అడుగడుగునా అద్భుత శాసనాలు
-తెలంగాణ (త్రిలింగ-తెనుంగు) అనేది తెనుంగు నుంచి తెలంగాణగా మారింది. ఈ ప్రాంతానికి ఎంతటి ఘన చరిత్ర ఉందో సమగ్రంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఖమ్మం మెట్టు (భద్రాచలం) మొదలు విదర్భ (ఒకప్పటి బెడదంకోట) నేటి బీదర్ వరకు విస్తరించిన తెలంగాణకు చాలా చరిత్రే ఉంది.
-తెలంగాణలో లభ్యమైన శాసనాల్లో ప్రాచీన చరిత్రను గొప్పగా వివరించే శాసనాలు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో శిలాశాసనాలు, తామ్ర (రాగి) శాసనాలు, చరిత్రకు ఆధారమైన తాళపత్ర (తాటి ఆకులు) గ్రంథాలు వెలుగుచూశాయి. వాటిలో తెల్లాపూర్ (తెలుంగపురం, తెనుగాణపురము) శాసనం ఒకటి.
-తెరియ-తయిర (ట్రైబల్ జాతి) తెంలంగాణం-తెలంగాణం-తెలియగాణ (తెలుగు ఆంగణం) తెంగాంగణం-తెలంగాణగా పరిణామం చెందినదని కాశీపీఠ పండితులు, చరిత్రకారులు కూడా నిర్ధారించారు.
-మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) మల్లిఖార్జునపల్లిలోని రాష్ట్రకూటుల (అమోఘవర్షుని) కాలం నాటి తెలంగాణ శాసనం కూడా గొప్పదే. ఆ శాసనం సంస్కృతం-తెలుగు-కన్నడ లిపులతో ఉంది. నా పరిశోధనలో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని శాసనాలను కొనుగొని ఉమ్మడి పురావస్తుశాఖకు అందజేశాను. వాటిలో ఝరాసంగంలోని శిలాశాసనాలు సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ (మోడి భాష) లిపుల్లో ఉన్నాయి. 11 శాసనాలను శాసన విభాగానికి ఇవ్వటం జరిగింది. వాటిలో తెలుగు, సంస్కృత, ప్రాకృత (బ్రాహ్మీ) శాసనాలు మూడింటిని మాత్రమే పరిష్కరించి వెలువరించాం. యావత్ తెలంగాణ మాగాణంలో ఎన్నో విలువైన శాసనాలు ఉన్నప్పటికీ ఝరాసంగం, ఢాకూర్, మిట్టపల్లి, టేక్మల్ (టేకుమాలు), మల్లిఖార్జునపల్లి, పట్లూరు, కోహీర్, ఇంద్రకరణ్, పుల్లూరు మొదలైన శాసనాలు, తాళపత్ర గ్రంథాలు నాటి అద్భుత చరిత్రను తెలుపుతున్నాయి.
కరీంనగర్ జిల్లా కుర్త్యాల గ్రామంలోని క్రీ.శ. 945 జనవల్లభుని పూర్తిశాసన (పద్య) పాఠం ముద్రణకు నోచుకోలేదు. వరంగల్ జిల్లా మానుకోట (ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా) తాలూఖా కొరవి (గొఱవి) శాసనం తెలంగాణ చరిత్రలో గొప్పది. ఇది క్రీ.శ. 935 నాటిదని తెలుస్తున్నది. పెద్దరాతి శాసన మొదటివైపు శాసన పాఠం, 2, 3, 4 వైపుల దాన శాసనపాఠం ఉన్నాయి. ఇది క్రీ.శ. 935 నాటిది కావడంతో దాదాపు నన్నయ్య కాలం కంటే ఒక శతాబ్దం ముందుదని పరబ్రహ్మశాస్త్రి, బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు.
-గూడూరు జనగామ తాలూకాలోగల క్రీ.శ. 1076-1127 కాలంనాటి చాలుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని శాసనం కూడా అనేక విషయాలు తెలుపుతుంది. ఇది నన్నయ్య తర్వాత 100 ఏండ్ల నాటిది. తెలంగాణ చరిత్రలో చెప్పుకోదగ్గ మరో శాసనం కరీంనగర్ జిల్లా ఉప్పర్‌పల్లి శివాలయంలోనిది. ఇది క్రీ.శ. 1157-1235 సంవత్సరాల మధ్యకాలం నాటి శాసనం. కందపద్య ఉత్పలమాల పద్యాల వరుసక్రమం యావత్ తెలంగాణకే ఒక మణిపూసగా చెప్పవచ్చు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, ప్రజంపూర్, శివనూరు, శంకరంపేట, గుడికందుల (భైరవేశ్వరాలయం) వేంకటరావుపేట, కొడిపాకతోపాటు నల్లగొండ జిల్లాలోనూ పేరుగాంచిన శాసనాలు ఉన్నాయి. కల్పగూరు, నందికంది శాసనాలను కొన్నింటిని దేవాలయ చరిత్ర గ్రంథంలో ఉదహరించారు. విష్ణుకుండిన రాజుల శిలాశాసనాల్లో జంట నందులు, సింహాకృతిగల శిలాశాసనాలు నా పరిశోధనలో లభ్యమయ్యాయి. పురావస్తు శాఖకు అందజేశాను.
-ఝరాసంగం, మర్పడగ (నాటి మరకత మణిపురం) ఇతర ప్రాంతాల్లో కళ్యాణి చాళుక్యరాజు రెండో అహవమల్ల వేయించిన శిలాశాసనం కూడా బయటపడింది. పాపన్నపేట మండలం నాగసానిపల్లి శివారులోని కొడిపాక శిలాశాసనం, దౌల్తాబాద్ మండలం సిరిపురం గ్రామ నడిబొడ్డునగల ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉన్న శిలాశాసనం కూడా ప్రాచీనమైనవే.