Type Here to Get Search Results !

Vinays Info

ప్రభుత్వ పథకాలు | Government Schemes

ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, లక్ష్యం ప్రజా సంక్షేమమే. అన్ని వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభించి అమలు చేస్తాయి. పోటీ పరీక్షల్లో ఈ పథకాలపై తరుచుగా ప్రశ్నలు అగుడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పలు పథకాలపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం..

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన
-లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుకొని సంసద్ ఆదర్శ గ్రామ పథకాన్ని ప్రధాని మోదీ 2014, అక్టోబర్ 11న ఢిల్లీలో ప్రారంభించారు. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని 2016 నాటికి, ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ముగిసేనాటికి అంటే 2019 మార్చి నాటికి మరో రెండు దత్తత గ్రామాలను తీసుకొని అభివృద్ధి చేయాలి. ఈ లెక్కన పార్లమెంట్‌లోని ఉభయసభల్లోని 543 మంది లోక్‌సభ సభ్యులు, 250 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాష్ట్రపతి ద్వారా నామినేటెడ్ సభ్యులు కలిసి దాదాపు 2379 ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఎంపిక చేసుకొనే గ్రామాలు తన భర్త/భార్యకు చెందిన గ్రామం కాకూడదు. మైదానంలోని గ్రామాల్లో జనాభా 3000-5000 అయితే పర్వత/గిరిజన ప్రాంతాల్లో అయితే 1000-3000 ఉండాలి. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జయపూర్‌లో ప్రారంభించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అసోం రాష్ట్రంలోని పశ్చిమ బికిలిగావ్ గ్రామాన్ని, యూపీలోని ఉద్వా గ్రామాన్ని సోనియాగాంధీ, దేహ్ గ్రామాన్ని రాహుల్‌గాంధీ, ఏపీలోని చేపల ఉప్పాడును వెంకయ్యనాయుడు, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామాన్ని కల్వకుంట్ల కవిత, సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ, మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లాలోని డోంజ గ్రామాలను దత్తత తీసుకున్నారు.

హృదయ్
-దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్)ను 2015, జనవరి 21న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ప్రకటించారు. ఈ పథకం కింద ఎంపికచేసిన 12 నగరాల్లో తెలంగాణ నుంచి వంరగల్ ఎంపికైంది. వరంగల్‌కు రూ. 40.54 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన అమరావతికి రూ. 22.26 కోట్లు కేటాయించారు. అజ్మీర్ (రాజస్థాన్), వారణాసి, మధుర (యూపీ), అమృత్‌సర్ (పంజాబ్), ద్వారక (గుజరాత్), గయా (బీహార్), బాదామి (కర్ణాటక), పూరీ (ఒడిశా), కాంచీపురం, వేళాంగిణి (తమిళనాడు)లు హృదయ్ పథకానికి ఎంపికయ్యాయి. ఈ పథక పైలాన్‌ను హన్మకొండలోని వేయిస్తంభాల గుడి ఆవరణలో 2015, అక్టోబర్ 17న వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్
--ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని మోదీ 2014, అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐదేండ్లపాటు దేశవ్యాప్తంగా 4,041 పట్టణాల్లో చేపట్టనున్నారు. దీనికయ్యే మొత్తం వ్యయం రూ. 62,009 కోట్లలో రూ. 14,623 కోట్లను కేంద్రప్రభుత్వం అందజేయనున్నది. గతంలోనున్న గ్రామీణ పారిశుద్ధ్యానికి సంబంధించిన నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛ భారత్ అభియాన్‌లో కలపాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద దేశంలోని 2.47 లక్షల గ్రామపంచాయతీలకు ఏటా రూ. 20 లక్షల చొప్పున అందుతాయి. దీని లోగోని గాంధీ కళ్లద్దాలతో మహారాష్ట్రకి చెందిన అనంత ఖాస్‌బార్దర్ రూపొందించారు. ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్ (స్వచ్ఛతవైపు ఒక అడుగు ముందుకు) అనే నినాదాన్ని గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీ సేథ్ అందించారు.

