Type Here to Get Search Results !

Vinays Info

వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కులు | Individual freedoms and rights

వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కులు | Individual freedoms and rights

ప్రకరణ 19 నుంచి 22 వరకు ఉన్న హక్కులను వివిధ స్వేచ్ఛల రూపంలో పొందుపర్చారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛలు చాలా విలువైనవి. కానీ ఈ స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు.అధికరణం 19లో ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి.

ప్రకరణ 19 (1)

  • వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన.
  • శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించడం.
  • సంస్థలు, సంఘాల ఏర్పాటు. సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ.
  • దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ.
  • దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ.
  • ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ. (ఈ క్లాజ్‌ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.)
  • వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు.
పైన పేర్కొన్న ఆరు స్వేచ్ఛలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు, కంపెనీలకు, కార్పొరేషన్లకు వర్తించవు.
ప్రకరణ 19(1)(ఎ)లో పేర్కొన్న వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత వ్యాఖ్యానాలు చేసింది. పౌరుడు తన భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించవచ్చు. ఇది పత్రికా స్వేచ్ఛ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ ప్రెస్) అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
కింద పేర్కొన్న స్వేచ్ఛలు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
  • పత్రికా స్వేచ్ఛ
  • వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ
  • రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ
  • ప్రసారాల స్వేచ్ఛ V సమాచార స్వేచ్ఛ
  • బంద్‌కు వ్యతిరేకమైన స్వేచ్ఛ
  • మౌనం పాటించే స్వేచ్ఛ
  • నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ
మినహాయింపులు
ఈ స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కింది కారణాల వల్ల పరిమితులు విధించవచ్చు.
  • భారత సార్వభౌమాధికారం, సమగ్రత.
  • దేశ రక్షణ, విదేశాలతో స్నేహా సంబంధాలు.
  • ప్రజాశాంతి, సఖ్యత, మర్యాద, నీతి, కోర్టు ధిక్కారం.
  • పరువు నష్టం, నేర ప్రేరేపణ తదితర ప్రాతిపదికలపై స్వేచ్ఛకు హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
ఈ పరిమితులు పార్లమెంట్, శాసనసభ చర్చలకు వర్తించవు. సభాధ్యక్షుల రూలింగ్ మేరకు సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ - సుప్రీంకోర్టు తీర్పులు
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత తీర్పులు వెలువరించింది.

శ్రేయా సింఘాల్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (2015)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 66ఎ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, అది చెల్లదని సుప్రీం తీర్పు చెప్పింది.

శ్రీమతి కుష్బు V/s తమిళనాడు (2012)
పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. ఒకరు వ్యక్తీకరించిన భావం నచ్చకపోతే న్యాయస్థానంలో దావా వేయవచ్చు. అంతేకానీ పూర్తిగా తమ భావాలను వ్యక్తీకరించకుండా నిషేధించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. మేజర్లయిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరం కాదని పేర్కొంది.

భరత్ కుమార్ V/s సి.పి.ఎం. (1998)
బంద్‌లు, సార్వత్రిక సమ్మెలు, ప్రాథమిక హక్కులు కావని, అవి ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, బలవంతంగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. టి.రంగరాజన్ గ/ట తమిళనాడు కేసు(2003)లోనూ సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

బిజో ఇమాన్యూవల్ V/s స్టేట్ ఆఫ్ కేరళ (1986)
దీన్ని జాతీయ గీతం కేసుగా పేర్కొంటారు. జాతీయ గీతాన్ని ఆలపించడం తమ మత విశ్వాసానికి విరుద్ధమని ఎవరైనా నిరూపించగలిగితే జాతీయ గీతాన్ని ఆలపించమని ఎవరూ ఒత్తిడి చేయరాదని పేర్కొంది. ఒక వ్యక్తి మౌనంగా ఉండటం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని వ్యాఖ్యానించింది.

మేనకా గాంధీ v/s యూనియన్ ఆఫ్ ఇండియా (1978 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా)
1978లో మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు నూతన అర్థాన్నిచ్చింది. మేనకా గాంధీ వివాదం విదేశీ సంచారానికి సంబంధించింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడిచింది. ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలోని‘డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా’ను సుప్రీంకోర్టు అనువర్తింపజేసింది.
‘ప్రభుత్వం ఏదో ఒక పద్ధతిని నిర్ణయించి స్వేచ్ఛలను పరిమితం చేయలేదు. నిర్ణయించిన పద్ధతి న్యాయబద్ధంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా, వెరసి సమంజసంగా ఉండాలి. ప్రభుత్వం చేసిన పని సక్రమమైనా, ఆ పని చేయడానికి ఎంచుకున్న ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ చర్యలు చెల్లుబాటు కావు.’ దీన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు.
పౌరులకు సంచార స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు దేశంలో ఉన్నప్పుడే కాకుండా, విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తాయని తెలిపింది. వాటికి భౌగోళిక పరిమితి ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నవీన్ జిందాల్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1995)
జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఎగురవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని ప్రకటించింది.
పత్రికలు లేదా మీడియాపై ముందస్తు సెన్సార్‌షిప్ లేదా నియంత్రణ సాధ్యం కాదు. కానీ సినిమాలపై ముందస్తు సెన్సార్‌షిప్ ఉండాలి. అది స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని, బ్రిజ్ భూషణ్ V/s యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్‌షిప్ విషయంలో పత్రికలు/మీడియాను, సినిమాలను ఒకే విధంగా చూడటం సమంజసం కాదని పేర్కొంది.
సమాచార స్వేచ్ఛ అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు. అది ప్రకరణ 19(1)(ఎ)లో అంతర్భాగం అని బెన్నెట్ కోల్‌మన్ కంపెనీ కేసులో 1973లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల 2005 జూన్‌లో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది.

19 (1) (బి) - సమావేశ స్వేచ్ఛ
శాంతి భద్రతలకు భంగం కలగకుండా, ఆయుధాలు లేకుండా, శాంతియుతంగా సమావేశం కావడానికి పౌరులకు స్వేచ్ఛ ఉంది. కానీ సిక్కులు తమ మత చిహ్నమైన చిన్న కత్తిని (కృపాణం) ధరించి శాంతియుతంగా సమావేశం కావచ్చు. స్వేచ్ఛపై కూడా కొన్ని పరిమితులుంటాయి. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా నిర్వహించే సమావేశాలను నిషేధించవచ్చు. ఉదా: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞను, కర్ఫ్యూను అమలు చేయవచ్చు.

