Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ సంక్షేమ పథకాలు(Welfare Schemes in Telangana)

 తెలంగాణ సంక్షేమ పథకాలు(Welfare Schemes in Telangana)

దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిపథంలో అన్ని రాష్ర్టాలకంటే వేగంగా దూసుకుపోతున్నది. పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని వివక్ష కారణంగా అభివృద్ధిలో ఏర్పడిన స్తబ్దతను తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక కొత్త పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఈ పథకాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున నిపుణ పాఠకులకు ప్రత్యేకం..


అమృతధార

రాష్ట్రంలో తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో శాశ్వత పరిష్కారం చూపడమే ఈ పథ కం ముఖ్య ఉద్దేశం. తొలి ఏడాది రూ. 502 కోట్ల వ్యయం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వ్యయాన్ని చేయనున్నాయి. నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం నగర పాలక సంస్థలు, వరంగల్, హైదరాబాద్ మహానగరపాలక సంస్థల పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడెం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈ పథకం ద్వారా తొలి దశ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రతి వ్యక్తికి సగటున 135 లీటర్ల నీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఆసరా

వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం పింఛన్ పథకం ఆసరాను ప్రవేశపెట్టింది. దీన్ని 2014, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆసరా లబ్ధిదారులుగా గుర్తించాలని ప్రభుత్వం జీవో 22ను జారీచేసింది. ప్రతి నెల వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికులకు, హెచ్‌ఐవీ రోగులకు రూ. 1000 అందజేస్తారు.


కల్యాణలక్ష్మి

ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో 2015, అక్టోబర్ 2న ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేద యువతుల వివాహం కోసం రూ. 51 వేలు అందజేస్తారు. దీనికోసం ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో రూ. 330 కోట్లు కేటాయిస్తే 2016-17 బడ్జెట్‌లో రూ. 738 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద లబ్ధిపొందే ఎస్సీ లబ్ధిదారుల ఏడాది ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. వెనుకబడిన తరగతుల వర్గాలకు కూడా 2016 నుంచి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.


షాదీ ముబారక్

మైనారిటీలకు చెందిన నిరుపేద యువతుల వివాహం కోసం 2015 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు. మైనారిటీ యువతుల వివాహం కోసం రూ. 51 వేలు అందిస్తారు. దీనికి ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో రూ. 100 కోట్లు, 2016-17 బడ్జెట్‌లో రూ. 150 కోట్లు కేటాయించారు. ఏడాది ఆదాయం రూ. 2 లక్షలకు మించని కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తారు.


ఆహార భద్రత

పేదరికం దిగువన ఉన్న కుటుంబాల కోసం 2015 జనవరి 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆహార భద్రత కార్డులకు అర్హులుగా 87.57 లక్షల కుటుంబాలను గుర్తించింది. ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి కేజీకి రూపాయి చొప్పున 6 కేజీలు అందజేస్తారు. గతంలో ప్రతి మనిషికి నాలుగు కేజీల చొప్పున ప్రతి కుటుంబానికి గరిష్టంగా 20 కిలోలు ఇచ్చేవారు. ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల చొప్పున అందజేస్తున్నారు. అంత్యోదయ పథకం కింద ఎంపికైన కుటుంబాలకు కిలో బియ్యం రూపాయికే 35 కేజీలు అందజేస్తారు. ఆహార భద్రత కార్డును పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల ఆదాయం ఉన్నవారు అర్హులు. భూపరిమితిని మాగాణిని 3.5 ఎకరాలు, మెట్ట భూమిని 7.5 ఎకరాలుగల కుటుంబాలను ఆహారభద్రత కార్డులు పొందడానికి అర్హులుగా గుర్తించారు.


ఫాస్ట్ పథకం

ఫాస్ట్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. ఈ పథకం కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందజేయడంతో పాటు విద్యార్థుల బోధ నా రుసుం, ఉపకారవేతనాలకు సంబంధించింది. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ. 2,734.95 కోట్లు కేటాయించారు.


సుభోజనం పథకం

రైతులకు రూ. 5లకే భోజనం అందజేసే ఈ పథకాన్ని హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని బీఆర్ అంబేద్కర్ భవన్‌లో సద్దిమూట పేరుతో 2014, జూలై 24న రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. తరువాత ఈ పథకాన్ని 2015 అక్టోబర్ 13న సుభోజనంగా మార్చారు.


ఉచిత వైఫై

ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలందించి రాష్ర్టాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చేందుకు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో 2015, ఏప్రిల్ 16న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వైఫై ద్వారా కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.


