తెలంగాణ
కేటీఆర్‌కు డిజిటల్ లిటరసీ పురస్కారం
-రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారకరామారావు గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారం అందుకున్నారు. సర్టిపోర్ట్ సంస్థ అంతర్జాతీయ విక్రయాల విభాగం ఉపాధ్యక్షుడు జాన్‌డే ఈ పురస్కారాన్ని అందించారు. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీహబ్ ఏర్పాటుతో పాటు రాష్ర్టానికి పెట్టుబడులు తరలించ్చేందుకు క్రియాశీల పాత్ర పోషించినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్యక్రమ అమలుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని సర్టిపోర్ట్ తెలిపింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు సర్టిపోర్ట్ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది.
తెలంగాణ యూత్ హాస్టల్స్‌కు ఉత్తమ అవార్డు
-తెలంగాణ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు దేశంలోనే 2వ బెస్ట్ అకౌంట్స్ (ఫెయిర్, క్లీన్) అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మియాపూర్‌లోని ఆల్విన్ కాలనీకి చెందిన తెంగాణ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధబోయిన వెంకట్‌యాదవ్ ఈ అవార్డుతో పాటు రూ. 15 వేల నగదు అందుకొన్నారు.
గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్
-గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ప్రకటించింది. గుడుంబా తయారీపై ఆధారపడిన కుటుంబాల పునరావాసానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ. 10 కోట్ల చొప్పున ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.
సరస్-2016
-అఖిల భారత స్వయం సహాయక సంఘాల చేతి వృత్తుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు ఉద్దేశించిన సరస్-2016 హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. దీన్ని గ్రామీణాభివృద్ధిశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లు సంయుక్తగా నిర్వహిస్తున్నాయి.
జాతీయం
తెలుగు బిలియనీర్లు ఏడుగురు
-దేశంలోని ధనిక నగరాలు, బిలియనీర్లతో న్యూ వరల్డ్ వెల్త్ విడుదల చేసిన తాజా నివేదికలో ఏడుగురు తెలుగు బిలియనీర్లు ఉన్నారు. ఐదు లిస్టెడ్ కంపెనీలు.. అరబిందో ఫార్మా, అమరరాజా బ్యాటరీస్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్ యజమానులు బిలియనీర్ల జాబితాలో నిలబడ్డారు. వీరితోపాటు రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు, నవయుగ గ్రూప్ అధిపతి విశ్వేశ్వరరావు జాబితాలో ఉన్నారు. జాబితాలో మొత్తం 2,64,000 మంది మిలియనీర్లు (రూ.6.5 కోట్ల విలువైన నికర ఆస్తులు కలిగినవారు), 95 మంది బిలియనీర్లు (రూ.6,500 కోట్ల విలువైన నికర ఆస్తులు కలిగినవారు) ఉన్నారు. ధనిక నగరాల జాబితాలో ముంబై టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అత్యధికంగా మిలియనీర్లు (45,000 మంది), బిలియనీర్లు (28 మంది) కూడా ముంబైకి చెందినవారే ఉన్నారు. హైదరాబాద్ 4వ సంపన్న నగరంగా నిలిచింది. హైదరాబాద్‌లో మిలియనీర్లు 8,200 మంది, బిలియనీర్లు ఏడుగురు ఉన్నారు.
పోటీతత్వంలో భారత్ దూకుడు
-గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ (ప్రపంచ పోటీతత్వ దేశాల సూచీ)లో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఏడాదికి వరల్డ్ ఎకానమిక్ ఫోరం రూపొందించిన జాబితాలో భారత్ 16 స్థానాలు మెరుగుపడి 39వ ర్యాంక్ దక్కించుకుంది. గతేడాది భారత్ 55వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే స్విట్జర్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత 8 ఏండ్లుగా స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో సింగపూర్, మూడో స్థానంలో అమెరికా నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, ఫిన్‌లాండ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక అంశాలు, ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక, వ్యాపార విలువలు, ఆవిష్కరణలు తదితర 12 విభాగాల్లో ఆయా దేశాలు అనుసరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని WEF ఈ జాబితాను రూపొందించింది. పాకిస్థాన్ ఈ జాబితాలో చివరి స్థానానికి పడిపోయింది.
