67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు - 67th National Film Awards
ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేసింది.
2021, మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహర్షి ఎంపిక కాగా, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలిచింది. రాజు సుందరం(మహర్షి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, నవీన్ నూలి(జెర్సీ) ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (‘భోన్‌స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు.
మలయాళ సినిమాకు 11 అవార్డులు...
2019 జాతీయ సినిమా అవార్డుల్లో మలయాళ సినిమాకు మొత్తం 11 పురస్కారాలు దక్కాయి. ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 అవార్డులను మలయాళ సినిమా గెలుచుకుంది.
67వ చలన చిత్ర అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు వచ్చాయి. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.
అవార్డులు–విజేతలు