w1948 సెప్టెంబర్ 17న మేజర్ చౌదరి నాయకత్వంలో చేపట్టిన “ఆపరేషన్ పోలో” అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసారు. 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య న్యూఢిల్లీ లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956- రాష్ట్రాల పునర్విభజన చట్టంను అనుసరించి “దేబర్ కమిటీ” సూచనల ప్రకారం 1956 నవంబర్ 1న “ఆంధ్రప్రదేశ్” ఆవిర్భావం జరిగింది. తరువాత 6 దశాబ్దాల కాలంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక మరియు ఆర్ధిక వైరుధ్యాల వలన అనేక సంఘర్షణలు, ఉద్యమాలు పుట్టుకొచ్చి చివరకు తెలుగు సమాజం, పునర్విభజన చట్టం 2014ను అనుసరించి విడిపోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 29వ రాష్ట్ర హోదాతో 2014 జూన్ 2న ఆవిర్భవించిన నూతన రాష్ట్రమే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.
ఉనికి : తెలంగాణ ఉనికి రీత్యా ఉన్నది ఉత్తరార్ధగోళంలో, దక్షిణాసియా ప్రాంతంలో, దక్షిణభారతంలో, దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉంది.150 46’-190 47’ఉత్తర అక్షంశాల మధ్య మరియు 770 16’ – 810 43’తూర్పు రేఖ అంశాల మధ్యలో సమద్విబాహు త్రిభుజం ఆకారంలో విస్తరించింది. ఇది ఒక భూపరివేష్టిత రాష్ట్రంగా ఉంది.
విస్తీర్ణం: తెలంగాణ భౌగోళికంగా 1,12,077 చ.కి.మీ. వైశాల్యంతో దేశంలో వైశాల్యం పరంగా 12వ స్థానంలో ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41% ఉంది. తెలంగాణ లో మొత్తం జిల్లాల సంఖ్య 10. అవి ఆదిలాబాద్, నిజాంబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం. తెలంగాణాలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు మహబూబ్ నగర్(18,432 చ.కి.మీ.), ఆదిలాబాద్ (16,128 చ.కి.మీ.). విస్తీర్ణం రీత్యా అతిచిన్న జిల్లాలు హైదరాబాద్ (217 చ.కి.మీ.), రంగారెడ్డి (7,493 చ.కి.మీ.).
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 50,03,674 (ఇది కెనడా దేశపు జనాభాతో సమానం). దేశ జనాభాలో తెలంగాణ జనాభా శాతం పరంగా 2.89%, స్థానము పరంగా 12వ స్థానం లో ఉంది. పురుషులు 176 లక్షలు, స్త్రీలు 173 లక్షలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత 312 చ.కి.మీ.
సరిహద్దులు: తెలంగాణ మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగిఉంది. ఉత్తరాన ఛత్తీస్ ఘడ్, వాయువ్యాన మహారాష్ట్ర, పశ్చిమాన కర్ణాటక, దక్షిణం మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్టంతో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, మహారాష్ట్ర రాష్టంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, కర్ణాటక రాష్టంతో మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్టంతో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. తెలంగాణాలో ఏ రాష్ట్ర సరిహద్దులు లేని జిల్లా “హైదరాబాద్”. రాష్ట్రంలో ఏకైక భూపరివేష్టిత జిల్లా “హైదరాబాద్”. అధిక జిల్లాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రము కర్ణాటక. అధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు నల్గొండ (ఖమ్మం,వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్,మెదక్), మెదక్ (నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,నల్గొండ,రంగారెడ్డి), కరీంనగర్ (ఆదిలాబాద్,నిజామాబాద్,వరంగల్,ఖమ్మం,మెదక్) 5 జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి.తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. రంగారెడ్డి జిల్లాను 1978 ఆగష్టు 12న ఏర్పరిచారు, ఆ పేరు “కొండా వెంకట రంగారెడ్డి” ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రి జ్ఞాపకార్ధం పెట్టబడినది.
అడవులు: తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం 27,214 చ.కి.మీ. కలిగి రాష్ట్ర విస్తీర్ణం లో 24.28% శాతాన్ని కలిగి ఉంది. అటవీ విస్తీర్ణం ఎక్కువ కలిగిన జిల్లాలు ఖమ్మం,ఆదిలాబాద్ కాగా, తక్కువ కలిగిన జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర గుర్తులు :
1. రాష్ట్ర జంతువు – మచ్చల జింక, దీని శాస్త్రీయనామం ఆక్సిస్ ఆక్సిస్.
2. రాష్ట్ర చెట్టు – జమ్మిచెట్టు, దీని శాస్త్రీయనామం ప్రోసోఫీస్ సీనరేరియా.
