ఔషధాలు - రకాలు(Types of Drugs)
వ్యాధులను గుర్తించడానికి, నిరోధించడానికి, నయం చేయడానికి ఉపయోగపడే పదార్థాలే మందులు/ ఔషధాలు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు, లిపిడ్‌లు, ప్రొటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలలాంటి జీవాణువులతో ఔషధాలు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే మందుల లక్ష్యాలు (Drug Targets) అంటారు. మందులు జరిపే చికిత్సల ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. అవి..సూక్ష్మజీవ నిరోధకాలు (Antimicrobials)
మానవులు, జంతువుల్లో బ్యాక్టీరియా, వైరస్, బూజు (ఫంగై) లాంటి పరాన్న జీవులు కలగజేసే వ్యాధులను నయం చేసేవే సూక్ష్మజీవ నిరోధకాలు. వీటిలో యాంటీబయోటిక్‌లు, యాంటీ సెప్టిక్‌లు, సంక్రమణ నిరోధకాలు ప్రధానమైనవి.
యాంటీబయోటిక్‌లు
- మానవులు, జంతువుల శరీరాలకు హాని కలిగించకుండా కేవలం వాటిని ఆశ్రయించిన సూక్ష్మజీవుల జీవరసాయన చర్యలను అడ్డుకుని వాటి పెరుగుదలను ఆపడమో (Bacteriostatic) లేదా పూర్తిగా నశింపజేయడమో (Bactericidal) చేసేవే యాంటీబయోటిక్‌లు. ఇవి పూర్తిగా కృత్రిమ లేదా అర్ధ కృత్రిమ రసాయనిక పదార్థాలై ఉంటాయి.
- 19వ శతాబ్ది ప్రారంభంలో సిఫిలిస్ అనే సుఖవ్యాధి చికిత్సకు పాల్ ఏర్‌లిచ్ (Paul Ehrlich) అనే శాస్త్రవేత్త రూపొందించిన సాల్వర్సన్ అనే స్వల్ప విషస్వభావం గల ఆర్సెనిక్ మూలక ఆధారిత ‘ఆర్‌సఫినామీన్’తో యాంటీబయోటిక్‌ల శకం ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణకు 1908లో నోబెల్ బహుమతి లభించింది.
- 1932 లో ‘ప్రాంటోసిల్’ అనే ఎజో రంజన పదార్థ ఆవిష్కరణ జరిగింది. దీనిలో నిజమైన క్రియాశీల పదార్థం సల్ఫానిలమైడ్.
- అయితే యాంటీబయోటిక్‌ల చరిత్రను తిరగరాసింది మాత్రం ‘పెన్సిలియం నొటేటం’ అనే శిలీంధ్రం (బూజు) నుంచి అలెగ్జాండర్ ప్లెమింగ్ సంగ్రహించిన ‘పెన్సిలిన్’ అనే యాంటీబయోటిక్.
- సూక్ష్మ జీవులను చంపేయాంటీబయోటిక్‌లకు ఉదాహరణ పెన్సిలిన్, ఓఫ్లోక్సాసిన్.
- సూక్ష్మజీవులను నిరోధించే యాంటీబయోటిక్‌లు ఎరిత్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికాల్
- పెనిసినిలిన్ - ఎ వంటి ఒకే ఒక జీవి లేదా వ్యాధిపై ప్రభావం చూపే వాటిని అల్ప క్రియాత్మక విస్తృతి యాంటీ బయోటిక్‌లు అంటారు.
- పెన్సిలిన్ రూపాంతరాలైన ఏంపిసిలిన్, ఏమాక్సీసిలిన్‌లతో పాటు క్లోరాంఫెనికాల్, ఆఫ్లోక్సాసిన్, సెఫ్‌ఫొడాక్సిమ్ వంటివి అధిక క్రియాత్మక విస్తృతి (Broad Spectrum) యాంటీబయోటిక్‌లు.
- క్లోరాంఫెనికాల్ ప్రధానంగా టైఫాయిడ్, రక్త విరేచనాలు, మూత్ర నాళ సంబంధ వ్యాధులు, నిమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడుతుంది.
యాంటీసెప్టిక్‌లు
- గాయాలు, అల్సర్లకు గురైన శరీర భాగాలు, రోగానికి గురైన చర్మం ఉపరితల భాగాలు కుళ్లకుండా చేసేవి చీము నిరోధకాలు (యాంటీసెప్టిక్‌లు).
