భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా? అవును ఆ ఆదేశాలనే ఆదేశిక సూత్రాలు అంటారు. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గ దర్శకాలు చేసింది. ఈ మార్గదర్శకాలు లేదా ఆదేశాలు, రాజ్యాంగం ప్రకటించిన పౌరుల హక్కులైన ప్రాథమిక హక్కులు కాపాడటానికి మరియు సవ్యంగా అమలుజరుపడానికి. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం ప్రభుత్వ విధి. ఇక్కడ 'ప్రభుత్వ'మనగా భారత అంతర్భాగంలో అధికారాలు గల అన్ని అంగాలు. అనగా భారత ప్రభుత్వము, భారత పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు, మరియు ఇతర అన్ని ప్రాదేశిక ప్రభుత్వాలు. ఉదాహరణ జిల్లా పరిషత్తులు, నగర పాలికలు, పురపాలికలు, పంచాయతీలు, గ్రామ పంచాయతీలు వగైరా. ఈ ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు మరియు భారతదేశంలో ప్రాథమిక విధులు మొదలగు విషయాలతో ప్రేరితమై రూపొందింపబడినవి.
వీటి ముఖ్య ఉద్దేశ్యాలు, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాహిత రాజ్యాన్ని స్థాపించడం.
చరిత్ర
ఆదేశిక సూత్రాలు, ఐర్లండు రాజ్యాంగం నుండి సంగ్రహించారు. భారత రాజ్యాంగ కర్తలు, ఐరిష్ జాతీయ ఉద్యమంతో ప్రభావితమైనారు. కాన, భారత రాజ్యాంగం ఐరిష్ ఆదేశిక సూత్రాలకు ఆదర్శంగా తీసుకుని, ఆదేశిక సూత్రాలను రచించింది.ఈ పాలసీల ఉపాయం, ఫ్రెంచి విప్లవం, మరియు అమెరికన్ కాలనీల స్వాతంత్ర ప్రకటనలనుండి పొందారు.ఇంకనూ, భారత రాజ్యాంగం, ఐక్యరాజ్యసమితి యొక్క సార్వత్రిక మానవహక్కుల ప్రకటన నుండి స్ఫూర్తిని పొందింది.
ప్రాథమిక హక్కులు మరియు భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, డ్రాఫ్టింగ్ కమిటీ తన మొదటి డ్రాఫ్టులోనూ (ఫిబ్రవరి 1948), రెండవ డ్రాఫ్టులోనూ (17 అక్టోబరు, 1948) మరియు మూడవ డ్రాఫ్టులోనూ (26 నవంబరు 1949) పొందు పరచినది.
లక్షణాలు
ఆదేశిక సూత్రాలు, ప్రజాప్రయోజనాలను, పౌరుల సామాజిక ఆర్థిక రంగాల అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని తయారుచేయబడినవి. ఆదేశిక సూత్రాలు, పౌరుల సామాజిక, ఆర్థిక అంశాలను ఉద్ధరించడానికి, 'శ్రేయోరాజ్యాన్ని' యేర్పాటు చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 1971లో భారత రాజ్యాంగ 25వ సవరణ లో, అధికరణ 31-సి ను జోడించి, ఆదేశిక సూత్రాలను ఇంకొంచెం విస్తరించారు.
ఆదేశికలు (ఆదేశాలు)
🔹రాజ్యం (ప్రభుత్వం)ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక న్యాయాన్ని పొందుటకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసానిస్తాయి.
🔹రాజ్యం (భారత ప్రభుత్వం) తన పౌరులందరికీ జీవనోపాధినీ, స్త్రీపురుషులందరికీ, సమాన ఉద్యోగాలు, పనులు, సమాన జీతాలు అనే సూత్రంపై, కలిగిస్తుంది. ధనాన్ని, ఆస్తులను, ఒకేచోట కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో విభజన జరిగేలా ప్రభుత్వం చూస్తుంది. దీనివల్ల, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. ప్రజలనూ, పిల్లలనూ కాపాడవలసిన బాధ్యతకూడా రాజ్యానిదే.