భోజనామృతం

రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రుల్లో మాతాశిశు సంరక్షకులకు భోజన సౌకర్యం కల్పించేందుకు ఈ పథకాన్ని మంత్రి హరీష్‌రావు 2015 అక్టోబర్ 13న మెదక్ జిల్లా సిద్దిపేటలో ప్రారంభించారు.


హాస్టళ్లకు సన్నబియ్యం

ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకొంటున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం 2015, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.


అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రంలో 10 జిల్లాల్లోని 462 మంది కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలో 164, వరంగల్‌లో 93, మెదక్‌లో 52, నల్లగొండలో 48, నిజామాబాద్‌లో 31, ఆదిలాబాద్‌లో 26, రంగారెడ్డిలో 18, మహబూబ్‌నగర్‌లో 17, హైదరాబాద్‌లో 11, ఖమ్మంలో 2 కుటుంబాలను గుర్తించింది. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించింది.


లైఫ్ పథకం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ కూలీల కుటుంబాల యువతకు సుస్థిర ఉపాధి కల్పన కోసం లైఫ్ (లైవ్లీహుడ్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్‌మెంట్) పథకానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీలో భాగంగా ఇది అమలుకానున్నది. ఉపాధి పథకం పనిదినాలపై ఆధారపడి నాలుగేండ్లలో ప్రతి ఏటా 100 రోజుల పనిదినాలు పూర్తిచేసుకున్న కుటుంబాలకు చెందిన 18-35 ఏండ్ల యువతీయువకులకు సుస్థిర ఉపాధి కల్పనకోసం ఈ ప్రాజెక్టును రూపొందించారు.


పల్లెప్రగతి

రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం ఈ కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో మంత్రి కేటీఆర్ 2015, ఆగస్టు 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంక్ రూ. 450 కోట్లు ఆర్థిక సాయం అందిస్తుండగా రాష్ట్రప్రభుత్వం తరఫున రూ. 192 కోట్లు (మొత్తంగా రూ. 642 కోట్లు) వెచ్చించనున్నారు. తొలి విడతగా రాష్ట్రంలోని వెనుకబడిన మండలాలను ఎంపికచేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పేదవర్గాలకు జీవనోపాధి కల్పించడం, సామాజిక హక్కులను కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం వంటి కార్యక్రమాలను చేపడతారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పర్యవేక్షణలో పనిచేస్తుంది.


లక్ష్యాలు

-ఎంపికచేసిన మండలాల్లో 2.5 లక్షల మంది పేద వ్యవసాయదారుల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడం

-2.5 లక్షల కుటుంబాలకు సరైన ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత అంశాల్లో మానవ వనరుల అభివృద్ధి

-5 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించడం

-ఆసరా, ఉపాధిహామీ వంటి పథకాల్లో లబ్ధిదారుల నమోదు, నగదు చెల్లింపుల ద్వారా సామాజిక భద్రత హక్కు కల్పించడం


ఆరోగ్యలక్ష్మి

గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో 2015, జనవరి 1 నుంచి అంగన్‌వాడీకేంద్రాల్లో అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ ఒకపూట భోజనాన్ని సమకూర్చుతారు. రాష్ట్రంలో 31,897 అంగన్‌వాడీలు, 4,076 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 5,90,414 గర్భిణులు, బాలింతలకు లబ్ధిచేకూరుతుంది. మూడేండ్లలోపు పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు గోధుమలు, పాలపొడి, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా మొదటి తేదీన అందజేస్తారు. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిరోజూ పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు గర్భిణులు, బాలింతలకు మూడు కిలోల బియ్యం నెలరోజులపాటు గుడ్లను, గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ ఒకపూట సంపూర్ణ భోజనం 200 మి.మీ. పాలు అందిస్తారు. గతంలో ఈ పథకం పేరు ఇందిరమ్మ అమృతహస్తం.


షీక్యాబ్స్

మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం షీక్యాబ్స్ పేరుతో 2015, సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రతి టాక్సీకి 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూరస్తుంది.


