Type Here to Get Search Results !

Vinays Info

వేదాలు

ఋగ్వేదము

నాలుగు వేదాల లోను ఋగ్వేదము అత్యంత పురాతనమైన గ్రంథము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది.
వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.
శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋక్కులలో ఐదు రుక్కులను ప్రధానంగా చెప్పబడ్డాయి.1 శాకల, 2 వాష్కల, 3 అశ్వలాయన, 4 మండూకాయన, 5 శాంఖ్యాయన. వీటిలో శాంఖ్యాయన, మండూకాయన, వాష్కల లభ్యం కాలేదు.
ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి.
ఒకటి అష్టకాలు వాటిలో అధ్యాయాలు వాటిలో వర్గాలు ఉంటాయి.
రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ వాటిలో సూక్తులుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్ధాలు వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని భావన.
ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాధలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదం అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ సూక్తంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించింది. ఋగ్వేదం కామితార్ధాలను తీర్చే వేదం. వర్షాలు పడాలంటే పర్జస్య పఠించాలని సూచింప బడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది. శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది. "అనోభద్రా క్రతవో యంతు విశ్వత॰" అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుషులను చేస్తుందని విశ్వసిస్తున్నారు.
ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వనిసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి. ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిః లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం మొదలైన శబ్దాలతో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.
ఋగ్వేదం పది మండలములు గా విభజింపబడింది. ఇందులో 10,622 పద్యాలు, 1,53,326 కావ్యాలు, 4,32,000 పదాలు ఉన్నాయట. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలు గాను స్తుతిస్తున్నాయి. ఎనిమిదవ, తొమ్మిదవ మండలాలలో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయారణ్యకము,ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.
ఋగ్వేదమునకు మొత్తము 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసి పోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం ఒక శాఖ మాత్రమే.((అదే శాకల శాఖ))
ఇంక ఉప శాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి, దాదాపుగా 20 ఉప శాఖల పేర్లు మాత్రము మిగిలాయని, తెలుస్తున్నాయని ఉవాచ.
ఋగ్వేదంలో మండలములు సంఖ్య = 10.
అష్టకములు సంఖ్య 8.
అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8.
అధ్యాయములు సంఖ్య 64
ఈ సంహిత లో 64 అధ్యాయములు మరియు 8 అష్టకములుగా విభజించ బడ్డాయి.
ఋగ్వేదంలో ఋక్కులు సంఖ్య = 10472 + వాలఖిల్య సూక్తాలు లోని ఋక్కులు = 80 కలిపి మొత్తం = 10552
సూక్తములు సంఖ్య = 1017 + వాలఖిల్య సూక్తాలు లోని ఖిల సూక్తములు = 11 కలిపి మొత్తం = 1028.
వర్గములు సంఖ్య = 2006 + వాలఖిల్య సూక్తాలు లోని వర్గములు = 18 కలిపి మొత్తం = 2024
ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య = 3,94,221 + వాలఖిల్య సూక్తాలు లోని అక్షరములు = 3,044 కలిపి మొత్తం = 3,97,265.

సామవేదము

చతుర్వేదాలలో ఒకటి సామవేదము (సంస్కృతం: सामवेद). సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.
వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి
- ఋక్కులు, యజుస్సులు, సామములు.
1.ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్.
2.వచన రూపంలో (ఛందస్సు లేకుండా) ఉన్నను యజుస్సులు.
3.గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము.
ఒకే శ్లోకం ఋక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును. ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన ఋక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్ఛరింపబడే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు మరియు కొన్న ఋగ్వేదమంత్రాలు. సామవేదంలో సామములున్నాయి. అధర్వణ వేదంలో ప్రధానంగా ఋక్కులు, కొన్ని యజుస్సులు ఉన్నాయి.
1895లో రాల్ఫ్ గ్రిఫిత్ ప్రచురించిన సామవేదం ఆంగ్లానువాదం పీఠికలో ఇలా వ్రాశాడు వేదాల క్రమంలో మూడవదిగా చెప్పబడే "సామవేదం" లేదా "పవిత్ర గానాల వేదం" ఋగ్వేదం తరువాతి ముఖ్యస్థానాన్ని కలిగి ఉంది. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. ఋగ్వేదం లోని వివిధ స్తోత్రాలను, శ్లోకాలను ఇందులో తిరిగి అమర్చినట్లుగా అనిపిస్తున్నది. ఈ అమరిక క్రమానికి మూల ఋగ్వేదంలోని క్రమంతో సంబంధం లేదు. యజ్ఞయాగాది కార్యాలలో ఉపయోగపడేందుకు వీలుగా వినియోగం బట్టి ఇలా అమర్చినట్లున్నారు. ఇలా పునర్వవస్థీకరించిన సామములు కొన్ని (ప్రస్తుతం మనకు లభిస్తున్న) మూల ఋగ్వేదంలోని శ్లోకాలకు యధాతధం కాగా మరి కొన్ని సామములు గణనీయంగా మార్పు చెందినట్లున్నాయి. మరి కొన్ని సామములు ప్రస్తుతం లభించే ఋగ్వేద పాఠం కంటే పురాతనమైనవిగా అనిపిస్తాయి. గానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను ఉచ్ఛారణాపరంగా ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి. సామవేద గానాలను ఎప్పుడు సంకలనం చేశారో ఊహించడం సాధ్యం కావడంలేదు. అలాగే సంకలనకర్త పేరు కూడా మౌఖిక సంప్రదాయ పరంగా లభించడం లేదు.
సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలావరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10,552 మంత్రాలలోనుండి యధాతధంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే వర్తిస్తుంది. ఉచ్ఛారణా విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీత 10-22 లో "వేదములలో నేను సామమును" అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును.
సామవేద సంహితకు మూడు శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ శాఖ గుజరాత్‌లో ప్రాచుర్యంలో ఉన్నది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోను, రాహయణీయ శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోను ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ శాఖలలో మంత్రాలు, ఉచ్ఛారణావిధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు (3681) ఉన్నాయి. సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలంనుండి మంత్రాలు గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒకో దేవత గురించి ఒకో ఛందస్సులో కీర్తిస్తుంది. ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని "పవమాన సోముడు" గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయ యజుర్వేదం
వేదం అనగా ('విద్' అనే ధాతువు నుండి) 'జ్ఞానం' అని అర్ధం.
యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు[పురోహితులు] చెప్పే మంత్రాలు [పద్యాలు] యజుర్వేదంలో ఉన్నాయి.
యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి "అధ్వర్యులు" అని పేరు.
కృష్ణ యజుర్వేదం లో
తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.
651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5,పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ కృష్ణ యజుర్వేదం లో సంహిత బ్రాహ్మణం కలగలసి (కలగాపులగంగా)ఉండటం వలన, అధ్యయినం, సమన్వయం, ప్రయోగం,కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు
సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు,
1987 ప్రకరణములు ఉన్నాయి.
యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది.
కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (తైత్తరీయ సంహిత), శుక్ల యజుర్వేదము (వాజసనేయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము" అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము", "స్వరితము", "ప్రచయము" అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.

అధర్వణ వేదం

హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది.
అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది.
సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం.
ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్య కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.
ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.
వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదు. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section