19 (1) (సి) - సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
పౌరుడు స్వచ్ఛందంగా తమకు నచ్చిన సంఘాలు, సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నైతిక విరుద్ధమైన, సమాజ హితానికి వ్యతిరేకమైన సంస్థలను, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే సంస్థలను, సంఘాలను అనుమతించరు.
2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేసి, నిర్వహించుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 19(1)(సి)లో చేర్చారు.

19 (1) (డి) - సంచార స్వేచ్ఛ
పౌరులు తమ ఇష్ట ప్రకారం దేశమంతటా సంచరించవచ్చు. తద్వారా వారికి విశాల భావజాలం పెంపొందడమే కాకుండా వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే సంచార స్వేచ్ఛపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు. ప్రజల సంక్షేమం, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలు, శాంతి భద్రతల దృష్ట్యా జన సంచారాన్ని నిషేధించవచ్చు. సంచార సమయంలో పౌరులు కొన్ని నియమ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
ఉదా: వాహనదారులు హెల్మెట్లు ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, అంటువ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు తీసుకోవడం తదితర సహేతుకమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవచ్చు.

19 (1) (ఇ): నివాసం ఏర్పరచుకొని స్థిరపడే స్వేచ్ఛ
దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పర్చుకొని స్థిరపడే స్వేచ్ఛ పౌరులకు ఉంది. అయితే ప్రజా సంక్షేమం, షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ నిబంధనల మేరకు అక్కడ స్థిరపడే హక్కు రాష్ట్రేతరులకు ఉండదు.

19 (1) (ఎఫ్) - వృత్తి, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ
భారత పౌరులు తమకు ఇష్టమైన వృత్తి, వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు. ఉదా: జోగినీ, దేవదాసి, వేశ్యా వృత్తులను పూర్తిగా నిషేధించారు.
కొన్ని వృత్తులను చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతితో పాటు కొన్ని అర్హతలుండాలి. నిర్దిష్టమైన షరతులు పాటించాలి. ఉదా: వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి. ఔషధాలను విక్రయించే వారికి ప్రత్యేక అర్హతలతో పాటు ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి.

ప్రకరణ 20
నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు
ఈ నిబంధన ప్రకారం వ్యక్తులకు నేరం, శిక్ష నుంచి రక్షణ పొందేందుకు కొన్ని అంశాలను పొందుపరిచారు.
  • 20(1) ప్రకారం తప్పు చేయనిదే ఎవరినైనా శిక్షించరాదు. ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరమైతేనే శిక్షించాలి. ఆ నేరానికి చట్టపరంగా విధించాల్సిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష విధించరాదు. కానీ తక్కువ శిక్షను విధించవచ్చు. దీన్ని ‘Doctrine of Beneficial Construction’ అంటారు.
  • 20(2) ప్రకారం ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు.
  • 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు.
ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుంచి లేదా తర్వాతి కాలం నుంచి అమల్లోకి వస్తాయి. క్రిమినల్ చట్టాలు ముందుకాలానికి వర్తిస్తాయి. కానీ గత కాలానికి వర్తించవు. దీన్నే న్యాయ పరిభాషలో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో చట్టాలు (Ex post Facto Legislations) అంటారు. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే Now and After, Not Before అని అర్థం.
సివిల్ చట్టాలను గతకాలానికి కూడా వర్తింపజేయవచ్చు. ఉదా: ప్రభుత్వం ఇంటి పన్నును పెంచుతూ 2015 జనవరి 26న ఆదేశాలు జారీ చేస్తే.. అది గత ఏడాది జూలై నుంచి వర్తిస్తుందని పేర్కొనడం సమంజసమే. పౌరులు ఆ రోజు నుంచి పెరిగిన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

డబుల్ జపార్డి
ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో డబుల్ జపార్డి (Double Jeopardy) అంటారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒకసారి శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయరాదు.
ఈ రక్షణ న్యాయపరమైన ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది. శాఖాపరమైన, పరిపాలనాపరమైన చర్యలకు వర్తించదు.
ఉదా: ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అతణ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. జైలు శిక్ష విధించడంతోపాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేస్తారు. ఇక్కడ తప్పు ఒక్కటే కానీ శిక్షలు ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు.

స్వయం సాక్ష్యం చెల్లదు
ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. దీన్ని న్యాయభాషలో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ (Self Incrimination) అంటారు. కానీ ముద్దాయి చేతిగుర్తులు, చేతిరాత, రక్త నమూనాలను అతడికి వ్యతిరేక సాక్ష్యాలుగా తీసుకుంటారు. 1978లో నందిని శతపతి V/s పి.ఎల్.డానీ కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం.. బెదిరించి, శారీరకంగా హింసించి, మానసిక క్షోభకు గురిచేసి నేరం ఒప్పుకునేలా చేసి సమాచారం రాబడితే అది బలవంతపు సాక్ష్యం కిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ఆర్టికల్ 20(3)కు వ్యతిరేకమని పేర్కొంది. నేర వైద్య శాస్త్ర పరంగా (Forensic Science) నిందితుల నుంచి సమాచారం రాబట్టడం కొంత మేరకు చెల్లుబాటు అవుతుంది.
ఉదా: సత్యశోధన లేదా లై డిటెక్టర్ (Polygraph), నార్కో అనాలిసిస్, మైండ్ మ్యాపింగ్ మొదలైనవి. అయితే కొన్ని రసాయనాలు ఉపయోగించి చేసే నార్కో అనాలసిస్ టెస్ట్ పూర్తిగా శాస్త్రబద్ధం కాదని కొవ్వాడ గాంధీ కేసు (2011)లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రకరణ 21
వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి రక్షణ
ఇది చాలా ముఖ్యమైంది. భారత పౌరులతోపాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది. జీవించే హక్కును, ఆంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగా హరించడానికి వీల్లేదు. ఈ నిబంధన వ్యక్తి జీవించే స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది. చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావాన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. శాసనసభల చట్టాల నిర్ణీత పద్ధతి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే పైన పేర్కొన్న పద్ధతి చెల్లుబాటవుతుంది. ఈ ప్రకరణను కార్యనిర్వాహక అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే పొందుపరిచారు. ఇది శాసనసభల చట్టాలకు వ్యతిరేకంగా రక్షణ ఇవ్వదు.
ప్రకరణ 21లో కల్పించిన రక్షణలు కార్య నిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తాయి. శాసనపరమైన చర్యలకు వర్తించవు. వీటిని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మేనకా గాంధీ కేసులో విస్తృతంగా వ్యాఖ్యానించింది. శాసన శాఖ చర్యలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించేలా కొన్ని సూత్రాలను నిర్దేశించింది.

