తెలంగాణ విశిష్ట సంస్కృతి జాతర
జాతర.. ఈ పేరు చెప్పగానే తెలంగాణ ప్రజలు భక్తి పారవశ్యంలో ఊగిపోతారు. ఇష్టదైవాన్ని ప్రజలంతా కులాలు, అంతస్తులకు అతీతంగా కొలిచే బహిరంగ వేడుకే జాతర. తెలంగాణలో తప్ప ఈ విశిష్ట సంస్కృతి ఎక్కడా కానరాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ప్రతి గ్రామంలోనూ నిర్ణీత కాలంలో జాతరలు నిర్వహిస్తారు. గ్రూప్స్ ఉద్యోగార్థుల కోసం రాష్ట్రంలోని ప్రధాన జాతరల సమాచారాన్ని అందిస్తున్నాం..
మెదక్
👉ఏడుపాయల జాతర :
ఈ జాతర మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో జరుగుతుంది.
-ఈ ప్రాంతం వద్ద మంజీర నది ఏడు పాయలుగా చీలిపోతుంది. ఇక్కడే దుర్గాభవాని ఆలయం ఉంది.
-ఈ ఏడుపాయల్లో మూడుపాయలు దుర్గాభవాని ఆలయం ముందు వైపు నుంచి, మిగిలిన నాలుగు పాయలు దుర్గాభవాని ఆలయం వెనుక వైపు నుంచి ప్రవహిస్తాయి.
-ఈ జాతర ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జరుగుతుంది.
👉దుర్గాభవాని దేవాలయం
-ఈ ఆలయాన్ని గరుఢ గంగ అని కూడా అంటారు.
-ఆ జాతరను మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
-ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధానంగా ఏడుపాయల స్నానం ఆచరిస్తారు.
-ఈ జాతరలో పాల్గొన్న భక్తులు ఒక రాత్రి గుడిలో నిద్రపోవడం ఆచారంగా కొనసాగుతున్నది.
👉జోగినాథుని జాతర
-మెదక్ జిల్లా జోగిపేటలోని కొండపై జోడు లింగాలుగా వెలసిన జోగినాథుని జాతర ప్రతి ఏటామార్చిలో జరుగుతుంది.
👉కేతకి సంగమేశ్వర స్వామి జాతర
-మెదక్ జిల్లాలో జహీరాబాద్ సమీపాన ఝరాసంగం గ్రామంలో కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది.
-ప్రతి ఏడాది మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
🔹నల్లగొండ
-గొల్లగట్టు జాతర/దురాజ్‌పల్లి జాతర
-తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర.
-ఈ జాతర జరిగే ప్రదేశం - నల్లగొండ జిల్లా సూర్యాపేట దగ్గరలోని పాలశేర్లయ్యగట్టు ప్రాంతం
-ఈ జాతరను పెద్దగట్టు జాతర అని కూడా అంటారు.
-యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి రెండేండ్లకోసారి నిర్వహిస్తారు. లింగమంతుల స్వామి సోదరి - చౌడమ్మ.
-నాలుగు రోజుల పాటు ఈ జాతరను నిర్వహిస్తారు.
-మొదటిరోజు : 30 విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. తదనంతరం కంకణాలు కట్టి ఊరేగింపుగా గుట్టపైకి తీసుకువస్తారు. తర్వాత చౌడమ్మకు మొక్కులు చెల్లిస్తారు. ఖాసీంపేట యాదవులు పసిడికుండను ఆలయ గోపురం మీద అలంకరిస్తారు.
-రెండో రోజు : బోనాలు వండుకొని లింగమంతుల స్వామికి, పక్కన ఉన్న చౌడమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు.
-మూడో రోజు : నెలవారం చేసి పోతరాజు, మిగిలిన దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తారు.
-నాల్గవ/చివరి రోజు : సూర్యాపేట యాదవులు మకరతోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. తదనంతరం పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర పూర్తవుతుంది.
