సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నందిని సిద్దా రెడ్డి
రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలచెంతకు చేర్చడంలో సిధారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. తన నియామకంపై ప్రభుత్వానికి సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించిన నందిని సిధారెడ్డి బందారం,వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా వర్శిటీలో ఎం.ఏ.పూర్తి చేశారు.ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై ఎం.ఫిల్(1981) పట్టా పొందాడు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి(1986) పట్టా పుచ్చుకున్నాడు.
మెదక్‌లో కొంతకాలం పనిచేసి తర్వాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. 2012లో పదవీవిరమణ చేశారు. విద్యార్థి దశనుండే కథలు,కవిత్వం రాయడం మొదలు పెట్టారు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ‘మంజీర’ బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితాసంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే “నాగేటి చాల్లల్ల” కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను “పోరు తెలంగాణ” సినిమాలో పాటగా తీసుకున్నారు.