ఆదర్శరచనల అడుగుజాడ..గురజాడ. వర్ధంతి సందర్భంగ
''ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోరు!
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోరు!''
ఆధునికఆంధ్ర సాహిత్యానికి శ్రీవీరేశలిం గం పంతులుగారు యుగపురుషులు. ఈ ప్రభాత కాలంలోనే శ్రీ గురజాడ అప్పా రావు గారి రచనలు నూతన విజ్ఞాన భా నూదయ కాంతులు ప్రసరింపజేశాయి. వీరి
రచన లు సంఖ్యలో స్వల్పమే అయినా, సాటిలేనివి. కవులకు ఆదర్శ మార్గాన్ని చూపించాయి.ప్రజల్లో దేశభక్తి ని రేకెత్తించాయి. భాషలో, భా వంలో విప్లవాన్ని సాధించాయి.
నవ్యాంధ్రసాహిత్యానికియుగకర్తఅయిన శ్రీ అప్పారావుగారు సెప్టెంబరు 21వ తేదీన విశాఖజిల్లా రాయవరం గ్రామం లో జన్మించారు.విజయనగరం కాలేజీలో చదివి బి.ఎ.పరీక్షపాసయ్యారు. వీరు చదువు కుంటున్న రోజుల్లోనే,ఇంగ్లీషులో కవిత్వం రాసి పత్రికల్లో ప్రచురిస్తూండే వారు. పట్టభద్రులు కాకపూర్వమే1884 లో విజయనగరం కాలేజీలో కొన్నాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని, అప్పుడు వారికిచ్చేజీతం నెలకు పాతిక రూపాయలు మాత్రమే. ఈ స్వల్ప జీతం తో అసంతృప్తి చెంది కాబోలు, తర్వాత కొన్నాళ్లు డిప్యూటీ కలెక్టరు ఆఫీసలో హెడ్‌క్లర్కుగాచేరారు.కాని,విజ్ఞానఖనియై న ఈ మహనీయునికి గుమాస్తాగిరి ఎంత కాలం సహిస్తుంది? అయిదారు మాసాల్లోనే ఆగుమాస్తాపనికిస్వస్తిజెప్పి, కాలేజీలో మళ్లీ లెక్చరరుగాప్రవేశించారు. జీతంకూడా వంద రూపాయలకు పెరిగిం ది. ఉపాధ్యాయవృత్తిలో ఉన్నంత కాలం జీతపురాళ్లనే తన జీవిత పరమావధిగా ఎంచుకోక,విద్యార్ధుల విజ్ఞాన వికాసాల కు ప్రత్యేకించి కృషిచేస్తుండేవారు.అందు వల్లనే విద్యార్ధులకు వీరెంతో ప్రీతిపాత్రు లయ్యారు.
*కన్యాశుల్కం*
ఉపాధ్యాయులుగా ఉన్నసమయంలోనే (1896) వీరు 'కన్యాశుల్కం' రచించారు. కన్యాశుల్కం రెండవకూర్పు పీకలో, ఆ నాటకరచనకుతానెందువల్లఉపక్రమించ వలసివచ్చిందో, అప్పారావుగారేస్వయం గా ఇలా చెప్పారు-
*''సంఘసంస్కరణోద్యమాన్ని బలపరచ డానికీ, తెలుగుభాషనాటకరంగానికి అనుకూలమైనది కాదన్న అపోహ నెదు ర్కొనడానికీ, నేను కన్యాశుల్కాన్ని రాశాను.''*
బ్రహ్మసమాజ భావాలు ఆంధ్రదేశంలోని విద్యావంతు ల్లో విరివిగా ప్రచారమవు తూన్న రోజులవి. సంఘసంస్కరణకు శ్రీ వీరేశలింగం పంతులు గారు కంకణంగట్టి పనిచేస్తున్నారు. అదే సమయంలో అప్పారావుగారు కూడా తన సాహిత్యం ద్వారా సంఘ దురాచార నిర్మూలనకు పూనుకున్నారు. అయినా అప్పారావు గారు తమ రచనల్లో కళకేమాత్రం లోపం రానివ్వలేదు. ఆనాటి వ్యక్తులు తమ సహజమైన ఆచార వ్వవహారాలతో కన్యాశుల్కంలో నేటికీ మనకు కండ్లకు గట్టినట్లు సజీవంగా కనిపిస్తారు. *గిరీశం లాంటి పాత్రలను ఆంధ్రదేశం ఎన్నటికీ మరిచిపోలేదు.