విస్తృత పరిధి, అభ్యుదయ వ్యాఖ్యానాలు
మేనకా గాంధీ కేసు, ఇంద్రజిత్, వెల్లూరు సిటిజన్‌‌స వెల్ఫేర్ కేసు, ప్రేమశంక ర్ శుక్లా కేసు, నరేంద్రకుమార్ కేసు, మోహిని జైన్ కేసు, ఆటోశంకర్ కేసు, శ్రీమతి ఖుష్బు కేసు మొదలైన వాటిల్లో సుప్రీంకోర్టు జీవించే స్వేచ్ఛపై విస్తృత అర్థాన్ని చెప్పింది. ఈ తీర్పుల సారాంశం ప్రకారం ప్రకరణ 21లో కింద పేర్కొన్న హక్కులు కూడా అంతర్భాగమే.
  • గౌరవప్రదంగా జీవించే హక్కు
  • కాలుష్య రహిత వాతావరణ హక్కు
  • రహస్యాలను, ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు
  • ఉచిత న్యాయ సలహా హక్కు
  • విదేశాల పర్యటన హక్కు
  • లాకప్ మరణాల వ్యతిరేక హక్కు
  • సమాచార హక్కు
  • సహజీవన హక్కు
  • ఏకాంతంగా జీవించే హక్కు
  • సత్వర విచారణ పొందే హక్కు
  • మరణ శిక్ష అమలును ఆలస్యం చేయడంపై అడిగే హక్కు
  • ఆహార హక్కు
  • నిద్ర హక్కు
ఆత్మహత్యా ప్రయత్నం - జీవించే హక్కు- తాజా వివాదం
ప్రకరణ 21 జీవించే హక్కును కల్పించింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్ అమానుషమైందని, దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ సెక్షన్‌ను తొలగిస్తున్నట్లు ఇటీవలే కేంద్రం ప్రకటించింది.
ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అసహజమైన కోరిక. కాబట్టి ఆ కోరికకు కారణమైన పరిస్థితులను పరిశీలించాలి. అలాంటి వ్యక్తులకు సరైన కౌన్సెలింగ్ నిర్వహించాలి. పోలీసు కేసులతో వేధించరాదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కారుణ్య మరణం (Euthanasia): 2011లో పింకీ విరానీ అనే జర్నలిస్టు అరుణా షాన్‌బాగ్ తరఫున సుప్రీంకోర్టులో కేసు వేసింది. వృత్తి రీత్యా నర్సు అయిన అరుణ షాన్‌బాగ్ బొంబాయి ఎడ్వర్డ్ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురైంది. ఆమె సుమారు 37 సంవత్సరాలు కోమాలోనే ఉంది. ఆమె పరిస్థితి దృష్ట్యా కారుణ్య మరణానికి అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. న్యాయస్థానం కారుణ్య మరణాన్ని నిరాకరించింది. ప్రత్యేక పరిస్థితుల్లోనే పాసివ్ కారుణ్య మరణాన్ని అనుమతిస్తామని పేర్కొంది.
విద్యాహక్కు (ప్రకరణ 21-ఎ) (Right to education): విద్యాహక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్-21ఎలో చేర్చారు. 6 - 14 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు.
వాస్తవానికి 2002కు ముందు ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 45లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరిచారు. కానీ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఆర్టికల్ 21-ఎకి బదలాయించి ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ప్రస్తుతం నిబంధన 45లో ఉచిత ప్రాథమిక విద్యను (ఆరేళ్ల లోపు వారికి) అందించాలనే కొత్త అంశాన్ని చేర్చారు. 2009లో విద్యా హక్కు చట్టాన్ని చేశారు. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

విద్యా హక్కుచట్టం ముఖ్యాంశాలు
  • ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి నివాస ప్రదేశానికి ఒక కి.మీ. పరిధిలో పాఠశాల ఉండాలి.
  • ప్రైవేట్ పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలి.
  • ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1 : 30గా ఉండాలి.
  • ఈ చట్టం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరిస్తాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కోటాలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండరాదు.
విద్యాహక్కు - సుప్రీంకోర్టు తీర్పులు
1992లో మోహిని జైన్ v/s కర్ణాటక, ఉన్నికృష్ణన్ v/s ఆంధ్రప్రదేశ్ కేసుల్లో జీవించే హక్కు, వ్యక్తి గౌరవాన్ని పొందే హక్కుల్లో విద్యా హక్కు అంతర్భాగం. దాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా బాలలకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని తమిళనాడు ప్రభుత్వం v/s శ్యామ్ సుందర్ కేసు (2011)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రాథమిక విధి: ఇదే సవరణ ద్వారా నిబంధన 51-ఎలో ప్రతి తల్లిదండ్రులు, సంరక్షకులు 6 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న తమ పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాలనే విధిని నూతన ప్రాథమిక విధిగా పేర్కొన్నారు.

