ఎడ్మండ్ హేలీ FRS నవంబర్ 8, 1656 - జనవరి 14 1742) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు మరియు భౌతిక శాస్త్రవేత్త. ఈయన హెల్లీ తోకచుక్క యొక్క కక్ష్యలు కనుగొనుటలో ప్రపంచ ప్రసిద్ధుడు.
తోకచుక్కల అన్వేషకుడు!నక్షత్రాలంటే ఆ కుర్రాడికి ఎంతో ఇష్టం. ఏవేవో పరికరాలతో వాటిని గమనిస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడే ఖగోళ శాస్త్రవేత్తగా మారి ఎన్నో సంగతులు వెల్లడించాడు. అతడే ఎడ్మండ్ హేలీ. పుట్టిన రోజు ఇవాళే-1656 నవంబర్ 8న. అంతరిక్షంలోని అద్భుతాల్లో తోకచుక్కలోకటి. వాటిపై పరిశోధన చేసి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించిన శాస్త్రవేత్తగా ఎడ్మండ్ హేలీ పేరొందాడు. అందుకు గౌరవసూచకంగా ఓ తోకచుక్కకు ఆయన పేరే పెట్టారు. అదే 76 ఏళ్లకోసారి భూమికి దగ్గరగా వచ్చి కనువిందు చేసే హేలీ తోకచుక్క. ఖగోళ, భూభౌతిక, గణిత రంగాల్లో కూడా ఆయన విలువైన పరిశోధనలు చేశారు.
ఇంగ్లాండులోని హాంగర్‌స్టన్‌లో 1656 నవంబర్ 8న ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన హేలీ ప్రాథమిక విద్యను ఇంటి వద్దనే అభ్యసించాడు. స్కూల్లో చేరేప్పటికే తండ్రి కొనిచ్చిన పరికరాల సాయంతో అంతరిక్ష పరిశీలన చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని క్వీన్స్ కాలేజీలో చేరేటప్పటికే సౌరకుటుంబం గురించి పరిశోధన పత్రాలు వెలువరించగలిగాడు. ఖగోళ పరిశీలనపై ఆసక్తితో సొంతంగా 24 అడుగుల పొడవుండే టెలిస్కోపును రూపొందించుకుని, దక్షిణ అట్లాంటిక్‌లోని సెయింట్ హెలీనా దీవికి వెళ్లి 341 నక్షత్రాలపై అధ్యయనం చేశాడు. ఫలితంగా ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎమ్మే డిగ్రీ పొంది ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా కూడా ఎంపికయ్యాడు. భూ అయస్కాంతత్వంలోని మార్పులు, వాయువులు, సముద్రంలోని ఆటుపోట్లను వివరించే మ్యాపులను హేలీ తయారు చేశారు. ఎత్తును బట్టి పీడనం ఎలా మారుతుందో చెప్పే నియమాన్ని ప్రతిపాదించారు. భూమి వయసు కనుగొనడం, ఇంద్రధనుసులోని వర్ణకాంతుల విశ్లేషణ, పరమాణువు పరిమాణం గురించిన ఎన్నో పరిశోధనలు చేశారు. సముద్రపు లోతుల్లోకి వెళ్లేవారి కోసం డైవింగ్‌బెల్, హెల్మెట్‌లాంటి పరికరాలు రూపొందించారు. జామెట్రీ, లాగరిథమ్స్, ట్రిగనామెట్రీలకు సంబంధించిన సూత్రాలు కనుగొన్నారు. భూమికి, సూర్యునికి మధ్య దూరం, విశ్వం రూపం, పరిమాణం, నక్షత్రాల సంఖ్యలను అంచనా వేశారు.
సూర్యుడికి సుదూరంగా తిరుగుతూ ఎప్పుడో ఓసారి సూర్యకుటుంబం పరిధిలోకి వచ్చిపోయే తోకచుక్కల గమనాలు, కక్ష్యల గురించి ఆయన పరిశోధనలు అద్భుతమైనవి. అంతకు పూర్వం 1531, 1607, 1683లలో కనిపించిన తోకచుక్కలు వేర్వేరు కావని, ఒకటే ప్రతి 76 ఏళ్లకువస్తోందని చాటి చెప్పారు. అదే హేలీ తోకచుక్క. అంతేకాదు న్యూటన్ సిద్ధాంతాలను వెలుగులోకి తెచ్చింది ఈయనే. ప్రచారానికి దూరంగా ఉండే న్యూటన్ పరిశోధనలు ఎంత విలువైనవో గ్రహించిన హేలీ, ఆయన చేత పుస్తకాన్ని రాయించి సొంత ఖర్చుతో అచ్చు వేయించారు. తద్వారా శాస్త్రలోకానికి ఎంతో మేలు చేశారు.