భూమి కొనుగోలు పథకం

నిరుపేద దళిత కుటుంబాల ప్రయోజనం నిమిత్తం భూమి కొనుగోలు పథకం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద తొలి దశలో భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ కుటుంబాలకు మూడెకరాల భూమిని సమకూరుస్తారు. తరువాత దశల్లో అర ఎకరం, ఎకరం, రెండెకరాల భూమిగల దళిత వ్యవసాయ కుటుంబాలకు మిగిలిన పరిమాణం భూమి ఇచ్చి ఆదుకుంటుంది. భూమి అభివృద్ధికి, నాట్లను సిద్ధం చేయడానికి వ్యవసాయ అవసరాలను సమకూర్చుకోవడానికి నిధులు సమకూర్చుకోవడంతోపాటు ఏడాదిలో ఒక పంటకు సేద్యపు నీటి సదుపాయాలు, బిందు సేద్య సదుపాయాలు, విత్తనాలు, సేద్యపు ఖర్చు, ఎరువులు, పురుగుల మందులు, దున్నే ఖర్చు, సూక్ష్మ సేద్య విధానాలు, పంపుసెట్లకు విద్యుత్ సరఫరా మొదలైన అవసరాలను తీర్చడానికి సమగ్ర ప్యాకేజీని అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఎకరం రూ. 2 లక్షల నుంచి 7 లక్షల వరకు ధరను చెల్లించడానికి కలెక్టర్లకు ప్రభుత్వం అధికారం కల్పించింది. 2015, జనవరి 29 నాటికి 525 మంది లబ్దిదారులకు 1,132 ఎకరాల ప్రైవేట్ భూమిని 270 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం రూ. 100 కోట్లు కేటాయించారు.


డిజిటల్ లిటరసీ

ప్రజలందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందించి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో డిజిటల్ లిటరసీని రూపొందించింది. నాస్కామ్ సహకారంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ డిజిథాన్ పేరుతో డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి 2015, ఆగస్టు 27న ప్రారంభించారు. ఈ-మెయిల్‌ను ఉపయోగించడం ఆన్‌లైన్లో బిల్లుల చెల్లింపులు, సోషల్ మీడియాను, ఎంమ్మెస్ ఆఫీస్‌ను ఉపయోగించడం మొదలైన వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.


టీ-హబ్

దీనిని 2015, నవంబర్ 5న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో రూ. 40 కోట్లతో నిర్మించిన టీ-హబ్ భవనాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రతన్ టాటా దేశంలో అతిపెద్ద ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించారు. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మింతమైన తొలి ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్. దీని నినాదం ఆలోచనలతో రండి-ఆవిష్కరణలతో వెళ్లండి. టీ-హబ్ ఉండే ప్రాంతాన్ని క్యాటలిస్ట్ అంటారు.


స్వచ్ఛ హైదరాబాద్

ఈ పథకాన్ని 2015, మే 16న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రారంభించారు.


తెలంగాణ రాష్ట్ర నైపుణ్య మిషన్

-2015, జూలై 21న రాష్ట్ర ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది.


టీఎస్ ఐపాస్

తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను 2015, జూన్ 12న సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. సౌర విద్యుత్ విధానం, టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనుమతులను వేగవంతం చేయడం, దళితులకు, మహిళలకు, గిరిజన పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివిధ పన్నుల రాయితీలు ఈ పారిశ్రామిక విధానంలో ఉన్నాయి.


ఈ-పంచాయతీ ప్రాజెక్ట్

రాష్ట్రంలో ఈ-పంచాయతీ ప్రాజెక్టును నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్‌లో ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. జనన, మరణ ధ్రువ పత్రాలు, పింఛన్లు, పహాణీలు, కరెంటు బిల్లుల చెల్లింపు వంటి పౌర సేవలను ఈ-పంచాయతీలు అందిస్తాయి. దశల వారీగా రాష్ట్రంలోని 8,770 గ్రామ పంచాయతీలకు ఈ సేవలను విస్తరిస్తారు.


డబుల్ బెడ్ రూమ్ స్కీం

-ఈ పథకాన్ని 2015, అక్టోబర్ 22న డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని సూర్యాపేటలోని గొల్లబజార్‌లో, మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఇండ్లను నిర్మించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున కేటాయిస్తారు. గ్రామాల్లో ఒక్కొక్క ఇంటికి రూ. 5.4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 5.30 లక్షలు కేటాయిస్తారు. ఒక్కో ఇంట్లో రెండు గదులు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.


గ్రామజ్యోతి పథకం

2015, జూలై 26న ప్రకటించిన ఈ పథకాన్ని 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లెలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనికింద గ్రామీణప్రాంత అభివృద్ధికి వచ్చే పదేండ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. జనాభా ప్రాతిపదికపై ప్రతి గ్రామానికి 2 నుంచి 6 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ఏడు గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి. అవి.. 1) పారిశుద్ధ్యం 2) ఆరోగ్యం-పౌష్టికాహారం 3) విద్య 4) సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన 5) సహజన వనరుల నిర్వహణ 6) వ్యవసాయం. ప్రతి కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వార్డు సభ్యుల్లో ఒకరు స్వయం సహాయక సంఘ లీడర్, గ్రామపంచాయతీ పరిధిలోని సామాజిక కార్యకర్త లేదా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి, సంబంధితరంగాల్లో అనుభవం ఉండి పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు. వీరిలో ఒకరు కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీకి గ్రామపంచాయతీ/మండలస్థాయి అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ పథకానికి రాష్ర్టానికి వచ్చే ఐదేండ్లలో వచ్చే 14వ ఆర్థికసంఘం నిధులు రూ. 2376 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రప్రభుత్వ ఆదాయం, గ్రాంట్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

-గ్రామీణ జిల్లాలు-9, మొత్తం గ్రామ పంచాయతీలు-8,685, వార్డులు- 87,838, మండలాలు-438, ఎంపీటీసీలు- 6441, ఎస్సీలు- 42,12,900, గ్రామీణ జనాభా- 2,26,88,576, ఎస్టీలు-29,01,266


హరితహారం

రాష్ట్రంలోని పచ్చదనాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం చిలుకూరులో మొక్కలు నాటి ప్రారంభించారు. రాష్ట్ర భూభాగంలో ప్రస్తుతం 24 శాతం మాత్రమే అడవుల కింద ఉన్నది. దీన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడత హరితహారాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సీఎం 2016, జూలై 11న ప్రారంభించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కల ఒకేరోజు 163 కి.మీ. పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నియోజకవర్గాలు, 10 మండలాలు, 50 గ్రామాల్లో కొనసాగించారు. వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకొంది. ప్రతి ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.


మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ)

పల్లెల్లోని చెరువులను బాగుచేసేందుకు మన ఊరు-మన చెరువు పథకాన్ని సీఎం 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ గ్రామంలోని పాత చెరువులో ప్రారంభించారు. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ. 1,783 కోట్లు కేటాయించారు. కాకతీయులకాలంలో చెరువుల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యతకు తగినట్లుగా మిషన్ కాకతీయ అనే పేరుతో చేపట్టారు. సర్వే ప్రకారం చెరువుల కింద 10.71 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలో 46,447 చెరువులు ఉంటే మొదటిదశలో 9,573 చెరువుల్లో చేపట్టారు. ప్రతి ఏడాది 20 శాతం చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మిషన్ భగీరథ

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథక పైలాన్‌ను 2015, జూన్ 8న నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ సీఎం కేసీర్ ప్రారంభించారు. దీన్నే మిషన్ భగీరథగా పేరుమార్చారు. రూ. 42,000 కోట్ల అంచనా వ్యయం గల ఈ ప్రాజెక్టును మెదక్ జిల్లా కోమటిబండలో ప్రధాని మోదీ 2016, ఆగస్ట్ 7న ప్రారంభించారు. ఇందులో 1.30 లక్షల కి.మీ. పొడవున పైప్‌లైన్‌ను వేసి రాష్ట్ర దాహార్తిని తీర్చడంతో పాటు రోజువారీ అవసరాలకు కూడా మంచినీటిని అందజేస్తారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, తండాలు, ఆదివాసీగూడేలు, శివారు కాలనీల్లో ప్రతి ఇంటికీ పైప్‌లైన్ల నిర్మాణం, నల్లా పెట్టే పని కూడా ప్రభుత్వమే చేపడుతుంది.


లక్ష్యాలు

-రాష్ట్రంలోని 25 వేల నివాస ప్రాంతాలకు నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడం

-2018 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి

-2016 ఆగస్టులో మొదటి దశ ప్రారంభం

-2016 డిసెంబర్ నాటికి 6 వేల గ్రామాలకు మంచినీరు

-2017 డిసెంబర్ నాటికి 90 % గ్రామాలకు మంచినీరు

-గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రోజూ 100 లీటర్ల మంచినీరు అందివ్వడం

-మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ప్రతి ఇంటికి రోజూ 135 లీటర్ల మంచినీరు అందివ్వడం

-మున్సిపల్ కార్పొరేషన్లలో రోజూ ప్రతి ఇంటికి 150 లీటర్ల మంచినీరు అందాలి

-మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు ప్రాజెక్టుల్లోని 10 శాతం నీరు సరఫరా చేయాలి.

-ప్రతి నీటిపారుదల ప్రాజెక్టులోని రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు వాడుకోవాలి.


మిషన్ భగీరథ స్వరూపం

-సెగ్మెంట్లు- 26

-ఇన్‌టేక్ వెల్స్- 19

-వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్లు- 56

-రిజర్వాయర్లు- 18,160

-ప్రధాన పైప్‌లైన్- 5,225 కి.మీ.

-సెకండరీ పైప్‌లైన్- 45,500 కి.మీ.

-పంపిణీ నెట్‌వర్క్- 75,000 కి.మీ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section