ప్రకరణ-22
అక్రమ నిగ్రహణ (Arrest), నిర్బంధం (Detention) నుంచి రక్షణ

అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు వ్యతిరేకంగా ఆర్టికల్ 22 రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రకరణ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు పాటించాలి. అవి..
ప్రకరణ 22 (1):
ఎ) ప్రతి అరెస్టుకు కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియజేయాలి. న్యాయవాదిని సంప్రదించే అవకాశం ఇవ్వాలి.
బి) నిందితుణ్ని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి.
24 గంటలను లెక్కించేటప్పుడు ప్రయాణ సమయాన్ని మినహాయిస్తారు. సెలవు దినాలను మినహాయించరు. అరెస్టయిన వ్యక్తిని సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాలి. పై రక్షణలకు కొన్ని మినహాయింపులున్నాయి. ప్రకరణ 22(3) ప్రకారం శత్రు దేశ పౌరులకు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయిన వారికి ఈ రక్షణలు వర్తించవు.
ప్రకరణ 22(4) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయిన వారిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైన ఎడ్వైజరీ బోర్డు సూచన మేరకు మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అర్హతలున్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.
ప్రకరణ 22(5) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టయిన వారికి తమను ఎందుకు అరెస్టు చేశారో వీలైనంత త్వరగా తెలపాలి. తద్వారా బాధితులకు పిటీషన్ వేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రకరణ 22(6) ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్ అరెస్టుకు కారణాలను వెల్లడించకుండా ఉండే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ప్రకరణ 22(7) ప్రకారం పైన పేర్కొన్న క్లాజులతో సంబంధం లేకుండా మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించే విధంగా పార్లమెంట్ శాసనాలు రూపొందించవచ్చు.

ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు, వివరణ:
సాధారణంగా నిర్బంధాలు రెండు రకాలు: 1. శిక్షించే చట్టాలు 2. నివారక చట్టాలు.
శిక్షించే చట్టాల్లో ముద్దాయి నేరం రుజువయ్యాక కోర్టు విధించిన శిక్షను అమలు చేయడానికి నిర్బంధిస్తారు. నివారక నిర్బంధంలో విచారణ లేకుండా నేరం చేస్తారేమో అనే అనుమానంతో నిందితుణ్ని లేదా అనుమానితుణ్ని ముందుగానే నిర్బంధిస్తారు. దేశ రక్షణ, శాంతి భద్రతల దృష్ట్యా ఇలా చేస్తారు.

సుప్రీంకోర్టు తీర్పులు
ఎ.కె.గోపాలన్ v/s స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950)

ఒక వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు అతడికి కారణాలను తెలపడం సంబంధిత పోలీస్ అధికారి బాధ్యత. అలాగే అరెస్టయిన వ్యక్తికి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. దీన్ని లాటిన్ పరిభాషలో ‘ఆడీ ఆల్టిరమ్ పార్టెమ్’ అంటారు. అంటే హియర్ ది అదర్ సౌండ్ టూ అని అర్థం. అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తికి తన నిర్దోషిత్వాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని దీని అర్థం.
అబ్దుల్ సమర్థ v/s స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (1962)
అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరు పరచకపోతే 24 గంటల తర్వాత ఆ వ్యక్తికి విడుదలయ్యే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
జోగిందర్ కుమార్ v/s స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్
ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు/స్నేహితుడికి/సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి.

ప్రకరణలు 23, 24
పీడన నిరోధ హక్కులు
మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టిచాకిరీని ప్రకరణ 23(1) నిషేధిస్తుంది. వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా ఏ పని చేయించరాదు. పై చర్యలకు పాల్పడితే పార్లమెంటు చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు.
నిబంధన 23లో బేగార్ అనే పదాన్ని ప్రయోగించారు. బేగార్ అంటే వెట్టిచాకిరీ. ఉత్తర భారతదేశంలో హాలీ అంటే.. ఎలాంటి పారితోషకం లేకుండా వ్యక్తులతో పని చేయించుకోవడం. దీన్ని 1976లో వెట్టిచాకిరీ చట్టం ద్వారా నిషేధించారు.
ఈ నిబంధన స్వయంగా అమల్లోకి రాదు. అందుకే 1956లో పార్లమెంటు అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది.
ప్రకరణ 23(2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు. దీన్ని దోపిడీగా పరిగణించరు.

ప్రకరణ-24
బాల కార్మిక వ్యవస్థ రద్దు
ఈ ఆర్టికల్ ప్రకారం 14 ఏళ్ల లోపు వయసుఉన్న బాలలను ప్రమాదకర, ఇతర పనుల్లో వినియోగించరాదు. ఒకవేళ వినియోగిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఈ నిబంధన కూడా స్వయంగా అమల్లోకి రాదు. దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తదనుగుణంగా చట్టాలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పులు
ఎం.సి.మెహతా v/s తమిళనాడు(1997) కేసులో 14 ఏళ్ల లోపు వయసున్న బాలలను ఏ రకమైన ప్రమాదకర పరిశ్రమల్లో లేదా ఇతర పనుల్లో వినియోగించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బందువా ముక్తిమోర్చా v/s యూనియన్ ఆఫ్ ఇండియా, 1997 కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెలువరించింది. బాలల సంరక్షణకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, బాలకార్మికులను పనిలో వినియోగించే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించాలని పేర్కొంది.

ప్రకరణలు 25-28
మత స్వాతంత్య్రపు హక్కులు
ప్రకరణ 25(1) ప్రకారం ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి, ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంది.
ప్రకరణ 25(2) ప్రకారం మత స్వేచ్ఛ ప్రజాశాంతికి, నైతికతకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు. అలాంటి సమయాల్లో ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. మత విషయాలను నియంత్రించవచ్చు. హిందూ మతంలో కొన్ని సామాజిక సంస్కరణలు చేపట్టవచ్చు.

ప్రకరణ-25లో రెండు వివరణలు ఉన్నాయి. అవి
  • సిక్కులు తలపాగా, కత్తి ధరించడం వారి సంప్రదాయంలో భాగం.
  • ప్రకరణ-25(2)(బి)లో హిందువులు అనే పదం ఉంది. ఇక్కడ హిందువులంటే సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా.

ప్రకరణ-26
మత సంస్థలు - మతపరమైన వ్యవహార నిర్వహణలో స్వేచ్ఛ
ప్రజా శాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు.
  • మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను స్థాపించవచ్చు.
  • సంస్థలను నిర్వహించుకోవచ్చు.
  • స్థిర, చరాస్తులను సంపాదించుకోవచ్చు.
  • అమల్లో ఉన్న చట్టాలకు లోబడి వాటిని నిర్వహించుకోవచ్చు.