బేటీ బచావో - బేటీ పడావో యోజన
-ఈ పథకాన్ని 2015, జనవరి 22న మోదీ హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలుచేయనున్న ఈ పథకానికి మాధురి దీక్షిత్‌ను ప్రచారకర్తగా నియమించారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం బాల, బాలికల నిష్పత్తి 1000:919. దేశంలో రోజుకు 2000 మంది బాలికలను తల్లిగర్భంలోనే చిదిమేస్తున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు. బాలికల పట్ల వివక్షను తొలిగించేలా, బ్రూణహత్యలను అరికట్టేలా ప్రజలను చైతన్యపర్చటం, బాలికల విద్యను ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకంలో భాగంగా బాలిక సుకన్య సమృద్ధి యోజన అదే రోజు ప్రధాని ప్రకటించారు. బాల్యవివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి పదేండ్లలోపు పథకం కింద పోస్టాఫీస్‌లోగాని, బ్యాంక్‌లోగాని కనీసం రూ. 1000లతో ప్రారంభించవచ్చు. జమచేసిన డబ్బులపై 9.1 శాతం వడ్డీతోపాటు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పద్దెనిమిదేండ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం డిపాజిట్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. ఈ ఖాతా 21 ఏండ్ల వరకు క్రియాశీలంగా ఉంటుంది.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
-దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2014, ఆగస్ట్ 28న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదవాళ్లందరికీ బ్యాంక్ ఖాతాలు అందించాలనేది లక్ష్యం. 2015, జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్ల మందికి రూపే డెబిట్ కార్డ్, జీరో బ్యాలెన్స్, రూ. లక్ష వరకు ప్రమాద బీమా, రూ. 30 వేల వరకు జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఆరు నెలల తరువాత ఈ ఖాతాలు ఉన్నవారికి రూ. 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకం ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కోటిన్నర బ్యాంక్ అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ పథకానికి జన్ ధన్ అని పేరుపెట్టడానికి, లోగో రూపకల్పనకు ప్రియాశర్మ సలహాలు ఇచ్చారు.

నీతి ఆయోగ్
-కేంద్ర ప్రణాళిక మండలి స్థానంలో నీతి ఆయోగ్‌ను 2015, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా సంక్షిప్తంగా NITI అంటారు. దీన్ని తెలుగులో భారత పరివర్తనకు జాతీయ సంస్థ అని, హిందీలో నీతి అంటే విధానం అని అంటారు. ఆయోగ్ అంటే కమిటీ. దీన్ని బట్టి నీతి ఆయోగ్ అంటే విధాన కమిటీ. దీనిలో పాలకమండలి చైర్మన్‌గా ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు, సీఈవో, అన్ని రాష్ర్టాల సీఎంలు, కేంద్ర పాలితప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, శాశ్వత సభ్యులు ఇద్దరు, ఆర్థిక నిపుణులు పార్ట్‌టైమ్ సభ్యులుగా, ప్రధాని సిఫారసు మేరకు నలుగురు కేంద్రమంత్రులు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ సాధికారిత, సమానత్వమే లక్ష్యంగా ప్రజానుకూల, గతిశీల సమ్మిళిత అభివృద్ధి అజెండాను అమలుచేసేందుకు కేంద్ర, రాష్ర్టాలకు ఒకే అజెండాను అమలుచేయడమే నీతి ఆయోగ్ లక్ష్యం.

అటల్ పెన్షన్ యోజన
-ఈ పథకాన్ని 2015, మే 9న ప్రధాని మోదీ కలకత్తాలో ప్రారంభించారు. అసంఘటితరంగంలో ఉన్నవారికి వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చేందుకు ఈ పథకం కింద 18 నుంచి 40 ఏండ్లు వయస్సు ఉండి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అర్హులు. ఈ పథకం 2015, జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, 60 ఏండ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ. 1000 నుంచి 5000 వరకు పింఛన్ వస్తుందని పీఎం తెలిపారు. వయస్సును అనుసరించి ప్రీమియం ఉంటుంది. ఈ పథకంలో చేరే వ్యక్తి ఎంత మొత్తం తన చందాగా చెల్లిస్తాడో ఆ మొత్తంలో సగాన్ని ప్రభుత్వం కూడా జతచేస్తుంది. ఏడాదికి ప్రీమియం పరిమితి రూ. 1000 ఐదేండ్ల పాటు ఇలా ప్రభుత్వం జతచేస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 3 లోగా ఈ పథకంలో చేరేవారికి వర్తిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
-ఈ పథకాన్ని మోదీ 2015, మే 9న కలకత్తాలో ప్రారంభించారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఈ పథకం కింద 18 నుంచి 70 ఏండ్ల వయస్సు ఉండి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అర్హులు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 115 నియోజకవర్గాల్లో గవర్నర్లు, సీఎంలు, కేంద్రమంత్రులు ప్రారంభించారు. ఈ పథకం 2015, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు కలిగినవారందరికీ సురక్ష బీమా యోజన సదుపాయం కలుగుతుంది. ఏడాది కేవలం రూ. 12 చెల్లింపు ద్వారా దుర్ఘటనస్థాయిని అనుసరించి రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం కలుగుతుంది. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వతంగా వికలాంగులైతే పరిహారం చెల్లిస్తారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన
-ఈ పథకాన్ని మోదీ 2015, మే 9న కలకత్తాలో ప్రారంభించారు. 2015 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద 18 నుంచి 50 ఏండ్లు నిండి, సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లు అర్హులు. పాలసీదారు ఏ కారణం ద్వారా చనిపోతే ఈ పాలసీని ైక్లెమ్ చేసుకోవచ్చు. ఏడాదికి ప్రీమియం రూ. 330 అంటే రోజుకు రూ. 1 కన్నా తక్కువే. 18 నుంచి 50 ఏండ్ల వయస్సువారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలోని సభ్యులు ఏ కారణంతోనైనా మృతిచెందితే అతని సంబంధీకులకు రూ. 2 లక్షలు, ఒకవేళ ఖాతాదారుడికి నాలుగు బ్యాంకుల్లో ఖాతాల్లో ఉండి ప్రీమియం చెల్లించినా ఒక బ్యాంక్ నుంచి మాత్రమే పొందుతారు. 50 ఏండ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే 55 ఏండ్లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లించేపక్షంలో బీమా సదుపాయం కల్పించబడుతుంది. ఏటా ఈ బీమా పథకాన్ని పునరుద్ధరించుకోవాలి.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
-రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ పథకాన్ని 2016, జనవరి 13న మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఆమోదముద్ర వేశారు. ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంది. ఈ పథకం కింద ఖరీఫ్ సీజన్‌లో ఆహారధాన్యాలు/నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రబీ సీజన్‌లో ఆహార ధాన్యాలు/నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని మొత్తం పంటల విస్తీర్ణం 19.5 కోట్ల హెక్టార్లు. దీనిలో 25-27 శాతానికి మాత్రమే ఇంతవరకు బీమా అందుతుంది. ఈ పథకంతో రాబోయే మూడేండ్లలో ఇది యాభై శాతానికి చేరుకుంటుందని వ్యవసాయ మంత్రిత్వశాఖ అంచనా. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి ఏటా రూ. 17,600 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

సాయిల్ హెల్త్ కార్డ్ పథకం
-ఈ పథకాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని శ్రీగంగారాం నగర్ జిల్లా సూరత్‌గఢ్ పట్టణంలో 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతుల పొలాలు, నేలలను పరిశీలించి కావల్సిన పోషకాలను, ఎరువులు ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపర్చడానికి రైతులకు సహాయం చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా మూడేండ్ల కాలంలో దేశంలోని రైతులకు రూ. 14 కోట్ల సాయిల్ హెల్త్‌కార్డులు జారీచేస్తారు. ఈ కార్డు వివిధ రకాల పొలాలకు అవసరమైన పోషకాలు, ఎరువులను పంటలవారీగా సిఫారసుచేస్తుంది. ఇంతేకాకుండా ప్రధాని స్వాస్థ్య ధర్తి-ఖేత్ హరా (ఆరోగ్యకరమైన భూమి-పచ్చనైనా పొలం) అనే నినాదాన్ని ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ర్టాలకు సూచించారు.

మిషన్ ఇంద్రధనస్సు
-దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు వేసేందుకు 2015 మార్చి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలిదశలో 201 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. మన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలను ఎంపికచేశారు. దేశవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ లెవల్ హౌస్‌హోల్డ్ సర్వే (DLHS)లో 89 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయలేదని వెల్లడవటంతో కేంద్రం ప్రతి నెల 7 రోజులపాటు 8 ప్రాణాంతక వ్యాధులకు టీకాలు వేయనున్నది. అవి డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం, శిశుపక్షవాతం, మెదడువాపు, క్షయ, తట్టు. రాష్ట్రంలో ఏ టీకాలు వేసుకోనివారి శాతం 36.3.

అమృత్
-అధిక జనాభాతో సతమవుతున్న పట్టణాల రూపురేఖలను మార్చేందుకు అమృత్ పథకాన్ని 2015, జూన్ 25న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో 500 అమృత్ పట్టణాలకు రూ. 50 వేల కోట్లు వెచ్చించనుంది. అమృత్ అంటే పట్టణాల్లో మౌలికవసతుల కల్పనకు సంబంధించింది. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌పార్మేషన్. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి 15 పట్టణాలకు చోటుదక్కింది. ఉత్తరప్రదేశ్ నుంచి 64, తమిళనాడు నుంచి 33, మహారాష్ట్ర నుంచి 37 పట్టణాలను ఎంపికచేశారు. 2007లో ప్రారంభించిన జేఎన్‌ఎన్‌ఎంయూఆర్‌ఎం పథకంలో మార్పులు చేసి అమృత్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లు, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, మిర్యాలగూడెం, సూర్యాపేట మున్సిపాలిటీలకు ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఉన్నాయి. ఈ పథకం కోసం రూ. 50 వేల కోట్లు కేటాయిస్తారు. ఈ పథకంపై 2015, జూన్ 25న ఢిల్లీలో కేంద్రం ఒక సదస్సు నిర్వహించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section