెప్పారు.
-కమ్రుద్దీన్ చిన్నతనంలోనే చక్రవర్తి ఔరంగజేబ్ అభిమానానికి పాత్రుడయ్యాడు. ఆరేండ్ల వయసులో తండ్రితోపాటు మొగల్ దర్బార్‌కు పోయినప్పుడు మొదటిసారి ఔరంగజేబ్ చూడగానే ఇతన్ని 450 గుర్రాలపై మన్సబ్‌గా నియమించాడు.
-1688లో తన 17వ ఏట తండ్రికి తోడుగా ఆదోని దుర్గం ముట్టడిలో, దాన్ని చేపట్టడంలో విజయం సాధించాడు.
-ఫలితంగా అతను 2000/500 జాత్, సవార్‌లపై మన్సబ్‌దార్‌గా నియమింపబడ్డాడు. దీంతోపాటు ఉత్తమమైన అరేబియా అశ్వం, బంగారు ఆభరణాలు, బుట్ట నిండా పండ్లు, సువాసన కలిగిన తినే పదార్థాలను బహుమానంగా పొందాడు.
-ఈ విధంగా మొదటి ప్రయత్నంలోనే ఇతను చూపిన శౌర్యానికి, ప్రతాపానికి ఖాన్ అనే బిరుదును ఇతనికి చక్రవర్తి ఇచ్చాడు.
-అదేవిధంగా 1693లో పన్హాలను ఆక్రమించిన మరాఠాలను ఎదుర్కొనే క్రమంలో ఇతను చూపిన సాహసానికి ముగ్ధుడైన ఔరంగజేబ్ మీర్ కమ్రుద్దీన్‌ఖాన్‌కు చిన్ ఖిలిచ్‌ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు.
-1705లో చిన్ ఖిలిచ్ ఖాన్ ఔరంగజేబ్‌తో కలిసి బీరార్‌లోని వాజింజర కోటపై దాడి చేశాడు.
-చిన్ ఖిలిచ్ ఖాన్ చేసిన సైనిక సేవలకు గుర్తింపుగా ఔరంగజేబ్ అతడి హోదా 5000/5000 మన్సబ్‌దారికి పెంచాడు.
-ఈ దండయాత్ర తర్వాత చిన్ ఖిలిచ్ ఖాన్ ఔరంగజేబ్ అనుమతితో శాంతి, శ్రేయస్సు, సంపద కోసం బీజాపూర్‌కి వచ్చాడు.
-ఈ లోపల చిన్ ఖిలిచ్ ఖాన్‌కు చక్రవర్తి విశ్రాంతంగా గడపడానికి ఒక అనువైన ప్రాంతాన్ని చూడమని వర్తమానం అందడంతో, చిన్‌ఖిలిచ్ ఖాన్ బీజాపూర్ సుబాలోని దేవ్‌పూర్ బాగుందని చెప్పాడు.
-దేవ్‌పూర్‌లో ఔరంగజేబ్ అస్వస్థుడైన సమయంలో ఇతను సేవలు చేశాడు.
-1706లో యూసఫ్‌ఖాన్, ఖుద్రతుల్లాఖాన్‌లను ఫిరోజ్‌నగర్ తళ్లికోట ఫౌజ్‌దార్ల పదవి నుంచి తీసేసి వారి స్థానంలో చిన్‌ఖిలిచ్ ఖాన్‌ను నియమించారు.
-ఈ సమయంలో ఔరంగజేబ్ చిన్‌ఖిలిచ్ ఖాన్ బహదూర్ అని చెక్కి ఉన్న బంగారు ఉంగరాన్ని చిన్‌ఖిలిచ్ ఖాన్‌కు బహూకరించాడు.
-ఔరంగజేబ్ మరణించిన కొన్నేండ్ల తర్వాత మొగల్ చక్రవర్తి అయిన ఫరూఖ్ సీయర్ చిన్‌ఖిలిచ్ ఖాన్‌కు నిజాం-ఉల్-ముల్క్ అనే బిరుదు ప్రదానం చేశాడు. అంతేకాకుండా దక్కన్‌లో ఆరు సుబాలపై సుబేదార్‌గా, కర్ణాటక ఫౌజ్‌దారుగా నియమించాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో నిజాం ఉల్ ముల్క్ 1724న అక్టోబర్ 23న బేరార్‌లో షక్కర్ ఖేడా వద్ద జరిగిన యుద్ధంలో ముబారిజ్‌ఖాన్‌ను ఓడించి దక్కన్‌లోని ఆరు సుబాలకు సుబేదార్ అయ్యాడు.
-అవి అహ్మద్‌నగర్, బీదర్, బీరార్, బీజాపూర్, ఖాందేశ్, హైదరాబాద్.
-ఈ విజయంతో అప్పటి మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా రంగీలా నిజాం ఉల్ ముల్క్‌కు అసఫ్‌జా బిరుదునిచ్చాడు.
-నిజాం ఉల్ ముల్క్ (1724-48): ఇతడు ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ ప్రాంతాలను పాలించాడు.
-అప్పటి మరాఠా పీష్వా అయిన బాజీరావ్-Iతో అనేక యుద్ధాలు చేసి పరాజయం పాలై మున్సిగావ్ (1728), వార్నా (1731), దురాయ్‌సరాయ్ (1738) సంధిలను కుదుర్చుకున్నాడు.
-1739లో పర్షియా పాలకుడు నాదిర్‌షా కర్నాల్ యుద్ధంలో మొగల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు.
-మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా రంగీలా సహాయంగా ఢిల్లీ వెళ్లిన నిజాం ఉల్ ముల్క్ ఢిల్లీలో నాదిర్‌షా జరుపుతున్న నరమేధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించాడు.
-అంతేకాకుండా నాదిర్‌షా, మొగల్ చక్రవర్తి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాడు.
-ఈ సందర్భంలోనే కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం సుమారు 70 కోట్ల విలువైన సొత్తు నాదిర్‌షాకు ఇచ్చారు.
-1748లో అహ్మద్‌షా అబ్దాలీ ఢిల్లీపై దండయాత్ర చేసిన సందర్భంలో మొగల్ చక్రవర్తికి సహాయంగా నిజాం ఉల్‌ముల్క్ ఢిల్లీకి బయలుదేరాడు.
-అయితే మార్గమధ్యలో మహారాష్ట్రలోని బుర్హాన్‌పూర్‌లో నిజాం ఉల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు.
-నిజాం ఉల్ ముల్క్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. కవి పండిత పోషకుడు, గొప్ప ఉదారవాది.
-ఇతని కులం పేరు షాకిర్
-ఇతను ప్రజల యోగక్షేమాలే ముఖ్యమని, వాటిని ముందు చూడాలని తన మరణ శాసనంలో రాసుకున్నాడు.

Below Post Ad