విసర్జన వ్యవస్థ(Excretory System)
శరీరంలో జీవక్రియల ఫలితంగా ఏర్పడిన నీరు, కార్బన్ డై ఆక్సైడ్, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను దేహం నుంచి బయటకు పంపడాన్ని విసర్జన అంటారు. విసర్జన క్రియను అధ్యయనం చేసే శాస్త్రం యూరాలజీ. మానవుడిలో ఒక జత మూత్రపిండాలు విసర్జన క్రియను నిర్వర్తిస్తాయి. మూత్ర పిండాలు విసర్జనతో పాటు రక్తం, కణజాలాల ద్రవాభిసరణ పీడనం, అయాన్లను సమతుల్యం చేస్తాయి.విసర్జన పద్ధతులు - జీవుల రకాలు
అమ్మోనోటెలిక్ జీవులు: అమ్మోనియాను విసర్జించే జీవులను అమ్మోనోటెలిక్ జీవులు అంటారు. దీని విష స్వభావం అధికంగా ఉంటుంది. ఉదా: అమీబా, హైడ్రా, అస్థి చేపలు, డిప్నాయ్ చేపలు, రొయ్యలు, పీతలు, నత్త, ఆల్చిప్ప, చిరుకప్ప, సముద్ర క్షీరదాలు (డాల్ఫిన్‌స, తిమింగలం)
యూరికోటెలిక్ జీవులు: యూరికామ్లాన్ని విసర్జిస్తాయి. విషస్వభావం చాలా తక్కువ. నీటికొరత ఉండే ఎడారి జీవుల్లో ఈ విధానం కనిపిస్తుంది. ఉదా: కీటకాలు (ఆర్థోపొడ) సరీసృపాలు (బల్లి, పాము, తొండ, మొసలి, తాబేలు), పక్షులు. కప్ప సుప్తావస్థ దశలో యూరికామ్లాన్ని విసర్జిస్తుంది.
యూరియోటెలిక్ జీవులు: యూరియాను విసర్జిస్తాయి. ఉదా: మంచినీటి చేపలు, వానపాము, ఉభయచరాలు (ఫ్రౌడకప్ప), క్షీరదాలు (మానవుడు). మొదటిసారి కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం ‘యూరియా’. దీని రసాయన నామం ‘కార్బమైడ్’
మానవ విసర్జన వ్యవస్థ
మానవుడి విసర్జన వ్యవస్థలో జత మూత్రపిండాలు, జత మూత్ర నాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి. పక్షుల్లో మూత్రాశయం ఉండదు. విసర్జక వ్యవస్థ ప్రాథమిక కర్తవ్యం రక్తం, శరీర ద్రవాల అయాన్ల సమతాస్థితిని కాపాడటం. ద్వితీయ కర్తవ్యం నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాల విసర్జన.
మూత్ర పిండాలు (కిడ్నీలు)
మూత్రనాళికలు (నెఫ్రాన్లు)
ఒక్కో మూత్ర పిండంలో 12 లక్షల (1.2 మిలియన్లు) నెఫ్రాన్లు ఉంటాయి. ప్రతి నెఫ్రాన్ (మూత్రనాళిక)లో రెండు భాగాలుంటాయి. అవి.
ఎ) భౌమన్స్ గుళిక
బి) నాళికా భాగం.
భౌమన్‌స గుళిక: ఇది ఒక గిన్నెవంటి భాగం. వృక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశించి అనేక ధమనికలుగా విభజన చెందుతుంది. భౌమన్ గుళికలోకి ఒక అభివాహి ధమనిక ప్రవేశించి అనేక రక్త కేశనాళికలుగా చీలి, రక్త కేశనాళికాగుచ్ఛాన్ని ఏర్పరుస్తుంది. దీనిలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తంలోని నీరు, మలినాలు భౌమన్‌స గుళికలోకి చేరుతాయి. ఈ వడబోతను సూక్ష్మగాలనం (ఆల్ట్రాఫిల్టరేషన్) అంటారు. భౌమన్‌స గుళికలో రక్తంలోని మలినాలు ఫిల్టరై ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. దీనిలో గ్లూకోజ్, కొన్ని క్లోరైడ్లు, విటమిన్లు ఉంటాయి.
నాళికాభాగం: ఇది భౌమన్స్ గుళిక వెనకభాగం. దీనిలో మూడు ఉప భాగాలు ఉన్నాయి.
ఎ) సమీప సంవళిత నాళం: ఇది ముడతలు పడి ఉంటుంది. దీనిలో 60 శాతం నీరు పునఃశోషణం చెందుతుంది.
బి) హెన్లీ శిఖ్యం: ఇది తలపిన్ను / సి ఆకారంలో ఉంటుంది. ఇందులో 20 శాతం నీరు పునఃశోషణం చెందుతుంది
సి) దూరాగ్రసంవళిత నాళం: దీనిద్వారా 15 శాతం నీరు పునః శోషణం అవుతుంది.
మూత్రాశయం
మూత్రం (యూరిన్) లక్షణాలు
ఒక వ్యక్తి రోజుకు సుమారు 1 నుంచి 1.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రంలో 96 శాతం నీరు, 2 శాతం యూరియా, 2 శాతం అకర్బన పదార్థాలుంటాయి.మానవుడు మూత్రం ద్వారా రోజుకు సుమారు 25 నుంచి 30గ్రాముల యూరియా విసర్జిస్తాడు.
యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం వల్ల మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. మూత్రం కొద్దిగా ఆమ్ల స్వభావంలో ఉంటుంది. దీని పీహెచ్ ‘6’. మానవుడి మూత్రంలో ‘సి’ విటమిన్ ఉంటుంది. మూత్రం శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటే యూరియా ‘అమ్మోనియా’ అనే విష పదార్థంగా మారుతుంది. అమ్మోనియా వల్ల మూత్రానికి ఘాటైన వాసన వస్తుంది. విసర్జితమైన మూత్రం కొంత సమయానికి వాసన వస్తుంది. మూత్రంలో గ్లూకోజ్, సోడియం ఉండవు. మధుమేహ వ్యాధిగ్రస్తుల మూత్రంలో గ్లూకోజ్ ఉంటుంది.
విసర్జనలో ఇతర అవయవాల పాత్ర
మూత్రపిండాలతో పాటు ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం కూడా వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి.
వ.సం. | విసర్జక అవయవాలు | జీవులు |
| 1. | సంకోచ రిక్తికలు | ప్రొటోజోవా జీవులు (అమీబా, పారమీషియం) |
| 2. | జ్వాలా కణాలు (ప్లేమ్‌సెల్స్) | ప్లాటి హెల్మింథిస్ జీవులు (బద్దెపురుగు, టేప్ వార్‌మ) |
| 3. | వృక్కాలు | అనిలెడ (వానపాము, జలగ) |
| 4. | మాల్ఫీజియన్ నాళికలు | ఆర్థ్రోపొడ (బొద్దింక, ఈగ) |
| 5. | హరిత గ్రంథులు | ఆర్థ్రోపొడ (రొయ్యలు, పీతలు) |
| 6. | కోక్సల్ గ్రంథులు | ఆర్థ్రోపొడ (తేలు) |
| 7. | కీబర్‌స అవయవం | మొలస్కా (నత్తలు) |
| 8. | బొజానస్ అవయవం | మొలస్కా (ఆల్చిప్ప) |
| 9. | మూత్రపిండాలు (కిడ్నీ) | చేప, ఉభయ చరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు |