ప్రపంచ రంగస్థల దినోత్సవం - World Theatre Day
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.
నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.
Also Read : International Theatre Institute ITI
1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.
Also Read : About World Theatre Day in English
రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు.1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు.
లక్ష్యాలు
- ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
- ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
- విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
- మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
- నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం