Type Here to Get Search Results !

Vinays Info

వన్యమృగా సంరక్షణ కేంద్రాలు

పాకాల వన్యమృగ అభయారణ్యం
జిల్లా : వరంగల్‌
విస్తీర్ణం: 860.2 చదరపు కిలోమీటర్లు.
నోటిఫైడ్‌ తేదీ: దీనిని మొదట బురదనేల మొసళ్ళు, పులుల రక్షిత ప్రాంతంగా హైదరాబాద్‌ ఫజిల్‌ చట్టం కింద నోటిఫై చేశారు. తరువాత వన్యమృగ (రక్షణ) చట్టం - 1972 కింద 30-09-1999లో మళ్ళీ నోటిఫై చేశారు.
వన్యమృగ సూచి: బురదనేల మొసళ్ళు
చేరుకోవటం ఎలా: రోడ్డు మార్గంలో వరంగల్‌ నుండి 60 కి.మీ. రైలు మార్గంలో నెక్కొండ నుండి 22 కి.మీ. మహబూబాబాద్‌ నుండి 50 కి.మీ.
ఉష్ణోగ్రత: గరిష్టం 47 డిగ్రీల సెంటీగ్రేడ్‌ శీతాకాలంలో 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: జూన్‌ నుండి అక్టోబర్‌ (నైరుతి రుతు పవన వర్షపాతం) 1143 మి.మీ.
చరిత్ర: పాకాల చెరువుకు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. దీనిని 13వ శతాబ్దంలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించారు. 2175 హెక్టార్లలో ఈ చెరువు విస్తరించి ఉంది.
ఈ అభయారణ్యం గురించి: పాకాల చెరువు పేరుపెట్టిన ఈ అభయారణ్యం తెలంగాణలో ప్రాచీనమైన అభయార ణ్యాల్లో ఒకటి. దీనికి దక్షిణాన ఏటూరునాగారం అభయా రణ్యం ఉంది. కృష్ణా, గోదావరుల పరీవాహక ప్రాంతంలో మిట్టపల్లాలతో, కొండలతో అలరారుతున్న ఈ అభయారణ్యంలో వన్యమృగజాతులు సమృద్ధిగా ఉన్నాయి.
మంజీరా వన్యమృగ అభయారణ్యం
జిల్లా: మెదక్‌
విస్తీర్ణం: 20 చదరపు కిలోమీటర్లు
నోటిఫైడ్‌ తేదీ: దీనిని వన్యమృగ (రక్షణ) చట్టం- 1972 కింద 20-05-1978 న వన్యమృగ అభయారణ్యంగా నోటిఫై చేశారు.
ఉష్ణోగ్రత: వేసవిలో గరిష్టంగా: 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌, శీతాకాలంలో కనిష్టంగా 9 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: వర్షాకాలం: జూన్‌నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతుపవనాలు) వర్షపాతం: 915 మి.మీ.
అటవీ వర్గం: తొమ్మిది ద్వీపాల నడుమ జీవావరణ వ్యవస్థ.
వన్యమృగ సూచి: బురదనేల మొసళ్లు, ఒక రకం తాబేలు (టెర్రాపిన్‌), నెమలితోక గల జాకన్‌
విశిష్టత:ఇది మానవ నిర్మిత జలాశయం. ఇది నీటిలో జీవించే పక్షులకు, బురద మొసళ్ళకు ఇష్టమైంది.
చేరుకోవటం ఎలా: రోడ్డు మార్గం: సంగారెడ్డి పట్టణం నుండి 5 కిలోమీటర్లు. హైదరాబాద్‌ నుండి 60 కి.మీ.
ఈ అభయారణ్యం గురించి: మంజీరా-సింగూరు బ్యారేజీల మధ్య మంజీరా నదిలో500-800 మీటర్ల వెడల్పుతో 36 కిలోమీటర్ల మేరకు ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడున్న 9 చిన్న ద్వీపాలు పక్షులు గుడ్లు పెట్టటానికి, విశ్రాంతి తీసుకోవటానికి అనువైనవి. దీనిని మొదట మొసళ్ళ అభయారణ్యంగా గుర్తించినప్పటికీ, రకరకాల పక్షులు ఈ ద్వీపాలకు రావటంతో దీనిని పక్షుల అభయారణ్యంగా కూడా ప్రకటించారు. మంజీరా నది హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యం
జిల్లా: ఖమ్మం
విస్తీర్ణం: 635.4 చదరపు కి.మీ.
నోటిఫైడ్‌ తేదీ: 24-01-1977
ఉష్ణోగ్రత: సగటు వార్షిక ఉష్ణోగ్రత- 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌, గరిష్ట ఉష్ణోగ్రత: 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
కనిష్ట ఉష్ణోగ్రత: 15 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: సగటున 863.55 మి.మీ
అడవివర్గీకరణ: టేకు, వెదురు చెట్లతో, పచ్చిక భూములతో దక్షిణాది ఆకురాల్చు అడవి.
వన్యమృగ సూచి: పులి, అడవి దున్న
విశిష్టత: మధ్యలో దట్టమైన అడవులతో కూడిన ద్వీపాలతో, నిత్య జలపాతాలతో కిన్నెరసాని వాగును చూడగానే మైమరపు కలుగుతుంది.
చేరుకోవటం ఎలా: రోడ్డుమార్గం: కొత్తగూడెం నుండి 15 కి.మీ. రైలుమార్గం- కొత్తగూడెం
చరిత్ర: ఈ అభయారణ్యం నుంచి ప్రవహించే గోదావరి ఉపనది కిన్నెరసాని పేరును ఈ అభయారణ్యానికి పెట్టారు. ఈ అడవి దండకారణ్యంలో భాగంగా ఉంది. రాముడు ఇక్కడే వనవాసం చేశాడనటానికి ఇక్కడి పర్ణశాల, రేకపల్లి, దుమ్ముగూడెం, సాక్షీభూతాలుగా నిలుస్తాయి. ఈ అభయార ణ్యంలో గుట్టలు, లోయల గుండా ప్రవహించే కిన్నెరసాని వాగు ఇక్కడి ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేసింది.
ఈ అభయారణ్యం గురించి: గోదావరి కుడి గట్టున ఉన్న కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యం అందాలను చూసి తీరవలసిందేకానీ వర్ణించటానికి వీలుకాదు. ఇక్కడ వంపులు తిరుగుతూ అభయారణ్యం నుంచి ప్రవహించే కిన్నెరసాని సౌందర్యం వర్ణనాతీతం. ఈ అభయారణ్యం అంచున కిన్నెర సాని వాగుపై గతంలో నిర్మించిన జలాశయం నేడు బురద నేల మొసళ్లకు నెలవై వాటి సంతానోత్పత్తికి దోహదం చేస్తున్నది.

ప్రాణహిత వన్యమృగ అభయారణ్యం
జిల్లా: ఆదిలాబాద్‌
విస్తీర్ణం: 136.02 చదరపు కి.మీ
నోటిఫైడ్‌ తేదీ: 18.03.1980
ఉష్ణోగ్రత: వేసవిలో గరిష్టంగా 46 డిగ్రీల సెంటీగ్రేడ్‌ శీతాకాలంలో కనిష్టం 9 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతుపవనాలు) 900 మి.మీ.
అడవి వర్గీకరణ: ఎండిన పొదలు, పచ్చికబైళ్ళతో కూడిన పొడి దక్షిణ ఉష్ణమండల ఆకురాల్చు అడవి
గిరిజన తెగలు: కలప కాని ఇతర అటవీ ఉత్పత్తులపై, పోడు వ్యవసాయంపై ఆధారపడిన నాయక్‌పోడు గిరిజనులు.
వన్యమృగసూచి: కృష్ణజింక
విశిష్టత: ఇది ప్రాణహిత నదీతీరాన కృష్ణజింకలు తిరుగాడే అభయారణ్యం.
చేరుకోవటం: రోడ్డు మార్గం: హైదరాబాద్‌- కరీంనగర్‌ -మంచిర్యాల రోడ్డుపై హైదరాబాద్‌ నుండి 330 కి.మీ. హైదరాబాద్‌-నిర్మల్‌-మంచిర్యాల రోడ్డుపై 360 కి.మీ.
రైలుమార్గం: హైదరాబాద్‌-మంచిర్యాల లైనులో హైదరాబాద్‌ నుండి 260 కి.మీ.
అత్యంత సమీప విమానాశ్రయం హైదరాబాద్‌
చరిత్ర: బెల్లంపల్లి అడవి డివిజన్‌లోని మార్వెల్లి ప్రాంతంలో జురాసిక్‌ కాలం నాటి కలప శిలాజాలు లభ్యం. దీనిని బట్టి ఇక్కడ రాక్షస బల్లుల (డైనోసారస్‌) ఉనికి రుజువు అవుతున్నది.
అభయారణ్యం గురించి: గుట్టలతో, సెలయేళ్ళతో వివిధ రకాల జంతువులకు నివాసయోగ్యమైంది ప్రాణహిత అభయారణ్యం.
పోచారం వన్యమృగ అభయారణ్యం
జిల్లా: మెదక్‌
విస్తీర్ణం: 129.84 చదరపు కి.మీ
నోటిఫైడ్‌ తేదీ: దీనిని మొదట 29.02.1952న హైదరాబాద్‌ ఫజిల్‌ చట్టం- 1952 కింద నోటిఫై కింద నోటిఫై చేశారు. తరువాత వన్యమృగ (రక్షణ) చట్టం- 1972 కింద 06.11.2000న వన్యమృగ అభయారణ్యం గా నోటిఫై చేశారు.
ఉష్ణోగ్రత: వేసవిలో గరిష్టంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ శీతాకాలంలో కనిష్టంగా 9 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: వర్షాకాలం: జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతుపవనాలు) వర్షపాతం 800 మి.మీ.
వన్యమృగసూచి: నాలుగు కొమ్ముల జింకలు
విశిష్టత: అభయారణ్యానికి చేరువనే ఉన్న విశాలమైన పోచారం చెరువు పక్షుల సందర్శకులకు కనువిందు చేస్తుంది.
చేరుకోవటం ఎలా: రోడ్డు మార్గం: హైదరాబాద్‌ నుండి 120 కి.మీ
అత్యంత సమీప విమానాశ్రయం: హైదరాబాద్‌
చరిత్ర: తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న అభయారణ్యాలలో ఇదొకటి. గతంలో హైదరాబాద్‌ నిజాం ఈ ప్రాంతంలో వేటాడేవారు.
ఈ అభయారణ్యం గురించి: చిన్నచిన్న నీటి కుంటలతో మిట్ట పల్లాలతో ఉన్న ఈ కొండ ప్రాంతం నాలుగు కొమ్ముల జింకలకు ప్రసిద్ధి. దేశంలోనే పెద్దవైన నీల్‌గారు జింకలు ఇక్కడున్నాయి.

కవ్వాల్‌ పులుల అభయారణ్యం
జిల్లా: ఆదిలాబాద్‌
విస్తీర్ణం: ముఖ్య ప్రాంతం 892.23 చదరపు కి.మీ.
తటస్థ విస్తీర్ణం: 1123.21 చదరపు కి.మీ.
నోటిఫైడ్‌ తేదీ: మొదట దీనిని 1965లో నెలకొల్పారు. తరువాత 14.07.1999న వన్యమృగ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. తరువాత 10.04.2012 పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు.
ఉష్ణోగ్రత: సగటు వార్షిక ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌; గరిష్టం 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌, కనిష్టం 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: వర్షాకాలం జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతుపవనాలు)- సగటు వర్షపాతం 1040 మి.మీ.
అటవీ వర్గీకరణ: టేకు వృక్షాలతో దక్షిణ ఉష్ణమండల ఆకురాల్చు అడవి.
మృగసూచి: పులి నీల్‌గారు
చేరుకోవటం ఎలా: రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల నుండి 60 కి.మీ, హైదరాబాద్‌ నుంచి280 కి.మీ.
అత్యంత సమీప విమానాశ్రయం: హైదరాబాద్‌
చరిత్ర: ఉత్తర తెలంగాణలో ఇదే అత్యంత ప్రాచీనమైన అభయారణ్యం. ఇది దట్టమైన వృక్ష, జంతుజాలానికి పెట్టింది పేరు. అభయారణ్యం దక్షిణ భాగంలో గోదావరి, కడెం నదుల పదీవాహకం ఉంది.
అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం:
జిల్లాలు: మహబూబ్‌నగర్‌, నల్లగొండ.
విస్తీర్ణం: ప్రధాన ప్రాంతం: 2166.37 చదరపు కి.మీ. తటస్థ ప్రాంతం: 445.02 చదరపు కి.మీ.
నోటిఫైడ్‌ తేదీ: మొదట వన్యమృగ అభయారణ్యంగా 27.06.1978లో నోటిఫై చేసి తరువాత 1983లో పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు.
ఉష్ణోగ్రత: గరిష్టంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌. కనిష్టంగా 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: సగటు వర్షపాతం 900-1000 మి.మీ
అటవీ వర్గీకరణ: పొదలు, వెదుళ్ళు, పచ్చిక బీళ్ళు గల పొడి, తడి మిశ్రమ దక్షిణ ఆకురాల్చు అడవి.
గిరిజన తెగలు: చెంచులు, లంబాడాలు, పశువులపై ఆధారపడిన ప్రాచీన తెగలు ఇక్కడ నివసిస్తారు.
వన్యమృగసూచి: పులి
విశిష్టత: అంతర్జాతీయ పక్షుల అధ్యయన సంస్థ (బర్డ్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌) మార్గదర్శకాల ప్రకారం ఏ1, ఏ2 పరిధిలో ఇది ప్రముఖ పక్షుల కేంద్రం.
చేరుకోవటం ఎలా: హైదరాబాద్‌ నుండి రోడ్డు మార్గంలో 130 కి.మీ.
శివరాం వన్యమృగ అభయారణ్యం
జిల్లాలు: ఆదిలాబాద్‌, కరీంనగర్‌
విస్తీర్ణం: 29.81 చదరపు కి.మీ.
నోటిఫైడ్‌ తేదీ: దీనిని మొదట ఫజిల్‌ చట్టం- 1952 కింద బురదనేలలో నివసించే మొసళ్ళ పరిరక్షణ కోసం నోటిఫై చేశారు. తరువాత మళ్ళీ వన్యమృగ (పరిరక్షణ) చట్టం- 1972 కింద వన్యమృగ అభయారణ్యంగా 20-05- 1978లో నోటిఫై చేశారు.
ఉష్ణోగ్రత: వేసవిలో గరిష్టంగా 46 డిగ్రీల సెంటీగ్రేడ్‌, శీతాకాలంలో కనిష్టంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ.
వర్షపాతం: జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతు పవనాలు) సగటు వర్షపాతం: 900 మి.మీ.
అటవీవర్గం: ఆకులు రాల్చే దక్షిణ ఉష్ణ మండల అడవులు.
గిరిజన వర్గాలు: గోండులు, మన్నెపోడులు, నాయక పోడులు, లంబాడాలు.
వన్యమృగ సూచి: బురదనేల మొసలి.
విశిష్టత: ఈ బురదనేల మొసళ్ళు అభయారణ్యం గోదావరి తీరంలో విస్తరించి ఉంది. ఈ రకం మొసళ్ళు చలి కాచుకోవడానికి, సంతానోత్పత్తికి ఈ వాతావరణం చాలా అనుకూలమైంది.
చేరుకోవటం ఎలా:
హైదరాబాద్‌-రామగుండం-మంథని రోడ్డుపై నుండి 280 కి.మీ. రైలు మార్గం: హైదరాబాద్‌ - రామగుండం లైనుపై హైదరాబాద్‌ నుండి 160 కి.మీ.
ఈ అభయారణ్యం గురించి: ఈ అభయారణ్యం రాష్ట్రం లోని ప్రాచీనమైన రక్షిత ప్రదేశాల్లో ఒకటి. ఇది మంథని- మహదేవ్‌పూర్‌ మార్గంలో గోదావరి ఉత్తర తీరం (ఆదిలాబాద్‌), దక్షిణతీరం (కరీంనగర్‌)లో విస్తరించి ఉంది. ఇక్కడ గోదావరి సజీవ ధార బురదనేల మొసళ్ళు బాగా పెరగటానికి దోహదం చేస్తుంది.