-ఈ జాతరలో దిష్టిపోయడం అనేది ప్రధాన ఆచారంగా వస్తుంది. దీన్ని వరంగల్ జిల్లా చికటాయపాలెంలోని దేవరవంశీయులు, నల్లగొండ జిల్లాకు చెందిన తుండు, మట్ట వంశ పూజారులు నిర్వహిస్తారు.
👉చెర్వుగట్టు జాతర
-నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉత్సవాలు జరుగుతాయి.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీజడల రామలింగేశ్వరస్వామి.
👉మేళ్లచెర్వు జాతర
-నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకాలోని మేళ్లచెర్వు గ్రామ సమీపంలో ఈ జాతర జరుపబడుతుంది.
-ఈ జాతరలో శంభులింగేశ్వరస్వామి ప్రధాన దైవం.
-శంభులింగేశ్వర స్వామి లింగం పైభాగాన ఐదు సెం.మీ.ల వివరం ఉంటుంది. దీంట్లో ఎప్పుడూ జలం ఉంటుంది.
-ఈ లింగం లోపల ఉన్న జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు.
👉అడవిదేవులపల్లి జాతర
-నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడవి దేవులపల్లిలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రధాన దైవం - కనకదుర్గమ్మ తల్లి.
-ఈ జాతరలో ప్రత్యేక కార్యక్రమాలు : సిడిమాన్ ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, గండదీపం
👉కోదండాపురం జాతర
-నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లిపల్లి మండలంలోని కోదండాపురం గ్రామంలో జాతర జరుగుతుంది.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీవెంకటేశ్వరస్వామి
-ప్రతి ఏడాది మాఘ బహుళ పంచమి నుంచి ఏకాదశి వరకు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
-ఏడు రోజుల్లో రథోత్సవం ముఖ్యమైంది.
👉చౌడమ్మ జాతర
-నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో అనేక గ్రామాల్లో ఈ జాతర జరుగుతుంది.
-చౌడమ్మ యాదవుల కుల దేవత. చౌడమ్మ జాతరను మూడు రోజుల పాటు జరుపుతారు.
👉తుల్జాభవాని జాతర
-నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పెద్దమునిగల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తారు.
-ఈ జాతరలో అనేకమంది లంబాడీ తెగకు చెందినవారు పాల్గొంటారు.
-జాతర జరిగే తొమ్మిది రోజులు పూజారి ఉపవాసం ఉండి విజయదశమి రోజున ఉపవాసం విరమిస్తారు.
🔹ఖమ్మం
-తేగడ జాతర : ఖమ్మం జిల్లా నూగూరు తాలూకా తేగడ గ్రామంలో భద్రకాళి, వీరభద్రుల దేవాలయాలున్నాయి.
-ఈ దేవతలకు మాఘ బహుళ త్రయోదశి, చతుర్థశుల్లో కల్యాణం చేస్తారు.
-గోదావరి నదికి వీరభద్ర స్వామి విగ్రహాన్ని తీసుకువెళ్లి స్నానం చేయించి తిరిగి గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు.
👉నిజామాబాద్
-సిద్దులగుట్ట జాతర : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట వద్ద జాతర జరుగుతుంది.
-పురాతన కాలంలో నవనాథులు ఈ గుట్టపై శివలింగాన్ని స్థాపించి తపస్సు చేయడంతో ఈ గుట్టను సిద్దులగుట్ట అంటారు.
-ఇక్కడి దేవాలయంలోని శివుడిని సిద్దలింగేశ్వరుడిగా కొలుస్తారు.
🔹రంగారెడ్డి
-చేవెళ్ల జాతర : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలో శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాలు ప్రతి ఏడాది చైత్రమాసంలో జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం, రథోత్సవం ప్రధానమైనవి.
🔹మహబూబ్‌నగర్
👉కురుమూర్తి జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం అమ్మాపూర్ గ్రామంలో నిర్వహించబడుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - కురుమర్తి రాయుడు
-ఈ జాతరను 19 రోజుల పాటు నిర్వహిస్తారు.
