రాష్ర్టాలకు ప్రాణసంకటం ఆర్టికల్ 356
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉండి ప్రఖ్యాతిగాంచిన ప్రజాస్వామ్య దేశాల్లో ప్రముఖమైనదిగా భాసిల్లుతున్న భారతదేశం వైరుధ్యాలకు పెట్టింది పేరు. భిన్నత్వాన్ని ఛేదించడం కోసం బలీయమైన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మన రాజ్యాంగ నిర్మాతలు సంకల్పించారు. అందుకోసం భారత సమాఖ్య వ్యవస్థను ఏకకేంద్ర లక్షణాల పునాదుల మీద నిర్మించారు. అటువంటి కృషిలో అంతర్భాగమే 356వ అధికరణ. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 356వ అధికరణతరచూ వివాదాస్పదమవుతూనే ఉంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా మరోమారు 356వ అధికరణ తెరపైకి వచ్చింది.
-ముఖ్యంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం చట్టబద్ధత కూడా న్యాయసమీక్షకు లోబడే ఉంటుందని ఆ రాష్ట్ర హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.
-రాజ్యాంగంలో ఉన్న అధికరణల్లో అత్యంత ఎక్కువగా దుర్వినియోగమైంది 356 ఒక్కటే. అత్యవసర పరిస్థితుల్లోనే అరుదుగా 356వ అధికరణను వినియోగించాలని భారత రాజ్యాంగ నిర్మాతలు సూచించారు.
-1949లో రాజ్యాంగ సభలో ఈ అధికరణపై జరిగిన చర్చలో బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ 356 అధికరణ ఒక మృతాక్షరం వంటిది. ఎప్పుడూ దీని వినియోగం వస్తుందని అనుకోను అని అన్నారు.
-అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయాధికారమే పరమావధిగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో గవర్నర్ పదవిని ఒక పావుగా మార్చేశారు.
-గవర్నర్ల నియామకం, వారి అధికారాలపై రాజ్యాంగ పరిషత్‌లో పెద్ద చర్చే జరిగింది. అలంకారప్రాయమైన గవర్నర్ పదవి కోసం ప్రత్యేక నియామకాలు అక్కర్లేదని, అవసరమైన సందర్భాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సదరు బాధ్యతలు నిర్వర్తించే వెసులుబాటు ఉండాలని కొందరు రాజ్యాంగ సభ సభ్యులు వాదించగా, గవర్నర్‌ను నియమించకుండా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ప్రజలే ఎన్నుకోవాలని రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు సర్ బెనగల్ నర్సింగరావు లాంటి వారు మరో వాదన ముందుకు తెచ్చారు. ఈ వాదనతో నెహ్రూ ఏకీభవించలేదు.
-రాజకీయ అవసరాల నేపథ్యంలో గవర్నర్ల నియామకాన్ని నెహ్రూ తీవ్రంగా ఖండించారు. పలు అంశాలపై అవగాహన కలిగి ఉన్న లబ్దప్రతిష్టులైన వారిని గవర్నర్లుగా నియమించాలని నెహ్రూ అభిప్రాయం.
-భారతదేశమనే ఇండియా రాష్ర్టాల యూనియన్ అని రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ ప్రకటించింది. రాష్ర్టాలకు ఇండియా నుంచి వేరుపడే అధికారాన్ని రాజ్యాంగం కల్పించలేదు.
-355 అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
356 అధికరణ ఏం చెబుతుంది?
-రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుంచి 360 వరకు గల అధికరణలు అత్యవసర పరిస్థితుల విధి విధానాలను వివరిస్తాయి.
-రాష్ట్రపతికి ఉన్న అసాధారణ అధికారాల్లో 356 అధికరణ ఒకటి. దీని ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించటం లేదని లేదా రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితులు లేవని ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేసినప్పుడు దాని ఆధారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
-కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడానికి తిరస్కరించినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. లేదా శాంతిభద్రతలు క్షీణించడం, రాజకీయ సంక్షోభం సంభవించిన సందర్భాల్లో కూడా విధించవచ్చు.
