దజని (ఆంగ్లం: Hydrogen), ఒక రసాయన మూలకం. దీనిని తెలుగు లొ 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత ద్విపరమాణు (H2) వాయువు. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన మూలకము మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త 1766 లో ఉదజని ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము(నీరు) ను ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.
ఉపయోగాలు
పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ
హేబర్ పద్ధతిలో అమ్మోనియా సంశ్లేషణ : 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం ఉత్ప్రేరకం సమక్షంలో నైట్రోజన్ వాయువు, ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం HCl ను నీటిలో శోషించడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారుచేస్తారు.300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ZnO, CrO3ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను ఉదజని తో కలిపి పంపితేమిథనాల్ తయారవుతుంది.
పారిశ్రామిక ఇంధనంగా
ఉదజని ను పారిశ్రామిక ఇంధనంగా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణం (242 కి.జౌ./మోల్).
ఆక్సీ ఉదజని బ్లో టార్చ్ లో ఉదజని ను శుద్ధ ఆక్సిజన్ తో మండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత (2800 C) గల జ్వాల వస్తుంది. దీనిని వెల్డింగ్ చేయడానికి, ప్లాటినమ్, క్వార్ట్జ్ లను ద్రవీకరించడానికి ఉపయోగిస్తారు.బొగ్గును నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకి పంపి తారువంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్ధం 'కోల్ గాస్'. దీనిలో ఉదజని (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం దీని కెలోరిఫిక్ విలువ 21,000 కి.జౌ./మీ3.ఉదజని, కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి ఇంధనాలను దహనం చేయడాం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విధుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.
నూనెల హైడ్రోజనీకరణంలో
అసంతృప్త నూనెలను సంతృప్త క్రొవ్వులుగా మార్చే ప్రక్రియలో హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తారు. అసంతృప్త నూనెలకు హైడ్రోజన్ వాయువు పంపిస్తూ నికెల్ ఉత్ప్రేరకం సమక్షంలో వేడిచేసినపుడు సంతృప్త క్రొవ్వులు ( డాల్డా,వనస్పతి మొదలగునవి) తయారుచేస్తారు. దీని కొరకు 241 మెగా పాస్కల్స్ పీడనాన్ని మరియు 300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణాన్ని ఉపయోగిస్తారు.