ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం | Andhra Pradesh Primary Education Programme(APPEP)
ఈ పథకం కేంద్రప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఓవర్ సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ODA) వారి ఆర్థిక, విద్యావిషయక సహకారంతో ప్రారంభమైంది.
1984-87లో మొదటిదశగా, 1989-95లో రెండవదశగా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందరు ఉపాధ్యాయులకు వర్తింపజేయబడింది.
ఈ పథకం ఆశయాలు :-
- మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం.
- అభివృద్ధిపరిచిన నమూనాలలో పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టడం.
- ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల మెరుగుదలకు తోడ్పడడం.
- సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల సాధించుట ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం.
- నోట్ : ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది.
నోట్ : ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు ఈ పథకం ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. అవి కృత్యాధార బోధనను (Activity Based Teaching) ను సులభతరం చేసాయి. అవి:
1) అభ్యసన కృత్యాలు కల్పించడం.
2) అనుభవాల ద్వారా అభ్యసనం చేయడం.
3) వ్యక్తిగత, జట్టు, మొత్తం తరగతి పనిని అభివృద్ధి పరచడం.
4) వైయక్తిక బేధాలకు అవకాశం కల్పించడం.
5) స్థానిక పరిసరాలను,వనరులను వినియోగించడం.
6) విద్యార్థుల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడం.
ఈ ఆరుసూత్రాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిల్లో మండల స్థాయిలో, ఉపాధ్యాయ కేంద్రాల స్థాయిలో ఉపాధ్యాయులకు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రాథమిక పాఠశాలలో జరిగే బోధనను సమర్థం చేసే ప్రయత్నం జరిగింది.
ఈ కార్యక్రమం ఉపాధ్యాయుని సాధికరతలో చేసిన కృషి :
- కృత్యాధార బోధనకు అవసరమైన బోధన వ్యూహాలు, బోధన సామాగ్రి, మూల్యాంకన సాధ నాలు ఉపాధ్యాయునికి అందుబాటులోకి వచ్చాయి.
- అదనపు తరగతుల నిర్మాణం బోధనకు అనుకూలమైన పరిసరాలను ఏర్పరిచింది. .
- ఉపాధ్యాయ కేంద్రాలు వృత్యాంతర శిక్షణలో భాగంగా శిశుకేంద్రీకృత విద్యాబోధనపై ఉపాధ్యాయుల అవగాహనను పెంపొందించాయి.
- ఉపాధ్యాయ కేంద్రంలో నెలకొసారి ఉపాధ్యాయులు సమావేశమై వారి వృత్తి సామర్థ్యాల మెరుగుదలకు పరస్పర చర్చలకు ప్రయత్నించారు.
- నోట్ : ఉపాధ్యాయునికి శిశుకేంద్రీకృత బోధన, కృత్యాధార బోధన (Activity Based Teaching) పట్ల అవగాహనను APPEP కల్పించింది.