Type Here to Get Search Results !

Vinays Info

హిమాలయాలు(The Himalayas)

భారత్‌కు ఉత్తర సరిహద్దుగా విస్తరించిన హిమాలయాలు నవీన ముడత పర్వతాలు.. ఇవి టెరిషరీ యుగానికి చెందినవి. దాదాపు 60 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతోద్భవం.. ఆల్ఫైన్, జాగ్రోస్, హిందూకుష్ పర్వతపంక్తుల ఆవిర్భావంతో ముడిపడి ఉంది. యురేషియూ ఖండం భారత ద్వీపకల్పంతో ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతశ్రేణులున్న చోట గతంలో ‘టెథిస్’ సముద్రం ఉండేది.

 హిమాలయ పర్వత శ్రేణులు భారత్, భూటాన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్, చైనాల్లో(ఆరు దేశాలు) వ్యాపించి ఉన్నాయి. హిమాలయ పర్వత పంక్తులు పశ్చిమాన పాక్‌లోని పోట్వార్ తీరం నుంచి తూర్పున మయన్మార్- నాగాలాండ్  సరిహద్దుల  వరకు 5,200 కి.మీ. మేర విస్తరించాయి. ఉత్తరాన టిబెట్ పీఠభూమి, దక్షిణాన గంగ బ్రహ్మపుత్ర మైదానాల మధ్య ఇవి వ్యాపించి ఉన్నాయి.

హిమాలయాలను తూర్పు-పడమరలుగా..

 1) పంజాబ్, కశ్మీర్ హిమాలయాలు 

 2) కుమవున్, గద్వాల్ హిమాలయాలు

 3) నేపాల్ హిమాలయాలు

 4) అరుణాచల్ అసోం హిమాలయాలుగా విభజిస్తారు. ఇవి వరుసగా సింధూ-సట్లేజ్, సట్లేజ్-కాళి, కాళి-తీస్తా, తీస్తా- బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నాయి.


టిబెటన్ హిమాలయాలు

 భారత్‌లో.. కశ్మీర్‌లోని కారకోరం, జస్కర్, లడఖ్ పర్వతశ్రేణులు టిబెటన్ హిమాలయాల కోవకు చెందినవి.  కారకోరం పర్వతాలను ఆసియూ ఖండానికి వెన్నుముకగా పేర్కొంటారు.  టిబెటన్  హిమాలయాల సగటు ఎత్తు 4500 మీటర్లు. ఇందులో 7000 మీటర్ల కంటే  ఎత్తై  పర్వత శిఖరాలు అనేకం ఉన్నాయి. ఉదా: కె2/గాడ్విన్ ఆస్టిన్, నంగపర్భత్, నామ్చాబారుమా. టిబెటన్ హిమాలయాల్లో అనేక హిమనీనదాలు, హిమనీనద సరస్సులున్నాయి. ఉదా: సియూచిన్ (హిమాలయూల్లో పెద్దది), జైఫూ, మానస సరోవరం, రాకాస్‌తాల్.


 గ్రేటర్ హిమాలయాలు

 అన్నిటికంటే ఎత్తైవి మధ్య గ్రేటర్ హిమాలయాలు. వీటి సగటు ఎత్తు 6000 మీటర్లు. ఇవి అవిచ్ఛిన్న పర్వతశ్రేణిగా జమ్మూకశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించాయి. ప్రపంచంలో ఎత్తై పర్వతశిఖరాలైన ఎవరెస్టు, నందాదేవి, గైరీశంకర్, మకాలు, కామెత్ మధ్యగ్రేటర్ హిమాలయాల్లోనే  ఉన్నాయి.  గంగోత్రి, యమునోత్రి, పిండామ్ తదితర హిమనీనదాల జన్మస్థానం కూడా ఇదే. కశ్మీర్‌లోని గ్రేటర్-టిబెటన్ హిమాలయాల మధ్య సన్నని మైదానాలు ఉన్నాయి. ఉదా: దేవసాయి మైదానాలు.


 నిమ్న హిమాలయాలు:

 వీటి సగటు ఎత్తు 2500 మీటర్లు. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూకశ్మీర్‌లో పిర్‌పంజాల్ పర్వతాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో దవులాధార్ పర్వతాలు, ఉత్తరాఖండ్‌లో ముస్సోరి కొండలు, నేపాల్‌లో మహాభారత్, నాగాటిబ్బా పర్వతాలని పిలుస్తారు. ఈ పర్వతశ్రేణి  వేసవి విడిది  కేంద్రాలకు ప్రసిద్ధి. ఉదా: సిమ్లా, కులూ, మనాలి, నైనిటాల్, డార్జిలింగ్. నిమ్న హిమాలయ సానువుల్లో దట్టమైన కోనిఫర్ అడవులున్నాయి.


 శివాలిక్ పర్వతాలు:

 వీటి సగటు ఎత్తు 1000-1500 మీటర్లు మాత్రమే. అందుకే వీటిని ఉప హిమాలయాలుగా పరిగణిస్తారు. ఇతర హిమాలయ పర్వత పంక్తుల శిఖరాలు శంఖాకారంలో ఉంటే.. శివాలిక్ పర్వతాలు కురచగా ఉంటాయి.  వీటిని జమ్మూకశ్మీర్‌లో జమ్మూ కొండలని.. ఉత్తరాఖండ్, నేపాల్‌లో శివాలిక్ కొండలని పిలుస్తారు.  అసొం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇవి అంతగా అభివృద్ధి చెందలేదు. శివాలిక్ పర్వతాలు దట్టమైన సమశీతోష్ణ మండల ఆయనరేఖా ఆకురాల్చే అరణ్యాలకు ప్రసిద్ధి. హిమాలయ నదులు శివాలిక్ పర్వతాలను ఛేదించుకుంటూ.. లోతైన ఇరుకు దారుల ద్వారా ప్రవహిస్తాయి. నిమ్న హిమాలయూలు, శివాలిక్ కొండల మధ్య ఉన్న సరస్సు హరివణాలను ‘డూన్’లని పేర్కొంటారు.  ఉదా: డెహ్రాడూన్.  శివాలిక్ పర్వతాలు, గంగా మైదానం మధ్య గిరిపద  మైదానం ఏర్పడింది. దీన్ని ‘బబ్బర్’, ‘తెరాయిమైదానాలుగా  విభజించారు. బబ్బర్ మైదానం గులకరాళ్లు, ఇసుకతో నిండి ఉంది.  తెరాయి మైదానం చిత్తడి నేలలకు ప్రసిద్ధి. ఈ మైదానంలో దట్టమైన రుతుపవన అరణ్యాలు ఉన్నాయి. జిమ్‌కార్బెట్, రాజాజీ నేషనల్ పార్కులు తెరాయి మైదానంలోనే ఉన్నాయి.


గంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానం

గంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానం 1.5- 2.5 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ మైదానంలో ప్రవహించే అనేక నదులు.. వరద మైదానాలను ఏర్పరచాయి. ఇవి సారవంతమైన ఒండ్రు మట్టిని కలిగి ఉన్నాయి. వీటిని  ‘కద్దర్’, ‘బంగర్’ మైదానాలుగా విభజించారు. కద్దర్ మైదానాలు పల్లపు ప్రాంతాలు. ఇవి తరచుగా వరద ముంపునకు గురవుతుండటంతో.. తాజా ఒండ్రుమట్టి  వచ్చి చేరుతుంది. వరదమైదానాల్లో ఎత్తై ప్రాంతాలు బంగర్‌లు. ఇక్కడ వరద ముంపు అరుదు. దాంతో ఈ ప్రాంతాల్లో పాత ఒండ్రు మట్టే ఉంటుంది. నదీమైదాన ప్రాంతంలో... నదుల మధ్య ఉండే నదీ విభాజక ప్రాంతాలను ‘డోబ్’లని పిలుస్తారు.


బాగార్

పశ్చిమ రాజస్థాన్‌లోని థార్ ఎడారి.. సింధూ మైదాన ప్రాంతానికి చెందినది. ఆరావళి పర్వతాలకు ఆనుకొని ఉన్న ఈ ఎడారి ప్రాంతం పాక్షికంగా శుష్క మండలం. దీన్ని ‘బాగార్’ ప్రాంతంగా పిలుస్తారు.  ఇక్కడ అనేక ఎడారి నదులు, ఉప్పునీటి సరస్సుల్లోకి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సాంబార్, శబర్, దీద్వానా తదితర ఉప్పునీటి సరస్సులున్నాయి. ‘లూనీ’ పెద్ద ఎడారి నది. బాగార్‌కు పశ్చిమంగా.. పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న థార్ ఎడారి ప్రాంతాన్ని  ‘మరుస్థలి’ అంటారు.


ద్వీపకల్ప పీఠభూమి:

భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక విభాగం.. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం. ఇది  చిన్న, పెద్ద పీఠభూములు, కొండలు, నదీలోయలతో నిండి ఉంది. ఉత్తరాన గంగా మైదానం, ఈశాన్యంలో రాజమహల్ కొండలు, వాయవ్య దిశలో ఆరావళి కొండలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన కన్యాకుమారి మధ్య ద్వీపకల్ప పీఠభూమి విస్తరించి ఉంది. ఇది అత్యంత పురాతన ఆర్కియూన్ (కాంబ్రియన్) మహాయుగపు శిలలతో ఏర్పడింది. దక్కన్ పీఠభూమి ప్రాంతం స్థిరమైన శిలావరణం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section