అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 9 న జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన :అవినీతి వ్యతిరేక సదస్సు" ద్వారా నిర్ణయించారు
అవినీతి ప్రభావం
అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. దారిద్య్రం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి.
అవినీతిని అరికట్టగలిగే మార్గాలు
కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనావ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావా దేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించు కోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు.
ఎన్నికల రాజకీయ వ్యవస్థలో అవినీతి తొలగించేందుకు సంస్కరణలు చేపట్టాలి. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధి విధానాలు ఏ పని ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలుజరిగేలా కార్యాచరణ ఉండాలి. పారదర్శకతకోసం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీకృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మనదేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతీఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిన బూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సేకరణ : వినయ్ కుమార్ ముక్కని (VINAYSINFO)