-1935 భారత ప్రభుత్వ చట్టంలోని 93వ సెక్షన్ నేటి 356 అధికరణకు మాతృక. ఈ చట్టంలోని 93వ సెక్షన్ ప్రకారం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలను (PROVINCIAL GOVERNAMENTS) రద్దు చేసే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి లభించింది.
-కాలక్రమంలో 93వ సెక్షన్ 356 అధికరణగా రూపాంతరం చెందింది. దీన్ని నాటి దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించగా, అంబేద్కర్ లాంటి వారు దీని వినియోగంపై చర్చలు కొనసాగించారు. అనంతర పరిణామాల్లో బలమైన కేంద్రాన్ని నిర్మించడం కోసం ఈ అధికరణను కొనసాగించాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది.
ఎంతకాలం కొనసాగించవచ్చు?
-గవర్నర్ సిఫారసు మేరకు కేంద్ర మంత్రిమండలి సలహాననుసరించి రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి వెనక్కి పంపవచ్చు.
ఉదా : 1997లో ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ తిప్పి పంపారు.
-అదే విధంగా 1998లో బీహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వ రద్దుకు వాజ్‌పేయి ప్రభుత్వం సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపారు. రెండోసారి అదే సిఫారసు తన దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్రపతి అనివార్యంగా ఆమోదించాల్సి వచ్చింది.
-ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్లమెంటు ఉభయసభలు రెండు నెలల్లోపు వేర్వేరుగా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. రెండు సభల్లో ఏ ఒక్క సభ తిరస్కరించినా ఆ ప్రకటన రద్దవుతుంది.
-ఈ విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించేనాటికి లోక్‌సభ రద్దయిఉంటే రాజ్యసభ ఆమోదం ద్వారా అది అమల్లోకి వస్తుంది. అయితే కొత్త లోక్‌సభ సమావేశమైన 30 రోజుల్లోపు ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. లేని పక్షంలో రాష్ట్రపతి పాలన రద్దవుతుంది. పార్లమెంటు ఆమోదించిన నాటి నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఆరు నెలల గడువు ముగియకముందే మరో తీర్మానం ద్వారా మరో ఆరునెలల చొప్పున గరిష్టంగా మూడేండ్ల వరకు పొడిగించవచ్చు.
-1978 నాటి 44వ సవరణ ప్రకారం ఒక ఏడాది తర్వాత కూడా రాష్ట్రపతి పాలన కొనసాగాలంటే కింది షరతులు వర్తిస్తాయి.
1.దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉండి ఉండాలి.
2.ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
-ఒకవేళ ఒక రాష్ట్రంలో మూడేండ్ల కన్నా ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. పంజాబ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఐదేండ్ల వరకు దీన్ని పొడిగించారు. ఇందుకోసం 1990లో 64వ, 67వ, 1991లో 68వ సవరణలు చేశారు.
-రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా రద్దు చేయవచ్చు. లేదా పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా కూడా ఎత్తివేయవచ్చు.
విచ్చలవిడి ప్రయోగం
-రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి పాలన పూర్తిగా గాడి తప్పి వ్యవహారం చక్కబెట్టలేని స్థితికి చేరిందని నిర్ధారిస్తూ గవర్నర్ తుది నివేదిక ఇస్తే తప్ప కేంద్రం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే ఈ సంప్రదాయం మాటలకు, కాగితాలకే పరిమితమైంది.
-ఇప్పటివరకు 125 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
-16 ఏండ్లుకుపైగా దేశాన్ని పరిపాలించిన జవహర్‌లాల్‌నెహ్రూ ఏడు సార్లు మాత్రమే 356 అధికరణను వినియోగించగా, దాదాపు అంతేకాలం ఏలిన ఇందిరాగాంధీ 48 సార్లు ప్రయోగించారు.
-తొలిసారిగా 1951 జూన్‌లో పండిట్ నెహ్రూ 356 అధికరణను ప్రయోగించి పంజాబ్ ముఖ్యమంత్రి గోపీచంద్ భార్గవ ప్రభుత్వాన్ని పడగొట్టారు.