3 . రాష్ట్ర పక్షి – పాలపిట్ట, దీని శాస్త్రీయనామం కోరేషియాసిస్ బెంగలేన్సిస్.
4. రాష్ట్ర పుష్పం – తంగేడు, దీని శాస్త్రీయనామం కెసియా ఆరిక్యులేటా.
5. రాష్ట్ర పండు – సీతాఫలం దీని శాస్త్రీయనామం అనోనా స్క్వామోస.
6. రాష్ట్ర చిహ్నాలు – కాకతీయ కళాతోరణం, చార్మినార్ (రూపొందించింది ‘ఏలే లక్ష్మణ్’ నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు).
7. రాష్ట్ర గీతం – “జయ జయహే తెలంగాణ జనని జయకేతనం” (రచించినది ‘అందెశ్రీ’ (అందె ఎల్లయ్య).
8. రాష్ట్ర మాసపత్రిక తెలంగాణ.
9. రాష్ట్ర వార్త ఛానెల్ యాదగిరి.
భాష : 1948 కన్నా పూర్వం హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఉర్దూ. ప్రస్తుత అధికార భాష “తెలుగు”.
ముఖ్యంశాలు :
* తెలంగాణ బిల్లు కేంద్ర కాబినెట్ ఆమోదం తెలిపిన తేదీ 6 ఫిబ్రవరి 2014.
* తెలంగాణ బిల్లు లోక్ సభలో ప్రవేశం అయిన తేదీ 13 ఫిబ్రవరి 2014.
* తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం అయిన తేదీ 18 ఫిబ్రవరి 2014.
* తెలంగాణ బిల్లు రాజ్య సభ లో ఆమోదం అయిన తేదీ 20 ఫిబ్రవరి 2014.
*తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు 1 మార్చ్ 2014.
*తెలంగాణ గజిట్ ప్రకటన 2 మార్చ్ 2014.
* 4 మార్చ్ 2014 తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ 2 గా ప్రకఠన.
* జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రముగా తెలంగాణ ఆవిర్భావం.
*తెలంగాణ లో మొత్తం పట్టణాలు 158, అత్యధిక పట్టణాలు గల జిల్లా మెదక్ (24), అత్యల్ప పట్టణాలు కల జిల్లా హైదరాబాద్(3 )
* పట్టాన స్థానిక సంస్థలు 68, అవి మున్సిపల్ కార్పొరేషన్లు 6, మున్సిపాలిటీలు 37, నగర పంచాయతీలు 25.
* రెవిన్యూ డివిజన్లు 42, అధిక (5) రెవిన్యూ డివిజన్లు కల జిల్లాలు మహబూబ్ నగర్,కరీంనగర్,వరంగల్,ఆదిలాబాద్. తక్కువ(2) రెవిన్యూ డివిజన్లు కల జిల్లా హైదరాబాద్.
*రాష్ట్రము లో ఉన్న మండల ప్రజాపరిషత్తులు 438, అధిక మండలాలు కల జిల్లా మహబూబ్ నగర్(64) తక్కువ మండలాలు కల జిల్లా హైదరాబాద్(16).
* రాష్ట్రము లో ఉన్న మొత్తం రెవెన్యూ మండలాలు 459.
*రాష్ట్రము లో ఉన్న మొత్తం గ్రామా పంచాయతీలు 8687. అధిక గ్రామా పంచాయతీలు కల జిల్లా మహబూబ్ నగర్(1331) తక్కువ గ్రామా పంచాయతీలు రంగారెడ్డి (690) గ్రామా పంచాయతీలు లేని జిల్లా హైదరాబాద్.
* లోక్ సభ స్థానాలు : 17, రాజ్య సభ స్థానాలు 7, శాసన సభ స్థానాల సంఖ్య 119+1(నామినేటెడ్ – స్టీఫెన్ సన్) అధిక శాసన సభ స్థానాలు కల జిల్లా హైదరాబాద్ (15) తక్కువ శాసన సభ స్థానాలు కల జిల్లా (9). శాసనమండలి స్థానాలు 30+3(నామినేటెడ్)=33.
* జిల్లా ప్రజాపరిషత్ ల సంఖ్య 9. జిల్లా ప్రజాపరిషత్ లేని జిల్లా హైదరాబాద్.
*రాష్ట్రము లో ఉన్న ZPTC (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కానిస్టిట్యూయన్సీ)లు 438, MPP (మండల పరిషత్ ప్రెసిడెంట్స్) లు 438, MPTC (మండల పరిషత్ టెరిటోరియల్ కానిస్టిట్యూయన్సీ)లు 6456.