🔹రాజ్యం, పౌరులకు, ఉచిత వైద్య విద్యా సదుపాయాలు కల్పించవలెను. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బులేదని, అతనికి న్యాయం అందకుండా పోవడం, రాజ్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
🔹గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహకాలిచ్చి, వాటిని స్వయంపరిపాలన చేసుకొనుగల పరిస్థితులను రాజ్యము కల్పించవలెను.
రాజ్యము, పౌరులకు పని హక్కు, విద్యాహక్కు, మరియు నిరుద్యోగం, వయసుమీరిన, అనారోగ్య మరియు అసహాయ పరిస్థితులలో ప్రజాసహాయాలు, మరియు వసతులను కల్పించాలి.
🔹మానవ పరిశ్రమ స్థితిగతులను తెలుసుకొని, గర్భవతులకు తగు సదుపాయాలు కల్పించాలి.
🔹కార్మికులకు సరైన వేతనాలు, కనీస వేతనాలు, వారి పనులకు అనుసారంగా స్థిరీకరించి, అమలుపరచాలి. వీరికి సరైన పనివేళలు, సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు కల్పించవలెను. లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అభివృద్ధి పొందేలా చూసుకోవాలి.
🔹పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలను దత్తత తీసుకునేలా చేసి, పారిశ్రామిక వాడలను అభివృద్ధి పరచాలి.
🔹పౌరులకు సమాన పౌర చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరచేలా చేయాలి.
🔹14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందజేసేలా చేయాలి.ఈ ఆదేశిక, 2002 లో భారత రాజ్యాంగ 86వ సవరణ ద్వారా పొందుపరచారు.
🔹షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల మరియు వెనుకబడిన తరగతుల వారి విద్య, ఆర్థికాభివృద్ధి మరియు సామాజికాభివృద్ధి కొరకు, రాజ్యం పాటుపడవలెను.
🔹పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి తగుచర్యలు గైకొని సామాజికాభివృద్ధిగావింపవలెను. మధ్యపానము, ఇతర వ్యసనాలను సమాజం నుండి దూరముంచవలెను.
🔹వ్యవసాయం, పశుగణాభివృద్ధి మరియు వైద్యము, సమాజంలో చక్కటి ఫలితాలనిచ్చేటట్లు చూడవలెను.
🔹వాతావరణాన్ని, అడవులను మరియు సామాజిక అడవులను అభివృద్ధి పరచి, వన్యజీవుల పరిరక్షణా భారాన్ని వహించవలెను.వన్యజీవుల సంరక్షణా చట్టం, 1976 లో భారత రాజ్యాంగ 42వ సవరణ మూలంగా పొందుపరచబడినది.
🔹ప్రాచీన నిర్మాణాలు, కట్టడాలు మరియు చారిత్రక ప్రాముఖ్యతగల అన్ని కట్టడాలు, కళావారసత్వపు విషయాలను కాపాడవలెను.
🔹సేవారంగంలోని ఎక్జిక్యూటివ్ ను న్యాయవ్యవస్థ నుండి వేరుచేయవలెను.
🔹ఆఖరుగా, ఆదేశిక సూత్రాలు, అధికరణ 51 ప్రకారం, అంతర్జాతీయ శాంతి మరియు రక్షణ, న్యాయం మరియు ఇతర దేశాలతో గౌరవప్రథమైన సంబంధ బాంధవ్యాల కొరకు రాజ్యం పాటుపడవలెనని తాకీదు ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ సమస్యలను సామరస్యంగా పరిష్కరించవలెనని సూచిస్తుంది.
అమలుపరచే విధానము
🔹ఆదేశిక సూత్రాలను అమలు పరచేందుకు, రాజ్యం (ప్రభుత్వం) ఎన్నో ప్రయత్నాలను చేపట్టింది.
🔹14యేండ్ల లోపు బాలబాలికలకు తప్పనిసరి ఉచితవిద్యను అందించుట ప్రధమకర్తవ్యంగా, ప్రాథమిక విద్యను సార్వత్రీకణ జేయుటకు పంచవర్ష ప్రణాళిక లలో పెద్ద పీట వేశారు. భారత రాజ్యాంగ 86వ సవరణ 2002, ప్రకారం 6-14 యేండ్ల మధ్యగల బాలబాలికలకు ఉచిత తప్పనిసరి విద్యను ఖరారు చేశారు.