ప్రకరణ-27
మతవ్యాప్తి లేదా మత పోషణ కోసం పన్నులు వసూలు చేయరాదు
మత ప్రాతిపదికన ప్రజలపై పన్నులు విధించరాదు, వసూలు చేయరాదు. ఈ నిబంధన పన్నులు వసూలు చేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. అయితే మత ప్రాతిపదికన ప్రత్యేక సేవలు అందించినందుకు ప్రజల నుంచి ప్రభుత్వం రుసుం వసూలు చేయవచ్చు.
ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాల కోసం, సేవల కోసం రుసుం వసూలు చేయడం రాజ్యాంగబద్ధమే.

ప్రకరణ-28
విద్యాలయాల్లో మత బోధన నిషేధం
ప్రకరణ 28(1): ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధం.
ప్రకరణ 28(2): పై నిబంధనకు కొన్ని మినహాయింపులిచ్చారు. ప్రభుత్వం నిర్వహించే దేవాదాయ, ధర్మాదాయ సంస్థల్లో ప్రత్యేక మత బోధన చేయవచ్చు.
ప్రకరణ 28(3): ప్రభుత్వ గుర్తింపు ఉన్న, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లో ఒక వ్యక్తి ఐచ్ఛికంగా మత ప్రార్థనలు/బోధనల్లో పాల్గొనవచ్చు. అయితే పాల్గొనమని ఒత్తిడి చేయరాదు. ఆ వ్యక్తి మైనర్ అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతి తీసుకోవాలి.


ప్రకరణలు-29, 30
విద్యా, సాంస్కృతిక పరమైన హక్కులు
ప్రకరణ 29(1): భారతదేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి ఉంటే.. వాటిని పరిరక్షించుకుని, పెంపొందించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది.
ప్రకరణ 29(2): ప్రభుత్వం నిర్వహిస్తోన్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి మతం, జాతి, కులం, భాషా ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
ప్రకరణ 30(1): మైనారిటీ వర్గాలవారు, ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించుకోవచ్చు.
ప్రకరణ 30(1)(ఎ): మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వారికి ప్రత్యేక నష్టపరిహారం చెల్లించాలి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజును చేర్చారు.
ప్రకరణ 30(2): ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే సమయంలో విద్యాసంస్థల పట్ల వివక్ష చూపరాదు. అల్ప సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలు, అధిక సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలను సమ దృష్టితో చూడాలి.


వివరణ:
  • ఆర్టికల్ 29, 30లలో ‘మైనారిటీ’ పదాన్ని ప్రస్తావించారు. కానీ ఈ పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు.
  • మైనారిటీల వర్గీకరణకు రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో రెండు రకాల మైనారిటీ వర్గాలున్నాయి. అవి మతపరమైన, భాషాపరమైన మైనారిటీ వర్గాలు.
  • హిందువులు మినహా మిగతా వారంతా మతపరమైన మైనారిటీలే. భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రాల వారీగా మారుతుంటారు. ఉదాహరణకు.. తెలంగాణలో కన్నడిగులు, గుజరాతీలు, మరాఠీలు భాషాపరంగా మైనారిటీలు.

సుప్రీంకోర్టు తీర్పులు
కేరళ విద్య పాఠ్యాంశాల సవరణ బిల్లు (1958) కేసు: కేరళ ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవ, కమ్యూనిస్టు భావాలున్న పాఠ్యాంశాలను చేర్చారు. దీంతో ఈ బిల్లును సుప్రీంకోర్టు సలహా పరిధికి నివేదించారు. పాఠ్యాంశాల్లో తీవ్రవాద భావజాలాన్ని చేర్చడం చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది.
డి.ఎ.వి. కాలేజ్ v/s స్టేట్ ఆఫ్ పంజాబ్ (1971) కేసు: విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పంజాబీ మాత్రమే బోధన భాషగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఇది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
ఆల్‌సెయింట్స్ v/s గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1980) కేసు: మెనారిటీ విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
టి.ఎం.ఎ.పాయ్ v/s స్టేట్ ఆఫ్ కర్ణాటక (2003) కేసు: మైనారిటీ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఏ సందర్భంలో జోక్యం చేసుకోవచ్చో, జోక్యం చేసుకోరాదో వివరణ ఇస్తూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవి..
  • మైనారిటీ స్థాయిని నిర్ణయించడానికి రాష్ట్రాన్ని మాత్రమే యూనిట్‌గా తీసుకోవాలి.
  • మైనారిటీ అనే పదంలో భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు ఉండవచ్చు.
  • బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, వారిపై పాలనా నియంత్రణ సంబంధిత హక్కులు మేనేజ్‌మేంట్‌కే ఉంటాయి. ప్రభుత్వ ధనసహాయం పొందని మైనారిటీ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. అయితే క్యాపిటేషన్ ఫీజులను ప్రభుత్వం నియంత్రించవచ్చు.

మత స్వేచ్ఛ - సుప్రీంకోర్టు తీర్పులు
బిజో ఇమాన్యువల్ v/s  స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసు:
జాతీయ గీతాన్ని ఆలపించడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని నిరూపించగలిగితే.. జాతీయ గీతం పాడాలని ఏ వ్యక్తిని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళ పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఈ కేసు దాఖలైంది.
సెయింట్ జేవియర్స్ కాలేజీ v/s  స్టేట్ ఆఫ్ గుజరాత్ (1974) కేసు:
‘లౌకికతత్వం’ పదానికి ఈ కేసులో సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. మతానికి, దేవుడికి అతీతంగా వ్యవహరించడమే లౌకికతత్వం. దేవుడి పట్ల ప్రత్యేక ద్వేషం, వ్యతిరేకత చూపకూడదు. దేవుణ్ని నమ్మేవారిని, నమ్మని వారిని ప్రభుత్వం ఒకే విధంగా చూడాలి.
 
ప్రకరణ - 31
ఆస్తిహక్కు
పార్లమెంటు ఆస్తి హక్కుకు సంబంధించి అనేక సవరణలు, చట్టాలు చేసింది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ, 1964లో 17వ రాజ్యాంగ సవరణ, 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేశారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. దాన్ని 12వ భాగంలో ప్రకరణ 300-ఎలో రాజ్యాంగ పరమైన హక్కుగా (Constitutional Rights) చేర్చారు. 1979 జూన్ 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అలాగే ఆస్తి హక్కుకు సంబంధించి నూతన నిబంధనలను కూడా చేర్చారు.
ప్రకరణ 31(ఎ): ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు వర్తించే కొన్ని మినహాయింపులను ఈ ప్రకరణలో పేర్కొన్నారు. భూ సంస్కరణల అమలు కోసం చట్టాలు చేసినప్పుడు.. అవి 14, 19 ప్రకరణలకు వ్యతిరేకమనే కారణంతో న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
ప్రకరణ 31(బి): కొన్ని చట్టాల వర్తింపునకు మినహాయింపులు. వీటిని 9వ షెడ్యూల్డ్‌లో ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో ఇలాంటి చట్టాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు. 9వ షెడ్యూల్డ్‌లో పేర్కొన్న అంశాలు సాధారణంగా న్యాయ సమీక్షకు గురికావు. కానీ ‘రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో న్యాయ సమీక్ష అంతర్భాగం. దాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు లేదు’ అని కేశవానంద భారతి కేసు(1973)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
 2007లో ఐ.ఆర్. కొహెల్హో v/s తమిళనాడు కేసులో ‘న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది. కాబట్టి 1973 తర్వాత 9వ షెడ్యూల్డ్‌లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్షకు గురవుతాయి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రకరణ 31(సి): ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై, ముఖ్యంగా ఆస్తి హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఈ పరిమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు.
ఆదేశిక సూత్రాల్లోని ప్రకరణ 39లో ఉన్న క్లాజు బి, సిలో సామ్యవాద తరహా సమాజ స్థాపన గురించి పేర్కొన్నారు. ఈ విషయమై రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కొన్ని పరిమితులు విధిస్తే, అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని న్యాయస్థానంలో ప్రశ్నించలేం.
వివరణ:
ప్రకరణ 31(ఎ), 31(బి), 31(సి)లు ఆస్తిహక్కుపై పరిమితికి సంబంధించినవి. ఇవి ఎలాంటి ప్రాథమిక హక్కులను ప్రసాదించవు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రకరణ 31ను తొలగించారు. కానీ వీటిని మాత్రం కొనసాగించారు.
 
ప్రకరణ - 32
రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies)
ప్రాథమిక హక్కుల్లో ఇది అత్యంత ముఖ్యమైంది. మూడో భాగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా/ఆ హక్కులను పరిమితం చేసినా/అమలు చేయకపోయినా, బాధితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన రాజ్యాంగ పరిహారాలను పొందవచ్చు. మొదటి ఆరు ప్రాథమిక హక్కుల అమలు ఈ నిబంధన పైనే ఆధారపడి ఉంటుంది. హక్కులను గుర్తించడంతోపాటు, వాటి అమలుకు హామీ ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. అమలు కాని హక్కులు వ్యర్థం.
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు నిబంధన 32(4) హామీ ఇస్తోంది. అందుకే అంబేద్కర్  రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగ ఆత్మగా, హృదయంగా వర్ణించారు.
ప్రకరణ 32(1): ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అవి అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారం పొందవచ్చు.
ప్రకరణ 32(2): హక్కులను కాపాడటానికి ప్రత్యేక ఆదేశాలైన హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో-వారెంటో, సెర్షియరీ లాంటి రిట్లను సుప్రీంకోర్టు జారీ చేసేందుకు ఈ భాగం వీలు కల్పిస్తుంది.
ప్రకరణ 32(3): సుప్రీంకోర్టు అధికారాలకు విఘాతం కలగకుండా, ఇతర న్యాయస్థానాల(స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు)కు కూడా రిట్లు జారీచేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు.
ప్రకరణ 32(4): రాజ్యాంగంలో ఇతరత్రా అనుమతించిన విధంగా తప్ప ఈ ప్రకరణ ద్వారా గుర్తించిన హక్కులు రద్దు కావు.
వివరణ:
రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో రాజ్యాంగ పరిహార హక్కు అంతర్భాగమని 1981లో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
 
రిట్లు-పరిధి-పరిమితులు
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీచేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు (Writs) అంటారు. రిట్లు జారీ చేసే పద్ధతిని బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నిబంధన 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, నిబంధన 226 ప్రకారం రాష్ర్ట హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారాన్ని కల్పించారు. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కల్పించవచ్చు. ఇప్పటి దాకా పార్లమెంటు అలాంటి చట్టాలను రూపొందించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. రిట్ల జారీ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.
హైకోర్టులు జారీ చేసే రిట్ అత్యవసర పరిస్థితుల్లో రద్దవుతుంది. ప్రకరణ 226 విషయ పరిధి తక్కువ. కానీ సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాదు. ప్రకరణ 32 విషయ పరిధి విస్తృతమైంది.
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీం కోర్టుకు ప్రత్యేకమైన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది (Primary and Original). అందుకే సుప్రీం కోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అంటే పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును  లేదా ప్రకరణ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చు.
సాధారణంగా హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని పౌరులు భావిస్తే, మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్ బ్రహ్మ భట్ v/s గుజరాత్ (1972) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
 
వివిధ రిట్లు-అర్థం-పరిధి-ప్రాముఖ్యత
హెబియస్ కార్పస్ (Hebeas Corpus)

ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది.  హెబియస్ అంటే ‘Have’,  కార్పస్ అంటే ‘Body’ అని అర్థం. ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడమని దీనికి అర్థం. ఇది పురాతన రిట్. నిబంధన 19-22 వరకు పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ జారీ చేస్తారు. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి. లేని పక్షంలో ఈ రిట్ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తుంది.
వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణతోపాటు చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు.
మూడో వ్యక్తికి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు (లోకస్ స్టాండై) ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ/వ్యక్తి ఈ రిట్ దాఖలు చేయవచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్ అని,  వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనమని అంటారు.
మినహాయింపులు:
పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంతో వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ నిరూపితమై జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.
 
