పురపాలక సంఘం : చిన్నచిన్న పట్టణాల పరిపాలన కోసం పురపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు. వీటిని కూడా రాష్ర్టాల్లో రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనం ద్వారా ఏర్పాటు చేస్తాయి. మున్సిపాలిటీలో మూడు అంగాలు ఉంటాయి. అవి 1) మండలి 2) స్థాయీ సంఘాలు 3) ప్రధాన కార్యనిర్వహణాధికారి.
మండలి (లేదా పురపాలక మండలి)కి మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఇది పురపాలక సంస్థలో చర్చా సంబంధమైన లేదా శాసనపరమైన అంగం. స్థాయీ సంఘాలు సంస్థకు తగిన సలహాలు ఇస్తుంది. కార్యనిర్వహణాధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతడు పరిపాలనను పర్యవేక్షిస్తాడు.
12వ షెడ్యూల్‌లో ఉన్న అధికారాలను, విధులను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది.
నోటిఫైడ్ ఏరియా కమిటీ : వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీని సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
టౌన్ ఏరియా కమిటీ : చిన్న పట్టణాల అవసరాలు తీర్చడానికి ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తాయి.
కంటోన్మెంట్ బోర్డు : సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌరులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని 1904లో రూపొందించారు. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. సికింద్రాబాద్ ప్రాంత పరిసరాల్లో కంటోన్మెంట్ బోర్డు ఉంది.
కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నికైన సభ్యులు, కొందరు నామినేటెడ్ సభ్యులు, మరికొందరు పదవీరీత్యా సభ్యులు ఉంటారు. ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ఉంది.
టౌన్‌షిప్ : ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఆ ప్రాంతంలో నివసించే వారికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ BHEL టౌన్‌షిప్, విశాఖపట్టణంలోని విశాఖ స్టీల్ టౌన్‌షిప్.
పోర్టుట్రస్ట్ : దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో పోర్టుట్రస్ట్‌లు ఏర్పాటవుతాయి. ఉదాహరణకు ప్రధాన ఓడరేవులున్న చెన్నై, ముంబై, విశాఖపట్టణంలో పోర్ట్‌ట్రస్ట్‌లున్నాయి. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌరసదుపాయాలను ఈ పోర్టుట్రస్ట్ కల్పిస్తుంది. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం ఈ పోర్టులు ఏర్పడతాయి. ఈ చట్టం ప్రకారమే సభ్యుల ఎన్నిక నామినేషన్, విధులు నిర్ణయమవుతాయి.
స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు : పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన ఏజెన్సీలు పనిచేస్తుంటాయి. ఉదాహరణకు హౌసింగ్ బోర్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ సప్లయ్ బోర్డులు ఈ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక విధులు ఉంటాయి. ఈ విధంగా వివిధ పట్టణ స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు వీటిలో ప్రముఖమైనవి.