Type Here to Get Search Results !

Vinays Info

రైతు చైతన్య ఉద్యమాలు

భూస్వాముల దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా కొన్ని గ్రామాల్లో సందర్భాన్ని బట్టి తిరుగుబాట్లు ప్రారంభమయ్యేవి. ముఖ్యంగా 1940-46 మధ్యకాలంలో ఆంధ్రమహాసభ - కమ్యూనిస్టులు ఇటు భూస్వాములను అటు ప్రభుత్వాన్ని కూడా సమాంతరంగా కదిలించేలా పేద రైతు కూలీలు, ప్రజలతో చాలా బలమైన పోరాట పునాదులను నిర్మించారు.

వెట్టిచాకిరి విధానం

- పేదలతో ఉచితంగా, బలవంతంగా, దౌర్జన్యంగా పనిచేయించుకునే వెట్టిచాకిరి విధానం హైదరాబాద్ సంస్థానంలో, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేది. సంస్థానాధీశులు, పాయిగాలు, జాగీర్దార్లు, భూస్వాములు, ప్రభుత్వాధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను అనేకరకాలుగా దోపిడీ చేసేవారు. భూస్వామ్య విధానం అమల్లో ఉన్న ప్రతి గ్రామంలోని కుల వృత్తుల సేవకులైన చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి కులాలతోపాటు మిగతా కులాల వారిని భూస్వాములు వెట్టిచాకిరీకి వినియోగించుకోవడమే గాక బానిసల కంటే హీనంగా చూసేవారు. ఇక మాల, మాదిగలను మరీ హీనంగా చూసేవారు. దీనికితోడుగా నిర్బంధ, బలవంతపు శ్రమ దోపిడీ, అక్రమ వసూళ్లు, తీవ్రమైన శిక్షలు, కుల వివక్ష, స్త్రీలపై అకృత్యాలు, బలవంతపు పన్నులు, లెవీ వసూలు, నాగు వడ్డీ (ధాన్యంపై అధిక వడ్డీ) వసూలు మొదలైన వాటిని బలవంతంగా పేదలపై మోపి వసూలు చేసేవారు.

శాంతియుత రైతాంగ ఉద్యమాలు (1930-46)

- 1930లో ఆంధ్రమహాసభ ఏర్పాటైంది. ఈ సంస్థ నాయకులు సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందముల నర్సింగరావు, మహిళా సభ నాయకులు బూర్గుల అనంతలక్ష్మి, మాడపాటి మాణిక్యమ్మ, నడింపల్లి సుందరమ్మ, రంగమ్మ, విఠోబాయి తదితరులతో తెలంగాణ ప్రజానీకం ప్రభావితమైంది. 1934, 1938లో ఏర్పాటైన ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజలను ప్రభావితులను చేశారు. 1939లో స్థాపించిన కామ్రేడ్స్ అసోసియేషన్ నాయకులు జవాద్ రజ్వీ, రాజబహదూర్ గౌర్, సయ్యద్ ఇబ్రహీం, ఆలం కుంద్ మీర్, 1939లో ఏర్పాటైన హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, వీడీ దేశ్‌పాండే, శ్రీనివాసరావు, ఎస్‌వీకే ప్రసాద్, పెరవెళ్లి వెంకట రమణయ్య, చిర్రావురి లక్ష్మీనర్సయ్య, మఖ్దూం మొయినుద్దీన్, డీవీ సుబ్బారావు, బీ ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి, డీ రాఘవేంద్రరావు, సీ తిరుమలరావు, సీ యాదగిరిరావు, హఫీజుద్దీన్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి తదితరుల ప్రభావం, మహిళా కమ్యూనిస్టు నాయకులు అందించిన సహాయ సహకారాలతో భూస్వాములకు వ్యతిరేకంగా శాంతియుతమైన రైతాంగ ఉద్యమాలను నిర్వహించారు.