* హాస్యరసపోషణలో కూడా వీరిది అందెవేసిన చెయ్యి. *కన్యాశుల్కం చదివినవారు గానీ,చూచి న వారుగానీ కడుపుచెక్కలయ్యేటట్లు నవ్వకుండా ఉండలేరు.* అర్థశతాబ్దికి పూర్వమే మన తెలుగులో యింతటి చక్కనినాటకం వచ్చినందుకుఆంధ్రజాతి నిజంగా గర్వించదగిన విషయం. ఏవో కొన్ని స్వల్పలోపాలున్నా ఈనాటికీ మన సాహిత్యంలో దీనికి దీటైన నాటకం రాలేదనే చెప్పాలి. ప్రదర్శన యోగ్యంగా ఉండేందుకు అప్పారావుగారు దీన్ని ఇంకా సంక్షిప్తం చేయాలని ప్రయత్నించా రు. కాని శరీరం కలిసిరాలేదు. ఇదే ఫక్కీ లో ప్రారంభించ బడిన 'కొండు భట్టీయం' అనే మరో నాటకం కూడా అసంపూర్తిగా నే ఉండిపోయింది.
*వాడుక భాష*
కన్యాశుల్కం రచనానంతరం అప్పారావు గారి ఆరోగ్యం చెడిపోయినందువల్ల వారికి విశ్రాంతి నిచ్చేందుకు విజయన గరం ఆనందగజపతి మహారా జు గారు అప్పారావు గారిని 1896 జూన్‌లో లెక్చరరు పదవినుండి మాన్పించి సంస్థా న శాసనపరిశోధకునిగా నియమించారు.ఆసమయంలో అప్పారావుగారు అనేక చారిత్రక విషయాలను పరిశో ధించారు. కళింగదేశ చరిత్రను రాయడానికి కూడా పూనుకు న్నారు. కాని ప్రచురణకర్తలైన విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారు గ్రాంధికభాష లోనే ఆ గ్రంథం ఉండాలని పట్టుబట్టా రు.కాని అందుకు అప్పారావు గారు అంగీకరించలేదు. *''నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికి వదులు కోలేను''* అని ఖచ్చితంగా సమాధానమిచ్చారు.
అర్థశతాబ్ది గడచిన తరువాత నేటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయం చేయలేని పని నిఆనాడేఅప్పారావుగారుచేసిచూపారు. వాడుకభాష ప్రచారానికి శ్రీగిడుగు రామ మూర్తి పంతులుగారు చేసిన అమూల్య సేవను ఆంధ్రజాతి ఎన్నటికీ మరచిపోలేదు. పండితులతో ఢకొీని 'గిడుగు' పిడుగులాగా గర్జించి వ్యావహా
రిక భాషా ప్రాచారావశ్యతకను, దాని ప్రాశస్త్యాన్ని రుజువు
చేస్తూవున్న సమయంలో అప్పారావుగారువాడుకభాషలో చక్కని రచనలు సాగించి వారి మార్గాన్ని సులభతరం చేశారు. ప్రజాస్వామ్యంలో సాహిత్యానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచారు.
*ఉత్తమకళావేత్త*
''కొత్తపాతల మేలుకలయిక'' తో పాటు, అప్పారావు గారి రచనల్లో కమ్మని తెలుగుదనం ప్రతి శబ్దంలోనూ ఉట్టిపడు తుంది. కొద్దిమాటల్లోనేభావాన్నిసూటిగా గుండెకు తగిలేట్టు చెపుతారు.'పూర్ణమ్మ' 'కన్యక' లాంటి గేయాలు యిందుకుచక్క ని ఉదాహరణలు. ఇవి చదువుతూంటే పాఠకుని హృదయం జలదరిస్తుంది. కన్నీరు బొటబొట కారుతంది.