-1959లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ఏర్పాటైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దుచేశారు. 1977లో మొరార్జీదేశాయ్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రేసేతర జనతా ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయాయననే నెపంతో ఏకకాలంలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను (హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్) రద్దు చేసింది.
-1980లో తిరిగి ఇందిరాగాంధీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర శాసనసభలను రద్దు చేసింది.
-1983లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత మెజార్టీతో అధికారం చేపట్టిన ఎన్‌టీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేశారు.
-2006లో గోవా రాష్ట్ర గవర్నర్ సిబ్తేరజీ ముఖ్యమంత్రికి అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిష్కారణంగా రద్దు చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం గవర్నర్ చర్యను గర్హిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
-ఉత్తరప్రదేశ్‌లో గరిష్టంగా తొమ్మిదిసార్లు 356 అధికరణను వినియోగించారు.
-కర్ణాటకలో ఒక నెలలో రెండుసార్లు (2007 నవంబర్‌లో) రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టిన దాఖలాలున్నాయి.
-1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు (నాలుగు నెలల పదకొండు రోజులు) ఆంధ్రరాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించినందుకుగాను ప్రకాశం పంతులు స్థానంలో రాష్ట్రపతి పాలన విధించారు.
-ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ప్రకటించారు. తొలిసారి - జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు (335 రోజులు) విధించారు.
-రెండోసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో 2014 మార్చి - 1 నుంచి జూన్ 8 వరకు (3 నెలల 7 రోజులు) విధించారు.
356 అధికరణ - వాద ప్రతివాదనలు
-రాష్ట్రపతి పాలనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పలు అధ్యయన కమిటీలు నివేదికలు సమర్పించాయి. అందులో మొదటిది 1966-69 నాటి ఎంసీ సెతల్వాడ్ అధ్యక్షతన వచ్చిన పరిపాలనా సంస్కరణల సంఘం అధ్యయన కమిటీ. ఇది రాజ్యాంగ పరిధిలో రాష్ర్టాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని పేర్కొన్నది.
-1969లో తమిళనాడు డీఎంకే ప్రభుత్వం నియమించిన పీవీ రాజమన్నార్ కమిషన్ (ఎ.లక్ష్మణస్వామి మొదలియార్, పి.రామచంద్రారెడ్డి సభ్యులు) 356 అధికరణ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించే ముందు రాష్ట్రపతి గవర్నర్ నివేదికను ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపాలి. లేదా 356, 357 అధికరణల్లోని అత్యవసరాంశాలను రాజ్యాంగం నుంచి పూర్తిగా ఉపసంహరించాలి అని సూచించింది.
-ఆ తర్వాత వచ్చిన ఆనంద్‌పూర్‌సాహెబ్ తీర్మానం (1973), భగవాన్ సహాయ్ కమిటీ (1974), పశ్చిమబెంగాల్ ప్రభుత్వ మెమోరాండం (1977)లు భారత సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించకూడదని పేర్కొన్నాయి.
-1983లో ఇందిరాగాంధీ నియమించిన జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్ (బి.శివరామన్, ఎస్‌ఆర్ సేన్‌లు సభ్యులు) 356 అధికరణను చాలా అనివార్య పరిస్థితుల్లో తప్ప వినియోగించరాదు. రాష్ట్రపతి పాలనను అమలుజరిపే ముందు రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన ఏ వివరణనైనా పరిగణలోకి తీసుకోవాలి అని విశదపర్చింది.
-ఇంకాస్త వివరంగా సర్కారియా కమిషన్ ఈ విధంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తనకుతాను దిద్దుకోవడానికి వీలుగా రాష్ట్రపతి ఆ రాష్ర్టానికి ముందస్తు హెచ్చరికగానీ, అవకాశాన్నిగానీ ఇవ్వని పక్షంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అన్యాయమే అవుతుంది అని పేర్కొంది.