మాండమస్ (Mandamus)
భాషాపరంగా మాండమస్ అంటే ఆదేశం అని అర్థం. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జారీచేసే అత్యున్నత ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు. ప్రభుత్వాధికారి/సంస్థ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం.
ప్రభుత్వాధికారులు, సంస్థలు తమ విధులను చట్టబద్ధంగా నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అలాంటి సందర్భాల్లో వారు సక్రమంగా విధులు నిర్వర్తించడానికి ఈ రిట్ జారీ చేస్తారు. పబ్లిక్ సంస్థలు, క్వాజి పబ్లిక్ (Quasi-Public), జ్యుడీషియల్ సంస్థలు, క్వాజి జ్యుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్ జారీ చేయవచ్చు.
మినహాయింపులు:
రాష్ర్టపతి, గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు. వీరు తమ అధికారాలు, విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని ఏ కోర్టు ఆదేశించలేదు.
ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్ జారీచేయడానికి వీల్లేదు.
మాండమస్ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీచేస్తారు. అంటే పరిపాలనాపరమైన ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ రిట్ జారీ అనేది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
అధికారులు తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులకే ఇది వర్తిస్తుంది. విచక్షణా (Discretion) పూర్వకమైన విధులకు వర్తించదు.

పొహిబిషన్ (నిషేధం)
భాషా పరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రైబ్యునల్ తన పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది.  దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ ముఖ్య ఉద్దేశం. ప్రొహిబిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా సంస్థలు, చట్టపర సంస్థలకు వర్తించదు.
 
సెర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం)
భాషాపరంగా సెర్షియోరరి అంటే ‘సుపీరియర్’ లేదా ‘టు బి సర్టిఫైడ్’ లేదా ‘బ్రింగ్ ద రికార్డ్స్’ అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు వెలువరించినప్పుడు దాన్ని రద్దు చేసి, కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశం. ఈ రిట్ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే.
సెర్షియోరరిని ప్రైవేటు సంస్థలు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయరు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే పరిపాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీచేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్-లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996) కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
 
ప్రొహిబిషన్, సెర్షియోరరి మధ్య తేడాలు
ప్రొహిబిషన్, సెర్షియోరరిల రిట్ల ఉద్దేశం ఒక్కటే. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం. అయితే వీటి ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభదశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్‌ను జారీ చేస్తారు.
సెర్షియోరరి రిట్ దిగువ కోర్టులను నియంత్రించడంతోపాటు, అవి చేసిన తప్పులను కూడా సవరిస్తుంది. ప్రొహిబిషన్ రిట్ కేవలం నిలుపుదల చేస్తుంది. (Prohibition is preventive where as certiorari is curative)
 
కోవారంటో (అధికార పృచ్ఛ)
భాషాపరంగా దీన్ని ‘బై వాట్ వారంట్’ (By What Warrant) అంటారు. అంటే ‘ఏ అధికారంతో’ అని ప్రశ్నించడం. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం. ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగం చేసిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తొలగిపోవాలని ఆదేశిస్తాయి. ప్రజా పదవి అంటే చట్టంతో ఏర్పాటైన స్వతంత్ర పత్రిపత్తి సంస్థ. ఉదాహరణకు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, డెరైక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవి.
ఈ రిట్ కోసం బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తికి (Third Person) ఇందులో జోక్యం చేసుకునే హక్కు (Locus Standi-లోకస్ స్టాండై) ఉంటుంది.
 
ఇన్‌జంక్షన్ (నిలుపుదల ఆదేశం)
ఈ రిట్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కేవలం సివిల్ వివాదాల్లో యధాతథస్థితిని (Status-Quo-Ante) కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీలుపడని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కుల రక్షణకు, ఈ రిట్‌కు సంబంధం లేదు.
 
ప్రాథమిక హక్కులు - ఇతర నిబంధనలు
ప్రకరణ 33ను అనుసరించి, ప్రాథమిక హక్కులు కింది వర్గాలకు వర్తించే విషయంలో పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని పరిమితులు విధించవచ్చు.
ఎ) సైనిక , పారా మిలటరీ దళాలు.
బి) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులు నిర్వర్తిస్తున్న సంస్థలు, అధికారుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు.
సి) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు.
డి) అత్యవసర సర్వీసులైన టెలి కమ్యూనికేషన్లు, ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులు.
 
ప్రకరణ 34-సైనికచట్టం (Marshal Law) - ప్రాథమిక హక్కులపై పరిమితులు
దేశంలోని ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు చేపట్టిన చర్యలు, తద్వారా జరిగిన నష్టాలకు, పరిణామాలకు వారిని బాధ్యులను చేయడానికి వీలులేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు.
 
ప్రకరణ 34, 35ల మధ్య తేడా
ప్రకరణ 34లో ప్రస్తావించిన అంశాలు కేవలం కొన్ని వర్గాల ఉద్యోగులు, వారి హక్కులపై విధించిన పరిమితులు. ప్రకరణ 35లో ప్రస్తావించిన అంశాలు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి రూపొందించినవి. కాబట్టి ఒకటి వర్గానికి సంబంధించింది, మరొకటి ప్రాంతానికి సంబంధించినది.
ఉదా: 1958లో రూపొందించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Power) Act- AFSPA). దీన్ని పలు పర్యాయాలు సవరించి అసోం, మణిపూర్ రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాల్లో విధించారు. అలాగే 1983లో పంజాబ్, చండీగఢ్‌లో కూడా ప్రయోగించారు. అక్కడి పరిస్థితుల కారణంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు విఫలమైనప్పుడు ఈ చట్టం ద్వారా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
 
ప్రకరణ- 35 చట్టబద్ధత, శిక్షలు
మూడో భాగంలో పేర్కొన్న నిబంధన అమలుకు చట్టబద్ధత కల్పించడం, శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. శాసనసభలకు ఉండదు. ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి లేదా ప్రక్రియ ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు.
ఉదా: ప్రకరణ 16(3) ప్రకారం రిజర్వేషన్ల అమలు, ప్రకరణ 32(3) ప్రకారం రిట్లు జారీ చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు సంక్రమింపజేయడం, ప్రకరణ 33 ప్రకారం సాయుధ బలగాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, ప్రకరణ 34 ప్రకారం సైనిక పాలన, మొదలైన అంశాలపై పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా ఈ భాగంలో పేర్కొన్న నేరాలకు, (ఉదాహరణకు ప్రకరణ 17లో పేర్కొన్న అస్పృశ్యత, 23లో పేర్కొన్న దోపిడీ, 24లోని బాలకార్మిక వ్యవస్థ మొదలైన వాటికి) శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
ప్రకరణ 35(బి) ప్రకారం, పై విషయాలకు సంబంధించి రాజ్యాంగం అమల్లోకి రాక పూర్వం ఉన్న చట్టాలు అలాగే కొనసాగుతాయి. అయితే ప్రకరణ 372 ప్రకారం పూర్వ శాసనాలకు మార్పులు, చేర్పులు, సవరణలు చేసి పార్లమెంటు కొత్త చట్టాలు రూపొందించుకోవచ్చు.
 
