Type Here to Get Search Results !

Vinays Info

రంజాన్ మాస ఉపవాసవ్రతం

ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్ గ్రంథం .

విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి' అని పేర్కొంది.

నిష్ట నియమాలు:

రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా ' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరిమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ' సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే! దీనిని ఖురాన్ ' తఖ్వా' అని అంటుంది.

ఉపవాస విధి:

రంజాన్ మాసంలో ప్రతి దినం అయిదు పూటల నమాజు చేయడం, రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్ష రోజా పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది.రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని మరియు అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా 1000 పూటలు ప్రసాదిస్తాడు. రంజాన్ మాసమంతా ఇస్లాం మత విశ్వాసులకు పవిత్రం, పుణ్యదాయకం. ప్రాతఃకాలం సహరీతో ఉపవాస దీక్ష రోజాకు సంకల్పించి సూర్యాస్తమయం తరవాత ఇఫ్తార్‌తో విరమిస్తారు. తదుపరి తరాబీ నమాజుల్లో పాల్గొంటారు. దైవసన్నిధిలో ఉన్న అనుభూతి పొందుతూ తాదాత్మ్యతతో శారీరక అలసట, నీరసం మరచిపోతారు. శరీర శుభ్రత పాటిస్తూ నమాజుకు పూనుకొంటారు. నమాజు చేసే సమయాన ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క యోగాసనమై శారీరక దృఢత్వాన్ని మానసిక చేతనను కలిగిస్తుంది. ఒకేసారి మనిషి బాహ్యాంతరాలు పరిశుద్ధం కావడం విశేషం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section