- ఆల్కహాల్, అయోసీన్ - పిపోడిన్, తేనె, ఉప్పు, బేకింగ్ సోడా, సోఫ్రామైసిన్, అయోడిన్, అయోడోఫాం, టింక్చర్ అయోడిన్ (ఆల్కహాల్ - నీరు మిశ్రమంలో కరిగించిన 2-3% ఆయోడిన్ ద్రావణం), డెటాల్ (క్లోరోహెక్జీనోల్, టెర్పినియోల్‌ల మిశ్రమం), బోరికామ్ల విలీన ద్రావణం (కంటికి పూసే యాంటీసెప్టిక్), హైడ్రోజన్ పెరాక్సైడ్‌లకు యాంటీసెప్టిక్ ధర్మం ఉంటుంది. పీనాల్ తక్కువ గాఢత (0.2%)లో యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తే, ఎక్కువ గాఢత (1%)లో క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
- బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ జల ద్రావణం, సల్ఫర్ డయాక్సైడ్ జల ద్రావణం క్రిమిసంహారిణులుగా పనిచేస్తాయి.
- గాయాలను శుభ్రపరచడానికి పెర్‌హైడ్రాల్ (హైడ్రోజన్ పెరాక్సైడ్ విలీన ద్రావణంను) ఉపయోగిస్తారు.
ఆమ్ల విరోధులు
ఉదరంలో ఉత్పత్తి అయ్యే ‘హైడ్రో క్లోరికామ్లం’, ఆహారం జీర్ణమవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని pH విలువ 1-3 వరకు ఉంటుంది. ఆమ్ల ఉత్పత్తి అధికంగా జరిగితే ‘మంట’ (Irritation)గా అనిపిస్తుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే జీర్ణాశయంలో పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి. తీవ్రత పెరిగితే చివరకు క్యాన్సర్‌కు కూడా దారితీయొచ్చు.
ఒకప్పుడు ఆమ్ల విరోధులుగా బేకింగ్ సోడా (సోడియం బైకార్బొనేట్), అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌లను విరివిగా ఉపయోగించేవారు. సోడియం బైకార్బొనేట్‌ను అధికంగా వాడితే జీర్ణాశయం క్షారత్వాన్ని సంతరించుకోవడం వల్ల ఇంకా ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దీని వాడకం తగ్గించారు. అయితే ఈ పదార్థాలు ఉత్పత్తి అయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయిగానీ ఆమ్ల ఉత్పత్తిని నియంత్రించవు.
సిమెటిడీన్, రానిటిడీన్, ఒమిప్రజోల్ వంటి మందులు అధిక ఆమ్ల ఉత్పత్తిని అడ్డుకొని ఆమ్ల విరోధులుగా పనిచేస్తాయి.
ఎనాల్జెసిక్‌లు
స్పృహ తప్పకుండా, మానసికాందోళనలకు గురిచేయకుండా బాధలను అణచివేసే ఔషధాలను నొప్పి నిరోధకాలు (Analgesics) అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలు...
1) దురలవాట్లకు లోను చేయని (NonAddictive) ఎనాల్జెసిక్‌లు. వీటినే Non-Narcoticఎనాల్జెసిక్‌లు అంటారు. ఆస్పిరిన్ (ఎసిటైల్ శాలిసిలికామ్లం), పారాసెటమాల్ (పారా ఎసిటమైనో ఫినాల్) అనేవి ప్రధాన ఎనాల్జెసిక్‌లు. ఇవి జ్వరాన్ని తగ్గించి Antipyretics గా కూడా పనిచేస్తాయి.
రక్తం గడ్డ కట్టకుండా చూసే గుణం ఉండటం వల్ల ఆస్పిరిన్‌ను గుండెపోటు నివారణకు కూడా ఉపయోగిస్తారు.
2) ఇవి నార్కోటిక్ వర్గానికి చెందిన ఎన్నాల్జెసిక్‌లు. అధిక శారీరక బాధ ఉన్నప్పుడు సాధారణ ఎనాల్జెసిక్‌లు ప్రభావశీలంగా ఉండవు. అందుకే శస్త్రచికిత్సానంతరం, క్యాన్సర్ అవసాన దశలో ఉండే రోగికి, ప్రసవానంతర నొప్పులను తగ్గించడానికి ‘ఓపియమ్ పాపీ’ (నల్ల మందు) నుంచి సంగ్రహించిన మార్ఫిన్ వర్గపు నార్కోటిక్‌లను (మార్ఫీన్, హెరాయిన్, కొకైన్) వాడతారు. అయితే ఈ ఔషధాలను నిర్ణీత పరిమాణాల్లో కాకుండా అధిక మోతాదులో ఎక్కువ రోజులు వాడితే ’Addict' అవుతారు. దీని వల్ల మైకం, అపస్మారక స్థితి, మూర్ఛ, చివరగా మరణానికి దారి తీయొచ్చు. వీటినే మాదక ద్రవ్యాలు అని కూడా అంటారు.
- మార్ఫీన్‌ను ‘ఎసిటైలేషన్’ చేసి హెరాయిన్‌ను తయారు చేస్తారు. బ్రౌన్ షుగర్‌లో ఇది ప్రధాన సమ్మేళనం.
- సాధారణంగా ఇవి నైట్రోజన్ ఆధారిత ‘ఆల్కలాయిడ్’ అనే కుటుంబానికి చెంది ఉంటాయి.
- ఆల్కలాయిడ్ కుటుంబానికి చెందిన నికోటిన్ (సిగరెట్ పొగ నుంచి), కెఫీన్ (టీ, కాఫీల ద్వారా)లకు కూడా ఎనాల్జెసిక్ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగానే పారాసెటమాల్, కెఫీన్ కలిసి ఉన్న టాబ్లెట్లను తలనొప్పికి ఎక్కువగా వాడతారు.
- డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి టాబ్లెట్లు మోతాదుకు మించి, తరచుగా వాడితే గుండె, కాలేయానికి హాని కలిగే ప్రమాదముంది.
- తాత్కాలికంగా ఒక భాగంలో స్పృహ లేకుండా చేయడానికి ‘కొకైన్’ను వాడతారు. కంటి పాపలను పెద్దవి చేయడానికి ఓయలేటర్‌గా ‘అట్రోపిన్’ వంటి ఔషధాలను ఉపయోగిస్తారు.
ట్రాంక్విలైజర్లు
మానసిక ఒత్తిడిని, మనోవ్యాధులను తగ్గించి మానసిక ప్రశాంతతను కలగజేసే మందులే ‘ట్రాంక్విలైజర్లు’. ఇవి నిద్రమాత్రలో ప్రధాన అనుఘటకాలు. డయజీఫామ్ (వేలియం), ఆల్ప్రజోలం, క్లోరోడయజీపాక్సైడ్ వంటి మందులు మనోవ్యాకులతను తగ్గించి నిద్రకు తోడ్పడతాయి.
బార్బిట్యురేట్ వర్గానికి చెందిన బార్బిట్యురికామ్ల ఉత్పన్నాలైన పెంటథాల్, వెరొనాల్, ఎమిటాల్, లుమినాల్, సెకొనాలు అనే మందులు నిద్ర తెప్పించే ‘హిప్నోటిక్‌లు’.
హిస్టమీన్ విరోధులు (Antihistamines)
హిస్టమీన్ అనే రసాయన పదార్థం జీర్ణకోశంలో పెప్సిన్, హైడ్రోక్లోరికామ్లాలు ఏర్పడటాన్ని ఉత్తేజ పరుస్తుంది. రక్తనాళాల విస్తరణకారిగా పనిచేస్తుంది. శ్వాస నాళాలు, పేగుల్లో మృదు కండరాలను సంకోచింపజేస్తుంది. సాధారణ జలుబు, ఎలర్జీల కారణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోవడానికి, అస్తమా లాంటి వ్యాధులకు కూడా హిస్టమీన్ కారణం.
హిస్టమీన్ జరిపే సహజ క్రియలో జోక్యం చేసుకొని మనకు రిలీఫ్ కలిగించే మందులే ‘యాంటీహిస్టమీన్‌లు’
ఉదా: బ్రోమ్‌ఫెనిరమీన్ (డిమోటేన్), ఎమడీన్ (Eyedrops), క్లోరోఫెనిరమీన్, ఆస్టెలీన్ (ముక్కులో చేసుకొనే స్ప్రే).
గర్భ నిరోధక మందులు
వీటిలో ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ ఉత్పన్నాలు కలిసి ఉంటాయి. అండం పక్వం చెంది అండాశయం నుంచి వెలువడకుండా నియంత్రించేది ప్రొజెస్టిరాన్. ఇంకా సంక్లిష్ట ప్రొజెస్టిరాన్ ఉత్నన్నాలైన లెవో నార్జెస్ట్రోల్, నారిథిండ్రోన్, ఇథైనైల్ ఈస్ట్రాడయోల్ (నోవెస్ట్రోల్) అనేవి విస్తారంగా వాడే గర్భనిరోధక మందులు. వీటి వల్ల శారీరక హార్మోన్ల సమతుల్యం దెబ్బతినే ప్రమాదముంది.
ఇతర అంశాలు
మలేరియా వ్యాధి నివారణకు సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించిన క్వినైన్‌తో పాటు, సంశ్లేషిత క్లోరోక్విన్‌లను ఔషధాలుగా వాడుతున్నారు.
HIV/AIDS వ్యాధి ట్రీట్‌మెంట్‌కు జిడోవుడిన్ (ZDV) లేదా అజిడోథైమిడీన్ (AZT) ఉపయోగంలో ఉంది