Type Here to Get Search Results !

Vinays Info

ముసునూరి నాయకులు

Top Post Ad

ముసునూరు అనే గ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలో ఉంది. ఇప్పటికీ ఈ గ్రామంలో కోట శిథిలాలు ఉన్నాయి. దీనినిబట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు! వీరు కమ్మ కులస్థులు. కాకతీయ పతనానంతరం ముస్లింల వశమైన తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని రేఖపల్లిని రాజధానిగా చేసుకొని ముస్లింలతో పోరాడాడు. ఈ పోరాటంలో ప్రోలయ నాయకునికి పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు, వేంగి పాలకుడు వేంగ భూపాలుడు, మొదలైన వారు సహాయం చేశారు. ఇలా రేఖపల్లిలో స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. ఇతని మంత్రి కుమారునికి అన్నయ్య మంత్రి విలాసా గ్రామం దానం చేస్తూ తామ్ర శాసనం వేయించాడు. అన్నయ్యమంత్రికి ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన ప్రతిష్టాపనా చార్య అనే బిరుదు ఉంది.

-ప్రోలయ నాయకునికి సంతానం లేనందువల్ల ఇతని మరణం తర్వాత కాపయ నాయకుడు రాజయ్యడు. 75 మంది నాయకుల సహాయంతో (సింగమనేడు, వేమారెడ్డి మొదలైనవారు......) ఓరుగల్లును ముట్టడించి ముస్లింలతో పోరాటం కొనసాగించి క్రీ.శ. 1336లో ఓరుగల్లును ఆక్రమించాడు. దీంతో మాలిక్ మక్బూల్ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను కృష్ణా నది నుంచి గోదావరి వరకు గల ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు. విస్తరణ కాంక్షతో రేచెర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి ఎరబోతు లెంకను నియమించాడు. తీరాంధ్ర ప్రాంతంలో తన ప్రతినిధులను నియమించాడు.
i. కోరుకొండ్ల ప్రాంతంలో కూననాయకుడిని నియమించాడు.
ii. సబ్బినాడు (కరీంనగర్) ముప్పు భూపాలుడిని నియమించాడు.

-కాపయనాయకునికి ఆంధ్ర సురత్రణ ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి.
-అదే సమయంలో అల్లా ఉద్దిన్ హసన్ గంగూ బహ్మనీ షా బిరుదు లేదా జాఫర్‌ఖాన్ పేరుతో 1347లో గుల్బర్గాలో బహ్మనీ రాజ్య స్థాపనలో కాపయనాయకుడు సహాయం చేశాడు. సహాయం మర్చి విశ్వాసఘాతానికి పాల్పడ్డ హసన్ గంగూ చివరికి 1350లో ఓరుగల్లుపై దాడి చేశాడు.
-ఈ దాడిలో కాపయనాయకుడు కౌలాస్ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. 1356 లో మరోసారి హసన్ గంగూ దాడి చేసి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. బహ్మనీలకు భువనగిరి తూర్పు సరిహద్దు అయ్యింది. కాపయనాకుడు హసన్‌గంగూ దాడులను అరికట్టాలని విజయనగర రాజు బుక్కరాయల సాయం కోరాడు. అయినప్పటికీ తన కుమారుడు వినాయక దేవుణ్ణి యుద్ధంలో కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మల్లీ హసన్‌గంగూ రెండు సేనల నాయకత్వాన హుమాయున్ సేనానిగా గోల్కొండపైకి, సప్దర్ ఖాన్ నాయకత్వాన ఓరుగల్లు పైకి దండయాత్రలకు పంపించాడు. కాపయనాయకుడు అన్నీ కోల్పోయి చివరికి బహ్మనీ సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం....
-1. గోల్కొండ
-2. ఓరుగల్లు దుర్గాలను సమర్పించాడు.
-3. 300 ఏనుగులు, 2000 గుర్రాలు, 3 లక్షల రూపాయలు యుద్ధ పరిహారంగా చెల్లించాడు.

-ఈ వరుస పరాజయాలను ఆసరాగా తీసుకుని తీరాంధ్ర రాజులు స్వతంత్రించారు. ఉత్తర తీరాంధ్ర రెడ్డిరాజుల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారిపోయే సమయంలో దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచెర్ల సింగమనాయుడు విజృంభించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా, కృష్ణా, తుంగ భద్ర అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు.

-సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతనాయుడు తన తండ్రి మరణానికి కారకుడైన కాపయ నాయకునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగ్లు మీద దండయాత్ర చేసి 1366లో కాపయ నాయకుని చంపి భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను స్వాధీనం చేసున్నాడు. దీంతో ముసునూరి వంశం అంతరించింది. దాదాపు 30 ఏండ్లు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ముసునూరి పాలనలో ఉన్నాయి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.