షేక్ బందగి ప్రతిఘటన

- విసునూరు దేశ్‌ముఖ్ రాపాక వెంకటరామచంద్రారెడ్డి అధికార పరిధిలోని జనగామ తాలూకా కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిజాయితీపరుడైన పేద ముస్లిం రైతు బందగి సాహెబ్. తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమి విషయమై బందగికి, ఆయనకు వరుసకు సోదరులైన ఫకీర్ అహ్మద్, అబ్బాస్ అలీలతో వివాదం తలెత్తింది. దేవరుప్పుల, కామారెడ్డిగూడెంలకు పోలీస్ పటేల్ అబ్బాస్ అలీ. దీంతో భూమి వివాదంపై అబ్బాస్ అలీ విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిని ఆశ్రయించాడు. కానీ, న్యాయమైన హక్కుదారుడైన బందగి సాహెబ్ దేశ్‌ముఖ్‌కు కూడా లొంగలేదు.
- చివరికి వివాదం కోర్టుకు చేరింది. అయితే, తీర్పు బందగి పక్షాన వచ్చింది. ఇది భరించలేని అబ్బాస్ అలీ సోదరులు దేశ్‌ముఖ్ మద్దతుతో 1940, జూలై 26న బందగిని అతి దారుణంగా నరికి హత్య చేశారు. ఈ సంఘటన తెలంగాణ ప్రజానీకంలో ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది.

ధర్మాపురం-మొండ్రాయి లంబాడాల తిరుగుబాటు

- జనగామ తాలూకాలోని ధర్మాపురం, మొండ్రాయి గ్రామాలు మక్తేదార్లు పుసుకూరు రాఘవరావు, కఠారు నరసింహారావు ఆధీనంలో ఉండేవి. ఈ గ్రామాల పరిధిలో 200 ఎకరాల బంజరు భూమిని గిరిజనులు సాగు చేసుకునేవారు. ఈ భూములను భూస్వాములు ఆక్రమించుకోవడమే కాకుండా ఎదురు తిరిగిన గిరిజన నాయకులపై కేసులు కూడా పెట్టించారు. చివరికి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో గిరిజనులు తిరుగుబాటు చేసి భూములను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రబాడు ప్రజా తిరుగుబాటు

- నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎర్రబాడు గ్రామ భూస్వామి జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి పేరిట 1,50,000 ఎకరాల భూమి ఉండేది. తన పరిధిలోని గ్రామాలైన చిల్పకుంట, ఎడవెళ్లి, నూతనకల్లు గ్రామాలకు చెందిన రైతులను వారి వ్యవసాయ భూముల నుంచి వెళ్లగొట్టి, ఆ భూములను తన పేరు మీద రాయించుకొని, తన గూండాల ద్వారా పేద రైతులపై దాడి చేసి, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. కానీ ఎడవెల్లి గ్రామ నాయకుడైన గాజుల రామచంద్రయ్య నాయకత్వంలో రైతులు తిరుగుబాటు లేవదీసి భూములను తిరిగి దక్కించుకున్నారు.
- సూర్యాపేట తాలూకా పాత సూర్యాపేట గ్రామ దేశ్‌ముఖ్ కుందూరు లక్ష్మీకాంతరావు, హుజూర్‌నగర్ తాలూకా బేతవోలు మక్తేదారు తడకమళ్ల సీతారామచంద్రారావు, బక్కమంతుల గూడెం భూస్వామి బోగాల వీరారెడ్డి, మల్లారెడ్డి గూడెం పోలీస్ పటేల్ మేళ్లచెరువు బంజరుదారు వీరభద్రరావు, వరంగల్ జిల్లాలోని అల్లీపురం, తిమ్మాపురం జాగీర్దార్ అన్వర్‌పాషా, ములకలగూడెం జమీందారు పింగళి రంగారెడ్డి వంటి పెద్ద భూస్వాములపైనే కాకుండా చిన్నాచితకా 5000 ఎకరాలకుపైగా భూములున్న భూస్వాములపై కూడా రైతులు తిరుగుబాటు చేశారు.