ఎస్‌ఆర్ బొమ్మై కేసు
-356వ రాజ్యాంగ అధికరణ వినియోగం విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం రెండుసార్లు వివరణ ఇచ్చింది. తొలిసారిగా 1977లో నాటి జనతా ప్రభుత్వం తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినప్పుడు - రాజస్థాన్ వర్సెస్ ఇండియా కేసులో 356 అధికరణ వినియోగానికి సంబంధించి రాష్ట్రపతి పాలన ప్రకటనపై న్యాయ సమీక్షాధికారం వినియోగించవచ్చునని తీర్పునిచ్చింది. తర్వాత 1944లో ఎస్‌ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినది. 1989లో 356 ద్వారా కర్ణాటకలోని ఎస్‌ఆర్ బొమ్మై ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు ఆ చర్య అమలుకాకుండా నిలుపుదల చేస్తే సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఏయే పరిస్థితుల్లో 356 అధికరణను ఉపయోగించవచ్చుననే విషయాన్ని బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రంలో ఏర్పడిన రాజ్యాంగ వైఫల్యాన్ని ఐదు సూత్రాల ద్వారా నిర్ధారించాలని నిర్ణయించింది.
-రాష్ట్రంలో భారీ ఎత్తున శాంతిభద్రతలు క్షీణించిపోవడం
-పరిపాలనలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడటం
-అవినీతి - అధికార దుర్వినియోగం
-రాష్ట్ర భద్రతకు, జాతీయ సమగ్రతకు ప్రమాదం వాటిల్లడం
-రాజ్యాంగ ఉల్లంఘన ఏర్పడినప్పుడు - పై సందర్భాల్లో న్యాయస్థానాలు, మేధావుల సలహా మేరకు 356వ అధికరణను ప్రయోగించవచ్చని ప్రకటించింది.
రాష్ట్రపతిపాలన- పర్యవసానాలు
-రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో ఏకకేంద్ర పరిస్థితులు నెలకొని కింది మార్పులు సంభవిస్తాయి.
-రాష్ట్రపతి ఆ రాష్ట్ర పాలనా బాధ్యతలు స్వీకరిస్తారు.
-రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుంది.
-గవర్నర్ వాస్తవాధికారాలు చెలాయిస్తారు.
-రాష్ట్రపతి పేరుతో గవర్నర్ రాష్ట్ర పాలన కొనసాగిస్తారు. ఇతని విధి నిర్వహణలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర సలహదారులను కేంద్రం నియమిస్తుంది.
-రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు. లేదా సుప్త చేతనావస్థలో ఉంచవచ్చు. (SUSPENDED ANIMATION)
-రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటుకు సంక్రమిస్తాయి. రాష్ట్ర పాలనకు అవసరమైన సాధారణ చట్టాలు, బడ్జెట్‌ల రూపకల్పన పార్లమెంటు చేపడుతుంది.
-రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారాల్లో ఎటువంటి మార్పు ఉండదు.
-రాష్ట్రపతి పాలనా కాలంలో రూపొందించబడిన చట్టాలు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయి.
-ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ర్టాలు మినహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో 356వ అధికరణాన్ని ఉపయోగించారు.
356వ అధికరణ భారత సమాఖ్య వ్యవస్థకు చేటు
-హెచ్‌ఎన్ కుంజ్రూ
356వ అధికరణను ఉపయోగించాల్సిన అవసరం ఎన్నటికీ రాదని, అది కాగితాలకే పరిమితమవుతుందని ఆశిద్దాం. అలాకాకుండా ఈ అధికరణను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే విషయంలో సముచిత నిర్ణయం తీసుకుంటారని నా ఆశ.
- బీఆర్ అంబేద్కర్
భారతదేశం విచ్ఛిన్నం చేయగల యూనిట్లతో కూడిన విచ్ఛిన్నం కాని ఐక్యస్వరూపం అయినందున రాజ్యాంగ నిర్మాతలు సరళ సమాఖ్యను ఏర్పాటుచేశారు.
- రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్ కేసులో సుప్రీం కోర్టు