అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ జూలై 11న చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది.
‘‘వర్జిన్ స్పేస్ మిషన్’’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి భూమిపైకి తిరిగి వచ్చారు.
యాత్ర జరిగిన తీరు ఇలా...
యాత్ర జరిగిన తీరు ఇలా...
- వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్‌షిప్ ‘వీఎస్‌ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్... అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి జూలై 11న ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
- 13 కిలోమీటర్లు ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్‌ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది.
- –ఆరుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్(యూనిటీ–22) భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది.(నాసా ప్రమాణాల ప్రకారం 80 కిలోమీటర్ల ఎత్తు దాటితే అంతరిక్షంలోకి వెళ్లినట్లే)
- యూనిటీ–22లోని ఆరుగురు కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు.
- అనంతరం స్పేస్‌షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది.
- మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది.
యాత్రలో పాల్గొన్న ఆరుగురు వీరు:
- వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్‌సన్
- భారతీయ మూలాలున్న తెలుగు వనిత... శిరీష బండ్ల
- ముఖ్య పైలట్ డేవ్ మెక్‌కే
- పైలట్ మైఖేల్ మాసుకీ
- లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కాలిన్ బెన్నెట్
- చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్
యాత్రలకు శ్రీకారం చుట్టాలని..
2022 ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్‌ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది.
ఒక్కొక్కరు రూ.1.86 కోట్లు..
బ్రాన్‌సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకున్నారు. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని 2022 ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
బెజోస్ కంటే ముందే..
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన జూలై 20న సొంత రాకెట్ షిప్‌లో రోదసి యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్‌సన్‌ను ఈ అంతరిక్ష యాత్రకు పురికొల్పినట్లు సమాచారం.
బ్రాన్‌సన్ రికార్డులు..
సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా బ్రాన్‌సన్ చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.
మన శిరీష రికార్డు..
- ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా(తొలి తెలుగు మహిళగా కూడా) రికార్డు సృష్టించారు.
- గతంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు.
- శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు.
- హ్యూస్టన్‌లో పెరిగిన శిరీష.. ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు.
- 2015లో వర్జిన్ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు.
- మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో నిష్ణాతురాలైన శిరీష... ప్రస్తుతం వర్జిన్ గలాక్టిక్ కంపెనీ గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
- తాజా యాత్రలో భాగంగా... స్పేస్‌షిప్‌లో ఆమె రిసెర్చర్ ఎక్స్‌పీరియన్స్ బాధ్యతలు నిర్వహించారు.