ప్రాథమిక హక్కులు - ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (Public Interest Litigation-PIL)
ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లను ప్రకరణ 32, ప్రకరణ 226లో పేర్కొన్నారు. హక్కులకు భంగం వాటిల్లినప్పుడు లేదా అమలు కానప్పుడు బాధితుడే కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే బాధితుడికి సరైన అవగాహన లేకపోవడం లేదా ఆర్థిక, సామాజిక స్థితి పరంగా కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బాధితులకు సంబంధించి ప్రజాప్రయోజనం అందులో ఇమిడి ఉంటే వారి తరఫున మూడో వ్యక్తి కూడా కోర్టులో వ్యాజ్యం వేయవచ్చు. దీన్నే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు.
సాధారణంగా కోర్టు జోక్యాన్ని కోరే హక్కు (Locus Standi) బాధితులకే ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఆ హక్కును ఇతరులకు కూడా సంక్రమింపజేసింది. ఈ వెసులుబాటును పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ (పీఐఎల్) లేదా సోషల్లీ ఇంట్రస్ట్ లిటిగేషన్ అని అంటారు.
గమనిక: పీఐఎల్ భావన మొదట అమెరికా న్యాయ వ్యవస్థలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇండియాలోని పీఐఎల్ భావన అమెరికా నమూనా లాంటిదే. కానీ కొన్ని మార్పులతో పాటిస్తుంది.
రాజ్యాంగంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి ప్రస్తావన లేదు. అయితే సుప్రీంకోర్టులో మొదటిసారి ఈ భావనను ప్రవేశపెట్టింది జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్. ఆ తర్వాత జస్టిస్ పి.ఎన్. భగవతి నేతృత్వంలోని  సుప్రీంకోర్టు బెంచ్‌కి మొదటిసారిగా 1979లో బిహార్ జైల్లో ఖైదీల తరఫున పీఐఎల్ దాఖలు చేశారు. దీన్నే హస్నార ఖతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు అంటారు.
1981లో ఎస్.పి.గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును పీఐఎల్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన కేసుగా పేర్కొంటారు. జస్టిస్ పి.ఎన్.భగవతి పీఐఎల్‌ను చక్కగా నిర్వచించి, తగిన వివరణ ఇచ్చారు.
ప్రకరణ 32 ప్రకారం, సుప్రీంకోర్టులో, ప్రకరణ 226 ప్రకారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. ఇతర న్యాయస్థానాలకు ఈ అధికారం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కుంభకోణాలు పీఐఎల్ ద్వారానే దేశంలో వెలుగులోకి వచ్చాయి.
పీఐఎల్‌ను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదు. ప్రచారం కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్ధేశంతో ప్రజాప్రయోజనాల నెపంతో పీఐఎల్ ను దాఖలు చేస్తే అలాంటి వ్యక్తులపై న్యాయస్థానాలు భారీ జరిమానాలు విధిస్తాయి.
ఉదా: సంజీవ్ భట్నాగర్ జాతీయగీతం నుంచి సింధ్ అనే పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టులో పీఐఎల్ దాఖలు చేశారు. అది అనవసరమైన, ఆర్భాటమైన కేసుగా భావించి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు భారీ జరిమానా విధించింది.
 
ప్రాథమిక హక్కులపై పరిమితులు- జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం
నిబంధన 352 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ప్రకరణలు 358, 359లలో వివరణలు ఉన్నాయి.
 
ప్రకరణ 358 ప్రకారం బాహ్య అత్యవసర పరిస్థితి
యుద్ధం, దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం ప్రకరణ 19లో పేర్కొన్న స్వేచ్ఛలను మాత్రమే రద్దు చేస్తారు. ఇతర ప్రాథమిక హక్కులు రద్దు కావు.
ప్రకరణ 358 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రకరణ 19లో పేర్కొన్న స్వేచ్ఛలు వాటంతట అవే రద్దవుతాయి.
కానీ ప్రకరణ 359 ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ర్టపతి ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి. ఎమర్జెన్సీ విధించినంత మాత్రాన వాటంతట అవే రద్దు కావు.
నిబంధన 358 పరిధి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కానీ ప్రకరణ 359 పరిధి దేశంలో కొన్ని ప్రాంతాలకు లేదా మొత్తం భాగానికి వర్తింపజేయవచ్చు.
జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ కారణంగా విధించినప్పటికీ (బాహ్య, అంతరంగిక కారణాలు) ప్రకరణ 20, 21  రద్దుకావు. ఈ అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.
ప్రకరణలు 358, 359 మధ్య కొంత సామీప్యం ఉంది. ఇవి అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా జరిగే పరిణామాలకు రక్షణ కల్పిస్తాయి కానీ ఎమర్జెన్సీతో సంబంధం లేని చట్టాలకు వర్తించవు.
 
ప్రాథమిక హక్కులు - మినహాయింపులు
ప్రకరణ 31-ఏ లో పేర్కొన్న ఐదు రకాల చట్టాలు తమ ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలులేదు. ఈ అంశాలను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు.
నిబంధన 31-బిలో కూడా ఇలాంటి పరిమితులనే పేర్కొన్నారు. 31-సి ప్రకారం నిర్దేశిక నియమాల్లో పొందుపరిచిన 39-బి, 39-సి అమలు కోసం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు.
 
ప్రాథమిక హక్కులు - ముఖ్య వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు
ఎ.కె. గోపాలన్ వర్సెస్ తమిళనాడు -1950: 1950లో చేసిన నివారక నిర్బంధ చట్టంలోని సెక్షన్ 4 న్యాయ సమీక్షాధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది.
శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-1951: మొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఈ వివాదంలో సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సవరణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ కేసులోనే సుప్రీం కోర్టు మొదటిసారి న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం-1954: ఈ వివాదం కూడా ఆస్తి హక్కుకు సంబంధించిందే. ప్రభుత్వం ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు అందుకు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section