ప్రశ్న: సన్నజాజి, విరజాజి వంటి కొన్ని పువ్వులు రాత్రుల్లోనే ఎందుకు విచ్చుకుంటాయి?
జవాబు: పుష్పాల రంగులకు, మకరందాల రుచులకు, సుగంధపు వాసనలకు కారణం వివిధ రకాల సేంద్రియ రసాయనాలే. రంగులనిచ్చేందుకు కెరోటిన్ పదార్థం కారణం. అలాగే గ్లూకోజు, ఫ్రక్టోజు వంటి వివిధ రకాల తేలిక పాటి చక్కెర పదార్థాల వల్లే మకరందాలు తేమగా ఉంటాయి.
పుష్పాలకున్న విశిష్టమైన సువాసనలకు కారణం ఆయా పుప్పొడి రేణువుల మీద, పుష్ప దళాల మీద ఉండి తేలిగ్గా ఆవిరయ్యే టర్పీనులు, ఎస్టర్లు, ఆల్కలాయిడ్లు కారణం. పుష్పాల రంగులు, మకరందాల రుచులు, పుష్ప సౌరభాల గుబాళింపులు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ఎంచుకున్న ఏర్పాటే. రాత్రుళ్లు సంచరించే కీటకాల ద్వారా పుప్పొడి రేణువుల వ్యాప్తి కోసమే కొన్ని పుష్పాలు రాత్రుళ్లు విచ్చుకుంటాయి. పుష్పాలలో ఉన్న మకరందాల, వర్ణాల, వాసనల రసాయనాలకు కాంతి సమక్షంలో చర్యనొందే లక్షణాలుంటాయి. కాంతి సమక్షంలో రసాయనాలు ప్రేరేపితమై పత్రదళాల్ని విప్పారించే విధంగా పగలు విచ్చుకునే పుష్పాలలో ఏర్పాటు ఉంటుంది. కాంతి ఉంటే విచ్చుకోకుండా కాంతి లేనట్లయితే చీకట్లో దళాల్ని విప్పదీసే విధంగా విరజాజి, సన్నజాజి కొన్ని మల్లె జాతుల్లో ఏర్పాటు ఉంటుంది. కాంతి గ్రాహకాల రసాయనిక లక్షణాల ఆధారంగానే పగలు లేదా రాత్రిళ్లు విచ్చుకునే తేడా ఉంటుంది.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)