అణగారిన, వెనుకబడిన కులాలకు, అభ్యున్నతిని కలుగజేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యార్థులకు 'వసతి గ్రహాల' ఏర్పాట్లు గావించారు.
బి.ఆర్.అంబేద్కర్ సంస్మరణార్థం, 1990-1991 సంవత్సరాన్ని "సామాజిక న్యాయ సంవత్సరం" గా ప్రకటించారు.
షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు మరియు వెనుక బడిన జాతుల విద్యార్థినీ విద్యార్థులు, వైద్యం, ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి ఉచితపాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను ఇతరులచే పీడితంనుండి రక్షించడానికి 1995లో ఒక చట్టాన్ని చేశారు, ఈ చట్టం ప్రకారం తీవ్రమైన శిక్షలుంటాయి.
పేద రైతుల అభ్యున్నతి కొరకు, భూ-ఉద్ధరణ చట్టాలను చేసి, వ్యవసాయ మరియు నివాస భూములను పంపిణీ చేపట్టారు.సెప్టెంబరు 2001, వరకు, 2 కోట్ల ఎకరాల భూమి పంపిణీ జరిగింది. బ్యాంకు పాలసీలను క్రమబద్దీకరించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రణాళికలు తయారు చేశారు.
1948 కనీస వేతనాల చట్టం ప్రకారం, ప్రభుత్వం తనకు లభించిన అధికారాలతో అనేక ఉద్యోగాల సిబ్బందికి కనీస వేతనాలను స్థిరీకరించింది.
వినియోగదారుల సంరక్షణా చట్టం 1986 ప్రకారం ప్రభుత్వం, వినియోగదారుల ఫోరం లను స్థాపించి, వినియోగదారుల హక్కులను కాపాడుతూ వస్తూంది.
సమాన వేతనాల చట్టం 1976 ప్రకారం, స్త్రీ పురుషులిద్దరికీ, లింగ భేదం లేకుండా, సమాన వేతనాలను స్థిరీకరణ జరిగినది.
2001 లో, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన ప్రారంభించబడినది. దీని ముఖ్యోద్దేశం, గ్రామీణ ప్రాంతాలవారికి ఉద్యోగావకాశాలు కల్పించడం. వీటిని పంచాయత్ రాజ్ ప్రభుత్వాంగాలద్వారా అమలు పరుస్తున్నారు.పంచాయత్ రాజ్ వ్యవస్థ, దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ స్థాపించబడినది.
మూడింట ఒక వంతు సీట్లను పంచాయతీలలో స్త్రీలకు కేటాయించడం జరిగినది. బీహారు లో ఐతే స్త్రీలకు సగం సీట్లు కేటాయింపబడ్డాయి.
పేదవారి విషయంలో, క్రిమినల్ చట్టాల ప్రకారం, న్యాయ సహాయ ఖర్చులు ప్రభుత్వాలు భరించేలా చట్టం చేయబడినది. జమ్మూ కాశ్మీరు మరియు నాగాల్యాండు లో న్యాయవ్యవస్థను, ఎక్జిక్యూటివ్ తో వేరుచేశారు.
భారత విదేశీ పాలసీపై, ఆదేశిక సూత్రాల ప్రభావం ఎంతోవున్నది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణా దళాలలో భారతదేశం చురుగ్గా పాల్గొంటున్నది. అణ్వస్త్ర నిరాయుధీకరణకు, భారత్ ఎంతో సుముఖంగా పనిచేస్తూ వస్తూంది.
సవరణలు
ఆదేశిక సూత్రాలను సవరించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమౌతుంది. దీనిని పార్లమెంటు లో, బిల్లు ప్రవేశపెట్టి, మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టం చేస్తారు.
అధికరణ 31-సి, భారత రాజ్యాంగ 25వ సవరణ 1971 లో దీనిని జోడించారు.
అధికరణ 45, దీని ఉద్దేశ్యం, పిల్లలకు తప్పనిసరి మరియు ఉచిత విద్య.దీనిని భారత రాజ్యాంగ 86వ సవరణ 2002 లో సూత్రీకరించారు.
అధికరణ 48-ఏ, దీని ఉద్దేశ్యం అటవీ ప్రాణుల మరియు అడవుల సంరక్షణ,దీనిని భారత రాజ్యాంగ 42వ సవరణ 1976 లో సూత్రీకరించారు.