Type Here to Get Search Results !

Vinays Info

ఈశాన్య రాష్ట్రాలు - ముఖ్య సమాచారం

ఈశాన్య భారతంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర ఉన్నాయి. వీటిని ‘సెవెన్‌ సిస్టర్స్‌’గా పేర్కొంటారు. 1975లో సిక్కిం.. భారత్‌లో విలీనం కావడంతో వీటి సంఖ్య 8కి పెరిగింది. బ్రిటిష్‌ హయాంలో సిక్కిమ్‌.. భారత రక్షణలో ఉన్న రాజ్యంగా ఉండేది. మణిపూర్‌, త్రిపురలు సంస్థానాలుగా ఉండేవి. అవి 1949లో భారత్‌లో విలీనమయ్యాయి.

-  విభిన్న సమాహారం..

ఈ ప్రాంతంలో దాదాపు 220 జాతులు, 180 భాషలు ఉన్నాయి. వీటికి భారత్‌కు చెందిన ప్రధాన భూభాగంలో ఉన్న భాష, గిరిజన, మత, కుల, సాంస్కృతిక తీరుతెన్నులకు పోలికే ఉండదు. కొండలు, అడవులు వంటి విభిన్న భౌగోళిక ప్రదేశాల్లో ఈశాన్య భారత తెగలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంత భాషలు టిబెటో-బర్మన్‌ కుటుంబానికి చెందినవి. ఇక్కడ సమాజాల్లో వర్గీకరణ కులాలవారీగా కాకుండా జాతులు, తెగల ఆధారంగా ఉంటుంది. ఇక్కడి భిన్నత్వం స్థాయిని చూసిన విశ్లేషకులు ఈ ప్రాంతాన్ని మినీ ఉపఖండంగా, మినీ భారత దేశంగా అభివర్ణిస్తుంటారు.

-  ప్రత్యేక సంస్థలు, చట్టాలు

ఈశాన్యంలో ప్రత్యేకతల దృష్ట్యా.. ఆ ప్రాంతానికే పరిమితయ్యే ప్రత్యేక చట్టాలు, సంస్థలను భారత్‌ సిద్ధం చేసింది. ఇక్కడి సంస్కృతులు, భూములు, తెగల హక్కులకు భారత రాజ్యాంగంలోని 6 షెడ్యూల్‌, 371ఏ అధికరణ రక్షణ కల్పిస్తున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి ‘ఈశాన్య మండలి చట్టం-1971’ని కేంద్రం తీసుకొచ్చింది. ఆర్థికాభివృద్ధికి నోడల్‌ సంస్థ, ప్రత్యేక సెక్రటేరియట్‌ ఏర్పాటయ్యాయి. 2001లో వాజ్‌పేయి హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి.. కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటైంది.

-  అసోం..

ఈ రాష్ట్రం బహుళ తెగలు, భాషలు, మతాల సంగమం. ఇక్కడ ఎక్కువగా ఇండో-ఆర్యన్‌, ఆస్ట్రో-ఏసియాటిక్‌, టిబెటో-బర్మన్‌ భాషలు మాట్లాడతారు. చారిత్రకంగా ఇక్కడ తాయ్‌-అహోమ్‌ల ఆధిపత్యం ఎక్కువ. వాస్తవానికి అస్సామీలు అంటే ఈ తెగవారే. నేడు అస్సామీ భాష మాట్లాడేవారిని అస్సామీలుగా పేర్కొంటున్నారు. బెంగాలీలు కూడా మరో పెద్ద తెగ. అయితే బెంగాలీలను మిగతా తెగలవారు అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. బోడోలాండ్‌ ప్రాంతంలో బోడోల ఆధిపత్యం ఎక్కువ.

-  నాగాలాండ్‌..

ఇక్కడ నాగా తెగలదే ఆధిపత్యం. మైదాన ప్రాంతాల్లో కుకీలు, కచారీలు, గారోలు, మిక్రిలు, బెంగాలీలు, అస్సామీలు ఉంటారు. నాగాల్లో దాదాపు 16 ఉపతెగలు ఉన్నాయి. వీరికి గ్రామాలవారీగా మాండలికాలు ఉన్నాయి. నాగా సంస్కృతిలో పండుగలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటిలో పాలుపంచుకోవడం తప్పనిసరి.

-  మణిపూర్‌..

మణిపూర్‌లో శతాబ్దాలుగా భిన్న తెగలు, సంస్కృతులు కలిసి జీవనం సాగించాయి. చివరికి పరస్పరం కలసిపోయాయి. ఇక్కడ జనాభాలో మెయిటెయ్‌ తెగలదే ఆధిపత్యం. వీరు మణిపురీ భాష మాట్లాడతారు. మెయిటెయ్‌ల్లో ఏడు ఉపతెగలు ఉంటాయి. వీటిని ‘సలాయ్‌’గా పిలుస్తారు.

-  త్రిపుర

ఒకప్పుడు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్‌లో విస్తరించిన త్రిపుర సామ్రాజ్యంలో నివసించినవారిని త్రిపురిలుగా పేర్కొంటారు. 1949లో ఈ రాజ్యం భారత్‌లో విలీనమయ్యేవరకూ డెబ్బార్మాస్‌కు చెందిన రాచకుటుంబాలు త్రిపురిలను 2వేల ఏళ్లకుపైగా పాలించారు. ఈ త్రిపురిలు కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఐదు నుంచి 50 కుటుంబాలు కలసి ఒక సమూహంగా జీవనం సాగిస్తాయి. త్రిపురిల్లో వివిధ కొండ గిరిజన ఉపతెగలు ఉన్నాయి.

-  మిజోరం..

శతాబ్దాల కిందట తూర్పు, దక్షిణ భారత దేశానికి విస్తరించిన మంగోలియన్‌ తెగలో మిజోలను భాగంగా చరిత్రకారులు భావిస్తారు. మిజోల్లో ఐదు ప్రధాన తెగలు ఉన్నాయి. 11 మైనర్‌ తెగలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఉమ్మడిగా ‘అవ్జీయా’గా పేర్కొంటారు. వీరు టిబెటో-బర్మన్‌ మూలాలున్న మాండలికాన్ని మాట్లాడతారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ క్రైస్తవ మిషనరీల ప్రభావానికి మిజోలు ఎక్కువగా లోనయ్యారు. నేడు ఇక్కడ క్రైస్తవ జనాభాయే ఎక్కువ. అక్షరాస్యత విషయంలో ఈ రాష్ట్రం.. దేశంలోనే రెండోస్థానంలో ఉంది.

-  అరుణాచల్‌ ప్రదేశ్‌..

ఈ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు, అనేక ఉప తెగలు ఉన్నాయి. వీటిలో కొన్ని తెగల మూలలు ఒక్కటే కావడం వల్ల వీటి మధ్య సారూప్యతలు ఉన్నాయి. భౌగోళికంగా పరస్పరం దూరంగా జరగడం వల్ల భాష, వేషధారణ, ఆచారాల్లో భిన్నత్వం వచ్చింది. మోన్పా, టిబెటనట్లు, ఖంబా, అపటాని/ టాని, గాలో/అబోర్‌, నిషి/దఫియా, కర్బీ, సింగ్ఫో, కోన్యాక్‌ వంటి తెగలు ఉన్నాయి.

-  మేఘాలయ

ఖాసీ, గారో గిరిజనులను మేఘాలయకు సంబంధించిన అసలైన గిరిజనులుగా భావిస్తారు. ఖాసీ తెగ.. మోన్‌-ఖ్మేర్‌ భాషను మాట్లాడుతుంది. ఇంకా ఇక్కడ నార్‌-సింటెంగ్‌, నేపాలీ, హైజాంగ్‌, బెంగాలీ, అస్సామీ, హిందీ భాషలు మాట్లాడుతుంటారు. జైంతియా, కోచ్‌, జొవాయ్‌, బోరో, హజాంగ్‌, దిమాసా వంటి మైనార్టీ తెగలు కూడా ఇక్కడ ఉన్నాయి.

-  సిక్కిమ్‌

17వ శతాబ్దం నుంచి సిక్కిమ్‌లో జాతుల వైవిధ్యాన్ని ‘లో-మోన్‌-సాంగ్‌’గా అభివర్ణిస్తుంటారు. ఈ మూడు తెగలు 17వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉంటున్నాయి. ఆ శతాబ్దం నుంచి నేపాలీలు కూడా ఇక్కడి వలసరావడం మొదలుపెట్టారు. ప్రస్తుత జనాభాలో 61 శాతం మంది నేపాలీలు ఉన్నారు. ఇక్కడ నేపాలీ భాషను ప్రధానంగా మాట్లాడతారు. ఇంకా భూటియా, జోంగ్‌చా, గ్రోమా, గురుంగ్‌, లెప్చా, లింబు, మగర్‌ వంటి భాషలూ వాడుకలో ఉన్నాయి. జనాభాలో 57.75 శాతం మంది హిందు మతాన్ని, 28.1 శాతం మంది వజ్రాయన బౌద్ధాన్ని పాటిస్తారు.

-  వేర్పాటువాదం

ఈశాన్య భారతానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టిన భిన్న జాతులు, తెగలు, భాషలు.. చివరికి ‘ప్రత్యేక’ ఉద్యమాలకు, వేర్పాటువాదాలకు, తీవ్రవాదానికి కేంద్రబిందువుగా మారాయి. తెగలవారీగా జాతీయవాదం పెరగడంతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ప్రత్యేక రాష్ట్రాలు, ప్రత్యేక దేశం కోసం, ఎస్టీలుగా గుర్తింపు కోసం జరుగుతున్న ఉద్యమాలు రక్తసిక్తమయ్యాయి. వెలుపలి నుంచి వచ్చిన వారితోపాటు కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలోనే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర తెగల నుంచి సమస్యలు పెరిగాయి. మొత్తం మీద ఈ ప్రాంతంలో 40కిపైగా వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ తీవ్రస్థాయిలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, అవినీతి వంటివి వీటికి ఆజ్యం పోస్తున్నాయి.
                

Top Post Ad

Below Post Ad

Ads Section