మృగవని జాతీయ పార్కు
జిల్లా: రంగారెడ్డి
విస్తీర్ణం: 3.6 చదరపు కి.మీ.
నోటిఫైడ్‌ తేది: 21.07.1998
ఉష్ణోగ్రత: గరిష్ఠం 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌, కనిష్ఠం 9 డిగ్రీల సెంటీగ్రేడ్‌
వర్షపాతం: జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు (నైరుతి రుతుపవనాలు)
సగటు వర్షపాతం: 750 మి.మీ నుండి 1100 మి.మీ వరకు
వన్యమృగ సూచి: ఎర్రజింక, మచ్చల జింక, ఆడ నెమళ్ళు, అడవి పిల్లి, ఉడుము.
విశిష్టత: ఇక్కడి వృక్ష, పుష్ప జాతులు, దక్కన్‌ పీఠభూములకు ప్రాతనిధ్యం వహించే మనోహరమైన శిలాకృతులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
చేరుకోవటం ఎలా: హైదరాబాద్‌-చేవెళ్ళ రోడ్డుపై హైదరాబాద్‌ నుండి 17 కి.మీ.
చరిత్ర: అటవీశాఖ 1955లో ఈ భూమిని నిజాం వద్ద కొనుగోలు చేసి, తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. ఈ ప్రాంతం దట్టమైన పచ్చిక భూములని గత చరిత్ర తెలుపుతుంది.
ఈ జాతీయ పార్కు గురించి: హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ల మధ్యనున్న ఈ పచ్చని ప్రాంతం అందం వర్ణించటానికి మాటలు చాలవు. భూమి కొంతమేర చదునుగా, మరికొంత మేర మిట్టపల్లాలతో, గుట్టలతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు
జిల్లా: హైదరాబాద్‌
విస్తీర్ణం: 1.425 చదరపు కిలోమీటర్లు
నోటిఫైడ్‌ తేదీ: జూబ్లీహిల్స్‌ అడవిలో 142.50 హెక్టార్ల భూమిని సెక్షన్‌-24 అటవీచట్టం- 1967 కింద 1994లో రక్షిత వనంగా నోటిఫై చేశారు. తరువాత 3.12. 1998న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయపార్కుగా ప్రకటించారు.
ఉష్ణోగ్రత: గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌.
వర్షపాతం: వర్షాకాలం జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు సగటు వర్షపాతం: 750 మి.మీ.
అడవి వర్గీకరణ: అక్కడక్కడ చెట్టు చేమ, పచ్చిక భూమి గల దక్షిణాది పొడి, ఆకురాల్చు అడవి.
వన్యమృగ సూచి: నెమలి, ఉడుము.
విశిష్టత: విభిన్న ఫలపుష్ప జాతులతో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మిగిలిన చివరి అటవీ జీవావరణ అటవీ వ్యవస్థ.
చేరుకోవటం ఎలా: దేశంలోని అన్ని ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు రోడ్డు/రైలు/విమానమార్గం.
చరిత్ర: కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుకు అద్భుత మైన చరిత్ర ఉంది. గరిష్ట భూ పరిమితి చట్టం కింద మిగులు భూమి ప్రభుత్వ ఆధీనంలోకి రావటంతో ఆ భూమిని 1992లో అటవీశాఖకు బదలాయించింది. ఈ విధంగా కెబిఆర్‌ పార్కుకు జాతీయ పార్కు హోదా లభించింది.
ఈ జాతీయపార్కు గురించి: హైదరాబాద్‌ మధ్యన జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ జాతీయపార్కు నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించే ఊపిరితిత్తి వంటిది. ఈ పార్కు అనేక జంతు, వృక్ష జాతులకు నెలవు. ఈ పార్కులోని చెరువు ఎండిపోకుండా ఏడాది పొడవునా చెట్లకు, జంతువులకు నీటిని అందిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section