మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే గనుక లేకుంటే ఇంజన్ లేని రైలు, దారంలేని గాలిపటం అవుతాయి. మన కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా వుండేలా చూసుకోవాలి. ఆ అవగాహన ఏర్పర్చుకోడానికి, అప్రమత్తంగా ఉండటానికి, అవసరమైన ప్రణాళికలు రచించుకోడానికి, జాగ్రత్తలేంటో తెలుసుకుని పాటించడానికి ఉద్దేశించినదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.
ఈరోజున ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు చర్చలు జరపడం, సెమినార్లు నిర్వహించడం, మెంటల్ డిజార్డర్లేమీ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక వైకల్యంతో బాధపడ్తున్న వారికి చికిత్స లాంటివన్నీ ఏర్పాటుచేస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం వుంది.
శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక దౌర్బల్యం శారీరకంగా క్షీణింపచేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢంగా వుండేట్లు చూసుకోవాలి. అప్రమత్తంగా వుండేందుకు అవసరమైన అంశాలను తెలుసుకోవాలి. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సలహా, సహకారాలతో 1992లో తొలిసారి వరల్డ్ పెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రోద్బలంతో ఈ దినాన్ని జరిపారు. కొన్ని దేశాల్లో ఈరోజు మొదలు వారంపాటు మెంటల్ ఇల్‌నెస్ అవేర్‌నెస్ వీక్ పేరుతో సెమినార్లు, చికిత్సలు నిర్వహిస్తారు.
మానసిక రోగం పేరు చెప్తే చాలు మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా మనం తల్లడిల్లిపోతాం. మనతోబాటు మనవాళ్ళూ ఆందోళన చెందుతారు. నిజానికి మనలో 40 శాతం పిచ్చివాళ్ళేననేది నిపుణుల అంచనా. అది మెడికల్ అనాలిసిస్ మాత్రమే. ఇంకా ఫ్రాంకుగా, నిఖార్సుగా చెప్పాలంటే పూర్తి నార్మల్‌గా వుండేవాళ్లు బహుశా ఏ రెండు శాతమో వుంటారు. మనచుట్టూ ఎంత అబ్‌నార్మాలిటీ! ఎన్ని వింత పోకడలు? తిండి పిచ్చి, డబ్బు పిచ్చి, నగల పిచ్చి, పుస్తకాల పిచ్చి, పేరుపిచ్చి, సినిమాల పిచ్చి.. గొప్పలు చెప్పడం, అప్పులు చేయడం, ఆడంబరాలు పోవడం, షాపింగు, అతి వాగుడు, మితిమీరిన కోపం... అబ్బో.. చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత లిస్టవుతుంది.
ఈ జనసామాన్యమైన సంగతి అలా వుంచితే వైద్య పరిభాషలో డిప్రెషన్, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్ (ఇన్‌సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించు కోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది. కష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా వుండగల్గితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. కనుక వత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచించమని చెప్తున్నారు సైకియాట్రిస్టులు. వత్తిడి, ఆందోళన తగ్గించు కోడానికి కొన్నిరకాల వ్యాయామాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా మెడిటేషన్ వల్ల ఎంతటి స్ట్రెయినైనా, ఎలాంటి స్ట్రెస్సయినా మటుమాయమౌతుందని రుజువుచేసి చూపిస్తున్నారు
మానసిక, శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి గనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండోదాని క్కూడా తీసుకోవడం మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొన్ని కాంప్లికేటెడ్ లేదా క్రానిక్ కేసులు నర్సింగ్‌హోమ్‌లో చేరి డాక్టర్ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపింతిచే ఫలితం వుంటుందని కూడా చెప్తున్నారు. మానసిక రోగులకు మందులతో బాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అనేక ఇతర కారణాల తోబాటు సహనం లేకపోవడం డిజార్డర్లకు దారితీస్తుందనేది వైద్యుల అభిప్రాయం. మరో సంగతేమంటే పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి దారితీస్తుందట. అందుకే 'యాన్ ఐడీల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్‌షాప్(An idle man's brain is devil's workshop)'' అన్నారు. చేతినిండా పని, మనసునిండా దాన్నెంత బాగా చేయాలా అనే తపన వుంటే ఇక లేనిపోని ఆలోచన్లకు, మైండు పాడుచేసు కోడానికీ తావెక్కడిది?
అనేక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ టీమ్‌లు ప్రపంచ మానసిక ఆరోగ్య దినానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆందోళన, వత్తిడి అనేవి డిప్రెషన్‌కు దారితీస్తాయి కనుక ముందుగా వాటికి చెక్‌పెట్టమని హితవు చెప్తున్నారు నిపుణులు. నిద్రలేమి లేదా ఇన్‌సోమ్నియా కూడా ఒకరకమైన మానసిక వ్యాధే. అంతూదరీలేని వ్యాకుల మనసులో పేరుకుపోయివుంటే నిద్రపట్టదు. ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. లేకుంటే శారీరక బడలిక తీరదు, మానసిక ప్రశాంతత లభించదు. కలతపరిచే ఆలోచనలు, చేటుచేసే చేష్టలు మానుకుంటే మానసిక రుగ్మతలేవీ దరిచేరవు అంటున్నారు సైకియాట్రిస్ట్ పెర్కిన్.
తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో కనీసం గంట సేపు వ్యాయామం, శక్తికి మించిన అలసట, దుర్భరమైన నొప్పి లేకుండా చూసుకోవడం, రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా, కుంగిపోకుండా వుండాలి. లోకంలో పరిష్కారం లేని సమస్యంటూ గుర్తించి, ప్రయత్నిస్తే ఆందోళనే వుండదు ఈపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే మానసిక రుగ్మతలు దరిచేరవని హామీ ఇస్తున్నారు నిపుణులు. ఇన్ని మాటలెందుకు.. క్లిష్టసమస్య లెదురైనా తలమునకల వకుండా ధైర్యంగా పరిష్కరించుకోగల్గితే, అందనివాటికి అర్రులు చాచి ఆందోళన చెందకుండా మనసు పదిలంగా వుంచుకుంటే చాలు మానసిక వైకల్యానికి తావే లేదు.
అన్నట్టు, టెర్రరిజం వల్ల పాకిస్తాన్ లో50 లక్షల మంది మానసిక రుగ్మతకు గురౌతున్నారని uno ఇటీవల ఓ సర్వే లో వెల్లడించగా.... అలాగే సామాజిక మాధ్యమాల వల్ల మన దేశంలో ఎక్కువగా ఈ మానసిక ఆందోళనలకు గురౌతున్నారని వెల్లడించింది.
ఏ లక్షణమైనా సరే అవధులు దాటినప్పుడు అది పిచ్చిచేష్ట అవుతుంది. లిమిట్స్‌లో ఉన్నంత వరకూ ఏదీ తప్పు కాదు.