భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం (పూనా ఒడంబడిక). 1932 సెప్టెంబర్ 24 న మహారాష్ట్ర లోని పూనా పట్టణంలో (ఇప్పటి పుణె) లో ఈ ఒప్పందం కుదిరింది.
నేపథ్యం
1932 ఆగష్టు లో జరిగిన రెండవ రౌండు టేబులు సమావేశం తరువాత రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిషు ప్రభుత్వం ఒక కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వం అల్ప సంఖ్యాక మతస్తులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుంది. అయితే ముస్లిములు, సిక్ఖులతో పాటు, దళితులను కూడా అల్ప సంఖ్యాక మతస్తులుగా ఈ అవార్డు ప్రకటించింది. బి.ఆర్.అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగా బ్రిటిషు ప్రభుత్వం ఈ విధంగా గుర్తింపు నిచ్చింది. అయితే మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించాడు. దళితులను విడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నం అవుతుందని, అందుకు నిరసనగా గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లో నిరాహారదీక్ష చేపట్టాడు. దేశం యావత్తూ గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందింది. కాంగ్రెసు నాయకులు గాంధీ వాదనకు మద్దతు తెలిపారు.
కమ్యూనలు అవార్డుకు అనుకూలురైన దళిత నాయకులు తమ పట్టుదలను సడలించుకున్నారు. అంబేద్కరు ఎరవాడ జైల్లో గాంధీతో చర్చలు జరిపాడు. వారి చర్చల ఫలితంగా వెలువడిందే పూనా ఒప్పందం.
ఒప్పందం వివరాలు
ఒప్పందం పాఠం ఇలా ఉంది:
1) ప్రాంతీయ శాసనసభ స్థానాల్లో అణగారిన వర్గాలకు (తరువాతి కాలంలో షెడ్యూల్డు కులాలు అని పేరొందినవి) కింది విధంగా రిజర్వేషన్లు ఉంటాయి: -
మద్రాసు 30; బొంబాయి సింద్ కలిపి 25; పంజాబు 8; బీహారు, ఒడిషా కలిపి 18; మధ్య ప్రావిన్సులు 20; అస్సాం 7; బెంగాలు 30; ఐక్య ప్రావిన్సులు 20. మొత్తం 148. ఈ అంకెలు బ్రిటిషు ప్రధానమంత్రి నిర్ణయానుగుణమైనవి.