ఢిల్లీ ప్రవాసీ భారతీయ కేంద్రం
-ప్రవాసీ భారతీయ కేంద్రం కోసం ఢిల్లీలో అత్యాధునిక కాంప్లెక్స్‌ను నిర్మించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అక్టోబర్ 2న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
హిందుస్థాన్ కేబుల్ మూసివేత
-నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన విధంగా హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)ను మూసివేయనుంది. ఇందుకు అవసరమైన రూ. 4,777.05 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. వేతనాలను చెల్లించడానికి, స్వచ్ఛంద పదవీ విరమణ, ప్రభుత్వ రుణాన్ని వాటా రూపంలో మార్చడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. 2007 పే స్కేల్ ప్రకారం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్, వీఎస్‌ఎస్ పథకాలను అందిస్తున్నట్లు తెలిపింది. కంపెనీల చట్టం 1956/2013, పరిశ్రమల వివాదాల చట్టం 1947, ఇతర చట్టాల కింద దీన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ ద్వితీయ వార్షికోత్సవం
-కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో భారత పారిశుద్ధ్య మహాసభను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతను ప్రోత్సహించి, బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసిన పది సంఘాలు, సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లాలకు స్వచ్ఛతా అవార్డులను ప్రధాని అందజేశారు. ఇందులో ఎన్సీసీ సూరత్ రైల్వేస్టేషన్, సింధుదుర్గ్, మండీ జిల్లాలు, చండీగఢ్, మైసూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. దూరదర్శన్, ఆకాశవాణిలో రోజుకు రెండుసార్లు స్వచ్ఛభారత్‌కు సంబంధించిన న్యూస్‌క్యాప్సూల్స్ ప్రసారం చేసే అవకాశాన్ని సమాచార ప్రసార శాఖ మంత్రికి ప్రధాని మోదీ సూచించారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
స్వరాజ్ ఇండియా
-ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు అక్టోబర్ 2న స్వరాజ్ ఇండియా పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. పార్టీకి అధ్యక్షుడిగా యోగేంద్ర వ్యవహరిస్తారు.
అంతర్జాతీయం
సార్క్ సమావేశాలు వాయిదా
-నవంబర్‌లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాలు వాయిదాపడ్డాయి. అర్థవంతమైన ప్రాంతీయ సహకారానికి శాంతి, సుస్థిరత ఉన్న వాతావరణం అవసరమని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించలేమని సార్క్‌కు అధ్యక్షతవహిస్తున్న నేపాల్ ప్రకటించింది. యురీపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక సార్క్ సమావేశానికి వెళ్లబోమని ప్రకటించాయి.
ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్‌కిమ్
-ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యంగ్ కింగ్ రెండోసారి నియమితులయ్యారు. 1 జూలై, 2017 నుంచి ఐదేండ్ల వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన నియామకానికి వరల్డ్ బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2012లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
క్రీడలు
మలేషియా గ్రాండ్‌ప్రి టైటిల్ రికియార్డో
-మలేషియా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 56 ల్యాప్‌ల మలేషియా గ్రాండ్‌ప్రి రేసును గంటా 37 నిమి. 12.776 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో 41 రేసుల తర్వాత తొలియం అందుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం
-న్యూజిలాండ్‌తో ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 178 పరుగుల తేడాతో గెలుపొంది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
అవార్డులు
మెడిసిన్‌లో యోషినోరికి నోబెల్
-2016కు గాను వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త యోషినోరి ఒషుమీకి లభించింది. పార్కిన్సన్, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన కణాల వినాశనానికి సంబంధించి (మెకానిజం ఆఫ్ ఆటోఫాగి) చేసిన పరిశోధనలకు గాను ఆయన ఈ అత్యుత్తమ అవార్డుకు ఎంపికయ్యారు.
వార్తల్లో వ్యక్తులు
షిమోన్ పెరెజ్ మృతి
-ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెజ్ సెప్టెంబర్ 28న మరణించారు. 2007 నుంచి 2014 వరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి కోసం చేసిన విశేష కృషికిగాను 1994లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
ఎస్‌టీసీసీఎస్ సభ్యుడిగా రవీందర్‌రావు
-నాబార్డ్ ఏర్పాటు చేసిన స్వల్పకాలిక సహకార రుణ నిర్మాణాలకు సంబంధించిన మానవ వనరులను అంచనా వేసే కమిటీకి తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు నియమితులయ్యారు. ఈ కమిటీ జాతీయ స్థాయిలో కో ఆపరేటివ్, డీసీసీబీలలో మానవ వనరులను అంచనా వేయనుంది. నాబార్డ్ డిఫ్యూటీ డైరెక్టర్ అమలోర్ పవనాథన్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు