Type Here to Get Search Results !

Vinays Info

మొగల్ యుగం(Mughal Era)

 మొగల్ సామ్రాజ్య స్థాపకుడు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఇతడు ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లో డిని ఓడించి మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.బాబర్ (క్రీ.శ. 1526 - 30)

బాబర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిపై దండెత్తి 1526 ఏప్రిల్ 2న చరిత్రాత్మక ‘పానిపట్టు’ యుద్ధంలో అతడిని ఓడించాడు. 1527లో మేవార్ రాజైన రాణా సంగ్రామ్ సింగ్‌పై దండెత్తి సిక్రీ సమీపంలోని కాణ్వా గ్రామం వద్ద అతడిని ఓడించాడు. దీన్నే ‘కాణ్వా యుద్ధం’ అంటారు. బాబర్ 1529లో గోగ్రా యుద్ధంలో బెంగాల్, బిహార్ ప్రాంతాలను పాలిస్తున్న అఫ్గానులను ఓడించాడు. బాబర్ క్రీ.శ. 1530లో మరణించాడు. ఇతడు టర్కీ భాషలో ‘బాబర్ మోమోర్స్’ (బాబర్ నామా) రాశాడు. ఇది అతడి ఆత్మకథ.

హుమాయూన్ (క్రీ.శ. 1530-40)
ఇతడి అసలు పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. షేర్‌ఖాన్‌తో 1539లో జరిగిన చౌసా, 1540లో జరిగిన కనూజ్ (బిల్‌గ్రామ్) యుద్ధాల్లో హుమాయూన్ ఓడిపోయాడు. హుమాయూన్ అంటే ‘అదృష్టవంతుడు’ అని అర్థం. కానీ చరిత్రకారులు ఇతడిని అత్యంత దురదృష్టవంతుడిగా పేర్కొంటారు.
1555-56లో హుమాయూన్ పర్షియా చక్రవర్తి షాతమస్ సహాయంతో షేర్షాసూర్ వారసుడైన సికందర్ సూర్‌ను ‘సర్‌హింద్’ యుద్ధంలో ఓడించి ఢిల్లీని పునరాక్రమించాడు. చిత్రలేఖనంలో హుమాయూన్ ‘పర్షియా-చైనా-మంగోలియా’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతడు మీర్ సయ్యద్ అలీ, ఖ్వాజా అబ్దుల్ సమద్ అనే చిత్రలేఖకులను పర్షియా నుంచి తీసుకువచ్చాడు. వీరు చిత్రలేఖనంపై ‘దస్తన్ -ఇ-అమీర్ హమ్‌జా’ అనే గ్రంథాన్ని రచించారు.

సూర్ వంశం (క్రీ.శ. 1540-45)
సూర్ వంశాన్ని షేర్షా స్థాపించాడు. ఇతడి అసలు పేరు ఫరీద్. ఇతడు అఫ్గాన్ జాతికి చెందిన సూర్ వంశీయుడు. పులిని చంపడం వల్ల ‘షేర్‌ఖాన్’ అనే బిరుదు పొందాడు. ఇతడు 1540లో హుమాయూన్‌ను ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. ‘షేర్షా’గా పాలన సాగించాడు. ఇతడు భూమిని సర్వే చేయించాడు. భూసారం ఆధారంగా భూమిని మూడు తరగతులుగా విభజించాడు. పండిన పంటలో నాలుగో వంతును భూమి శిస్తుగా వసూలు చేశాడు. రైతులకు ‘భూమి పట్టాలు’ ఇచ్చి రైత్వారీ పద్ధతి అమలు చేశాడు. షేర్షా మొదటిసారిగా జాతీయ రహదారులను నిర్మించాడు. ఇతడు వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టి అక్బర్‌కు మార్గదర్శకుడయ్యాడు. షేర్షా సమాధి సస్రామ్‌లో ఉంది.

అక్బర్ (క్రీ.శ. 1556 - 1605)
మొగల్ చక్రవర్తులందరిలో గొప్పవాడు అక్బర్. ఇతడి సంరక్షకుడు బైరాంఖాన్. ఇతడు చిన్న సైన్యంతో 1556లో పానిపట్టు వద్ద హేమును ఓడించాడు. దీన్నే ‘రెండో పానిపట్టు యుద్ధం’గా పేర్కొంటారు. అక్బర్ 1564లో జిజియా పన్ను రద్దు చేశాడు. 1564లో గోండ్వానా, 1567లో మేవాడ్, 1568లో రణతంబోర్, 1569లో కలంజర్, 1572లో గుజరాత్, 1586లో కశ్మీర్, 1593లో అహ్మద్‌నగర్, 1601లో ఖాందేశ్‌ను జయించాడు. అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రిలో ‘ఇబాదత్ ఖానా’ అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఇతడు 1576లో ‘హల్దీఘాట్’ యుద్ధంలో రాణా ప్రతాప్‌సింగ్‌ను ఓడించాడు.
అక్బర్ 1582లో ‘దిన్-ఇ-ఇలాహి’ మతాన్ని ప్రవేశపెట్టాడు. ఇతడి పాలనా వ్యవస్థలో ఉద్యోగులందరూ సైనికాధికారులుగా వ్యవహరించేవారు. దీన్నే ‘మున్సబ్‌దారీ పద్ధతి’గా పిలుస్తారు. ఇతడు ‘రైత్వారీ’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతడి భూమిశిస్తు విధానం ‘బందోబస్తు’గా ప్రసిద్ధి చెందింది.
అక్బర్ కాలంలో అబుల్ ఫజల్, నిజాముద్దీన్ బదానీ గొప్ప కవులు. అబుల్ ఫజల్ రచించిన ‘ఐనీ అక్బరీ’ నాటి సామ్రాజ్యం గురించి, ‘అక్బర్ నామా’ అక్బర్ చరిత్ర గురించి తెలుపుతుంది. అబుల్ ఫజల్‌కు ‘కవిరాజు’ అనే బిరుదు ఉంది. నిజాముద్దీన్ అహ్మద్ ‘తబకాత్-ఇ-అక్బర్’, బరౌనీ ‘తారీఖుల్ బదౌనీ’ అనే గ్రంథాలు రాశారు. అక్బర్ కాలంలో అబ్దుల్ సమద్ గొప్ప చిత్రకారుడు. ఇతడికి ‘షిరీనకలమ్’ (మధురలేఖిని) అనే బిరుదు ఉంది. అక్బర్ స్వయంగా సంగీత విద్వాంసుడు. ఇతడి ఆస్థానంలో తాన్‌సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసుడు కూడా ఉండేవాడు. అక్బర్ ‘ఫతేపూర్ సిక్రీని నిర్మించాడు. ఇతడిని ప్రష్యా రాజు రెండో ఫ్రెడరిక్, ఇంగ్లండ్ రాణి మొదటి ఎలిజబెత్, పర్షియా పాలకుడు అబ్బాస్‌తో పోల్చవచ్చు.
అక్బర్ రెవెన్యూ విధానం ప్రసిద్ధి చెందింది. ఇతడు భూమిని సర్వే చేయించి పొలాలను పోలజ్, పరౌటీ, చబార్, బంజర్‌గా విభజించాడు. ప్రతి రకం భూమిని దిగుబడి ఆధారంగా ఉత్తమ, మధ్యమ, అథమ అని మూడు రకాలుగా వర్గీకరించాడు. పొలంలో పదేళ్ల దిగుబడిని తేల్చి వాటి సరాసరి నిర్ణయించి అందులో మూడో వంతును శిస్తుగా నిర్ణయించాడు. శిస్తు ధన, ధాన్య రూపాల్లో చెల్లించచ్చు. దీని వసూలులో దళారులు లేరు. రైతులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించేవారు. ప్రభుత్వం రైతులకు పట్టాలిచ్చి వారి నుంచి కబూలియత్ (ఒప్పంద పత్రాలు) తీసుకునేది.

జహంగీర్ (క్రీ.శ. 1605-1627)
ఇతడి అసలు పేరు సలీం నూరుద్దీన్ మహమ్మద్. జహంగీర్ ప్రజలకు న్యాయాన్ని చేయడానికి బంగారు గొలుసు ఉన్న ఒక గంటను అమర్చాడు. ఇతడు 1606లో సిక్కు గురువు అర్జునదేవ్‌ను ఉరి తీయించాడు. జహంగీర్ 1611లో నూర్జహాన్ అనే ఇరాన్ వనితను వివాహం చేసుకున్నాడు. నూర్జహాన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈమె తండ్రి గియాస్ బేగ్, సోదరుడు అసఫ్‌ఖాన్‌కు ఉన్నత ఉద్యోగాలిచ్చారు. 1608లో కెప్టెన్ విలియం హాకిన్‌‌స (ఇంగ్లండ్) జహంగీర్‌ను కలిసి సూరత్ వద్ద కర్మాగారాన్ని నెలకొల్పడానికి అనుమతి పొందాడు.
జహంగీర్ బహుభాషా కోవిదుడు. ‘తుజక్-ఇ-జహంగీరి’ పేరుతో జీవిత చరిత్రను రాశాడు. ఈ గ్రంథంలో చిత్రలేఖనం గురించి వర్ణించాడు. ఇతడి ఆస్థానంలో అబూబ్‌హసన్, ఉస్తాద్ మన్సూర్ అనే ప్రఖ్యాత చిత్రకారులు ఉండేవారు. వీరికి నాదిర్ ఉజ్‌జమాన్ అనే బిరుదు ఉంది. జహంగీర్ 1627లో మరణించాడు. ఇతడి కుమారులు ఖుర్రం, షహ్రియార్, పర్వేజ్.

షాజహాన్ (క్రీ.శ. 1627-1658)
ఇతడి అసలు పేరు ఖుర్రం. ఇతడి భార్య ‘ముంతాజ్’. ఈమె 1631లో మరణించారు. ఈమె స్మృతి చిహ్నంగా ఆగ్రా వద్ద షాజహాన్ నిర్మించిన అద్వితీయ నిర్మాణం ‘తాజ్‌మహల్’. షాజహాన్ 1636లో నిజాం షాహి రాజ్యాన్ని జయించాడు. ఇతడి ఆస్థానంలో గొప్ప పండితుడైన జగన్నాథుడు ‘రసగంగాధర’ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని, గంగానదిని స్తుతిస్తూ ‘గంగా లహరీ’ అనే కావ్యాన్ని రచించాడు. మొగల్ వాస్తుకళకు షాజహాన్ కాలం స్వర్ణయుగం. ఇతడిని ‘వాస్తుకళా ప్రభువు’గా పేర్కొనేవారు. నేటి ‘ఢిల్లీ’ నగర స్థాపకుడు ఇతడే. దీన్ని చాలాకాలంపాటు ‘షాజహానాబాద్’గా వ్యవహరించారు. ఢిల్లీలోని ఎర్రకోట, జామా-ఇ-మసీదు ఇతడి విశిష్ట నిర్మాణాలు. ఎర్రకోటలో దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్ భవనాలు ఉన్నాయి. ఆగ్రా కోట లోపల నిర్మించిన మోతీ మసీదు, జుమా మసీదు ప్రసిద్ధ కట్టడాలు. ‘నెమలి సింహాసనం’ షాజహాన్ నిర్మించిందే. కోహినూర్ వజ్రం కూడా ఇతడి కాలానికి చెందిందే.
షాజహాన్ కుమారులు ఔరంగజేబ్, దారా, ఘజామురాద్. షాజహాన్ వ్యాధి బారిన పడిన తర్వాత అతడి కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులో ఔరంగజేబ్ గెలిచి సింహాసనాన్ని అధిష్టించాడు.

ఔరంగజేబ్ (క్రీ.శ. 1658-1707)
ఇతడు ‘అలంగీర్’ (ప్రపంచ విజేత) అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు. సిక్కుల తొమ్మిదో గురువైన తేజ్‌బహదూర్‌ను ఉరి తీయించాడు. 1679లో ‘జిజియా’ పన్ను విధించాడు. ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. ముస్లిం ధర్మశాస్త్రానికి ‘పతవాఇ-అలింగీర్’ అనే పేరుతో జరిగిన క్రోడీకరణను ఆదరించాడు. ఔరంగాబాద్ వద్ద తాజ్‌మహల్‌ను అనుసరిస్తూ తన భార్య సమాధి నిర్మించాడు. దీన్నే ‘దక్కన్ తాజ్‌మహల్’గా వ్యవహరిస్తారు. ఇతడు మొగల్ చివరి పాలకుల్లో గొప్ప చక్రవర్తి.

మొగల్ వంశ చివరి పాలకులు
క్రీ.శ. 1707-61 మధ్య కాలంలో మొగల్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించి అంతరించింది. 1707 నుంచి 1712 వరకు బహదూర్ షా పాలించాడు. ఇతడిని మొదటి షా అలం అని కూడా పిలుస్తారు. ఇతడు ఉదార మనస్కుడు. రాజపుత్రులు, మహారాష్ర్టులతో సంధి చేసుకున్నాడు. బహదూర్ షా తర్వాత జహందర్ షా (1712-1713) అధికారంలోకి వచ్చాడు. ఇతడు అసమర్థుడు. సోదరుడు ఫరూక్ సియర్ ఇతడిని సింహాసనం నుంచి తొలగించి రాజ్యానికి వచ్చాడు. ఫరూక్ సియర్ కాలం (1713 - 1719)లో సిక్కుల నాయకుడైన ‘బందా బహదూర్’ను ఉరితీశారు.
సయ్యద్ సోదరులుగా పేర్కొనే హుసేన్ అలీ, అబ్దుల్లా ‘ఫరూక్ సియర్’ను హత్య చేసి మహమ్మద్ షా (1719-1748)ను పాదుషాగా చేశారు. 1739లో ఇరాన్ (పర్షియా) రాజు నాదిర్ షా భారతదేశం మీద దండెత్తి మొగల్ సామ్రాజ్యంలోని కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని, అపార సంపదను దోచుకెళ్లాడు. అఫ్గాన్లలో తురానీ తెగకు నాయకుడైన అహ్మద్ షా అబ్దాలీ 1748-69 మధ్య కాలంలో భారతదేశంపై ఏడుసార్లు దండెత్తాడు. ఇతడు 1761లో మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ర్టులను ఓడించాడు.
మొగల్ ప్రభువుల్లో చివరివాడు రెండో బహదూర్ షా (1837-1858). ఇతడు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆంగ్లేయులు బహదూర్‌షాను రంగూన్ జైళ్లో బంధించారు. ఇతడు 1862లో తన 87వ ఏట అక్కడే మరణించాడు.

ప్రాంతీయ రాజ్యాలు

విజయనగరం (క్రీ.శ. 1336-1565)
హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పాలించాయి. విజయనగర రాజుల్లో శ్రీ కృష్ణ దేవరాయలు గొప్పవారు.

విజయనగర సామ్రాజ్య పతనానికి కారణాలు:
  • బహమనీ రాజులతో నిరంతర యుద్ధాలు
  • రామరాయల రాజకీయ విధానం
  • రాక్షస తంగడి యుద్ధం
  • అరవీటి వంశస్థుల బలహీనత
  • వారసత్వ తగాదాలు
  • సామంతుల తిరుగుబాట్లు
  • బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ల దండయాత్రలు
  • సైనిక నిర్వియత
గుజరాత్ (క్రీ.శ. 1392-1526)
ముజఫర్ షా గుజరాత్‌కు స్వతంత్ర రాజ్యంగా పునాది వేశాడు. 1411-1443లో అహ్మద్‌షా అహ్మదాబాద్ నగరాన్ని నిర్మించాడు. తర్వాత మహమ్మద్ షా, రెండో అహ్మద్ షా గుజరాత్‌ను పాలించారు. వీరందరిలో మహమ్మద్ బేగ్రా గొప్పపాలకుడు.

కశ్మీర్
షంషూద్దీన్ ‘షహమీర్’ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశంలో జైనుల్ అబ్దిన్ గొప్పవాడు. ఇతడికి ‘కశ్మీర్ అక్బర్’ అనే బిరుదు ఉంది. ఇతడు ‘జిజియా’ పన్ను ఎత్తేశాడు.

మేవాడ్ సిసోడియా వంశస్థులు
ఈ వంశంలో రాణా సంగ్రాం గొప్పరాజు. కాణ్వా యుద్ధంలో (1527) రాణా సంగ్రాంను బాబరు ఓడించాడు. 1572-97 మధ్య కాలంలో రాణా ప్రతాప్ పరిపాలించాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section