చాకలి అయిలమ్మ భూపోరాటం

- వేల ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా తమ ఆధీనంలో ఉంచుకున్న భూస్వాములు, చట్టబద్ధంగా బంజరు భూములను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్న పేద రైతు కూలీలను మాటిమాటికి బేదాఖల్ రూపేణా తొలగిస్తూ నానా రకాలుగా బాధించేవారు.
- మల్లంపల్లి మక్తేదారు ఉత్తంరాజు రాఘవరావుకు సంబంధించిన పాలకుర్తి పరిధిలోని 10 ఎకరాల తరి భూమిని, 20 ఎకరాల ఖుష్కీని స్థానిక రజక కుటుంబమైన చిట్యాల నరసయ్య, అయిలమ్మలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండేవారు.
- ఉద్యమకాలంలో ఈ కుటుంబం దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డికి, స్థానిక పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల సంఘానికి సహకరిస్తుందనే కారణంతో పాలకుర్తి జాతర సందర్భంగా జరిగిన దొమ్మిని పాలకుర్తి కుట్ర కేసుగా బనాయించి అయిలమ్మ భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలతోపాటు పార్టీ ముఖ్య నాయకులను జైలుకు పంపించారు. - ఈ సమయంలోనే చాలా తెలివిగా విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, మల్లంపల్లి మక్తేదారు నుంచి తాను అయిలమ్మ, నర్సయ్యల భూమిని కౌలుకు తీసుకున్నట్లు ఒక ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నాడు. అంతేకాకుండా ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా తీసుకున్న దేశ్‌ముఖ్ చేతికందివచ్చిన పంటను తన మనుషుల ద్వారా దక్కించుకోవాలని దాడి చేయించాడు. అయితే, అప్పటికే జిల్లా పార్టీ నిర్ణయం మేరకు అయిలమ్మ కుటుంబానికి రక్షణగా ఉన్న స్థానిక నాయకులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్లు ప్రతాప్‌రెడ్డి, నల్లా నర్సింహులు మొదలైనవారు ప్రజల సహాయ సహకారాలతో వారి దాడిని విజయవంతంగా ఎదుర్కొని ఆ గూండాలకు దేహశుద్ధి చేసి అయిలమ్మ పంటను ఆమె ఇంటికి చేర్చారు. ఆనాడు ఈ సంఘటనలో అయిలమ్మ చూపించిన ధైర్యానికి, తెగువకు ఆమె పార్టీకి, నాయకులకు అందించిన సహాయ సహకారాలకు జిల్లా పార్టీ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎంతో ఆశ్చర్యపోయాడు. అందుకే ఈమె చరిత్రలో కమ్యూనిస్టు అయిలమ్మగా పేరుగాంచింది.
- ఈ విధంగా భూస్వాముల దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా కొన్ని గ్రామాల్లో సందర్భాన్ని బట్టి తిరుగుబాట్లు ప్రారంభమయ్యేవి. ముఖ్యంగా 1940-46 మధ్యకాలంలో ఆంధ్రమహాసభ - కమ్యూనిస్టులు ఇటు భూస్వాములను అటు ప్రభుత్వాన్ని కూడా సమాంతరంగా కదిలించేలా పేద రైతు కూలీలు, ప్రజలతో చాలా బలమైన పోరాట పునాదులను నిర్మించారు. అంతేకాకుండా వారు తీసుకున్న సమస్యలన్నీ ప్రభుత్వ నిబంధనలు, ఆంధ్రమహాసభ తీర్మానాల పరిధిలోనే ఉండేవి.

మాదిరి ప్రశ్నలు


1. ఆంధ్రమహాసభ ఎప్పుడు ఏర్పాటైంది? (1)

1) 1930
2) 1931
3) 1932
4) 1933

2. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ 1938లో ఏర్పాటు కాగా, హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది? (2)

1) 1938
2) 1939
3) 1940
4) 1941

3. బందగి సాహెబ్ ఎప్పుడు హత్యకు గురయ్యాడు? (3)

1) 1941, జూన్ 26
2) 1941, జూలై 26
3) 1940, జూలై 26
4) 1940, జూన్ 26

4. హైదరాబాద్ రాజ్యంలో దేనికి వ్యతిరేకంగా మొదటి ప్రజా ఉద్యమం జరిగింది? (4)

1) వందేమాతర ఉద్యమం
2) క్విట్ ఇండియా ఉద్యమం
3) ముల్కీ ఉద్యమం
4) చందా రైల్వే పథకం

5. తెలంగాణ గ్రామాల్లో ఉండే భూస్వాములను ఏమని పిలిచేవారు? (4)

1) మక్తేదారులు
2) సర్ఫాస్‌లు
3) పట్టేదారులు
4) ఎ, బి

6. చందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగిన సంవత్సరం? (3)

1) 1896
2) 1893
3) 1883
4) 1886

7. హైదరాబాద్‌లో మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది? (1)

1) కృష్ణ అయ్యంగార్
2) రామచంద్ర పిైళ్లె
3) ముత్యాల రామన్న
4) సజ్జన్‌లాల్

8. హైదరాబాద్ నగరంలో ఆర్య సమాజ్ శాఖ ఎప్పుడు స్థాపించారు? (3)

1) 1888
2) 1890
3) 1892
4) 1893

9. ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? (2)

1) 1921
2) 1923
3) 1925
4) 1926

10. మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి అధ్యక్షత వహించినది? (1)

1) నడింపల్లి సుందరమ్మ
2) యోగ్య శీలాదేవి
3) టీ వరలక్ష్మమ్మ
4) ఎల్లాప్రగడ సీతాకుమారి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section