Type Here to Get Search Results !

Vinays Info

హరీష్ చంద్ర హెడా | Harish Chandra Heda ( H.C.Heda)

హరీష్ చంద్ర హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మారాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు మరియు మూడు పర్యాయాలు నిజామాబాదు నియోజకవర్గం నుండి లోక్‍సభకు ఎన్నికై 1952 నుండి 1967 వరకు లోక్‍సభలో నిజామాబాదుకు ప్రాతినిధ్యం వహించాడు.

హరీష్ చంద్ర 1912, అక్టోబర్ 14న అప్పటి హైదరాబాదు రాజ్యంలోని ఉస్మానాబాదు జిల్లాలోని శిరాఢోన్ గ్రామంలో ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బాల్ ముకుంద్ హెడా. ఈయన విద్యాభ్యాసం ఉస్మానాబాద్, గుల్బర్గా, హైదరాబాదులలో సాగింది. 1936లో స్వాతంత్ర్య సమరయోధురాలు గ్యాన్ కుమారీ హెడాను వివాహమాడాడు. న్యాయవాద పట్టా పొంది 1939 నుండి 1942 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

1930లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తత్త్వశాస్త్రం, న్యాయశాస్త్రాలలో పట్టభద్రుడైన హెడా 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు మరియు ఆర్య సమాజం ఏర్పాటు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు.క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనూ హైదరాబాదు విమోచనోద్యమంలోనూ పాల్గొని జైలుకెళ్ళాడు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ల సన్నిహిత సహచరుడైన హెడా, 1949లో ప్రొవిన్షియల్ పార్లమెంటుకు, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఏర్పడిన రాజ్యాంగసభకు ఎన్నికయ్యాడు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాదు లోక్‍సభ నియోజకవర్గం నుండి సోషలిస్టు అభ్యర్ధి అయిన కాశీనాథరావు ముకాల్పర్ను ఓడించి పార్లమెంటు సభ్యుడయ్యాడు. ఆ తరువాత 1957లోనూ, 1962లోనూ స్థానిక అభ్యుర్ధులైన జి.రాజారాం మరియు ఎం.నారాయణ రెడ్డిలను ఓడించి తిరిగి లోక్‍సభకు ఎన్నికయ్యాడు. అయితే 1967 ఎన్నికలలో ఎం.నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

హెడా మార్క్సిజం, గాంధేయవాదంపై అనేక వ్యాసాలు వ్రాశాడు. గాంధీజీస్ నౌఖాలీ పద్ యాత్ర (1946), ఆన్ ద హైసీస్ (1958) మరియు ఎలక్షన్ ఇన్ బ్రిటన్ (1960) అనే మూడు పుస్తకాలను ప్రచురించాడు.

ఈయన 2002, ఆగష్టు 28న తొంభై ఏళ్ల వయసులో హైదరాబాదులో అస్వస్థతతో మరణించాడు. ఈయన సతీమణి గ్యాన్ కుమారీ హెడా కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. వీరి ఏకైక సంతానమైన కుమారుడు శరద్ హెడా న్యూజెర్సీలో స్థిరపడ్డాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section