Type Here to Get Search Results !

Vinays Info

NATIONAL FLAG

భారత జాతీయపతాకం ప్రస్తుతమున్న రూపంలో 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనాను సారనాథ్ లోని అశోకస్థంభం నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా.

భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన పింగళి వెంకయ్య. జాతీయపతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి ఖచ్చితమైన నియమావళి అమల్లో ఉంది.

ప్రతీక

అశోకచక్రం
స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయ కాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూమతానికి, ఆకుపచ్చ ఇస్లాం మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు.

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్నిరోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగసభ, కాంగ్రెస్ పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, అన్ని మతాలవారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయపతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోకచక్రాన్ని చేర్చడం.

అంతకు ముందున్న జెండాలోని రంగులకు మతపరమైన అన్వయాలున్నందున స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాతీయపతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలూ లేవని స్పష్టం చేస్తూ పతాకప్రాధాన్యతను ఇలా వివరించాడు: "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం."

ఐతే కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.

చరిత్ర

కలకత్తా జండా
20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమం బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయపతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యురాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్యభాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తులున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు "বন্দে মাতরম (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్చతకు చిహ్నాలు.

1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన జండా
మొట్టమొదటి త్రివర్ణపతాకం 1905లో జరిగిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగష్టు 7 న కలకత్తాలోని పార్శీబగాన్ స్క్వేర్లో శచీంద్ర ప్రసాద్ బోస్ చే ఆవిష్కరించబడింది. ఈ పతాకాన్ని "కలకత్తా పతాకం" అంటారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామరపూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో "వందేమాతరం" అనే అక్షరాలున్నాయి.

1907 ఆగష్టు 22 న మేడం భికాజీ కామా జర్మనీ లోని స్టుట్‌గార్ట్ లో మరో జండాను ఎగరేసింది. ఈ జండాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భారతంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాషాయ పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అడుగున ఉన్న పట్టీలో స్థంభానికి దగ్గరగా నెలవంక, రెండో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మ లు కలిసి తయారు చేసారు.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకారులు దీన్ని స్వీకరించాక, ఈ జండా బెర్లిన్ కమిటీ జండా గా పేరు పొందింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెసొపొటేమియాలో ఈ జండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్ పార్టీ జండాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళు ఉపయోగించారు.

1921లో అనధికారికంగా స్వీకరించబడిన జెండా
1917లో తిలక్, అనీబిసెంట్ లు హోంరూల్ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హోదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడివైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగువన హిందువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలున్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది.

దానికి ఒక సంవత్సరం క్రితమే 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయపతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి.బొమ్మన్‌జీ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపించగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికీ చిహ్నంగా నిలిచిన చరఖా (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొందించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతినిధ్యం వహించేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు.

గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించబడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాలకు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరకంగా స్వాతంత్ర్యపోరాటం సాగిస్తోన్న ఐర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈ పతాకాన్ని అహమ్మదాబాదు కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికారపతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు.

ఐతే ఆ జెండాలో మతాలకు చిహ్నాలుండడం చాలామందికి నచ్చలేదు. 1924లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా సంస్కృత కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయరంగును, విష్ణువు ధరించే గదను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లిం ఫకీర్లు-దర్వేషీల వైరాగ్యానికి చిహ్నమైన జేగురురంగును చేర్చాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సిక్ఖులు తమ మతచిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్లైతే మతపరమైన సూచికలను పూర్తిగా తొలగించాలని కోరారు.

1931లో సూచించబడిన జెండా
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1931 ఏప్రిల్ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశించినవే కాబట్టి అభ్యంతరకరమైనవేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టిరంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయారైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు.

పింగళి వెంకయ్య రూపొందించిన 1931 నాటి జెండా. దీన్నే రెండవప్రపంచయుద్ధంలో అర్జి హుకుమతె ఆజాద్ హింద్ వాడుకొంది
తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయజెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది.

రెండవ ప్రపంచయుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వాడిన జెండా
అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ పతాకాన్ని స్వల్పమార్పులతో - చరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులి బొమ్మతో - వాడుకొంది. ఈ మార్పులు గాంధీ అహింసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్ర బోస్ వీరోచిత పద్ధతులకు గల తేడాను ప్రతిబింబిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారతదేశపు గడ్డమీద మొదటిసారిగా బోస్ చేత మణిపూరులో ఆవిష్కరించబడింది.

స్వతంత్ర భారతదేశ జాతీయపతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగసభ, 1947 జూన్ 23న బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం.పణిక్కర్, సరోజినీ నాయుడు, రాజాజీ, కె.ఎం.మున్షీ, బి.ఆర్.అంబేద్కర్ లతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 1947 జూలై 14న కాంగ్రెస్ పతాకాన్నే అన్ని పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయపతాకంగా స్వీకరించాలని నిర్ణయించింది. దాంట్లో మతపరమైన సూచికలేవీ ఉండరాదని తీర్మానించింది. చరఖా స్థానంలో సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగష్టు 15 నాడు ఆవిష్కరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section