'కాసులు' అనే ఖండ కావ్యంలో
''మరులు ప్రేమని మది దలంచకు
మరులు మరలును వయసుతోడనే
మాయ మర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకమును రాజమార్గము?
ప్రేమనిచ్చిన ప్రేమవచ్చును
ప్రేమనిలిపిన ప్రేమనిలుచును''
అని చెప్పి ఆదర్శప్రేమ అంటే ఏమిటో చక్కగా నిర్వచించారు.
సంఘ సంస్కరణ ప్రియుడైన భర్తను ఒక సామాన్య కుటుంబములోని స్త్రీ ఏవిధం గా భావిస్తుందో 'ముత్యాల సరములు' లో సహజంగా చిత్రించారు. అమాయకురాలైన ఈమె మాటలకు పాఠకునికి కోపం రాకపోగా వర్ణాశ్రమ ధర్మ శృంఖలాలు ఈమెను యెంతగా బంధించి వేశాయో చూచి జాలివేస్తుంది.
'లవణరాజు కల' జ్ఞాన వాసిష్టంలోనిది అయినా-మహాకవి దానికి ఒక అపూర్వ శోభనుచేకూర్చారు. అవాస్తవిక విషయ మైనా, దీన్ని చదువుతూ ఉన్నంతసేపు పాఠకుడు వాస్తవిక జగత్తులోనే విహరి స్తున్నాననుకుంటాడు.
గ్రీక్ కథను కథావస్తువుగా తీసికొని రచింపబడిన 'డామస్ పిధియస్ అను పద్య కథానికలో ఆదర్శమైత్రి అంటే ఏమిటో నిరూపించారు.
'లంగ రెత్తుము' 'దించు లంగరు' అనేవి రెండూ, ప్రధమ ప్రపంచ యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని ఆవహించుకుంటూన్న కాలంలో రాయబడినవి.
*ముత్యాలసరం*
ప్రతిభానిధియైన ఈమహాకవి ఆంధ్ర
భాష కు 'ముత్యాలసరం' అనే చక్కని ఛందస్సు ను ప్రసాదించాడు. వసుచరిత్రాది ప్రబంధాల్లో వాడబడిన
''బల బాలరసాల మిది పిక
పాలి పాలిటి యమరసాలము
గేలి గేలిడి గ్రుచ్చ గడు రా
గిల్లు గిల్లుము తత్ప్రవాలము''
ఈ వృషభగతి రగడలోని నాలుగవ పంక్తిలో కొన్ని మాత్రలు తగ్గించినచో ఈ ఛందస్సు ఏర్పడుతుంది. ''గుమ్మడేడే గోపిదేవీ'' లాంటి పాటలు ఇంతకు పూర్వమే ఉన్నా, దీనిని ప్రచారంలోకి తెచ్చింది శ్రీ గురజాడవారే.ప్రజలవాడుక భాషలో రాయబడి, మృదుమధురమైన పదాల పొందిక తో, ఇంపుసొంపులు గులుకు గురజాడవారి 'ముత్యాల సరా లు' మన ఆంధ్రభాషావ ధూటికి నిజంగా ముత్యాల సరాలే!
*దేశభక్తి*
అప్పారావుగారిలో మొదటినుంచీ బ్రహ్మసమాజ భావాలతోపాటు జాతీయ భావాలు కూడా ప్రబలంగా ఉండేవి.
''తెగులు కిరవని కతల పన్నుచు
దిగులుచెందు టిదేటికార్యము
తలతు నేనిది సంఘ సంస్కర
ణ ప్రయాణ పతాకగాన్''
''వీటి అన్నిటికీ మించినది అప్పారావుగారి 'దేశభక్తి' అనే గేయం.
ఇందులోని ఒక్కొక్క పాదం నిజంగా ఒక్కొక్క ముత్యం లాంటిది. ఈ గేయం ఒక్కటి చాలు, అప్పారావుగారిని అమర జీవిని చేయడానికి.