Type Here to Get Search Results !

Vinays Info

:::గొండుల తిరుగుబాటు:::

గోండుల తిరుగుబాటు (తెలంగాణ)
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ‘కొమరం భీం’ నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలో ‘జోడెఘాట్’ ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆ ప్రాంతంలో గోండు, కొలాం మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడెఘాట్‌పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతోనే ఎదుర్కొన్నారు. ‘జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) మనవే’ అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు.
భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయణ్ని బంధించడానికి స్థానిక తాలుక్‌దార్ ‘అబ్దుల్ సత్తార్’ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యమే ప్రత్యక్ష దాడికి దిగింది. 1940 అక్టోబర్ 8న జరిగిన దాడిలో ‘కొమరం భీం’ వీర మరణం పొందారు. ఈయణ్ని సైన్యానికి కుర్థం పటేల్ చూపించాడు. ‘కొమరం భీం’ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్య్రానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. కమ్యూనిస్ట్ నాయకులు ‘పుచ్చలపల్లి సుందరయ్య’ ఈయన జీవిత చరిత్రను రచించారు. గోండులు ఈయణ్ని దేవుడిగా ఆరాధిస్తారు.
తానాభగత్ ఉద్యమం (బిహార్, 1914)
ఛోటా నాగపూర్ ప్రాంతంలో ఓర్గాన్ అనే ఆదిమవాసులు నివసించేవారు. వీరు పెద్ద ఎత్తున హిందూ సంస్కృతీకరణ కోసం పేరు చివరన భగత్ అనే పదాన్ని చేర్చుకొని తమ స్థాయి మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంతాల గిరిజనేతరులు అక్కడ చేరి తమకు అన్యాయం చేస్తున్నారని వారిని తరిమేసేందుకు ఉద్యమించారు.
మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
మద్రాసు రెసిడెన్సీలో ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో మద్రాస్ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడి గిరిజన తెగల్లో కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండేవారు. బ్రిటిష్ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామరాజు సమైక్యపరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతిలో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.
ఈ తిరుగుబాటును అణచివేసేందుకు మద్రాసు ప్రభుత్వం ‘రూథర్ ఫర్డ్‌’ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన గొంముల్లు దొరను 1923 సెప్టెంబర్‌లో నిర్బంధించారు. మరో అనుచరుడు ‘అగ్గిరాజు’ను కాల్చి చంపారు. దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకులను కోల్పోయింది. చివరకు 1924 మే 7న సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం అంతరించిపోయింది.

కొండ సవరలు తిరుగుబాటు (1943, ఒడిశా)
కోరాపుట్ జిల్లాలో గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అతణ్ని నిర్బంధించి 1943లో బెరంపూర్ జైలులో ఉరి తీసింది. దీంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది.
వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్లీ ఆదిమ తెగలు నివసించేవి. పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945లో కిసాన్‌సభ ఇచ్చిన పిలుపుతో భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టిచాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతిఘటించాలనే లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్ చేసినదాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section