-దీనిలో 8వ రోజు జరిపే శ్రీవారి ఉద్ధాలసేవ చాలా పవిత్రమైంది.
👉మన్నెంకొండ జాతర
-మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెంకొండ వద్ద జాతర జరుగుతుంది.
-ప్రముఖ దైవం - ఆంజనేయస్వామి
👉సిరసనగండ్ల జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ దగ్గర సిరసనగండ్ల జాతర జరుగుతుంది.
-జాతర ప్రత్యేకత : వైభవంగా సీతారాముల కల్యాణం జరపడం.
👉రంగాపూర్ జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.
-ఇక్కడ నల్లమల అడవులోని కొండలపై ఉమామహేశ్వర దేవాలయం ఉంది. కొండకింద రంగాపూర్ గ్రామంలో హజ్రత్ నిరంజన్ షావలి దర్గా ఉంటుంది.
-వారం రోజులపాటు ఈ జాతర మతాలకతీతంగా జరుగుతుంది.
👉సలేశ్వరం జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని అడవుల్లో చెంచుల ఆధ్వర్యంలో సలేశ్వర తీర్థం ఉంది.
-ఈ జాతర సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ నెలలో చైత్రపౌర్ణమికి మూడు రోజుల ముందు, మూడు రోజుల వెనుక మొత్తం వారం రోజులు జరుగుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - శివుడు
👉మల్దగల్ జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా మల్దగల్‌లో తిమ్మప్ప జాతర జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామిని భక్తులు తిమ్మప్పగా కొలుస్తారు.
👉గద్వాల్ జాతర
-మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఈ జాతర జరుగుతుంది.
🔹ఆదిలాబాద్
👉నాగోబా జాతర
-నోగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వద్ద ఉన్నది.
-నాగోబా గిరిజనుల ఆరాధ్యదైవం. పూర్వకాలంలో నాగోబా గోండుల కుటుంబంలో జన్మించి అద్భుతమైన మహిమలను కనబర్చి కేస్లాపూర్ గ్రామాన ఉన్న పుట్టలోకి ప్రవేశించిందని చెప్తారు. అప్పటి నుంచి గోండులు ఆ పుట్టకు పూజలు చేస్తూ అక్కడ దేవాలయాన్ని నిర్మించారు.
-సర్పజాతిని పూజించడం ఈ పండుగ ప్రత్యేకత.
-ప్రతి ఏడాది పుష్యమాసం అమవాస్య రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది.
-నాగోబా జాతరలో దర్బార్ ఏర్పాటు చేసిన ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త - ప్రొఫెసర్ హైమన్‌డార్ప్ (1946)
👉బుర్నూరు జాతర
-ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో ఈ జాతరను జరుపుకుంటారు.
-బుర్నూరు ప్రాంతంలో గోండుల దేవతలు అయిన అకిపెణ్, ఆవులపెణ్, మాసోబాలను గ్రామ పొలిమేరల్లో నెలకొల్పారు. ఈ దేవతలను పూజిస్తూ గోండులు తమ కార్యక్రమాలను కొనసాగిస్తారు.
👉వేలాల జాతర
-ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాలలో మహాశివరాత్రి రోజున అతిపెద్ద జాతర జరుగుతుంది.
-గోదావరి నది తీరంలో భక్తులు భజనలతో శంకరుడిని పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు.
🔹కరీంనగర్
👉బెజ్జంకి జాతర
-ఈ జాతర కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనే ప్రాంతంలో జరుగుతుంది.
-ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంపై గోపికల నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కారు.
-ఈ జాతరను చైత్రమాసంలో జరుపుతారు. చైత్రపూర్ణిమ నాడు బండ్ల సేవ జరుగుతుంది. ఇక్కడ ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తారు.
-ఆలయానికి ఉత్తరంగా 35 అడుగుల ఎత్తు స్తంభం ఉంది. దీన్ని అండాళ్ స్తంభం అని అంటారు. సంతానం కోసం ఈ స్తంభానికి చీర కట్టించి ఒడిబియ్యం పోసే ఆచారం ఉంది.
👉నల్లకొండ జాతర
-కరీంనగర్ జిల్లా కోడిమ్యాల మండలం నల్లకొండ గ్రామ సమీపంలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. - ప్రధాన దైవం నల్లకొండ నర్సింహస్వామి.
👉సింగరాయ జాతర
-కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రధాన దైవం - లక్ష్మీనర్సింహస్వామి.
-ప్రతి ఏడాది పుష్యబహుళ అమావాస్య రోజున జరుగుతుంది.
👉కొండగట్టు జాతర
-కరీంనగర్ జిల్లా ముత్యంపేట సమీపంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.
-ప్రధాన దైవం - ఆంజనేయస్వామి. ఇక్కడ హనుమంతుడు ఒకవైపు నర్సింహస్వామి ముఖంతో, ఇంకోవైపున ఆంజనేయస్వామి ముఖంతో రెండు ముఖాలను కలిగి ఉంటారు.
🔹వరంగల్
👉సమ్మక్క సారక్క జాతర
-వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతర ఇది.
-భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1న ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
-సమ్మక్క, సారలమ్మ అనే ఇద్దరు దేవతలు తల్లి, కూతుళ్లు
చారిత్రక నేపథ్యం
-మొదటి ప్రతాపరుద్రుని కాలంలో పోలవాస అనే గిరిజన ప్రాంతాన్ని పాలించే సామంత రాజు - మేడరాజు
-మేడరాజు కుమార్తె - సమ్మక్క (భర్త : పగిడిద్ద రాజు)
-సమ్మక్క, పగిడిద్దరాజుల సంతానం - సారలమ్మ, నాగులమ్మ, జంపన్న
-కరువు కారణంగా కప్పాన్ని చెల్లించకపోవడంతో ప్రతాపరుద్రుడు మేడరాజుపై యుద్ధం ప్రకటించాడు.
-కాకతీయ ప్రతాపరుద్రుడు మేడరాజు అల్లుడైన పగిడిద్ద రాజును ఓడించడానికి అతి పెద్ద సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం సంపెంగ వాగు వద్ద పగిడిద్దరాజు గిరిజన సైన్యాన్ని ఓడించింది.
-ఈ యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటు తన కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు మరణించారు.
-పగిడిద్దరాజు కుమారుడైన జంపన్న కాకతీయ సైన్యాన్ని ఓడించలేక, శత్రువు చేతిలో మరణించడం అవమానమని భావించి సంపెంగ వాగులోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
-పగిడిద్దరాజు భార్య సమ్మక్క కాకతీయ సేనలతో వీరోచితంగా పోరాడుతుండగా కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను కత్తితో పొడిచాడు.
-గాయంతో సమ్మక్క యుద్ధభూమి నుంచి ఈశాన్య దిశగా చిలుకలగుట్ట వైపు బయలుదేరి అదృశ్యమైంది.
-అమె అదృశ్యమైన చోట ఒక కుంకుమభరిణి లభించింది. ఆ ప్రాంతంలోనే ఇప్పటి సమ్మక్క సారలమ్మ గద్దె ఉన్నది.
-సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి రెండేండ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుతారు.
-ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరను యునెస్కో గుర్తించింది.
👉మేడారం అనుబంధ జాతరలు
-👉పగిడిద్దరాజు జాతర : సమ్మక్క జాతర ముసిగిన మూడోరోజున పెనక వంశానికి చెందిన వడ్డెలు పునుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు జాతర జరుపుతారు.
-సమ్మక్క జాతర నుంచి గిరిజనులు నేరుగా పగిడిద్దరాజు జాతరకు వెళ్తారు.
-నాగులమ్మ, సమ్మక్కలు కొట్లాడినప్పుడు ఇతని కుడి కన్నుకు సమ్మక్క కంకణం తగిలి గాయమై కన్న లొట్టపోయింది.
👉ముసలయ్య జాతర
-వరంగల్ జిల్లా లక్నవరం సరస్సు గుట్టలోని ఒక సొరంగంలో నాగలి కర్రు ఆకారంలో ముసలయ్య ఉంటాడు.
-మేడారం జాతర ముగిసిన తర్వాత వచ్చే మార్చి నెలలో ముసలయ్య జాతర జరుగుతుంది.
-ముసలయ్య కాకతీయులతో జరిగిన యుద్ధంలో పాల్గొని యుద్ధం ముగిసిన తర్వాత రాయినిగూడెంలో కరువు, అతిసార వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతుండగా బాలుడిగా జన్మించాడు.
-అతని పుట్టుకతో ఆ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండాయని భక్తుల విశ్వాసం.
-లక్నవరం గుట్టల్లో ఉన్న ముసలయ్య జాతర సందర్భంగా రక్తపు పాన్పుతో ఆయనను కొలుస్తారు.
-దేవుని రాయిని తెచ్చి రాత్రంతా నృత్యాలు చేస్తూ జోగు అడుగుతారు. అనంతరం దేవుడికి బలి ఇస్తారు.
👉సూరుగొండయ్య జాతర
-వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నుంచి 20 కి.మీల దూరంలోని రంగాపురం గ్రామంలో జరుగుతుంది.
-ఏప్రిల్, మే నెలల్లో చైత్రపౌర్ణమిరోజున ఈ జాతర జరుగుతుంది.
-కోయజాతి గిరిజనుల్లో భరద్వాజ రుషి గోత్రానికి చెందిన మూడో గట్టు వేల్పుల్లో పెద్దసూరుగొండయ్య, చిన్నసూరుగొండయ్య ఉండేవారు. పెద్దసూరుగొండయ్యను పొలి తగలని వడ్డె బోయడు, చిన్నసూరుగొండయ్యను బోయనికి వడ్డె పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు.
-పూజలు జరిపే వడ్డె మూడురోజులు ఉపవాసం ఉంటాడు. పెద్ద ఎత్తున కొళ్లను బలిస్తారు. బెల్లాన్ని ప్రసాదంగా పంచుతారు.
👉నాగులమ్మ జాతర
-వరంగల్‌లోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు గుడికి సమీపాన చిన్నగుడిసెలో నాగులమ్మ దేవతను నిలిపి పూజిస్తున్నారు.
-మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున గోవిందరాజుల జాతర జరిగే సమయంలోనే నాగులమ్మ జాతర నిర్వహిస్తారు.
-కోయ తెగకు చెందిన మూడో గట్టు గోత్రం ఇంటికి చెందిన అందె అనే ఇంటి పేరు ఉన్నవారు వంశపారంపర్యంగా, పూజారిగా ఆచార్య సంప్రదాయాలను నిర్వహిస్తారు.
👉బాలకుమారస్వామి జాతర
-బాలకుమారస్వామి తాడ్వాయి మండలం గట్టుపై గండ్రగొడ్డలి రూపంలో ఉంటాడు.
-బాలకుమారస్వామిని సమ్మక్కకు సోదరుడని, పినతండ్రి కుమారుడని, కోటెం వంశస్థుడని చెప్తారు.
-మేడారం జాతర జరిగిన తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ జాతర జరుగుతుంది.
-జాతర జరగడానికి ముందు రోజు దేవతను గ్రామంలో ఊరేగించి 7 బిందెలతో జలాభిషేకం చేస్తారు.
-డోల్లీల చప్పుళ్లు, గంటల శబ్దాలతో పడగలు ధరించిన బాలకుమారుడు గుడికి చేరుకుంటాడు.
👉కార్నేపల్లి జాతర
-వరంగల్ జిల్లా ములుగుకు 20 కి.మీ.ల దూరంలో ఉన్న కార్నేపల్లి గ్రామపంచాయతీలోని సండ్రగూడెంలో ఈ జాతర జరుగుతుంది.
-ఇక్కడ సారలమ్మను పులి రూపంలో పూజిస్తారు.
👉భూపతిపురం జాతర
-వరంగల్‌లోని భూపతిపురంలో మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 11 రోజుల పాటు ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది.
-ఈ ప్రాంతంలోని కోయలు కొండ సారలమ్మ పేరుతో సారలమ్మను పూజిస్తారు.
👉వేల్పులమ్మ జాతర
-వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలో వేల్పులమ్మను దేవతగా కొలుస్తారు.
-ప్రతి మూడేండ్లకొకసారి ఈ జాతర జరుగుతుంది.
-ఒకటిన్నర ఇంచుల బంగారు వెండి కడ్డీలు దేవతకు గుర్తుగా ఒక వెదురు బొంగులో పెట్టి, వెదురు బొంగును కుండలో పెడతారు. జాతర జరిగే సమయంలో ఆ వెదురు బొంగును పూజలో ఉపయోగిస్తారు.
👉గుంజేడు ముసలమ్మ జాతర
-వరంగల్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పరిధిలోని గుంజేడు శివారులో ముసలమ్మ జాతర ప్రతి రెండేండ్లకొకసారి సమ్మక్క జాతర జరిగిన సమయంలోనే రెండురోజుల పాటు జరుగుతుంది. ముసలమ్మ దయతో సంతానం కలిగినవారు ఉయ్యాల కట్టి మొక్కు చెల్లించుకుంటారు.
👉కొమరవెల్లి జాతర
-వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది.
-ప్రతి సంవత్సరం మాఘ మాసం నుంచి చైత్ర మాసం వరకు జరుగుతుంది.
-ఇక్కడి ప్రధాన దైవం - కొమరెల్లి మల్లన్న.
👉కొరివి జాతర
-వరంగల్ జిల్లా కొరివి వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి ఏడాది శివరాత్రి రోజున ఈ జాతర జరుగుతుంది.
-20 రోజులపాటు ఈ జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి.
👉అయినవోలు జాతర
-వరంగల్ జిల్లా అయినవోలులో ఉన్న మైలార దేవునికి ప్రతి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తారు.
-ఈ ఉత్సవాలను కూడా 20 రోజుల పాటు నిర్వహిస్తారు.
👉కోటంచ జాతర
-వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి.
-ఇక్కడి ప్రధాన దైవం - లక్ష్మీనరసింహస్వామి.
👉రామప్ప
-వరంగల్ జిల్లా పాలంపేట గ్రామంలో ప్రతి ఏడాది శివరాత్రి సమయంలో మూడురోజుల పాటు జాతర జరుగుతుంది.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీ రామలింగేశ్వరస్వామి
👉హైదరాబాద్
👉పెద్దమ్మ జాతర
-హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిలో జనవరి చివరివారంలోగానీ, ఫిబ్రవరి మొదటివారంలోగానీ ఈ జాతర జరుగుతుంది.
మహంకాళి జాతర
-దీన్ని బోనాల పండుగ అని కూడా అంటారు. ఈ జాతర ను అషాడమాసంలో హైదరాబాద్‌లో అతి గొప్పగా జరుపుకుంటారు.
👉అల్వాల్ (ఆలవాల) జాతర
-టెంపుల్ అల్వాల్‌గా పిలువబడుతున్న అల్వాల (అలవాలం - ఆవులుండే చోటు)లో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
-నిజాం రాజు నసీరుద్దౌలా బహదూర్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన చందులాల్ ఈ ఆలయాన్ని నిర్మించాడు.
-మహారాజా కిషన్ పర్షాద్ కాలం నుంచి అల్వాల్ జాతర ఫిబ్రవరిలో జరుగుతుంది. రథోత్సవం రోజున హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరూ జాతరలో పాల్గొంటారు.
Ⓜ🆚